Tag: స’శేషం’

మోడీ సారు, అమితాబ్బచ్చన్ వెజ్జు ఫుడ్డే తింటరంట; సెహ్వాగ్, పవన్ కళ్యాణులు గుడ వెజిటేరియన్సని ఇన్న,


———————————————————————————————————————————-

 “గుడికాడ పంతులుగారు కత జెప్తుండె, అప్పుడిన్నా!పెపంచమంత కలిపి బ్రమ్మాండం అంటరంట, అండమంటే గుడ్డేగదన్న?

 అవ్ రా భయ్! నేను గూడ ఆణ్ణే ఇన్న!

 కోడిగుడ్డుకెల్లొచ్చే పిల్లల్ను కోళ్ళు దినవ్, మేక పిల్లల్ను మేకల్ దినవ్. మరి మనందరం బ్రమ్మగుడ్డుకెల్లొచ్చే పిల్లలమైతే కొన్ని పిల్లలు వేరే పిల్లల్ను ఎందుకుదింటున్నయో?”

 ———————————————————————————————————————————-

మోడీ సారు, అమితాబ్బచ్చన్ వెజ్జు ఫుడ్డే తింటరంట; సెహ్వాగ్, పవన్ కళ్యాణులు గుడ వెజిటేరియన్సని ఇన్న, కరీన కపూరు, షహీద్ కపూరు, జాన్ అబ్రహం,… శాకాహారమే ప్రిఫర్ జేస్తరంట. కుస్తీలుబట్టే సుశీల్ కుమారు గుడా కూరగాయలే దింటడంట. ఎవురూగుడ మొదట్నుండే వెజ్జోళ్ళు కాదు. ఐనగాని వెజ్ లోనికి మారిపోయిన్రు. అందరొకే లెక్క జంతువుల కొరకే వెజిటేరియన్సయిపోయిన్రని అననుగాని కావాల్నంటే నాన్-వెజ్ మానడం వీజినే, వారానికొక్కసారైన పర్లే,

మనిషులల్ల కొందరు జిందగికి ఏదోక మీనింగుండాలె, దాని ప్రకారమే బతకాలె అనుకుంటుంటరు. గదేమంత చెప్పినంత వీజికాదుగానీ గట్ల బతకనీకి ట్రై జేసుడుల ఏదో మజా ఉంటదనుకుంట. గందుకే కద పెద్దపెద్ద లీడర్లందరు ఏదోకటి స్పెషల్ పని జేస్తుంటరు! గాంధిగానీండ్రి, నెహ్రుగానీండ్రి, లింకన్, మండేలసుంటోళ్ళు గానీండ్రి ఆళ్ళు జెప్పేటి మాటలల్ల ఏదో గమ్మత్తైన పాయింటుంటది. గమ్మత్తని ఎందుకన్ననో సమజయ్యిందా? ఆళ్ళీడ లేకున్న గూడ పెపంచమంత ఇప్పటిగ్గూడ ఆళ్ళను తలుస్తుంటది. గది తిట్టనీకి గావచ్చు, మెచ్చుకోనీగ్గూడ గావచ్చు. మాటల్ల గమ్మత్తుంటెనే మనుషుల్ ఎక్కువ దినాలు యాదికుంటరు. లేకుంటె ఒక్క రోజుల మరుపుకొస్తరు. ఇప్పుడు జూడరాదు, జనాల యాదిల వుండేదానికి సినిమలోళ్ళు, లీడర్లు, మతాలోళ్ళు .. ఇష్టమొచ్చిన తీరుగ పిచ్చి స్టేట్మెంట్లిస్తుంటరుగద, గట్లన్నట్టు.

పార్ట్ 1 > “రిచర్డ్ గెరె, హాలీవుడ్ల హీరో యేషాలేసేటోడు, ఇట్లన్నడు …” ఈడున్నది – (http://wp.me/p2uFNm-fd

థామస్ అల్వ ఎడిసన్ ఎరికనే గద? ఆయన్నే, లైటుబల్బు తయారుజేసిన పెద్దమనిషి, గాయనేమన్నడు?  “Non-violence leads to the highest ethics, which is the goal of all evolution. Until we stop harming ALL other living beings, we are still savages,” అంట. గిట్లెందుకన్నడాని తెగ సొంచాయించిన. హింస మొత్తం మానేయాల్నంటడు. అదెట్లన్నదే నాకెరికవ్వలే. ఎందుకంటే కూరగాయలను, గింజలను, దుంపలను తినుడు మాత్రం హింస కాదానండి? మొక్కలకు ప్రానమున్నాదని యేనాడో తేలిపాయె గద. గసుంటప్పుడు వెజ్ ఫుడ్డు దినేటోళ్ళు గూడ హింస జేస్తున్నట్టుగాదు? గా హింస మానేదెట్లననే నా డౌటు. ఏం దినకుంటే అందరొకేసారి సస్తరుగదండి! ఐతే, ఒక పెద్ద పంతులుగారిట్ల జెప్పిండు – “బతకాల్నంటే ఏదోకటి దినక తప్పదురా బిడ్డ! మామూలు మనుషులకు సరైన తిండిదినక తప్పదు. అడవుల్ల తపస్సు జేసేటోళ్ళు పండిన ఆకులు, రాలిన పండ్లు తిని గడిపేటోళ్ళు గానీ తెల్లారి లేచినకాణ్ణుండి కష్టంజెయ్యాల్సినోళ్లకు బలానికి తినాలె. తినకుంటే నీలోని జీవుని హింసించినట్టుగాదుర? ఒక్క పాయింటు యాదుంచుకో మళ్ళ. ఏందిన్న సరే నీకు ఆకలి తీరంగనే తినుడు ఆపెయ్యాల. అవసరంలేకున్నగూడ తిన్నవంటే, రుచి కొరకు దిన్నవంటే అది మన్నైన సరే వయొలెన్సు కిందనే లెక్కయితది.” ఇల్ల పాయింటు కనబడతనేవుండె. నువ్వు కూరగాయలు దిన్నవా? మాంసం దిన్నవా అన్నదిగాదు ఇంపార్టెంటు. ఎంత దిన్నవ్? ఎన్నిసార్లు దిన్నవ్? ఎందుకొరకు దిన్నవ్? అదీ పాయింటు. మాంసం దినటం తప్పు అనేటోళ్ళున్నరు. ఐతే ఎడారుల్ల, మంచుదేశాలల్ల వుండేటోళ్లకు కూరగాయలేడ దొర్కుతయ్? సైన్యంల పనిజేసే సైనికులు పప్పన్నందిని యుద్ధాల్ జేయగల్తరా? ఆళ్ళందరుగూడ మాంసం దినాలె. ఈడ లాజిక్కేందంటే సైన్యంనుండి బైటకొచ్చినంక మాంసం మానేయాలె. లేదా తక్కువదినాలె. గట్లనే ఆఫీసులల్ల పనిజేసేటోళ్లకు రోజు మాంసందినాల్సిన పనేముంది? ఆ ఇదంగ బాలెన్సు జేసుకోవాలె. టేస్టు కొరకు గాకుండ అవసరం కొరకు ఫుడ్డుదినాలె. అందుకెగద పూర్వం పండుగలప్పుడే పిండివంటలు జేసుకునేది. ఇప్పుడైతే రోజూ పిండివంటలు, బిర్యానీలేనాయె!ఇట్ల జూస్తె ఎడిసన్ సారు జెప్పింది అరవై, డెబ్భై శాతం వరకు చెయగల్తమని నమ్ముతున్న. ఎడిసన్ జెప్పినట్టు ఎందుకు చెయ్యాలె?  అనిగాని అడిగితిరా ఒకటే జవాబు.  బూమ్మీదున్న అన్ని జీవులుగూడా దేవుని దృష్టిల సమానమే, ఆ లెక్కన జీవులన్నీగూడ అన్నదమ్ముల్లెక్క. అంతలెక్క అర్ధమయ్యేవరకి మనుషుల ఇవల్యూషన్ అవ్వనీకి ఆస్కారమున్నదని ఎడిసన్ సారు అంటున్నట్టు. ఈ రోజుకీడతో ఆపుత సారు / మేడం , ఉండున్రుండున్రి, ముందు మేడం, తర్వాతనే సారు! గిప్పుడు మన కోడి, మేక డిస్కషనినండి –

