Tag: విప్లవం

మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం😋😋😋


వోట్ల తాంబూలం ఇచ్చేశాం, ఇంకో ఐదేళ్ళ పాటు పార్టీలు, ప్రభుత్వాలూ తన్నుకు చావడానికి.

ఆ అధ్యాయం మే 23 నుంచీ మొదలయ్యేలోపు మనం ఎంజాయ్ చెయ్యాల్సిన వాటిలో మొదటిది ఆవకాయ సీజను. ఉగాది తరవాత వచ్చే పండగ వినాయక చవితి అనుకుంటాం కానీ మధ్యలో వచ్చే ఆవకాయ సీజన్ కి పండగ అనేంత ఇంపార్టెన్స్ వున్నా ఎందుకో ఆ స్టేటస్ ఇవ్వలేదు ఈ దేశం. తరతరాలుగా ఆంధ్రజాతికి జరిగిన అవమానాల్లో ఇదొకటి. మొదటి అవమానం విశ్వామిత్రుడు తన కొడుకుల్లో కొందరిని మీరు ఆంధ్రభృత్యులై పోతారు పొండి అని శపించడం. (మహాభారతంలో చదివా, మనకి స్పెషల్ స్టేటస్ రాపోడానికి, విశ్వామిత్రశాపానికీ ఏమన్నా లింకుందేమో?). ఇంత జరిగినా మన తెలుగువాళ్ళని తెలుగుతేజాలు అని ఈ రోజు అనగలుగుతున్నామంటే ఆ క్రెడిట్ చాలా మటుకు ఆవకాయకే వెళ్తుంది. ఆంధ్రులకి ఆవేశం వుందనే సంగతి ఏడాది పొడుగునా గుర్తు చేసేందుకు ఆవకాయ తప్ప ఇంకెవరూ కనిపించట్లేదు మరి. అందుకే ఆవకాయకి ఈ పోస్ట్ అంకితం.

ఉగాది రాగానే కోయిల కూతతో మనకి వసంతం వచ్చిన సంగతి తెలుస్తుంది కానీ ఆవకాయ సీజన్ని ఆహ్వానించే పక్షి కూత ఏదీ ప్రత్యేకంగా వున్నట్టు లేదు. కానీ, ప్రకృతి మాత్రం కూతలకి బదులు కవితలు అల్లుతుంది, నిశ్శబ్దంగా. అలాంటి కవితలు –

చెవులుండే మనసుకి వినిపించవు.

ౘవులుండే నాలుకకే వినిపిస్తాయి.

అలాంటి కవిత నిన్న నా నాలుకకి “వినబడింది”. అలా👇.

ఎక్కడో విన్నట్టుందే అని కిందామీదా పడక్కర్లేదని వేరే చెప్పట్లేదు. ఎందుకంటే, శ్రీశ్రీగారి విప్లవం ఎంత ఎర్రగా వుంటుందో ఆవకాయ విప్లవం అంత ఎర్రగా, కొంచెం ఎక్కువ ఘాటుగా వుంటుంది కదా? అందుకు!

మనం సామాజిక విప్లవాలు మర్చిపోయి దశాబ్దాలు అవుతున్నట్టు వుంది. ప్రస్తుతానికి ఆవుపాలు, బిప్లబ్ దేబ్ లు, ‘అంబా🐄….’నీలు …. ఇవే మనకి విప్లవాలు. వాటిలోలేని ఫైరూ, పవరూ ఆవకాయలోనే చూసుకోవాలింక. చూసుకోండి, ప్రకృతి తనలోని ఒకో భాగంతో ఒకో విధంగా ఆవకాయ సీజన్ని ఎలా ఆహ్వానిస్తోందో –

మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం అనేది పాతపాట. నిజానికి అవన్నీ దేనికదే ఒకో కవిత. ఆ కవితలన్నీ కలిసిన ఖండకావ్యం ఆవకాయ. ఆనెస్ట్లీ, ఖండకావ్యాలు అనే కావ్యాలుంటాయని తెలుసు, కానీ అవేంటో మనకి తెలీదు. నాకున్న మిడిమిడి జ్ఞానానికి అందినంత మటుకు ఆవకాయకి ఖండకావ్యం అనేపేరు సరిగ్గా సరిపోతుంది. మావిడికాయల ఖండాలు  (=ఆవకాయబద్దలు😋) నిండి, శ్రీశ్రీ కవితల్లో వుండే ఫ్లో కి ఇంచుమించు సరిసాటి ఐన ఊట ప్రవహించే కావ్యంలాంటి ఆవకాయని ఖండకావ్యం అంటే తప్పేవుంది? ఏంలేదు.

ఇవాళ్టికి ఇంతే🙂సంగతులు.

బై4నౌ 🤗