Category: హృదయాం’తరంగం’

Without Her, fatHER (=man) is just fat


ఇవాళ మదర్స్ డే కి స్నేహితులం పంచుకున్న మెసేజెస్‌లో ఒక జోక్ మెరిసింది. అది ఇలా సాగింది –
Today is mothers day and rest of the days in the year are father’s days
దీనికి వచ్చిన సరదా రెస్పాన్స్ –
Without her, father is just fat 😆
కరెక్టే కదా, FATHERలో Her వుంది. MOTHERలోనూ Her యే వుంది.
ఆమె లేకుండా (ఆమెని తల్లిగా గౌరవించని అని చదువుకోండి, ప్లీజ్ 🙂 ) ఫాదర్లో ఫాట్ కాక ఇంకేమున్నట్టు?

And, now, on a more serious note —

ఓ “మహాప్రస్థానం” రాసే క్రమంలో ఒక కవీ,
తన భావానికి కాన్వాస్‌పై రూపమిస్తూ ఆర్టిస్టు
ఒక మహాసౌందర్యాన్ని రాతిబండ నుంచి వెలికి తీస్తున్న స్కల్ప్టరూ
ఓ సృష్టిరహస్యాన్ని ఆవిష్కరించబోతున్న సైంటిస్టు
సంఘంలో మంచి మార్పుకోసం ప్రయాస పడుతున్న మానవతావాది
వెండితెర దృశ్యాల్ని కావ్యంగా మలిచే పనిలో ఒక దర్శకుడూ
ప్రపంచానికి సత్యదర్శనం చేయించే బృహత్కార్యంలో తత్వవేత్తా
భవిష్యత్తుకి పునాదులు వేసుకునే దీక్షలో స్టూడెంటూ
తమ ప్రేమకి అమ్మానాన్నల ఆమోదముద్రకై ఆశపడే యువజంటా
చెమటోడ్చే బ్రతుకు నిలుపుకోవాలనే దీక్షలో ఉన్న శ్రామికజీవి
అజ్ఞానపు చీకట్లు తొలగించడమే ధ్యేయమైన టీచరూ
మూఢత్వాన్ని రూపుమాపే యజ్ఞంలో హేతువాదీ

వీళ్ళందరికీ కామన్‌గా వున్న గుణం ఏదీ?
తల్లిదనం.

కాదా?

వాళ్ళందరూ తామనుకున్నది ఆవిష్కరించడంలో, సాధించడంలో పడిన శ్రమకి ఔన్నత్యం కల్పించేందుకు వాడుకునే ఉపమానాల్లో ప్రసవవేదన కంటే గొప్పదైన పదం వుందా?
తెలిసికానీ, తెలీక కానీ ప్రతి వ్యక్తీ తన లక్ష్య సాధనలో తనకి జన్మనిచ్చిన తల్లి పొందిన ప్రసవవేదన పడుతూనే వుంటుంది / వుంటాడు కదా !!
అలాంటప్పుడు అమ్మని గుర్తు చేసుకోవడానికి ఒక డే ఎందుకు?
లక్ష్యం గుర్తున్న ప్రతి మనిషికీ అమ్మ గుర్తుండాలి. అమ్మని ప్రేమించే ప్రతి వ్యక్తికీ మంచి లక్ష్యం వుండాలి.
రెండిట్లో ఏ ఒక్కటి మర్చిపోయినా ఆ మనిషి ఉండీ లేనట్టే.
దేవుడే లేడనే మనిషున్నాడూ, అమ్మే లేదనువాడూ అసలే లేడూ అన్నారు కాదా ఒక కవి.
అసలే లేడూ అనే పరిస్థితి రాకుండా వుంచేందుకే మదర్స్ డే అనేది వుండాలి. ప్రతి కృషిలోనూ, దీక్షలోనూ, సాధనలోనూ, శ్రమలోనూ, పీల్చే ప్రతి శ్వాసలోనూ, వేసే ప్రతి అడుగులోనూ మాతృత్వ భావన, అమ్మ ప్రసవవేదన మరో రూపంలో నిండిపోయి వుందనే భావన కలిగించే విద్యావ్యవస్థ రావాలి.
గుడి కట్టి రామరాజ్యం తీసుకు రావడం కాదు, ముందు రాముళ్ళనీ, సీతమ్మలనీ తీసుకొస్తే రామాలయాలూ, రామరాజ్యాలూ అవే వస్తాయి. రావంటారా?

ఈ మాటలు, పెద్దలెందరో ఇంతకు ముందు ఎన్నో సార్లు, ఎన్నో చోట్ల చెప్పినవే అయినా ఈ రోజు ఎందుకో అసంకల్పితంగా నా మదిలో మెదిలాయి. ఎవరైనా చెప్పినప్పుడు వచ్చే ఫీల్ ఒక రకం, ఎవరంతట వాళ్ళు ఫీలైనప్పుడు వచ్చే ఫీల్ ఇంకో రకం. అందుకే పంచుకోవాలనిపించింది.