kodi meka 02

 

స’శేషం’

రిచర్డ్ గెరె, హాలీవుడ్ల హీరో యేషాలేసేటోడు, ఇట్లన్నడు – “As custodians of the planet………”


ఈ పోస్టు రాయల్నా వద్దాని చానా దినాల సంది సొంచాయిస్తుంటి. కారనాలు చెప్పాల్నంటే  – ఇది మతాలకి సంబందించిన ఇష్యమని మతాలోళ్ళు, నాన్-వెజ్ తినేటోళ్ళను ఇమర్సించుడని నాన్-వెజ్జోళ్ళు మనోబావాల్ దెబ్బతిని బాదపడి నన్నుగూడ బాదపెడతరో ఏందోననే గీ సొంచాయించుడంత. గానీ మహాబారతంల జదివిన – మనిషి ఐదురకాల యజ్ఞాల్ జేయాల్నంట – బ్రహ్మ, దేవ, పితృ, మనుష్య, భూత యజ్ఞాలంట. భూతమంటే దెయ్యాలు, భూతాలుగాదు పక్షులు, జంతువులన్నట్టు. తతిమ్మ యజ్ఞాల సంగతేమోగానీ చివరిది, గదే భూతయజ్ఞమంటే సచ్చెటంతిష్టం నాకు. ఇట్ల బ్లాగులల్ల జంతువుల, పక్షుల సంగతులు రాసుడు గూడ భూతయజ్ఞం లెక్కనే అని ఎవుడో జెప్తుంటిన్న! తెలంగాణయాసలెందుకుర ఈ రాసుడంటరా? నాలుగు నుండి పది వరకి నల్లగొండ డిస్టిక్కుల సదివిన. తెలంగాణ యాసన్న, జొన్నరొట్టెలన్న, పొన్నగంటి కూరన్నఇప్పటిగ్గూడ తెగిష్టం. అయన్నీ మిస్సయితున్న. అందుకె మూడు సరదాలు ఒక్కటేసారి ఈ తీరుగ తీర్చుకోవాల్ననుకున్న. గిప్పుడు సదివేటోళ్లకు నేఁజెప్పెడిది – మీ నమ్మకాల్ను, మీరుదినే ఫుడ్డును కించపర్చనీకిగాని, మార్చనీకిగానీ గిది రాయట్లే. సదువుతాబోతె గదే సంజైతది. జంతువులన్నిటిగ్గూడ – అడవుల్లుండేటివి, ఆహారమిచ్చేటివి, ఆహారమయ్యేటివి, మనం పెంచుకునేటివి – అన్నింటిగ్గూడ మనం డిగ్నిటీ ఇవ్వాలె. యానిమల్సుకు గిప్పుడది దొరుకుతలేదు. రిచర్డ్ గెరె అని హాలీవుడ్ల హీరో యేషాలేసేటోడు ఇట్లంటుండు – “As custodians of the planet it is our responsibility to deal with all species with kindness, love, and compassion. That these animals suffer through human cruelty is beyond understanding. Please help to stop this madness.” ఫాక్టు జెప్పాల్నంటే మనదేశంల కన్న మాంసం ఎక్కువ దినే ఇతర దేశాలల్ల జంతువులకు, పక్షులకు కొంచెం మంచిగనే ట్రీట్ జేస్తున్రు. థాయిలాండ్ ల, మలేషియాల జూసిన! కోళ్ళను, బాతులను, పందులను ట్రాన్సుపోర్టు జేసేదానికి వాడే ట్రక్కులల్ల వానికి మంచిగుండేలాగ ఎరెంజిమెంట్లు బాగనేజేస్తున్రు. ఇంక అగ్రదేశాలిష్యం చెప్పెడిదేముంది? ఆడుండే రిచర్డు గెరెనే ఇట్ల మాట్లాడుతుండంటే మనదగ్గర సంగతి ఎట్లుండొచ్చు సారు? చిన్నప్పుడు సూసేటోన్ని, బండి లాగే ఎద్దులకు మెడ మీద కాడి బెడతరు గద! ఆడ పుండయితది. దానికి మందెయ్యరు, మాకెయ్యరు. ఎద్దు పుండు కాకికి ముద్దని మనకు సామెతగూడున్నది గద. చూడను మనకు బాదయితదిగాని బండోళ్లకు మాత్రం యే ఫీలింగుండదు. కర్రపెట్టి ఫట్టఫట కొడుతుంటరు.  మొదటిసారి ముంబై, గప్పుడు బొంబై, పొయినపుడు ఒకనాడు రాత్రిపూట బాల్కనీలనుండి సూస్తావుంటె ఒక లారీల బక్కచిక్కిన ఎద్దులను తీసుకుపోతుండ్రు. ఆయన్నీ కబేళకు పోతున్నయని మా కజిన్ చెప్పిండు. ఎంత బాదయ్యెనంటే ఈ రోజుగ్గూడ గామూగజీవాల ముకాల్లొనున్న దైన్యం గదేతీరుగ కన్పడతది మనసుల. మహారాష్ట్రోళ్ళు బీఫ్ బాన్ జేసిన్రు గద, గా బాన్ సరింగ పంజెయ్యాల్నని అందరుగుడ కోరుకోవాలె. ఎందుకనంటరా? లిక్కర్ బాన్ జూసినంగద, గది బాన్ జేయగనే స్మగ్లింగ్ ఎక్కువైతది, దొంగసార బట్టీలు ఎక్కువైతయ్, జనాలు స్టేటు దాటుకొనిబోయి తాగోచ్చేటోళ్ళు. గదే సీను గిప్పుడు గుడ రిపీటవ్వదని గ్యారెంటేంలేదుగద! గవర్మెంట్లు గా దిక్కునుండి గూడ జూసి పకడ్బందిగ అమల్జెయ్యాలె.

