Category Archives: వన🦌🌳🐾🌾🦋 విహారం

🐝🌻వనవిహారం 🌵🐛- ప్రతిక్షణం చూసిన సినిమానే చూడ్డానికి దేవుడేమన్నా తెలుగు సినిమా మేకరా?


ముళ్ళపూడి వెంకటరమణగారి అప్పుల అప్పారావు చెప్పిన ఫేమస్  డైలాగుల్లో ఒకటి – “సూర్యుడెందుకు ఉదయిస్తాడు? నదులెందుకు ప్రవహిస్తాయి? వెన్నెలెందుకు కాస్తుంది? అందుకే  అప్పారావు అప్పులు చేస్తాడు,” అనేది. రాజబాబు నోటఎంచక్కా పలికిన యూనివర్సల్ ఫాక్ట్ . 

అప్పులు చెయ్యడం అనేది ప్రకృతి సహజధర్మాల్లో ఒకటని అర్ధం చేసుకోడానికి ఇంతకంటే సహజమైన సులభమైన వివరణ ఎక్కడా లేదేమో? కానీ ప్రకృతి ఒడిలో మైమరిచిపోయే క్షణాల్లో మనిషికి, అందులోనూ తెలుగు మనిషికి  ‘కలాపోసన’ ఆటోమేటిగ్గా వచ్చేసే అసంకల్పిత ప్రతీకార చర్య. అప్పారావుకి అప్పులు చెయ్యడం ఎంత సహజమో అంత సహజమైన విషయం అది. ఆ కలాపోసనలో భాగంగా భలే భలే అందాలూ సృష్టించావూ, ఇలా మురిపించావూ అంటూ దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం, అసలెందుకు ఇవన్నీ ఇలా ఇంతందంగా… అంటూ భావావేశం ప్రకటించుకుంటాం. దాంతోపాటు కాస్త భావకవిత్వం ప్రవహించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇంచుమించు అలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యల్ని ప్రేరేపించినా కొన్ని దృశ్యాలు నిన్న చూశాను, మా Sungei Buloh mangroves
(మడ అడవి) లో. ఆ చూడ్డంలో   సూర్యుణ్ణి రోజూ ఉదయించమని తొందరపెట్టే అర్జెంట్లూ  వారెంట్లూ  ఏంటో తెలిసిందనిపించింది.  
అప్పారావు అప్పులకి, నదులు ప్రవహించడానికీ, వెన్నెల కాయడానికీ ,… కూడా ఇలాంటివే ఏవో కారణాలుండచ్చు. అవేంటో తర్వాత చూద్దాం.  ముందు పెత్యక్ష నారాయుడి పొద్దు పొడుపు హడావిడి ఏంటో, ఎందుకో చూద్దాం. 


ప్రభాత కిరణాలతో  అలల ని స్పృశించాలనే ఆరాటంతో … 

ఇబిరిత (Hornbill) పక్షి రెక్కల  అంచుల గుండా  ప్రసరించి  కొత్త కాంతులు  సంతరించుకోవాలనీ ...

రంగు రంగుల  తూనీగల  రెక్కలపై నర్తించలే ని వెలుగులు వెలుగులా ? అనీ ... 

అలలపైనా , గాలి తెరలపైనా  జరిగే తెల్ల కొంగల బాలె  (ballet)కి తొలికిరణాల వేదిక నిర్మించాలనీ  …. 

ప్రత్యక్ష నారాయుడు ప్రతిరోజూ పరిగెత్తుకొస్తాడనిపించింది. 

His own mornings are new surprises to God అంటాడు విశ్వకవి Stray Birds అనే పద్య సంకలనంలో. అవును కదా? ఈ చరాచర సృష్టి అంతటినీ సృష్టించడానికి సృష్టికర్తకి ఇంతకంటే కారణం కావాలా? జరామరణ చక్రాన్నీ, అందులో పడి కొట్టుమిట్టాడడా నికి మనుషుల్నీ సృష్టించి ప్రతిక్షణం చూసిన సినిమానే చూడ్డానికి దేవుడేమన్నా తెలుగు సినిమా మేకరా?