సృష్టి మొదలైనప్పటి నుంచీ ఈ రోజు దాక, ఈ క్షణంలో నేల మీద కళ్ళు తెరిచిన పసిబిడ్డ నుంచీ ఏ మహామేధస్సులోనో రూపుదిద్దుకున్న కొత్త ఆవిష్కారం దాకా – మూలం, ఆధారం తల్లి లేదా తల్లి ప్రేమ లేదా తల్లి తనలోని ప్రేమనీ, త్యాగాన్నీ ప్రపంచానికి నిరూపించి చూపించే ప్రసవ వేదన.

ఆమె సంకల్పం లేక లేదు ఏ జీవికి జన్మ
ఆమె స్ఫూర్తి నిలపడమే ఇలలో సత్కర్మ
ఆమె చేయిపట్టి దిద్దిస్తే వ్రాస్తాడా బ్రహ్మ
సృష్టిని నడిపించే మహాశక్తి అమ్మ

🌹🌹🌹🌹🌹

ఆ అమ్మాయి మూగప్రశ్నలకి కొవ్వొత్తులూ, వీరాలాపాలూ సెలబ్రిటీ-తొడచరుపులూ ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల కంటే అర్ధవంతమైన జవాబులున్నాయా?


photo courtesy : Eenadu

కన్నతండ్రికి కడసారి కన్నీటి సెల్యూట్ చేస్తున్న ఆ 👆 అమ్మాయి కళ్ళలో కనిపించే ప్రశ్నల్ని ప్రపంచం పసిగట్టిందా? కనీసం ఊహించిందా?
ఆ ప్రశ్నలకి –
కొవ్వొత్తుల ప్రదర్శనలూ
నాయకుల వీరాలాపాలూ
సెలబ్రిటీల తొడ చరుపులూ
ఎన్నికల సంవత్సరపు ఎక్స్-గ్రేషియోల —
కంటే అర్ధవంతమైన జవాబు ఇవ్వగలదా ?

ఇప్పుడే సోషల్-మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వీరవనిత ఉపన్యాసం చూశా. ఆవిడ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే – ఆటల్లో కప్పులు, మెడల్స్ గెల్చుకొచ్చిన క్రీడాకారులకి ఉద్యోగాలూ, కోట్ల కోట్ల రివార్డులూ, బ్రాండ్-అంబాసిడర్ షిప్పులూ, ఇళ్ళూ, స్థలాలూ… అందించే ప్రభుత్వాలు అమర జవాన్లకి ఇస్తున్నదేంటి అని .
అవును. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన విషయమే ఇది. కానీ ప్రభుత్వం కంటే ముందు ప్రజలు ఆలోచించాల్సిన, స్పందించాల్సిన విషయం కూడా. ప్రజలు స్పందించకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకునే విషయం కాదు కూడా. ఎందుకంటే –
డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ చేసింది మహాత్యాగం అని ఒక పక్క కన్నీరు కారుస్తూ, వాళ్ల కుటుంబాలకి సహాయం చేసే విషయంలో సర్వీస్ రూల్స్ దాటని / దాటలేని అశక్తత / అసమర్ధత/ ఆలోచనా రాహిత్యం ప్రభుత్వాలదే. అదే సెలబ్రిటీల దగ్గరకొచ్చేసరికి రూలింగ్ పార్టీ ప్రచార కాంక్ష + పబ్లిక్ క్రేజు + బడా బడా కంపెనీల అడ్వార్టైజ్మెంట్ బడ్జెట్లు అన్నీ కలిసొస్తాయి. కానీ ఈ పరిస్థితికి బాధ్యత ప్రజలదే. కొవ్వొత్తులతో ప్రదర్శన అయ్యాక ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ ఎంపీలని పార్లమెంటులో డిస్కస్ చెయ్యమని, ఇప్పటివరకూ ఎందుకు చేయలేదనీ నిలదీస్తున్నారా? లేదు కదా !! లేదు అనడానికి ఒకటే ఒక్క ఆధారం, పార్లమెంట్ చర్చలూ, రికార్డులే.

Military men’s patriotism/sacrifice are rewarded by employment contract.

Celebrities’ rewards are covered by –
Rulers’ hunger for publicity +
Public Craze +
Advertisement budgets of big businesses

Finally,
People do not press their MPs to discuss it in Parliament.