సింహాలకు, పులులకు గూడ సర్కసులల్ల, మొబైల్ జూలల్ల మెడ తిప్పనీకిరాని బోనులల్ల పెట్టేటోళ్ళు. మేనక గాంధొచ్చినంక సర్కసులు, మొబైల్ జూలు బాన్ జేసింది. నిజాన్కి సారూ, మనదేశంల జీవాలకిచ్చినిలువ ఇంకేడ ఇవ్వకుంటుండెనంట. రామాయణంల, మహాబారతంల అందికి ఆధారాలు గూడున్నయ్. తర్వాతెప్పుడైన చెప్త. ఇయన్నీ మాకు చెప్తుండేంది మేమేమన్న సంపుతన్నమా, బోన్లల్ల బెడుతన్నమా అనుకుంటున్రా సారూ, మీరు గాపన్లుజెయ్యకున్నా చేసేటోల్లను మీరు సంజాయించగల్తరు. మీరు చికెనో, మటనో కొననీకి బోయినపుడు ఆడ కండిషన్లు ఎట్లున్నయో జర జూడున్రి. సరింగ లేనక్కడ కొనకుండ్రి. గది సాలు.  నా సంగతి సర్లెండిగాని మొన్నొక కోడి , మేక ఆళ్ళ మనోబావాలు చెప్పుకుంటుండగ రికార్డు జేసిన, కొంచెం కొంచెం నా సోదితో గలిపి ఈడనే ఇనిపిస్త, ఇనుండ్రి –

kodi meka 01

స’శేషం’

See ‘Real’ — జంతువులకి వోట్లుంటే?


BEEF BAN 2

ఆవులు, ఎద్దుల్ని రక్షించడం బావుంది. ఇతర జీవుల్ని కూడా ఉట్టి ఆహారంగానే కాకుండా ఇంకొంచెం humane treatment దక్కేలా చట్టాల్ని అమలుపరచాలి.

భారతం కాదు, బసవ పురాణం అంటే కోపం వచ్చింది + కోపం రాలేదు


తెలుగులో ప్రధమకావ్యం భారతం కాదు, బసవ పురాణం అంటే ఆంధ్రవాళ్లకు కోపం వస్తుంది(ట) 🙂
నేను అంధ్రవాణ్ని కాదు, తెలుగువాణ్ణి. అందువల్ల కోపం వచ్చింది 😡, కోపం రాలేదు కూడా 😐

కోపం ఎందుకొచ్చింది?
తెలుగువాడైన ప్రతివాడికి కోపమొస్తుంది. “భారతం ప్రధమ తెలుగు కావ్యం కాదు,” అన్నందుక్కాదు. కవిత్వానికి, కావ్యాలకి రాజకీయరంగు పులిమినందుకు. ఈ కారణంగా కోపం రాలేదు అంటే వాడి తెలుగుదనంలో లు, గు తమ పొజిషన్లు మార్చుకున్నట్టే 😉
ఠాట్! పొజిషన్లు మార్లేదెహే! అని ఢంకా బజాయించాడంటే వాణ్ణెవరో కల్లు తాగిన కోతిగా మార్చినట్టు.

కోపం ఎందుకు రాలేదు?
భారతం అనువాద రచనే అయినా మూలభారతానికీ తెలుగు భారతానికీ తేడా వుంది. ఇది స్వతంత్ర కావ్యం అనేటంత తేడా!
పద్యాల అల్లిక వివిధ ఛందస్సులలో వున్నప్పుడు అది విన్నా, చదివినా, నాటకం వేసినా వచ్చే మజా వేరు. ద్విపద కావ్యం తక్కువని కాదు. దాని అందం దానిది. అన్ని వర్గాలకీ చేరువగా, అర్ధమయ్యేలా వుండడం దాని ప్రత్యేక ప్రత్యేకత. రసజ్ఞత అని ఒకటేడిసిందిగదా! అదే, literary, artistic or aesthetic taste అంటారూ, అదీ! అందులో వేరు వేరు లెవెల్స్ అనమాట.
రెండిట్నీ ఎంజాయ్ చేసే సెక్షనూ వుంటుంది, సందర్భమూ వుంటుంది. శంకరాభరణం? క్లాస్ ప్రేక్షకులు మాస్ సినిమానీ, మాస్ ఆడియెన్సు క్లాస్ సినిమాల్నీ ఎంజాయ్ చేసిన సందర్భాల్లేవూ? ఏఎన్నార్ దేవదాసు, ఎన్టీయార్ రాముడు-భీముడు – వీటిని  క్లాసూ మాసూ రెండు సెక్షన్లూ ఎంజాయ్ చెయ్యలా? అలాంటిదే ఇదీ. నన్నయ, పాల్కురికి సోమనాధుల కాలపువాళ్ళు రెండిట్నీ ఎంజాయ్ చేసేవుంటారు. ఇటాలియన్ కాన్సెప్ట్లు, పార్లమెంటులో కరెంటు పోవడాలు అప్పటికి లేవుగా!