			

🌳🦌వన🐾విహారం🌾🦋 – రాయలవారి 👑 🐥Kingfisher


ఒకళ్ళు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్; ఇంకొకరు ఎ కింగ్ హూ మేడ్ టైమ్స్ గుడ్ ఫర్ పీపుల్.
ఇద్దరూ లకుముకిపిట్టకి తమదైన శైలిలో పేరు తెచ్చినవాళ్ళే.
ఈపాటికి ఇదంతా ఎవర్ని గురించో మీకర్ధం అయ్యుంటుంది. కనీసం మొదటి కింగ్, లకుముకిపిట్ట పేరు మీద ఒక ఎయిర్-లైన్స్, ఒక బీరు బ్రాండూ పెట్టిన పెద్దమనిషే అని తెలిసిపోయుంటుంది.  లకుముకిపిట్టలకి తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం వుందో మనకి తెలీదుగానీ, ఒకవేళ కాస్త సాహిత్యస్పర్శ వుండి, ఆ స్పర్శ లకుముకిపిట్ట చేత దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి చాటుపద్య రత్నాకరం చదివించి వుంటే, దానికి తప్పకుండా –
“ఆడిన మాటకుఁ దప్పెను
గాడిదకొడు” కంచుఁ దిట్టఁగా విని “యయ్యో
వీఁడా నా కొక కొడు” కని
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!
అనే పద్యం గుర్తొచ్చి అది కూడా తెగ ఫీలై పోయుంటుంది. (కానీ గాడిదలూ, లకుముకిపిట్టలూ కూడా తెలుగు చదువుకునే, మాట్లాడే పరిస్థితే వుంటే తెలుగుని రక్షించండోయ్ బాబోయ్ అంటూ తెలుగువాళ్ళు ఏడిచే పరిస్థితి ఎందుకొస్తుందీ? రాదు కదా! అది వేరే విషయం).

కింగ్-ఫిషర్‌కి మంచి పేరు తెచ్చిన రాజుగారెవరో కూడా తెలిసిపోయుంటుంది, టపా టైటిల్ చూడగానే. రాయలవార్ని తల్చుకోగానే సమరాన, సాహితీ సమరానా మడమ తిప్పని మహావీరుడు గుర్తొచ్చి తెలుగుండెలు (=తెలుగుగుండెలు) ఉప్పొంగడం వింతేం కాదు. కానీ ఒకవంక ఉర్రూతలూచు కవనాలతో, ఒక వంక వురికించు యుద్ధ భేరీలతో బిజీ బిజీగా వుండే ఆంధ్రభోజుడి ప్రకృతి పరిశీలనా శక్తీ, ఆ ప్రకృతిని లక్ష్మికి ప్రతిరూపంగా చూసిన ఆయన ఆధ్యాత్మిక దృష్టీ రెండూ అద్భుతం అనిపించేలా వ్రాసిన కొన్ని పద్యాలు – గరికపాటివారి ఆముక్తమాల్యద ప్రసంగంలో విని, ఆయన చెప్పిన ఈ పుస్తకంలో  https://ia902708.us.archive.org/18/items/AmuktaMalyada_988/Amuktamalyada_Part01.pdf చూసి తెలుసుకున్నాను – చదివితే ప్రకృతి ప్రేమికుల గుండెలు తెలుగులో ఉప్పొంగడం గారంటీ.

Rayalavari Lakumuki

లకుముకిపిట్టలని వర్ణించిన తీరు ఒక విశేషమైతే, అవి గ్రామాల్లో వుండే బావుల్లో, అదీ వీధిబావుల్లో, చేపల్ని వేటాడుతూ వుంటాయని చెప్పడంలో ఆనాటి ప్రజలు ప్రకృతికి ఎంత దగ్గరగా వుండేవారో తెలుస్తుంది. లక్ష్మీదేవి చేతిలో బంతితో లకుముకిని పోల్చడంతో ఆయన సహజ ప్రకృతికి ఇచ్చిన విలువ ఏమిటో తెలుస్తోంది. లక్ష్మి కరముల నుంచి వస్తున్నది కాబట్టి లకుముకి అయిందేమో అసలు. (లంబోదర లకుమికరా..లో లకుమికరా అంటే లక్ష్మిని ప్రసాదించేవాడు అని అర్ధం(ట). దాన్నే కొంచెం నాకు కావలసినట్టు అర్ధం చేసేసుకున్నా, ఇలా –
లక్ష్మికర పక్షి >>> లకుమికర పిట్ట >>> లకుముకి పిట్ట

వై నాట్?

Lakumuki 3

ఇంతకీ లకుముకిపిట్టల్లో ఓ వంద రకాలుండగా రాయలవారి పద్యంలో అందంగా బందీ అయిన లకుముకి ఏ రకం అయ్యుంటుంది?
నా ఊహ ఈ 👇బుల్లి పిట్ట అని. ఎందుకంటే చాలా రకాలు కేవలం చేపల మీదే కాక కీటకాలు, ఇతర చిన్నజీవులని కూడా వేటాడి బతుకుతాయి. ఇది మాత్రం ఎప్పుడూ నీళ్ళు ఉన్నచోటే కొమ్మల మీదా, బండల మీదా, ఒక్కోసారి నీళ్ళలో ఉన్న చేపని చూస్తూ గాల్లో వున్నచోటే కదలకుండా ఎగురుతూ (hovering) కనిపిస్తుంది.

