Category Archives: INDIA I LOVE

నా జన్మభూమి ఎంతో అందమైన దేశము (2) – Tigers of Bandhavghar


అడవిలో టూరిస్టుల్ని మోసే ఏనుగులూ, జీపులూ దగ్గరగా రావడం ఇష్టం ఉండేది కాదుట ఛార్జర్ కి. మరీ హద్దు మీరుతున్నట్టనిపిస్తే వాటి మీద దాడి చేయబోతున్నట్టు హడావిడి చేసేది, గర్జించేది. అందుకే ఆ పేరు వచ్చింది. ఐతే ఏ ఎటాక్ లోనూ ఎవరూ గాయపడలేదు. ఉత్తుత్తి మాక్ ఎటాక్స్. మనుషుల్ని దగ్గరగా చూడడం అలవాటు పడిన అడవి మృగాలలో టాలరెన్స్ లెవెల్స్ అన్నిటికీ ఒకలాగా ఉండవు. పులులయితే కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తే, కొన్ని దట్టమైన గడ్డిలోకి, చెట్లలోకి వెళ్ళిపోయి తప్పించుకు తిరుగుతాయి. ఛార్జర్ లాంటివి సరేసరి. మరీ చిన్న పిల్లలతో ఉన్న అడపులి జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు. ఛార్జర్ దాదాపు పదేళ్లు రాజ్యం చేసి 2000 సంవత్సరంలో చనిపోయింది. ఇప్పుడు బాంధవఘర్లొ ఉన్న పులులన్నీ ఛార్జర్ తో ఏదో రకంగా చుట్టరికం ఉన్నవే అంటారు. ఆశ్చర్యమేంలేదు. పదేళ్లంటే వైల్డ్ టైగర్స్ లెక్కలో ఒక జీవితకాలం. ఛార్జర్ పదేళ్లు డామినెంట్ మేల్ గా పార్కు టూరిజం జోన్ అంతటినీ తన స్వాధీనంలొ ఉంచుకుంది. ఆ కాలంలో ఎన్నో మగపులుల్ని ఆ ప్రాంతంనుంచి తరిమేసి ఉంటుంది. పెద్ద టూరిస్ట్ ఎట్రాక్షన్ అయిన ఛార్జర్ చివరలో మరో యువపులి చేతిలో గాయపడి, వేటాడలేక యాతన పడింది. పార్క్ వాళ్ళు అది ఉన్న ప్రాంతం కనిపెట్టి దానికి ఆహారం అందించి, ఇతర పులులు దాని జోలికి రాకుండా కాపలా కాసి అది సహజంగానే పోయేందుకు పరిస్థితులు కల్పించారు.

ఛార్జర్ కి ఆ పేరు రాక ముందు మరో పేరు ఉండేదిట. అది పీ.పీ.సింగ్. ఒకసారి అది టూరిస్ట్ ఏనుగుపై ఉత్తుత్తి దాడి చేసినపుడు దాని గర్జనలు, బెదిరిన ఏనుగు సృష్టించిన గందరగోళం టూరిస్టుల్లో ఒకాయనలొ అసంకల్పిత ప్రతీకార చర్యలు కలిగించాయిట. నట్టడివిలో బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి. అప్పట్నుంచీ గైడ్స్ పీ.పీ.సింగ్ అని పిలవడం మొదలెట్టారు. తరువాతెప్పుడో ఛార్జర్ పేరు వచ్చింది. ఇదీ క్లుప్తంగా ఛార్జర్ కధ.