బసవపురాణాన్ని ద్విపదలో రాయడం వెనుక అది సామాన్యులకి చేరాలన్న బసవేశ్వరుని సామాజిక స్పృహవుంది. భారతంలో విషయవైవిధ్యం విస్తృతం – ఫిలాసఫీ, సోషియాలజీ, పాలిటిక్స్, ఎథిక్స్, మోరల్స్, ఎమోషన్స్, హ్యూమన్ ఫ్రెయిలిటీస్ …. ఒకటేమిటి it covers every aspect of life. సమకాలీన సమస్యలని ప్రత్యేకంగా ఎత్తిచూపకుండా, అలాగని వదిలెయ్యకుండా, అంటే జడ్జిమెంట్ పాఠకుడికి వదిలేసే ఒక విధమైన థాట్ ప్రొవోకింగ్ నేరేషన్ భారతంలో వుంటుంది. బసవ పురాణం బసవేశ్వరుడి చరిత్ర. సాంఘిక సంస్కరణ లక్ష్యంగా సాగిన బయోగ్రఫీ. రెండూ రెండు విధాల ప్రభావం చూపే గొప్ప గ్రంధాలు. అందువల్ల ఏది ఫస్టు, ఏది సెకెండులాంటి అసందర్భ అనుచిత సందేహాలు మంచి సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్లకి రావు. ఒకవేళ రాంకింగులిచ్చినా అది సింబాలిగ్గా తీసుకోవాలనుకునే హృదయవైశాల్యం మంచి పాఠకుడికి వుంటుంది. తెలుగువాళ్ళు మంచి పాఠకులు. ఈ కారణాల వల్ల కోపం రాలేదు.
కోపం వస్తుందని, రావాలనుకుని కోపం తెచ్చుకునే కేటగిరీ వేరు.

****

“శ్రీవారిని దర్శించుకున్న (సినీ) ప్రముఖులు !!!” – శ్రీవారి ముందు ప్రముఖులెవరండీ అసలు?


తెలుగు న్యూస్ లో నాకు నచ్చని ఒకానొక (ఓకే ఒక కాదు) ఐటం ఇవాళ మళ్ళీ పేపర్లో పడింది. అది – “శ్రీవారిని దర్శించుకున్నప్రముఖులు (ఒకోసారి సినీ ప్రముఖులు)”. శ్రీవారి ముందు ప్రముఖులేంటండీ అసలు? పేపర్లవాళ్ళు అలా రాస్తారా ఈ ప్రముఖులు అలా రాయించుకుంటారా? ఫలానా దేవుణ్ణి దర్శించుకోడానికి వెళ్లాను అని నలుగురితో చెప్పుకోవటమే కూడదంటారు. అలా చెప్పుకుంటే దైవదర్శనం వల్ల మనలో ఏ మూలో వున్న కాస్తపాటి భక్తి, విశ్వాసం, దేవుడికి మన శరణాగతి, ఆ నమ్మకంవల్ల వచ్చే (లేక) రాబోయే జ్ఞానం – ఇలాంటి వాటి ఆరోగ్యానికి మంచిది కాదని అలా అంటారు. ప్రముఖులు అని పిలవబడుతున్నవాళ్లకి ఈ విషయం తెలీదు అనుకుంటే ప్రముఖులు అనే టైటిల్ సబబేనా?

శ్రీవారిని దర్శించుకునే రకరకాల ప్రముఖుల్లో సినీ, రాజకీయ, అధికారిక, ప్రభుత్వ ప్రముఖులే ప్రముఖులు. ఇందులో కొత్తగా చెప్పేదేంవుంది? ఏ తెలుగు పేపర్ చూసినా తెలుస్తుంది. కానీ కొత్తగా మనం చూడొచ్చు.

పైన చెప్పిన నాలుగురకాల ప్రముఖులకీ, ఇతర ఉత్తుత్తి ప్రముఖులకీ  తేడా ఏంటంటే అది కాంట్రవర్సీ. కుంభకోణం, రంభకోణం ఈ రెండు కోణాల్లో ఏ కోణంనుంచి చూసినా ఈ నలుగురూ అందులో చోటు చేసుకోవడానికి పోటీలు పడుతూ వుంటారు. అందువల్లే ప్రముఖులనే టైటిలూ దానికి టాగ్ లా భక్తి అంటే కొంచెం అదోలా అనిపిస్తుంది.

నవవిధభక్తుల్లో ప్రముఖభక్తి లేదు. ఇది దశమవిధ భక్తి. ఒక్క క్షణం, ఇప్పటి ప్రముఖ భక్తికన్నా చాలా రెట్లు అతిగా వుండే ప్రముఖ భక్తి , ఇన్ ఫాక్ట్, దశముఖ భక్తి రావణాసురుడు ప్రదర్శించి ఇరవై చేతులూ కైలాస పర్వతం కింద నలగ్గొట్టించుకుని శృంగభంగం అయ్యాక చివరికి పేగులతో(సొంతవి) రుద్రవీణ వాయించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కలియుగప్రముఖులకి రావణుడంత భక్తీ లేదు, మొండితనమూ లేదు, సాహసం అంతకంటే లేదు. సో, ప్రస్తుత ప్రముఖభక్తి పదోరకం భక్తిలో లోయెస్ట్ లెవెల్.

భక్తికి సరిపోయే క్వాలిటీ హ్యుమిలిటీ(అణకువ, నమ్రత, వినయము) ప్రముఖత్వం కాదు. ఈ విషయం పేపర్లకి తెలియదా? దేవస్థాన అధికార్లకీ, అర్చకులకీ తెలియదా? ప్రముఖులకి తెలియదా? ఎవరికీ తెలియదా? అదే నాకు తెలియదు.

నిజాయితీగా చెప్పాలంటే ఈ టాపిక్ లేవనెత్తడంలో నాక్కొంత సెల్ఫ్ డౌట్ లేకపోలేదు. ప్రముఖులందర్నీ ఓకే గాటన కట్టడం కరెక్టు కాదేమో, నేనంత బ్రాడ్-మైండెడ్ కాదేమో! ముందే చెప్పినట్టు ప్రముఖులు అని రాయించుకుంటారా? పేపర్లే రాస్తాయా? అన్నమీమాంస ఒకటి వుందికదా!
అదీకాక భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానంగా అంబికా దర్బార్ బత్తీ తప్ప ఇంకెవరూ, ఏమీ వుండకూడదు, నేను కూడా. సో, నా ప్రశ్నల్ని జస్టిఫై చెయ్యడం ఎలా? వాట్నిఎవరాన్సర్ చేస్తారు? లాభం లేదు డైరెక్ట్ గా దేవుణ్నే ఆత్మారాముణ్ణే అడగాలి. అడిగేసాను ఈ ‘ప్రముఖ’ భక్తిని నువ్వెలా రిసీవ్ చేసుకుంటావు అని. అం’తరంగా’లుగా ఆయనిచ్చిన సమాధానాలివీ –