ఈ చర్చంతా ఒక ఎత్తూ, అసలీ చర్చలకి చోటిచ్చే సమస్యల మూలాలు వెతకడం మరో ఎత్తు. మూలచ్ఛేదం చెయ్యకుండా కబుర్లు చెప్తూ కూచునే నాయకత్వాలు – అవి దేశానివి కావచ్చు, ప్రపంచానివి కావచ్చు – అందరూ చేస్తున్నది వ్యాపారం తప్ప ఇంకోటి కాదు. ఈ సమస్యకి పరిష్కారం వుంది, దొరుకుతుంది అనుకోడం అత్యాశే, దురాశే. మనిషి మైండు యొక్క డిజైన్ అలాంటిది. ప్చ్!! ఆ డిజైన్ మార్చుకోవాల్సింది మనిషే. ఆ మార్పుకి నాందిగా, మారాల్సిన మానవజాతిలో భాగంగా 2015లో ఇలాంటి సందర్భంలోనే, తండ్రిని కోల్పోయి కుములుతున్న ఆ 👇 చిన్నారిని చూసి రాసుకున్న వాక్యాలనే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా 👇

ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
మనుషుల మధ్యన మంటలు పెట్టే మతమా?మతం పేరుతో నాటకమాడే రాజకీయమా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
చేతికొచ్చిన తలరాతలు రాసే దేవుళ్ళా? దేవుడి పేరిట ద్వేషం నేర్పే మనుషులా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
అమాయకంగా ప్రాణాలొడ్డే దేశభక్తులా? అధికారంకై ఎత్తులు వేసే దేశభోక్తలా?
ఈ దుఃఖానికి కారణమెవరు?ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
జిహాద్ ముసుగులో మూఢులు చేసే రక్తపాతమా? చేతకానితనపు ఆయుధం పట్టిన శాంతికపోతమా?
ఈ దుఃఖానికి కారణమెవరు? ఈ గాయానికి బాధ్యులు ఎవరు?
విభజించి పాలించే సామ్రాజ్యవాద స్వార్ధపరత్వమా? వ్యాపారానికి ఆదర్శాల్ని బలిచేసే బడుగుదేశాల నిస్సహాయత్వమా?
కులమతవర్గ ప్రాంతవర్ణజాతిబేధాలను పాటించనివి తీరని దుఃఖాలూ, మానని గాయాలే, మనుషులు కాదు !!
సరిహద్దులు, అంతస్తులు, ఆచారాలకి అతీతమైనవి వ్యాపారం, దురహంకారం, అధికార దాహం అంతే, మానవత్వం కాదు !!
మనుషులందర్నీ ఒకటి చేసేది మంచి మనసు, కానీ దేవుళ్ళని విడగొట్టేది మనసు చచ్చిన మతం
తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ
గాయాలు, దుఃఖాలు, మతమౌఢ్యాలు, సిద్ధాంతాల్లో తేడాలు, మనుషుల మధ్య గోడలు, అవి రాజకీయాల పంచ ప్రాణాలు
రాజకీయం, దురహంకారం, వ్యాపారం, అధికారం, అతివ్యామోహం ఇవి స్వార్ధానికి పంచశిరస్సులు
రాజకీయాల పంచప్రాణాలు పోతేనే నీ దుఃఖానికి అంతు
స్వార్ధం పంచశిరస్సులు తెగిపడితేనే ఈ గాయానికి మందు
స్వార్ధం, రాజకీయం ఉన్నన్నాళ్ళూ సరిహద్దులకటూఇటూ నీ దుఃఖం పంచుకునే అమాయకులుంటూనే ఉంటారు.

తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ
నాన్న చేసిన త్యాగం వ్యర్ధం కాదు, “మనిషి”ని మనిషిగా మార్చే ప్రేమై ఆ శౌర్యం, ధైర్యం మళ్ళీ అవతరిస్తాయి.

తెలుసుకో పిచ్చితల్లీ, ఏడవకు మళ్ళీ మళ్ళీ

🌹 🌹 🌹 సర్వే జనాః స్సుఖినో భవంతు 🌹 🌹 🌹

రైతుని పట్టిన 🐊రుణమకరాన్ని🐊 వదిలించవే మకర సంక్రాంతీ!!🙏🙏
అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా రైతన్నలకీ, నేతన్నలకీ. రైతుల పంటలకి మంచి ధరలు పలికి, జనం (మనం) కొనుక్కునే బట్టల్లో ఓ 25% చేనేత బట్టలే కొనుక్కునీ వాళ్ళ సంక్రాంతిలో కొత్త కాంతి నింపాలని కోరుకుంటూ … వాళ్ళ ఋణాలు
(పార్టీలకి అతీతంగా) 100% మాఫీ అయిపోయి మళ్ళీ వాళ్ళు అప్పులు చెయ్యాల్సిన అవసరం రాకూడదని ఆశ (దురాశా?) పడుతూ …


🐄🐂🐃 🌾🌾🌴🌴🌳🌳🌿🌿🎋🎋🐄🐂🐃

KSD”అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని, రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి…