ఛార్జర్ ని సమాధి చేసిన చోటు చాలా ఎత్తైన చెట్లతో, గడ్డీ, తుప్పలు మరీ గుబురుగా లేకుండా ఉంది. అతి నిశ్శబ్దంగా ఉంది. మృగరాజుపై గౌరవం అన్నట్టు గైడూ, డ్రైవరు కూడా మౌనంగా ఉన్నారు. పదేళ్ళ పాటు వాళ్లకి ఉద్యోగ భద్రత కల్పించింది ఆ పులి. ఆ మాత్రం గౌరవం ఉండదా? ఆ నిశ్శబ్దంలో లంగూర్ మంకీ అరుపు వినబడింది. ఏదో ప్రిడేటర్ ని చూసిందో లేక అనుమానంతోనో ఒక హెచ్చరిక చేసింది. ఇతర కోతులూ, నేల మీదున్న జింకల్లాంటి జంతువులూ కూడా ఈ హెచ్చరికల మీద చాలా ఆధారపడతాయి. నిజానికి కొండముచ్చుకీ – మచ్చల జింకకీ symbiotic relationship/ interspecies friendship ఉంది. రక్షణ కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఎత్తులో ఉండి దూరంలో ఉన్న ప్రమాదాల్ని కనిపెట్టడం కోతికి తేలిక. గడ్డిలో, పొదల్లో దాగిన ప్రిడేటర్స్ ని పసిగట్టడం జింకకి వీలవుతుంది. పరిణామక్రమంలొ రెండు జాతులూ ఒకదాని ఉపయోగం ఒకటి గ్రహించుకున్నాయి. వీలయినంతవరకూ దగ్గరగా మసులుతాయి. కలిసి ఉంటే కలదు సుఖం అనేది కేవలం మనిషి కనిపెట్టిన సత్యం కాదు. సంఘ జీవనపు ఉపయోగం ప్రతీ జీవి గ్రహించగలదు. ప్రకృతి సహజమైన జంతుప్రజ్ఞ ఉన్న స్థాయినిబట్టీ ప్రతీ జీవీ తన పరిసరాలతో, తన జాతి జీవులతో, ఇతర జాతులతో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాయి. వాటిలో అవి బుద్ధిపూర్వకంగా మోసాలు చేసుకోవడం వుండదు. అది కూడా సాధించిన ఘనత మనిషికి మాత్రమే చెందుతుంది. Sorry for the digression. లంగూర్ మంకీ అరుపుతో మాలో ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఏదో జంతువు దగ్గర్లో తిరుగుతోంది. ఏ క్షణంలోనయినా మా కంట బడవచ్చు. అక్కడున్న గాఢమైన నిశ్శబ్దం చూస్తే ఆ జంతువు పులే కావచ్చు. ఓ పది నిమిషాలు అక్కడే ఉన్నాం. మా జీపు ఒక్కటే. వాహ్! ఫస్ట్ ట్రిప్ లో అందరికంటే ముందు పులిని చూసినవాళ్ళం మేమే అవుతాం అనిపించలేదు. జిమ్ కార్బెట్ స్టైల్లో ఒంటరిగా (ఇంచుమించు) పులిని ఫేస్ చెయ్యబోతున్నాం. జూలో, సర్కస్ లో లా కాకుండా పులిని దాని సహజ వాతావరణంలో నీ ఇంటికొచ్చా! నీ నట్టింటికొచ్చా! అన్నంత లెవెల్లో ఎదుర్కోబోతున్నామనే ఎక్సైట్-మెంట్. భయం వేస్తే ఎలా? దానికి భయ పెడదామని సరదా పుడితే ఎలా? ఇలాంటి ప్రశ్నలేంలేవు బుర్రలో. ఐదు నిముషాలయ్యింది. మంకీ అరుపులు ఆగిపోయాయి. ఫాల్స్ అలార్మ్ కావచ్చు. థ్రిల్ కాస్తా నిల్. రోజుల తరబడి పులులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అడవుల్లో తిరిగినా కనీసం దాని కాలి గుర్తులు కూడా సరిగ్గా దొరకని జిమ్ కార్బెట్ అనుభవాలు గుర్తుచేసుకున్నాం. జీపు కదిలింది. చూద్దాం! ఇంకా నాలుగ్గంటల టైముంది అడవిలో తిరగడానికి ఈ మొట్ట మొదటి సఫారీలో. ఇదిగో ఇదీ ఛార్జర్ని బరీ చేసిన స్థలం –