రాకెట్ లాంచింగ్ ముందు ఇస్రో చైర్మన్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు అంటే ఏదో ఆయన వ్యక్తిగత నమ్మకం అని సరి పెట్టుకోవచ్చు. లాంచింగ్ ఫెయిల్ ఐతే అది దేవుడి ఫెయిల్యూర్ అని వాదించే వితండవాదులు ఇంకా తెరపైకి రాలేదు కనక ప్రస్తుతానికి వదిలెయ్యచ్చు. బట్, సినిమాల్లో సిగ్గూ లజ్జా లేని సీన్లు తీస్తూ, నటిస్తూ దేవుడికి పొర్లుదండాలు పెట్టే సినీ ప్రముఖుల్ని చూసి ఆ ‘సినీ’ భక్తిప్రపత్తులకి గుళ్ళో మూల విరాట్ మాయాబజార్లో ఎన్టీయార్ కృష్ణుడిలా తలపంకిస్తూ నవ్వుకుంటాడు. సామాన్యుల గుండెల్లో,బుర్రల్లో వుండే దేవుడు మాత్రం భ్రుకుటి ముడేస్తాడు. (భ్రుకుటి ముడెయ్యడం = frowning)

ఒక సుప్రీం కోర్టు జస్టిస్ తిరుపతో, శ్రీశైలమో వెళ్తే అదికూడా పర్సనల్ మేటర్ అని వదిలెయ్యచ్చు(వదిలెయ్యాలి) కానీ వేలకోట్ల కుంభకోణాలు చేసేసి కాలిబాటన కొండెక్కుతున్నా, కిరీటం తెస్తున్నా అంటే కొంచెం ఎబ్బెట్టుగా ఫీలౌతాడు మనలోవుండే అంతర్యామి. గుళ్ళోవుండే సర్వాంతర్యామి మాత్రం, “నా దృష్టిలో అందరూ ఒకటే,” అన్న పాలిసీ పెట్టుకోవడంవల్ల అదే చిరునవ్వుతో, అదే అభయహస్తంతో ప్రోటోకాల్ ఫాలో ఔతాడు.

ఓ అయ్యేఎస్ వీఐపీ దర్శనం చేసుకుని వస్తే ఆయనకుండే డ్యూటీలు, పని+రాజకీయ వత్తిళ్ళూ తెలుసు కనక యాక్సెప్ట్ చేసేస్తాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కానీ ప్రజాసేవకులం అని ముఖాలమీద పోస్టర్లంటించుకు తిరిగేవాళ్ళు అందరితో క్యూలో నిలబడకుండా వీఐపీ దర్శనాలు చేసేసుకోవడం, వాళ్ళతో సాగదీసుకున్న మూతులతో అర్చకులు ఫోటోలు దిగడం… ఇలాంటివి చూస్తే ఆత్మారాముడికి నవ్వు, జాలి, చిరాకు ఒకసారే పుట్టుకొస్తాయి.

మరి మీడియా గురించేమంటావ్ స్వామీ అంటే అంతర్యామీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడూ ఇద్దరిదీ ఒకటే అభిప్రాయం. పూర్వం యుగాని కొకరో ఇద్దరో విలన్లు ఉన్నటైములో లోకకల్యాణానికై నారద మహర్షి నిర్వహించిన పాత్ర ని కలియుగంలో మీడియాకి హోల్-సేల్ గా ఔట్-సోర్స్ చేసేసార్ట. యుగధర్మం ప్రకారం లోకకళ్యాణం అనేపని లోకమంతా కాంట్రావర్సీమయంచెయ్యడంతో రిప్లేస్ ఐపోయిందిట. ఒకోసారి తెలిసీతెలియక కూడా మీడియా ఆ పాత్ర నిర్వహించేస్తూ ఉంటుందిట. ప్రస్తుత సబ్జెక్ట్ మాటర్ అలాంటిదేట.

మరి ఈ పరిస్థితిని మార్చే ఉద్దేశం నీకేమైనా వుందా స్వామీ అంటే – కురుక్షేత్ర యుద్ధం కానీ, వాగ్యుద్ధం కానీ ఆయుధం పట్టకూడదని పాలిసీట. అందులోనూ ఇది కలియుగం కనక అస్సలు కలగజేసుకోరుట. చట్టంలా తన పని తాను చేసుకుపోతూ కర్మసిద్ధాంతం ఉండనే ఉందిట. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెల్సుట, నాకే తెలీదుట. సో ఫ్రెండ్స్, అల్ మై డౌట్స్ క్లియర్డ్, అల్ మై క్వెశ్చన్స్ ఆన్సర్డ్. నో మోర్ కంప్లెయింట్స్ ఫ్రమ్ మై సైడ్!! 🙂 _/\_

:-) మార్క్ ట్వైన్, ఆరుద్ర, Writer’s itch & మృగాళ్లు – This is about Pen, Gun and Men :-)


నువ్వు రాయాలనుకున్నదేదో పూర్తిగా రాసాకగానీ నువ్వేం రాయాలనుకున్నావో క్లారిటీ రాదు, నిజానికి రాయటం అప్పుడు మొదలౌతుంది అని మార్క్ ట్వైన్ ఉవాచ. ఇదేదో ఆరుద్ర గారి ఫిలసాఫికల్ ఉవాచ – నేనెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటుకి లిటరరీ ఈక్వలెంటులా ఉందే అనిపిస్తోందా. యూ ఆర్ రైట్. ఈ ఆర్టికిల్ ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు ఆరుద్ర గారి పద్యం ఆధారంగా మృగాళ్ళని తిట్టడం నా ఉద్దేశం. రెండ్రోజులాగి రీ-బ్లాగ్ చెయ్యబోతూ ఎడిట్ చెయ్యడంలో రూపు మొత్తం మారిపోయింది. This is a ‘great’ writing experience for my small self. ఎంత చెట్టుకి మొక్కకి అంత ‘గాలి’ మరి.