మొన్న మార్చిలో రెండు వారాల  చైనా ట్రిప్పు పడింది. సుజౌ సిటీ చుట్టుపక్కల మూడు రోజులు తెగ తిరిగాం, ఫౌండ్రీలు, ఫోర్జింగ్ షాపులు వగైరాలు విజిట్ చేస్తూ. ఆ తిరుగుడులో ఒక చోట అదుగో ఆ బుద్ధుడు👇 కనిపించాడు.WhatsApp Image 2018-05-29 at 11.47.50ఆదిశంకరాచార్యుడు, జీసస్‌‌‌‌ల ప్రతిరూపాలని చూసినప్పుడు ఎలాంటి అలౌకిక భావపరంపర మనసుని తాకుతుందో శాక్యమునిని చూసినా కలుగుతుంది. కలుగుతుంది కాదు మనసు కరుగుతుంది అంటే కరెక్టు. అలా కరిగిపోయినప్పుడు కలిగే  అనుభవం ఏంటంటే ఈ అస్తిత్వానికి కులం, మతం, దేశం, …. టు కట్ ఇట్ షార్ట్ .. మనని మనం చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి సెపరేట్ చేసుకోడానికి ఎన్ని రకాల సాకులుంటే అన్ని సాకులూ మాయమైపోతాయి. క్షణంలో సగం సేపే ఐనా ఆ ఆనుభూతి అద్వితీయం. కాదు, అద్వైతం. ఆ ఆద్భుతవ్యక్తుల ఆలోచనా పరంపర  వేల ఏళ్ళ తర్వాత ఇంకా నిలిచి వుందంటే అది వారి జీవితకాలంలో  వాళ్ళు తమ అనుయాయులకి కలిగించిన అద్వితీయ భావనలకి అద్వైత అనుభవానికి సాక్ష్యం అని నాకర్ధమైంది అని నేననుకుంటున్న వారి గొప్పతనం. లెటజ్ నాట్ గో టు వాట్ సమ్ ఆఫ్ దెయిర్ ఫాలోవర్స్ డు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాలోయింగ్ దెయిర్ ఫిలాసఫీస్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హియర్.

ఇప్పుడా బుద్ధుడు ఎందుకు గుర్తొచ్చాడంటే ఇవాళాయన బర్తు డే కదా! అది మర్చిపోకూదడనే సెలవు కూడా ఇచ్చారు కదా!! ఈ సందర్భంగా మానవజాతిని నిజంగా మెచ్చుకోవాల్సిన సంగతి – మహానుభావుడు అనుకున్న వ్యక్తి పుట్టినరోజుకి పబ్లిక్ హాలిడే ఇవ్వడం. ఆ రకంగా, “జీవితమంటే అంతులేని ఒక పోరాటం. బ్రతుకు తెరువుకై  పెనుగులాడుటే ఆరాటం..” అంటూ పాడుకోడానిక్కూడా టైము, ఛాన్సు కూడా లేని మనిషికి పోరాటాలకి, ఆరాటాలకి అవతల ఏముందోనన్న ఆసక్తి, కుతూహలం పెంచుకోడానికి, వీలయితే తీర్చుకోడానికీ ఒక అవకాశం ఇవ్వడం.  ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది వేరే విషయం. అది నెగెటివ్ థింకింగ్.

పోరాటాలకి, ఆరాటాలకి అవతల ఏముందోనన్న ఆసక్తి, కుతూహలంతో, ఈ ప్రపంచం అనే నాటకరంగానికి తెర వెనక కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం చేసే “అప్పల్రాజు” ఎవరో తెలుసుకోవాలని –

రెండో, మూడో వేల ఏళ్ళ క్రితం ఒక రాజుగారబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే,

అలా వెళ్ళిపోయి “తెర వెనక భాగవతం” అంతా తెలిసేసుకుని ఇవతలికి వచ్చి “ఒరేయ్! బాబుల్లారా! K.S.D “అప్పల్రాజు” సంగతలా వుంచండి. పరలోకంలో ప్రశాంతత కోసం ఈ లోకంలో అశాంతి సృష్టించక్కర్లేదురా! మీ పరలోక సుఖాల కోసం ఇతర జీవుల్ని పరలోకానికి పంపించాల్సిన పనిలేదురా! మీ బుద్ధిని వాడండి, మీ ధర్మాన్ని ఆచరించండి, మీ సంఘాన్ని ఆశ్రయించండి” అని బోధిస్తే

ఆయన కృషి అంతా ఈ రోజు మనకి ఒక పబ్లిక్ హాలి డే రూపంలో వస్తే, దాన్ని ఎంజాయ్ చెయ్యడానికి, బిర్యానీ తిని, సినిమా చూడ్డానికి  ఉపయోగిస్తే ఆయన ఫీలవ్వడూ?!? ఇవాళ మాయింట్లో బిర్యానీయే; అది ఆపలేదుగానీ పిల్లలు సినిమా చూద్దామని యూ ట్యూబ్ ఓపెన్ చెయ్యగానే మాత్రం సక్సెస్‌‌ఫుల్‌‌గా, శాంతియుతంగా ఆపించా💪💪💪. బుద్ధుడు ఫీలవ్వడనే ఫీలౌతున్నా. ఫీలౌతాడని మనసులో ఏ మూలో వున్న కాస్త అనుమానం, గిల్ట్ పోగొట్టుకోడానికి నాకు తెలిసిన “బుద్ధం శరణం గచ్ఛామి….”కి నాకు తోచిన ఎక్స్ప్లనేషన్ ఇలా👇 ….