DSC_0874

మళ్ళీ అడవిలోకి ప్రయాణం. దారిలో అడవులన్నా పులులన్నా ఎందుకు నాకీ పిచ్చి అని ఒక పనికిమాలిన డౌట్ వచ్చింది. కొన్ని క్షణాల పాటే ఉన్నా నా మటుకు అది చాలా ఇంట్రెస్టింగ్ డౌట్. ఎందుకంటే మా యింట్లో ఎవరికీ లేని వైల్డ్ లైఫ్ ఇంటరెస్ట్ నాకు ఎలా ఏ సందర్భంలో కలిగివుంటుందా అని గతాన్ని తవ్వుకోవడం కూడా ఎందుకో బావుంటుంది. నిశ్శబ్దమైన అడవి మధ్య మనకి తెలియకుండా మన్ని అబ్జర్వ్ చేస్తూ పచ్చటి కళ్ళు రెండు చాలా దగ్గర్లోనే ఉన్న ఫీలింగ్ ఉంటుందే, అందులో ఒకటో, రెండో శాతమైనా ఆ మెమరీ మైనింగ్ వల్ల కలుగుతుంది. ఆ మెమరీస్ లో నాకు తెలిసి మొట్టమొదట పులి గురించి విన్న నిజమైన కధో, నిజమా అనిపించే కధో ఏదైతేనేం అది చెప్తాను. ఐదారేళ్ల వయసులో మా నాన్న చెప్పిన కధ. బెడ్రూమ్ కిటికీలోంచి చంద్రుణ్ణి తెల్లవార్లూ చూస్తూ చంద్రుడు వెళ్లి సూర్యుడు ఎలా వస్తాడో చూడాలని నాకో ప్రాజెక్టుండేది అప్పుడు. (ఇప్పటికీ పూర్తవ్వలేదు) అలా చంద్రుణ్ణి చూస్తూ కధ చెప్పమంటే చెప్పిన కధ ఇది.

సీలేరు అనే వూరు, ఆ వూరి చుట్టూ దట్టమైన అడవులు. కంప్లీట్ విత్ టైగర్స్ అనమాట. రాత్రిళ్ళు బయటకొస్తే పులో, చిరత పులో ఎదురవ్వడం చాల సాధారణంట అక్కడ. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ఉంది. అందులో స్టాఫ్ కి అక్కడే క్వార్టర్స్. ఆ స్టాఫ్ లో ఒకడే ఈ కధకి నాయకుడు (అని నా ఉద్దేశం, కన్ఫర్మ్ చేసుకోవాలని అప్పుడు తెలియదు, ఇప్పుడు కుదరదు). సరే కదా నాయకుడు ఒక రాత్రి చలి మంట వేసుకుని ఒక్కడే కూచున్నాడు. వేచ్చాదనానికి నెమ్మదిగా కునుకు పట్టింది. కాస్సేపటికి మెలుకువొచ్చి చూస్తే మంటకవతల ఓ పులి కూర్చుని ఉందిట. అదీ చలి కాగుతోంది. పనిలో పనిగా నోరు తెరిచి వేడి తగిలేలా పెట్టుకుందిట. అడ్డమైన మాంసాలూ తిని బ్రష్ చేసుకోకుండా వదిలేసినందువల్ల పళ్ళలో బాక్టీరియా చేరి బాధ పెడుతుంటే పులులు ఇలా మంటలు కనిపించినప్పుడు నోరక్కడ పెట్టి క్రిముల్ని వదిలించుకుంటాయిట. ఐతే కధలో పులికి కానీ, హీరోక్కానీ ఈ విషయం తెలుసో లేదో అనేది పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది కనక అదలా వదిలేస్తున్నాను. సరే పులిని ముందు హీరో చూసాడు. అసంకల్పిత ప్రతీకార చర్య జరిగింది. ఐనా మనవాడు బుర్ర స్టేబుల్ గా ఉంచుకున్నాడు. లేచి పరిగెడితే పులి వెంట పడుతుంది. దానికా చాన్స్ ఇవ్వకుండా తప్పించుకోవాలి. మండుతున్న కట్టె మెల్లిగా తీసి తెరిచిన పులి నోట్లో విసిరేసి పారిపోయాడు. పులేం బాధలు పడిందో పాపం హీరో మాత్రం ప్రాణాలతో బైట పడ్డాడు. ఇప్పుడైతే క్రూరమైన కధ అనిపిస్తుంది. అలా అని అప్పుడు కూడా పులి చచ్చి, కధ సుఖాంతం అయిందని నేను సంబరపడ్డ గుర్తు లేదు. This last point is something that makes me happy over that matter. ఈ కధ కాక ఇతర కధలున్నా ఎంతో కొంత రియాలిటీకి దగ్గరగా ఉన్న టైగర్ స్టోరీ ఇది.