ఆరుద్ర పద్యం ఇదీ –

మెన్‌
ఆమెన్‌
చెరపట్టన్‌
మ్రోగెన్‌
నీగన్‌
నా
పెన్‌
ఆపెన్‌ (త్వమేవాహం పుట 36-37)
Your gun shoots and my pen stops the molesters that are after the helpless woman -ఇదీ మీనింగ్ .
నాకున్న భాషాపరిమితుల్తో ఇంతకంటే బాగా రాయటం కుదరదు మరి.
ఆరుద్రగారి త్వమేవాహంలోదిట ఈ పద్యం. ఇవాళ విశాలాంధ్రలో చదివాను. ( ఇక్కడ కొంచెం పిడకల వేట – “ట” అన్న ఒక్క అక్షరం ఎంతగొప్పదో ఇప్పుడర్ధం అవుతోంది. పెద్ద పెద్ద వాక్యాలతో ఎక్స్ప్లనేషన్లూ, డిస్క్లైమర్స్ రాయవసరంలేకుండా జస్ట్ ఒక్క “ట” యాడ్ చేస్తే చాలు. విషయం మన సొంతం కాదని, ఆ పరిజ్ఞానం అంతకంటే లేదనీ చదివేవాళ్లకి తెల్సిపోతుంది. తిట్లు, విమర్శలు, వ్యాఖ్యలు వగైరాలతో శ్రమ పడకుండా మన్ని పెట్టకుండా లైట్ దీస్కుంటారు. తెలుగుభాషలోని సౌలభ్యాల్లో ఇది ఒకటి. ఇతర సౌలభ్యాలేమిటో నాకు తెలిసాక రాస్తాను. అప్పటివరకూ గరికపాటివారి ఉపన్యాసాలు వింటూ తెలుగు నిజంగా నేర్చుకుంటా)
1949లో నిజాం/రజాకార్లకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధపోరాటం బాక్-గ్రౌండ్ తో త్వమేవాహం రాశారు. అని తెలుగు వికీపీడియాలో చదివి తెలుసుకున్నాను. ఈ డిస్క్లైమర్ ఎందుకంటే ఎవరైనా ఆరుద్ర గారిపై వ్యాఖ్యలు, చర్చలు మొదలుపెడితే ఇంక నా పని అంతే, అందుకే ఈ ముందు జాగర్త.
మరెందుకు ఈ రాయాలన్న దురద అంటే – ఇన్ ఫాక్ట్ నాకే అనిపిస్తుంది – writer’s itch అని ఒకటుంటుందిగా
When once the itch of literature comes over a man, nothing can cure it but the scratching of a pen. But if you have not a pen, I suppose you must scratch any way you can అని ~Samuel Lover, అన్న పెద్దమనిషి 1842లో అన్నాట్ట. పెన్ను కాకపోతే ఏదో ఒకదాంతో రాయమన్నాడుగా రాసేందుకు కీబోర్డు, రాయించుకునేందుకు బ్లాగు ఉన్నాయి కనక రాయడం అనిన్నీ,
An incurable itch for scribbling takes possession of many, and grows inveterate in their insane chests అని ఆంగ్లంలో జువెనాల్ అనీ, రోమన్ భాషలో డెసిమస్ లునియస్ లువెనాలి (Decimus Iunius Iuvenalis) అని పిలవబడ్డ రోమన్ కవి తన 2nd century AD బెస్ట్ సెల్లర్ the Satires లో అనటం వల్లనూ ఈ బ్లాగ్రచనా ప్రయత్నమను సాహసమునకు ఒడిగట్టితిని.

ఆరుద్ర గారి గురించే సరిగ్గా తెలియదు కానీ కొత్తగా శామ్యూల్ లవర్ & జువెనాల్ అంటూ పాత రచయితల్ని కోట్ చెయ్యడమేమిట్రా నీ మొహం తగలెయ్యా అంటే ఐ కాన్ట్ హెల్పిట్, రైటర్’స్ ఇచ్ ఇంత భయంకరమని నాకూ ఇప్పుడే తెల్సింది. అందుకే ఆల్ టైమ్ బెస్ట్ రైటర్ మార్క్ ట్వైన్ రచనాకండూతి గురించి ఏమన్నాడా అని గూగిలింపనంత ఈ క్రింది వాక్యముగానంబడియె –

The time to begin writing an article is when you have finished it to your satisfaction. By that time you begin to clearly and logically perceive what it is you really want to say అన్నాడు మార్క్ ట్వైన్.

ఆర్టికల్ మొత్తం చదివాక ఎక్జాక్ట్లీ గా అదే జరిగిందని పాఠకులు గ్రహింపగలరు. ఈ పోస్టు యొక్క మాతృక – ఇదీ ఆరుద్ర గారి పద్యానికి అర్ధం – చూడగలరు.

Now, ఎక్కువ టైము వేస్టవ్వకుండా డైరెక్టుగా పాయింటుకి వచ్చేస్తా –

పద్యం ప్రతిపదార్ధం కూడా కావాలా? ఐతే ఇదిగో :
= ఆ
మెన్ = మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను)
ఆమెన్ = చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్, ఆమెను అనగా ఆ స్త్రీని
చెరపట్టన్ = ప్రతీ సినిమాలోనూ దీనికి మీనింగు దొరుకును కావున ఇచట వ్రాయనవసరము లేదు.
నీ గన్ = ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా)
నా పెన్ = పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు
ఆపెన్ = ఆపెదరు
ఆ మగవాళ్ళు (మృగాళ్లు అని చదువుకొన వలెను) ఆమెన్ (చర్చిలో చెప్పే ఆమెన్ కాదండోయ్) ఆమెను అనగా ఆ స్త్రీని చెరపట్టగా ‘తుప్పా’ కి చేపట్టిన పోలీసులు (ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా), చట్టాలు చేసే నాయకులు పత్రికలూ, రచయితలూ, కవులు, నటీనటులు ,ఎట్సెట్రా సామాజిక బాధ్యతగల వ్యక్తులు (ఎంతమందికుందో డౌటు)ఆపెదరు (వీళ్ళందరూ పెన్ వాడతారు కదా)
ఇదీ తాత్పర్యం.

పద్యాలపై నా పరిజ్ఞానం సున్నాయే. అయినా పద్యంలోని విషయం మాత్రం మరిచిపోలేనిది. అలా మర్చిపోకుండా మనదేశపు పురుషాహంకారవరాహాలు (మేల్ షావినిస్ట్ పిగ్స్) రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయి కదా మరి. ప్రస్తుతబాధేంటంటే ఆరుద్ర గారు కీచకులపై గన్ మోగుతుందని, పెన్ దురంతాల్ని అపుతుందని రాసారు కదా. ఏ గన్నూ మోగట్లెదు, ఏ పెన్నూ సరిగా రాయట్లేదు. రాజకీయ తుప్పు పట్టి, లీగల్ టాంగిల్స్ లొ చిక్కుకుని వంగిపోయిన గన్ను సరే మోగదు. రాయాల్సిన పెన్నుకీ బద్ధకం పట్టుకుంది. సెన్సేషన్స్, గాసిప్స్ , పాలిటిక్స్ లొ మసాలా మరిగి, రాయాల్సినవి, జాతికి కావాల్సినవి రాయడం మానేసింది. ఇంకోటి, మంచిని చదివి దానిని వంటబట్టించుకోవల్సిన జనానికీ మసాలాలు అలవాటు చేసింది.