WhatsApp Image 2018-05-29 at 12.12.45

…. రాసుకుని బంధుమిత్రులతో వాట్సాప్‌‌లో పంచేసుకున్నా. చూసినవాళ్ళు చిన్ముద్రలు 👌 పెట్టారుగానీ చివాట్లు పెట్టకపోడంతో  అందరికీ నచ్చిందనే అనుకున్నా. ఒక ఫ్రెండు బుద్ధతత్వాన్ని ఇలా జ్ఞానకర్మ యోగాలతో ఇలా ముడి పెట్టాడు – Three layers of human life. Self, dharma and society. All three layers have their importance. Only when we follow our Dharma and work towards a righteous society, Karma yogam is fulfilled. By looking inwards gyana yogam is initiated. Karma yogam and Gyana yogam are inseparable. ఇది చూసి ఇంకాస్త ధైర్యం వచ్చి టపాలో పెట్టేశా.

(ఈ టపాకి టైటిల్‌‌గా ఆర్జీవీగారి సినిమా టైటిల్ ఎలా కుదిరిందో ఆ దేవుడికే తెలియాలి  ‌😆 )

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి

 

🌹 🙏🌹

 

ఇంకా అయోమయం!! ఇంకా జగన్నాధం!! Yes, We have failed them as humans.


మనదేశంలో దారుణాలు రెండు రకాలుగా వెలుగులోకి వస్తున్నాయనిపిస్తోంది. ఆ రెండురకాల దారుణాల్లో మొదటిరకాన్ని నేరాలనీ, రెండో రకాన్ని ఘోరాలనీ పిలవచ్చు. పేర్లు పెట్టాక అలా ఎందుకు పెట్టామో డిఫైన్ చెయ్యాలి కదా? సరే, నేరాలంటే నేరమనస్తత్వం లేక మానసిక రుగ్మతల వలన పురికొల్పబడిన దారుణం అనుకుంటే, అలాంటి నేరానికి రాజకీయ ఎజెండా జోడయినప్పుడు నేరం కాస్తా ఘోరంగా మారుతుంది అనుకోవచ్చు.

అనుకోవాలి. ఎవరు? అందరం.

ఎందుకంటే, ఒకసారి నేరం రాజకీయ రాద్ధాంతంగా మారాక అసలు నేరానికి కారణం, ఆ కారణాలకి దారితీస్తున్న పరిస్థితులు అన్నీ ఔట్-ఆఫ్-ఫోకస్ ఐపోతాయి. కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందనే సామెత తెల్సిందే, కానీ అసలు నాలికే ప్రమాదంలో వున్నా దాని సంగతి పట్టించుకోకుండా కొండనాలిక్కి వైద్యం చెయ్యడంలా తయారవుతోందా పరిస్థితి?

అవుతోందేమో🤔 !?! ఆలోచించాలి. ఎవరు? బుర్రవున్నవాళ్ళు. (బుర్ర ఉందా లేదా అనేది ఎవరికివాళ్ళు – ఐ మీన్, నాయకులు, వ్యవస్థలు, ప్రజలు i.e. మనందరం – తేల్చుకోవచ్చు)

జోకులు, చతుర్లు, విసుర్లు పక్కనపెడితే….

  • ఆల్రెడీ నేరమనస్తత్వం / మానసిక రుగ్మతల వలన జరిగిన నేరాన్ని రాజకీయలబ్ధికోసం చిలవలు పలవలు చేస్తున్నారా?
  • రాజకీయ క్రీడలు జరగని ఘోరాల్ని కూడా సృష్టించడం లేదు కదా?
  • పొలిటికల్ డామేజ్ తీవ్రంగా ఉంటుందని తెలిసి కూడా హేయమైన పనులు చేసే రాజకీయులు వున్నారా? అలాంటివాళ్ళు ఒకవేళ వుంటే కొందరా ఘోరాల్ని ఎందుకంత తేలిగ్గా తీసిపారేస్తున్నారు? లేకపోతే వాళ్ళనెందుకు, ఎవరు బద్నాం చేస్తున్నారు? ఆ  రాక్షసుల్ని కటకటాల్లోకి నెట్టడం కంటే వాళ్ళని వెనకేసుకు రావడంవల్ల వచ్చే రాజకీయ మైలేజి ఎక్కువా?
  • సహజంగానే మనుషుల్లో మానసిక రుగ్మతలు, పైశాచికత్వం పెరుగుతున్నాయా? ఒకవేళ అదే నిజమైతే ఈ విషయంలో మన రాజకీయాలు రాద్ధాంతాలు కాక ఇంకేం చేస్తున్నాయి? రాజకీయులకి (పార్టీలతో సంబంధం లేకుండా) ఈ విషయాల మీద వున్న అవగాహనేంటి? వాళ్ళు తీసుకుంటున్న / తీసుకోవాలనుకుంటున్న చర్యలేంటి?
  • ఇవన్నీ అర్ధమయ్యి కూడా జనం నోరు మెదపట్లేదా? లేక జనం అయోమయంలో వున్నారా? లేకపోతే రాజకీయాల్లో కొట్టుకుపోతున్నారా? లేకపోతే ఈ ఘోరాలకి గురౌతున్నది పేదవాళ్ళే కదా అనే నిర్లక్ష్యం+ఉదాసీనతా? అసలు పై ప్రశ్నలకి సరైన జవాబులేంటో క్లూ ఉందా మనకి?