దీని తరువాత జంతువుల మీద కొంతవరకూ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ పెరగడానికి కారణం సెవెంత్ లో ఉండగా మా పిన్ని ప్రెజెంట్ చేసిన ‘పిల్లి జాతి’ అనే నేషనల్ బుక్ ట్రస్ట్ పబ్లికేషన్. Cat Family పేరుతో  M.D. చతుర్వేది వ్రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం. సింహంతో మొదలై పిల్లి వరకూ ఇండియాలో ఇప్పుడూ/ఒకప్పుడూ ఉన్న జంతువులన్నిటి గురించీ వ్రాసినది.

దాని తర్వాత, దాని ప్రభావం వల్ల అనొచ్చేమో, సర్కస్ లో సింహాన్ని (in fact, బోనులో పడుకునున్న సింహం తోక చివరి కుచ్చుని) ముట్టుకోవడం జంతువులపై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోవడానికి కారణం అయిందని అనుమానమో, అభిప్రాయమో – అది కూడా ఒకటుంది. ఆ విషయాలు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లో.

(సశేషం)

***4ksy***

ద ఇండియా ఐ లవ్ (1)


బాంధవఘర్ నేషనల్ పార్క్.  జీపులో అడవిలోకి వెళ్తున్నాం. తెల్లవారు ఝాము ఐదు అవుతుంటే మౌగ్లీ రిసార్ట్ నుంచి బయల్దేరాం. కటిక చీకటి ప్లస్ చిక్కటి చలి. ఓపెన్ టాప్ జీప్ లో ముందు డ్రైవరూ, వెనక సీట్లో మేమిద్దరం. భాయ్ సాబ్! నీ దగ్గర గన్ ఉందా అని వచ్చీ రాని హిందీలో అడిగా. గన్ గిన్ ఏమవసరంలేదు సాబ్. మనం జీపులో ఉన్నంతసేపూ పులి మన జోలికి రాదు. నా సీటు పక్కనుంచి రెండడుగుల దూరంలో పులి నడుచుకుపోవడం ఎన్నిసార్లు జరిగిందో లెక్కేలేదు అన్నాడు. ఇప్పుడు పులిని అంత దగ్గర్నుంచి చూడడం అవసరమా అనే ప్రశ్న మనలో రావాలి కదా. రాలేదు. జిమ్ కార్బెట్, కెన్నెత్ ఆండర్సన్ ల అనుభవాలని ఉపాసించిన, వాళ్ళ పుస్తకాలని ఔపోసన పట్టిన పుణ్యఫలమో ఏమో అస్సలు భయం వెయ్యలేదు. భయం వెయ్యలేదా? లోపలున్న భయం బయటపడలేదా? తెలీదు. డిసెంబర్ కావడంతో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. సాలవృక్షాలు (ఏగిస / Sal), వెదురు పొదలు నిండిన అడవి. మధ్య మధ్య పచ్చిక బయళ్ళు, చిన్నపాటి యేళ్ళు, అక్కడక్కడా రాళ్ళ గుట్టలు, ……దూరంగా కొండల మీద బాంధవఘర్ ఫోర్ట్.

నిశ్శబ్దంగా ఉన్న అడవిలో మట్టి రోడ్డు మీద ఎక్కువ చప్పుడు లేకుండా జీపు వెళ్తోంది. బాట, అడవిబాటకి రెండు పక్కలా జంగిల్ జయింట్స్ అన దగ్గ టేకు, ఏగిస, విప్ప (mahuva) చెట్లు. వాటి మధ్య నుంచి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేత కిరణాలు. దూరంగా మైదానంలా ఉన్న ప్రదేశంలో ఆహారం కోసం గడ్డిని కెలుకుతూ నెమళ్ళ గుంపు. జీపుకి ముందు ఓ ఫర్లాంగు దూరంలో రోడ్డు దాటుతూ జింకల గుంపు. ఎక్కువగా తెల్ల చుక్కల జింకలు (AXIS AXIS).

రాంభగత్, మా జీపు డ్రైవరు, మేఁవాఁ ప్రశాంతతని ఆస్వాదించడానికి ఓ రెండు నిమిషాలు అక్కడ ఆపాడు. నిశ్శబ్దంగా ఆ వాతావరణాన్ని కళ్ళతో, చెవులతో శ్వాసతొ పాటుగా పీల్చుకుంటూ చూస్తున్న మా మధ్య మంచుతో తడిసిన విప్పచెట్టు రెమ్మ నిశ్శబ్దంగా రాలింది. అడవితల్లి ప్రేమగా పిలుస్తోందా? అడవిలో అతి ప్రశాంతమైన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో టిఫిన్ చెయ్యడం ఒక అనుభవం. It must be one of the most peaceful breakfasts one can ever have on earth. Only sound that could be heard was that of water droplets falling from leaf to leaf on their early dawn journey towards mother earth. That silence and solitude were not electrified yet as the king, of the jungle, was not on the scene.