మంచిని చెప్పాల్సినవాళ్ళు, మంచిని రక్షించాల్సినవాళ్ళు, మంచిని పెంచాల్సిన వాళ్ళు – పెన్నూ, గన్నూ, మెన్నూ – ఎవరూ కవి వాక్యాన్ని నిలబెట్టరా?

{నిన్నటి న్యూస్, కలకత్తాలో కొందరు దరిద్రులు ఓ డెబ్భై రెండేళ్ళ వృద్ధురాలిపై ప్రతాపం చూపించారు. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే, మానవత్వం మర్చిపోయిన ఆ రాక్షసులు-సారీ రాక్షసులకి మానవత్వం ఎందుకుంటుంది? – ఆ filthy beasts త్వరలో పెన్ & గన్ చేపట్టిన అసలైన మెన్ చేతుల్లో నశించాలని కోరుకోండి.}

*****

గాంధీజీ కలలు; రాహుల్ గాంధీ’స్ “డంబ్-నెస్”; ముఫ్తీ గారి ఓవరాక్షన్


ఎక్స్పెక్ట్ చేసినట్టే అయింది. లీవ్ అనిచెప్పి వెళ్ళిన రాహుల్ గాంధీ పై దిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు కదా. కాంగ్రెసు బాబులు యధావిధిగా గోల పెట్టారు, గోర్నమెంటు బాబులు కధావిదిగా ఆఁ! అబ్బే! అంతా ఉత్తుత్తినే! డిల్లీలో ఉండే లీడర్లని ప్రొఫైల్ చెయ్యడం మామూలే అని తేల్చేస్తున్నారు. అంతా మామూలే అయితే ఆ ప్రోఫైలింగేదో, గిప్పుడే రాహుల్ బాబు ఊళ్ళో లేనప్పుడే చెయ్యాలా? అతనొచ్చాక ఎంచక్కా జుట్టు రంగూ, కళ్ళ రంగూ, కావాలంటే పళ్ళ రంగూ, .. అన్నీ డైరెక్టుగాచూసే చెయ్యొచ్చుగా?
ఓ పక్క కుర్రాడు ఎక్కడున్నాడో, ఏం పిచ్చిపన్లు చేస్తున్నాడో మన మెడకేం చుట్టుకుంటుందోనని కంగారు, ఇంకో పక్క అసలే ముసుగులో గుద్దులాటలా ఉన్న వ్యవహారాన్ని కెలికి, వాళ్ళు కుళ్ళుకుంటుంటే కిస కిస నవ్వుకోవాలనే సరదా. ఎద్దు పుండు కాకికి ముద్దు. బట్, కాకులు ఎడ్లవుతాయి, ఎడ్లు కాకులౌతాయి. ఓడలు -బళ్ళ మాదిరిగా. కాశ్మీర్ లో ముఫ్తీ తో దోస్తీ రాజకీయ సుస్తీ (స్పెల్లింగ్ కరెక్టే బాబూ, సీ కింద త వత్తే, అనారోగ్యం) వస్తే కాంగ్రెసు బాబులు నవ్వుకున్నారు, ఇప్పుడు రాహుల్ వ్యవహారాన్ని అటూ ఇటూ కెలికి వీళ్ళు నవ్వుకుంటున్నారు. దేశాన్ని పాలిచండయ్యా అంటే అది మానేసి పార్టీ -పార్టీ పాలిటిక్స్ మీద ఫోకస్సేంటో?

రాహుల్ గాంధీ టాపిక్కు వచ్చింది గనక చెప్తున్నా, అతన్నందరూ డంబ్ పొలిటిషియన్ అంటున్నారు గానీ ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అభిజ్ఞవర్గాలు అనేసుకుంటున్నాయి.

Note: అభిజ్ఞ్జ వర్గాలంటే ఏమిటో, అవెలా ఉంటాయో, అసలవి మనుషులో లేక ఎవడి ఐడియా వాడు రాసేసి అభిజ్ఞవర్గం అనే అమాయకుడిమీదకి బాధ్యత నెట్టేస్తాయోగానీ ఆకాశంలొ బ్లాక్ హోల్ లాగా మీడియాలో అభిజ్ఞవర్గం అనే shady thing ఒకటుంటుంది. నిజంగా దాన్ని చూసాం అనుకునే వాళ్ళుంటారు, కనిపించిందేమో అని తమని తాము కన్విన్స్ చేసుకునేవాళ్ళూ ఉంటారు. చిన్నప్పట్నుంచీ చూస్తున్నా బిగ్ ఫుట్, యేటి, మాన్-స్టర్ ఆఫ్ లాక్-నెస్, యూఎఫ్ఓస్ … వీటిలాగే నిజంగా ఉందో లేదో తెలియని మరో ఎంటిటీ అభిజ్ఞవర్గం. వాళ్లనే ఒకోసారి విశ్వసనీయవర్గాలు అనికూడా పిలుస్తారు.

సరే, ఇప్పుడు విషయం రాహుల్ గాంధీ’స్ “డంబ్-నెస్” గురించి కదా. ఏదేమైనా సోనియా-రాహుల్ మధ్య ఏం జరుగుతోందోగానీ కాంగ్రెస్ పార్టీ గురించి గాంధీజీ కన్న కలల్ని ఇద్దరూ కలిసి నిజం చేసేసేలా ఉన్నారు. కొంపదీసి నిజం చేసేస్తారేమోనని కంగారుపడుతున్న గాంధీ’టోపీ’లు తల్లీకొడుకులిద్దరికీ టోపీలు పెట్టి ఆ ప్రాసెస్ ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు.
గాంధీజీ కలలు అంటే నా ఉద్దేశం స్వాతంత్రానంతరం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండాలి అనే విషయంలో గాంధీజీ అభిప్రాయాలు అని.