పై ప్రశ్నల్లో ఒక్కదానికైనా స్పష్టమైన సమాధానం ఉందా? ఏమో! నా ఆలోచనకందట్లేదు. ఇంకా పైగా

👀అనుమానాలు  👀, 😇 కన్ఫ్యూజన్😇 ఎక్కువైపోతున్నాయ్ 😌 😢 

కొందరు మాత్రం –

  • ఇలాంటి నేరాలు పాతరోజుల్లోనూ జరిగాయి, అప్పుడవి బైట పడలేదు, ఇప్పుడు మీడియా డెవలప్ ఐపోడంతో బైట పడుతున్నాయంటున్నారు. (మరైతే గతకాలపు ఘనకీర్తి అంతా డొల్ల అనుకోవాలా? అంతా అయోమయం 😇 జగన్నాధం🙏)
  • రాక్షసకృత్యం చేసిన మృగాన్ని  మనిషిని ఉరి తీసెయ్యలంటున్నారు. చట్టం వచ్చేసింది కూడా. (మరి చట్టం తన పని తను చేసుకుపోవాలి కదా! రాక్షసుడు పట్టుబడాలి కదా! వాణ్ని పట్టుకోవాల్సిన & ఉరి తీయాల్సిన వ్యవస్థలు సరిగ్గా పని చెయ్యాలి కదా! మరే! కదా?  ఇంకా అయోమయం 😇 😇, ఇంకా జగన్నాధం🙏🙏)

“ఎదగడానికెందుకురా తొందరా? ఎదర బతుకంతా చిందర వందర” అని పిల్లల్ని జోకొట్టే కాలం చెల్లిపోయింది. ఎదక్కుండానే చిందరవందర బతుకుని ఎదుర్కుంటున్నారు వాళ్ళు. అందుకు కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా రోజుల్లో, కాకపోతే వారాల్లో, ఎట్-లీస్ట్ నెలల్లో నేరగాళ్ళని ఉరికంబం ఎక్కించాల్సింది పోయి, రాజకీయ నష్టనివారణలు / మైలేజీల మీదే దృష్టి పెట్టి వాళ్ళని భయంకరంగా అవమానిస్తున్నాం.

భగవంతుడా! జగన్నాధా! ఈ అయోమయాన్ని గుర్తించే వయసొచ్చి, వాళ్ళూ ఈ సొసైటీలా తెలివి మీరిపోయే వరకైనా పసిపిల్లల్ని రక్షించు స్వామీ! ఎందుకంటే వీకే సింగ్‌‌గారన్నట్టు We have failed them as humans. నీకు ఒకటి కాదు వంద, కాదు కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… 🙏లు.

ఇంతేసంగతులు స్వామీ 🙏! బై4నౌ 😢

 

 

 

“నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్😍, కొందరు స్వాములు కాస్తా మంత్రులైతే నవ్వుకున్నాడోయ్..డోయ్..డోయ్😂” + రాములవారికి Belated🌹HappyBirthDay🌹Message


“నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్ కొందరు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్,” అంటూ ఏఎన్నార్ చేత పాడించారు బాపు రమణలు, అందాలరాముడు సినిమాలో. ఆ సినిమా అప్పుడెప్పుడో సెవెంటీస్‌లో వచ్చింది. అంటే కలియుగం మొదట్లో ఎప్పుడో అనుకోవచ్చు. ప్రస్తుతం కలియుగం ముదిరింది. స్వామీజీలు మంత్రులైపోయే కాలం. సర్వసంగపరిత్యాగి అయిన స్వామిని చక్రవర్తితో సమానంగా చూసే కల్చర్ మనది. అందుకే పీఠాధిపతుల సేవకై ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు మొదలైనవి వుంటాయట. ప్రవచనాల్లో విన్నా. మరి చక్రవర్తి సమానుడికి మంత్రి హోదా ఇవ్వడం అంటే అది ప్రమోషనా? డిమోషనా? ఏమో!!! హోదా తీసుకున్న స్వాములకి, ఇచ్చిన ప్ర’భూ’స్వాములకే తెలియాలి. రాములవారు మాత్రం పై పాటకి “కొందరు స్వాములు కాస్తా మంత్రులైతే నవ్వుకున్నాడోయ్..డోయ్..డోయ్..డోయ్..” అని ఇంకో లైను కలుపుకుంటాడు.