ఈ అడవిని మూడు రోజుల్లో వదిలి వెళ్ళిపోవాలి, ఎలా? జీపు స్పీడందుకుంది. ఎర్రమట్టి రోడ్ మీంచి దుమ్ము రేగుతోంది. అయినా ఎలాంటి ఇరిటేషన్, తుమ్ములు లేవు. కాలుష్యంలేని మట్టి, గాలి. చలికి ముఖాలు ఎర్రగా అయిపోతున్నాయి. రాంభగత్ మాత్రం స్పీడు తగ్గించలేదు. వీలైనన్ని పులుల్ని మాకు చూపెట్టాలని అతని తాపత్రయం.

బాంధవఘర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లొ ఉమరియా జిల్లాలొ ఉంది. జబల్ పూర్ నుంచి మేం కార్లో వెళ్ళాం. మూడు గంటలు పట్టినట్టు గుర్తు. అంతగా డెవలప్ కాని (thank god!) ప్రాంతాల గుండా వెళ్తుందేమో మార్గం చాల అందంగా, గోధుమ, ఆవాలు, శనగ లాంటి పంటపొలాల మధ్య సాగుతుంది. ఎక్కడ చూసినా ఓ రకమైన అడవి వాతావరణం. గిరిజన ప్రాంతం. చిన్నప్పుడు చూసిన అడవి సినిమాల్లో కోయగూడాలు కనిపించినప్పుడు విన్పించే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందే అది చెవుల్లో వినబడుతోంది. కలలు కళలకే కాదు, చెవులకీ ఉంటాయనమాట. మా ప్రయాణం  మధ్యాహ్నం రెండుకి మొదలై రాత్రి ఏడు వరకు సాగింది.

Bgarh 001
దార్లో గోధూళి వేళ…..

వందల ఆవులు రోజంతా పొలాల్లో, చిట్టడవుల్లో మేతకి తిరిగి తిరిగి గ్రామాలకి చేరుకుంటున్న దృశ్యం.

నాన్నతో సైకిల్ రౌండ్ కొడుతూ ఓ మూడేళ్ళ బుల్లిది

రోడ్డు పక్క పొలాల సరిహద్దు గోడల మీద కొండముచ్చులు లంగూర్స్, (ముచ్చు అనే పదం వల్ల అ సీన్ లో ఉన్న అందం ఈ మాట వల్ల తగ్గుతోంది, preconceived ideas influence what we see and hear, sometimes what we write)

దూర దూరంగా పొలాల్లో ఉన్న ఇళ్ళు, మంచెలు;