disbanding congress

The Harijan issue of 15th February 1948 carried a document as Gandhi’s “Last Will and Testament” –
“Though split into two,” his document began, “India having attained political independence through means devised by the Indian National Congress, the Congress in its present shape and form, i.e. as a propaganda vehicle and parliamentary machine, has outlived its use. India has still to attain social, moral and economic independence in terms of its seven hundred thousand villages as distinguished from its cities and towns” and in order to achieve these goals unhampered by the roadblocks of power-politics “…The A.I.C.C. resolves to disband the existing Congress organization and flower into a Lok Sevak Sangh.”
The note was explosive then by the standards the then being set by the Congress and by its present standards the note should look like a nuclear bomb.
What Gandhi wanted was a radical overhaul of the party, right? అభిజ్ఞవర్గాలు చెప్పేదాన్ని బట్టీ రాహుల్ అలాంటి పార్టీ ఓవర్-హాల్ కోసమే తల్లితో తలపడుతున్నాడని. అదే నిజమైతే, పార్టీలో సంస్కరణలు జరిగి ఆప్, బీజేపీలకి దీటుగా తయారయితే అంతకంటే కావాల్సిందేముంది ప్రజాస్వామ్యానికి? పనిలో పనిగా కాంగ్రెస్ కి డైనాస్టిక్ రూల్ దౌర్భాగ్యం వదిలించే దిశగా కూడా పావులు కదుల్తున్నాయని అభిజ్ఞవర్గం అనుకుంటోంది. పెళ్లి దిశగా యువనేత అడుగులు కదలకపోవడమే దానికి సూచన. అదే జరిగితే రాహుల్ గాంధీ మోడర్న్ భీష్ముడే. ఆహాఁహాఁ! ఇంచు మించు సరిసాటి. ప్రియాంక రాజకీయాల్లోకి రాకుండా రాబర్ట్ వాద్రా శతవిధాల ప్రయత్నిస్తాడనే నమ్మకం, ధైర్యం ప్రజలకెప్పుడూవుంది.

Now-
ఏం జరిగింది – ఏం జరుగుతోంది – ఏం జరగబోతోందనే టెన్షన్ పెరిగిపోయినట్టుంది ఎన్డీయే పెద్దలకి. ప్రభుత్వం రాహుల్ సెలవు విషయంలో అభిజ్ఞవర్గాల్ని నమ్మదల్చుకోలేదు. ఏకంగా పోలీస్ ఎంక్వైరీకి తెరలేపింది. ఢిల్లీ పోలీసులు కాంగెస్ ఆఫీసుకెళ్ళి కాంగ్రెస్ వైస్-ప్రెసిడెంట్ హైటూ, వెయిటూ, జుట్టూ-కళ్ళ రంగులూ అన్నీ ఆరా తీశార్ట. కాంగ్రెస్ కి ఏం సంకేతాలు పంపుతున్నట్టు? రాహుల్ చుట్టూ ఉండాల్సిన ఎస్పీజీకి చెప్పకుండా సెలవు పెట్టేసి రాహుల్ ఏదో పెద్ద డ్రామానే నడుస్తోందన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాడు. పోలీస్ ఎంక్వైరీలు పెట్టి ప్రభుత్వమూ డ్రామాలొ చేరింది. ఆఁ! ఈయన ఎక్కడికెళ్ళి ఎ చిక్కుల్లో ఇరుక్కుంటాడో, ప్రతిపక్షనేత రక్షణ బాధ్యత గాలికొదిలేశారన్న నింద మోసే ప్రమాదం కల్పిస్తాడా ఏం అని ప్రభుత్వం టెన్షన్ పడ్డం కరెక్టేగా.

ఈ మధ్య ఓవరాక్షన్ చేస్తున్న వాళ్ళలో ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ ఒకడు, పెద్ద జిడ్డు పొలిటీషియన్. ఎనభైతొమ్మిదిలో వీపీసింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ అయిన వారంలోనే ఇతని కూతుర్ని కిడ్నాప్ చేశారు మిలిటెంట్లు. కిందామీదా పడి వాళ్ళ డిమాండ్లు తీర్చే వరకూ, అంటే జైల్లో ఉన్న కొందరు టెర్రరిస్ట్లని వదిలిపెట్టేవరకూ ఈ “హోమ్ మినిస్టర్” గారు ప్రభుత్వాన్ని పీడించాడు. అప్పటి కాశ్మీర్ సీ.ఎమ్, ఫరూక్ అబ్డుల్లా దీని ఆధారంగా పొలిటికల్ ఎడ్వాంటేజ్ పొందే ఛాన్స్ ఇవ్వకుండా, కేంద్రంలో కొత్త ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో పడకుండా మేనేజ్ చెయ్యాల్సి రావడంతో టెర్రరిస్టుల్ని వదిలిపెట్టి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ బ్రతుకు జీవుడా అనుకుంది, రాజకీయ పబ్బం గడుపుకుంది. కొందరు పరిశీలకుల అభిప్రాయం ఏంటంటే ఇలా ప్రభుత్వం మొదటిసారి లొంగివచ్చినప్పటినుంచీ కాశ్మీర్ సిట్యుయేషన్ భ్రష్టు పట్టడం మొదలైందని.

కూతుర్ని మిలిటెంట్స్ వదిలిపెట్టాకా ఈ పెద్దమనిషి ఏమన్నాడో తెలుసా – “I had left her fate in the hands of the Almighty,” అని. దేవుణ్ణి అంత నమ్మే పెద్దమనిషి, “ఏమయితే అయింది, ఒక్క టెర్రరిస్టునీ వదిలే ప్రసక్తి లేదు. నా కూతుర్ని దేవుడే రక్షిస్తాడ”నుకోవచ్చుగా ఒక హోమ్ మినిస్టర్ గా? హేఁవిటో !

ఇప్పుడు మళ్ళీ స్టేట్ సి.ఎమ్ అయ్యాడు. ఎందుకొచ్చిన గొడవ? తీవ్రవాదులకి పాజిటివ్ సిగ్నల్స్ పంపడం మంచిది, మళ్ళీ ఈ కిడ్నాప్ గొడవలేం పడతాం అనుకున్నాడో ఏమో అప్పుడే ఒకణ్ణి జైల్లోంచి విడిపించాడు. కాశ్మీర్ జెండా, నేషనల్ ఫ్లాగ్ తో సమానంగా అన్ని చోట్లా అదీ ఎగరాలన్నాడు. ఐతే, తెర వెనకేం జరిగిందోగానీ ఆ ఆదేశం వెనక్కి తీసుకున్నాడు.

నా మటుకు నేను చాలా మంచోణ్ణే, కోలిషన్ ధర్మ ప్రకారం ఒకోసారి చేతులు కట్టుకోవాల్సొస్తుంది అనే సంకేతం కూడా తీవ్రవాద వర్గాలకి పంపాడనిపించట్లా? ఏ తేడాలొచ్చినా బీజేపీమీద బాధ్యత నెట్టెయ్యొచ్చు.

బీజేపీ ఖర్మ కాకపొతే పైకేమో వీరాలాపాలు, తెర వెనక అధికారం కోసం లోపాయకారీ ఎరేంజిమెంట్లు. బిజినెస్ లోనే క్విడ్ ప్రొ కో అనుకుంటాం. రాజకీయంలోనూ అదే. పైగా ఇవన్నీ టీదింగ్ ట్రబుల్స్, బాలారిష్టాలు అని కవరింగొకటి.

మళ్ళీ – హేఁవిటో !

**********