ఆఁ! అన్నట్టు రాములవారిని తలచుకోగానే గుర్తొచ్చింది. రామనవమికి రాములవారికి గ్రీటింగ్ టపా వెయ్యలేదని. మనం మోడర్న్‌గా బిలేటెడ్ గ్రీటింగ్స్ పెట్టినట్టు రాముడికీ బిలేటెడ్ హాపీ బర్త్ డే చెప్తే ఎలా వుంటుంది? అని బ్రహ్మాండమైన ఐడియా ఒకటి తట్టింది. తట్టీతట్టగానే అదృశ్యహస్తం ఒకటి నెత్తిన మొట్టింది. ఆ మొట్టికాయతో పుట్టిన శబ్దంలో, “ఆదిమధ్యాంతరహితుడికి బర్త్ డే ఏంటి? దానికి బిలేటెడ్ గ్రీటింగ్స్ ఏంటి? అది సిద్ధాంతులు, జ్యోతిష్కులు, రాష్ట్రప్రభుత్వాలు కిందామీదాపడాల్సిన టాపిక్. నీలాంటి సామాన్యుడికి మాత్రం నేనే రోజు అర్ధమైతే ఆ రోజే నాకూ, నీకూ కూడా పుట్టిన్రోజు. తెల్సిందా,” అనే అర్ధం ధ్వనించింది.  “అవును కదా స్వామీ ! నాకు వేసిన ఈ మొట్టికాయ ఆ కిందామీదా పడుతూ ప్రజల్నీ పడేస్తున్నవాళ్ళకీ వెయ్యచ్చుగా?!? ప్రతి ఏడూ నానా తర్కాలూ, చర్చలూ చేసి చివరికి రెండురోజులు పండగ, ఒక రోజు సెలవూ సాధిస్తున్నారు పాపం,” అని స్వామితో వేళాకోళం ఆడాలనిపించినా, స్వామివారి చేత “నీ సంగతి నువ్వు చూసుకోవోయ్, ఇతర్ల సంగతి నీకెందుకు?,” అని చీవాట్లు పెట్టించుకోవడం ఎందుకొచ్చిన గొడవ అనిపించి తమాయించుకున్నా. ఇంతలో రాంబాబు నా మనసులోని సంశయం గ్రహించినట్టుగా, “అవును, వాళ్ళ సంగతి నీకనవసరం. నీ ఫ్రెండ్సు చూడు. ఆ గొడవలన్నీ పట్టించుకోకుండా ఇవాళే వాట్సప్‌లో హాపీ శ్రీరామనవమి నుంచి శ్రీరామసహస్రనామం వరకూ ఎన్ని రకాలుగా గ్రీటింగ్స్ పెట్టేస్తున్నారో, అవన్నీ నే స్వీకరించట్లా? స్టేట్ గవర్నమెంట్ ఏ రోజు సెలవంటే ఆ రోజే నా నవమి అన్జెప్పి వాళ్ళందర్నీ దీవించడం మానేశానా ఏంటి?,” అన్నట్టు అనిపించింది. వాట్సప్ మెసేజీలు చూశా, ఎవరి మనసుకి నచ్చినట్టు వాళ్ళు రాములవారికి, లోకానికీ శుభాకాంక్షలు చెప్పినా ఒక రకం మెసేజి అందులో మిస్సయినట్టు అనిపించింది. ఒక చేతులో విల్లు, మరో చేత్తో అభయముద్రతో మనసులోనే నిల్చునివున్న స్వామి, “ఇంకెందుకు ఆలోచన? నువ్వనుకున్న సందేశం కూడా పోస్ట్ చేసేయ్,” అన్నట్టు నవ్వుతున్నాడు. నేను తొమ్మిదోక్లాసులో వుండగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చి నన్నమితంగా అలరించి, ఆలోచింపజేసిన నండూరివారి “విశ్వదర్శనం” కోసం బాపుగారు వేసిన బొమ్మ, అదే నా రామనవమి శుభాకాంక్షగా పోస్ట్ చేసేశాను. అదుగో అదే 👇 –

WhatsApp Image 2018-03-25 at 12.06.22

photo courtesy: ViswaDarsanam

యోగవాశిష్టం నేను చదవలేదు. ఫ్యూచర్లో చదువుతానా? ఏమో, తెలీదు. కానీ ఆ బొమ్మ చూస్తేనే, ఆ గురు శిష్యుల రెండుమాటలు వింటేనే తక్కినదంతా అర్ధమైపోయినంత అందమైన ఆ బొమ్మ నచ్చనివారు, మెచ్చనివారు ఎవరుంటారు? కానీ, ఒకే ఒక్కరి స్పందన మాత్రం నాకు అమితంగా నచ్చింది. అది “Oh, What a deep thought?” అన్న క్లుప్తవాక్యం. బై ద వే, అతను మెటీరియలిస్టిక్ అమెరికాలో వుంటూ, కులమతఆచారాల పట్టింపుల్లేకుండా, గుళ్ళూగోపురాల్లాంటి వాటిని కుటుంబసభ్యులకోసం మాత్రం దర్శిస్తూ, హిందూసంస్కృతిపై ఎంతో ఇష్టం, రిచ్యువలిస్టిక్ వ్యవహారాలపై వ్యతిరేకత కలిగి దేవుడికి సేఫ్ డిస్టెన్స్‌లోవుండే పచ్చి హేతువాది. కానీ ఎలాంటివారికైనా నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు రాకపోదు. దేవుడు అనే కాన్సెప్ట్‌లో జీవుడికి అర్ధం తెలుస్తుంది అన్న అర్ధం స్ఫురించబకాపోదు, కాబట్టే “Oh, What a deep thought?” అన్నాడని నాకు తెలుసు, నా క్లాస్-మేట్ కాబట్టి. అతని అంతరాంతరాల్లో అట్టడుగున ఎక్కడో రాముడి పట్ల భక్తి కాకున్నా ప్రీతి ఉంటుందని కూడా తెలుసు, ఈ సంస్కృతిలో పుట్టిపెరిగినవాళ్ళని అది అంత తేలిగ్గా వదిలిపోదని కూడా తెలుసు కాబట్టి. అయితే ఆ ప్రీతి కూడా లేని అతిపదార్ధవాదులకీ, తీవ్రహేతువాదులకీకూడా రాముడు నచ్చకపోడు ఆయన్ని చూపాల్సిన విధంగా చూపిస్తే, ఆయన అనుసరించిన మార్గం భక్తులందరూ అనుసరిస్తే అనిపించింది. అలా అనిపించేసి టపా అక్కడితో ఆగిపోలేదు. ఇంకా వుంది. అది వచ్చే పోస్టులో. స్టే ట్యూన్డ్.