ఏ జన్మలోనో ఈ ప్రదేశంలోనే పుట్టి పెరిగి ఈ నేటివిటీ ఆత్మలో నిండిపోయి ఈ జన్మకీ ఆ వాసన మిగిలిపోయినట్టు… ఓ చిన్న పొలం కొనుక్కుని ఇలాంటిచోట సెటిల్ ఐపోవాలని ఆత్మఘోష. దార్లో కట్ని, స్లీమనాబాద్, ఉమరియా కాక కొన్ని చిన్న చిన్న గ్రామాలు చూసుకుంటూ సాగిపోయాం. రాత్రి తొమ్మిది పది ప్రాంతాల్లో బాంధవఘర్ చేరుకుంటే రోడ్డు దాటుతున్న పులుల్ని చూడొచ్చు, లక్కు బావుంటే. 105 sq. km వైశాల్యం ఉన్న ప్రధాన అడవిలో (core area) 27 పులులు ఉన్నాయట. చాలా ఎక్కువ ఆ వైశాల్యానికి. యావరేజ్ 1 sq.km కి 3 లేక 4 ఉంటాయనమాట. ఒకో మగ పులి దాదాపు 60 to 100 sq. km, ఆడ పులి 20 sq.km రేంజిలో తిరుగుతూ, ఆ రేంజిని కాపాడుకుంటూ ఉంటాయి. దీన్ని బట్టీ బాంధవఘర్ అడవి, 27 పులులకి చూస్తె ఎంత ఇరుకో అర్ధమౌతుంది! అందుకే కొన్ని అరణ్యాన్ని దాటి బయటికి, అంటే సెమీ-ఫారెస్ట్ లొకి వస్తాయి. మనిషికి, మృగానికి సంఘర్షణ మొదలౌతుంది. ఇక్కడ ఇది నిరంతర వ్యవహారం. పులులు కాక చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఇంకా ఇతర చిన్న మాంసాహార జంతువులకీ నివాసం ఈ అరణ్యం. అన్నిటినీ డామినేట్ చేస్తూ పెద్దపులులు అడవిని తమ స్వంతం చేసుకున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు అతి అరుదుగా కనిపిస్తాయి. పులి కంటబడితే అవి బతికి బయటపడ్డం డౌటే. మధ్యప్రదేశ్ లోనే ఉన్న పన్నానేషనల్ పార్క్ లొ అని గుర్తు, ఓ ఎలుగుబంటిని పులి తింటున్న ఫోటో చూసాను. ఇద్దరు అమెరికన్స్ ఏనుగుల దంతాలకి కెమేరాలు వేలాడదీసి పులుల్ని ఫాలో అయ్యి వాటి దిన చర్యని డాక్యుమెంటరీగా తీసారు. ఆ సందర్భంలోనే ఎలుగుని తింటున్న పులి వాళ్ళ కంటబడింది. బాంధవఘర్ పార్క్ లొ సీత అనే ఆడ పులి ఉండేది. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీల ద్వారా చాల వరల్డ్ ఫేమస్ అయింది. అది కొండచిలువని చంపి పిల్లల కోసం తీసుకు వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. మామూలుగా జింక, కణుజు, అడవిపంది పెద్ద పులికి మెయిన్ మెనూ. అప్పుడప్పుడూ గౌర్ (Indian Bison), ఖడ్గమృగం పిల్లలు, ఏనుగు గున్నలని కూడా ట్రై చేస్తాయి. బాంధవఘర్ లో ఏనుగులు, ఖడ్గమృగాలు లేవు. చైనీస్ ఫుడ్ మీదకి మనసు పోయినప్పుడు కొండ చిలువ, ఎలుగుబంటి, ఒకోసారి కోతి లాంటివి తింటాయేమో!