ఆగండాగండి, అందరికీ కొంచెం ఆలస్యంగానే అయినా, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు స్వామివారికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు. ఏమనుకోకండి పలికించెడివాడు నవమి అయిన ఇన్నాళ్ళకి పలికించాడు. ఇంకో ఒకటో రెండో టపాలకి కూడా పలికించేలాగేవున్నాడు. చూద్దాం. ఏమంటావ్ స్వామీ? ఓ, సరే, చూద్దాం అంటావా?

అయితే సరే. బై4నౌ. 🙏

మెటీరియలిస్ట్ 🐊మకరాన్ని🐊 వదిలించే 🔥Someక్రాంతి☀


ఉగాది ఇంకా మూణ్ణాలుగు నెలల దూరంలో వుందని మర్చిపోయిందో, భోగిమంటల సంగతి దేవుడెరుగు ఎడతెరిపి లేకుండా పట్టిన ముసురుతో పాటు ముసురుకున్న బద్ధకం వదిలించుకోవాలనుకుందోగానీ ఈసారి మావూళ్లో కోయిల తొందరపడి ముందే కూసేసింది.  దట్టంగా పట్టిన మబ్బుల వల్ల సూర్యుడు మకర సంక్రమణం చేశాడా లేదా తెలీకుండానే మకరసంక్రాంతి వచ్చేసింది. ఆలిండియా రేడియోలో చెప్పేవాళ్ళు దేశమంతా సంక్రాంతి ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు అని. కానీ అలాంటివేం లేకుండానే సంక్రాంతి రోజంతా ఆఫీసులో గడిపి సాయంత్రం ఇంటికెళ్తూ టాక్సీ కోసం వెయిట్ చేస్తుంటే  ఆకాశంలో వాన మబ్బులు, ఆ చెట్లూ, మిలమిలలాడుతున్న స్ట్రీట్ లైట్లూ వగైరాలన్నీ చూసి ఓ ఫోటో తియ్యాలనిపించింది. తీశా . అక్కడితో అయిపోతే ఎలా? కుదరదు కదా! అందుకేనేమో టాక్సీ ఎక్కాక ఆ కింద రాసిన తవికా వాక్యాలు బుర్రలోంచి నోట్ పాడ్ మీదకి  ఒలికాయి. అక్కడితో ఆగితే  కూడా కుదరదనుకుంటా. ఎత్తిపోతల పధకం పెట్టి నోట్ పాడ్ మీంచి బ్లాగులోకి మళ్ళించా. ఇక్కడితో ఆగిపోతే మీ అదృష్టం. ఆగలేకపోతే తరవాత మీ యిష్టం. 😀😀😀

(మనుషులు గంగిరెద్దులైన మోడర్న్ మార్కెట్ ఎకానమీల్లో —

మబ్బులే  గొబ్బిళ్ళు

డిసిప్లిన్డ్ గా నుంచున్న చెట్లే పూలు

రంగుల లైట్లే పసుపూ కుంకాలు

ఆటోమొబైళ్లే ఎడ్లూ, బళ్ళూ 

రోడ్ల మీద గీతలే ముత్యాల ముగ్గులు 

జీతాలే చేతికందిన పంటలు

నిలబెట్టుకున్న మానవత్వాలే  నూత్న వస్త్రాలు 

రావాలి ప్రతి ఏటా మకర సంక్రాంతి

కావాలి మెటీరియలిస్ట్ మకరాన్ని వదిలించే some క్రాంతి )

అందరికీ (రైతన్నలతో సహా🙏) సంక్రాంతి⚘ మరియు some క్రాంతి🌋 (అదేంటో నాకూ అంతు పట్టట్లా !!🤔) శుభాకాంక్షలు. తరవాత మీ యిష్టం.🙏