చైనీస్, కొరియన్స్, I think Japanese also, … వీళ్ళందరికీ పులిని తినడం మీదకి మనసు పోతూ ఉంటుంది. ఒక ఫిలిపినో తను చైనాలో టైగర్ మీట్ తిన్నట్టు చెప్పాడు, I don’t like you అన్నాను. ఖర్మ! ఇండియాలోనే మూఢనమ్మకాలు ఎక్కువనుకుంటే ఈ మంగోలాయిడ్ జాతులకి మరీ weird నమ్మకాలు. మూగ జంతువుల ప్రాణాల మీదకి తెచ్చే నమ్మకాలు. పోనీ వాటిని ఒక్క దెబ్బకి చంపుతారా అంటే అలా కాదు. వీలయినంత క్రూరంగా చంపాలి, అదీ నమ్మకంలో భాగమే. పాములు, కోతులు, ఎలుగుబంట్లు … మహాహింసకి గురౌతున్నాయి. ఆ దేశాల్లో పులిజాతి అంతరించిపోయింది, చైనాలో కొన్ని ఉన్నాయి. వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్ కి అవసరమైన పులి కొవ్వు, ఎముకలు, వగైరాలకి ఇండియానే సరఫరా కేంద్రం. 2005లొ అరెస్టయిన సంసార్ చంద్ అనే poacher (దొంగవేటగాడు అన్న తెలుగు డిక్షనరీ అర్ధం నాకు నచ్చలేదు) కొన్ని వందల పులులు, చిరుతల్ని మట్టు పెట్టాడు. చైనీస్ మార్కెట్ లొ టైగర్ ప్రోడక్ట్స్ కి ఉన్న డిమాండ్ వాడి చేత ఈ పని చేయించింది. ఈ మధ్యే వాడి అనుచరులు చాలామంది అరెస్ట్ అయ్యారు. శారిస్క సాంక్చువరీ లొ ఉన్న పులులన్నిటినీ ఈ గాంగే పొట్టన పెట్టుకుందని అనుమానం. ఇలాంటి క్రిమినల్స్ కాక థాయ్ లాండ్ లొ మరో రకం శత్రువులున్నారు పెద్దపులికి. టైగర్ జూ పేరుతో దాదాపు వంద పులులు, చిన్న పిల్లలతో కలిపి, ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. అక్కడ పులి ప్రక్కన కూర్చుని ఫోటోలు తీయించుకోవచ్చు. పులి పిల్లలతో ఆడుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు, పులుల్ని ఒక ఎన్-క్లోజర్ లొ డైరీ ఫాంలో ఆవులూ, గేదెల్ని ఉంచినట్టు ఉంచడం మరో ఎత్తు. వాటిలో కొన్ని రోజూ టైగర్ సర్కస్ లొ పాల్గొంటాయి. సర్కస్ కోసం అన్ని టైగర్స్ ఎందుకో అర్ధం కాదు. కొందరు జంతుప్రేమికులు అనుమానాలు వ్యక్తం చేసారు, ఈ పులుల్ని వాటి body parts కోసం పెంచుతున్నారని, వాటిని చంపి మాంసం, ఎముకలు, … ఎగుమతి చేస్తారని. అయితే కొన్ని థాయ్ బుద్ధిస్ట్ ఆలయాల్లో కూడా మచ్చికయిన పులుల్ని బౌద్ధ బిక్షువుల పర్యవేక్షణలో ఉంటాయి. అవి టూరిస్ట్ అట్రాక్షన్ అవడంతో ఆలయాలకీ రాబడి పెరుగుతుంది. కాకపోతే పులుల్ని మత్తుపదార్ధాలు పెట్టి, కోరలు, గోళ్ళు తీసేసి నిస్తేజంగా ఉంచుతారు. చంపి ఎగుమతి చేసినా, జీవఛ్ఛవాలుగా వుంచినా రెండూ తప్పేకదా?

The tiger is a large-hearted gentleman with boundless courage and that when he is exterminated – as exterminated he will be, unless public opinion rallies to his support-India will be the poorer by having lost the finest of her fauna.

-Jim Corbett

కార్బెట్ మాటలు నిజమయ్యే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది కదా పులికి “మనుషులు” చేస్తున్న దగా చూస్తుంటే. (ఇది పోస్ట్ చేయడానికి రెండ్రోజుల ముందు పేపర్లో న్యూస్, దేశంలో పులుల సంఖ్యా పెరిగిందని. 2010లో 1400 ఉన్న ఈ “భారతీయుల” జనాభా 2000+ అయిందిట. సంతోషం. పులుల్ని భారతీయులన్నందుకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయా? తినకూడదు. జంతువులతో కూడా పోల్చదగని మనుషులున్న కాలంలో పులిని మనిషిలా చూస్తే తప్పేముంది. ఈ మనోభావాల గోల లేని కాలంలో జిమ్ కార్బెట్ పులిని లార్జ్ హార్టెడ్ జెంటిల్మాన్ అని అననే అన్నాడు.)

బాంధవఘర్ పార్క్ లొ ప్రవేశానికి మూడు గేట్లు ఉన్నాయి. టూరిస్టులకి గేట్ 1, గేట్ 2 లు మాత్రమె తెరుస్తారు. గేట్ 3 పార్క్ స్టాఫ్ కే. అడవిలోకి మా మొదటి ట్రిప్పు గేట్ 2 నుంచి మొదలైంది. లోపలికి వెళ్తూనే ముందు చెప్పిన నెమళ్ళు, జింకలు, సూర్య కిరణాలు, మంచులో తడిసిన మహువా కొమ్మ, …. అవి దాటుకొని కొంతదూరం వెళ్ళాక చాలా ఎత్తైన చెట్లు, గుబురు పొదలు ఉన్న ఒక చోట జీపాగింది. ఇక్కడే ఛార్జర్ చనిపోయాక దాన్ని సమాధి చేసారు అని గైడ్ చెప్పాడు. ఛార్జర్ అంటే బాంధవఘర్ నేషనల్ పార్కుకి బ్రాండ్ అంబాసిడర్ అనదగిన రాయల్ బెంగాల్ టైగర్.

**స’శేషం’**