Lakumuki 4

మా యింటికి దగ్గర్లో ప్రవహించే పాంగ్-సువా కెనాల్ చుట్టుపక్కల అలా 👆 కనిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా వర్షాలు పడి కాలవ నిండుగా ప్రవహిస్తున్నప్పుడు. అయితే, అది చేపని పట్టేందుకు నీళ్ళ లోపలికి దూకి చేపతో పైకి రావటం ఇంతవరకూ చూడలేకపోయాను. ఆ అదృష్టం ఎప్పటికో!!

ఆంధ్రభోజుడి / తెలుగు వల్లభుడి పద్యంలో – తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటైన  కావ్యంలో చోటు దక్కించుకున్న ఈ పిట్ట పక్షిలోకానికి, తెలుగుభాషాప్రియులకి, తెలుగు ప్రకృతిప్రేమికులకీ సెలబ్రిటీయే!! ఇంతకీ మన సెలబ్రిటీ విల్‌ఫుల్ డిఫాల్టర్ తన ఎయిర్‌లైన్స్‌కి , బీరుకి లోగోగా వాడుకున్న కింగ్‌ఫిషర్ కూడా ఇదే.  బీర్ కింగ్ తెచ్చిన తలవంపులు, రాయలవారిచ్చిన సెలబ్రిటీ స్టేటస్‌తోనైనా ఈ లకుముకి మర్చిపోగల్గుతుందని ఆశిద్దాం.

ఈ దేశంలో కనపడే దగ్గర దగ్గర పది రకాల లకుముకుల్లో నాకిప్పటి వరకూ నాలుగే కనిపించాయి. వాటిలో ఇది మూడోది.  నాలుగో దాన్ని కిందటి పోస్టులో చూపించాను. ఒకటి, రెండు రాబోయే వనవిహారాల్లో.

బై4నౌ

🐾🌵🐋💦🌦🐢🐞🍁🍄🌾

వ🦌న🌳వి🐾హా🌾రం🦋 – Kingfisher గురించి(1)


Kingfisher అనగానే ఆ పేరు పెట్టుకున్న ఒక పక్షి కంటే ముందు పదకొండు వేల కోట్లకి బాంకుల్ని ముంచేసి యూకే చెక్కేసిన ఒక టైకూన్, మూతబడిన ఒక ఎయిర్ లైన్, ఒక బీరు బ్రాండు గుర్తొస్తాయి.

మీడియాని ఫాలో అవ్వదు కానీ ఈ పిట్టకి తన పేరు మీద ఆ కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఎన్ని వివాదాలు సృష్టించాడో తెలిస్తే పేరు మార్చేసుకుంటుందేమో.

Kingfisherకి తెలుగులో –
చల్లముద్దపక్షి

చల్లకవ్వపుపిట్ట

పచ్చరేకపిట్ట

మీలపల్లేంక పులుగు

లకుముకి పిట్ట

అని పేర్లున్నాయి, according to ఆంధ్రభారతి.
ఫొటోలో వున్న పిట్టకి ఆ తెలుగు పేర్లలో ఏది కుదురుతుందో కానీ ఇంగ్లీషులో మాత్రం Stork-billed Kingfisher అని పెట్టారు. అంటే కొంగముక్కు లకుముకి అనచ్చేమో.

ఇండియా నుంచి ఆగ్నేయాసియా వరకూ చాలా చోట్ల కనబడుతుంది(ట). నాకు మాత్రం మా వూళ్ళో సంగీబులో వెట్-లాండ్స్ లో కనిపించింది.

మీకు ఎక్కడైనా కనిపిస్తే ఆ సంగతి ఇక్కడ కామెంట్ పెడతారా? ఫ్లీజ్😊🙏

వ🦌న🌳వి🐾హా🌾రం🦋 – పడగ లేని పాము – చెట్టు దిగిన కప్ప


వనాలు, వన్య జీవుల గురించి తెలుగులో రచనలు తక్కువ. కానీ అవంటే ఇష్టం, ఆసక్తీ లేని తెలుగువాళ్ళు కూడా తక్కువే అనేది నా అనుమానం కాదు, అభిప్రాయం. అందుకే నా వనసంచారాలని తెలుగు వాళ్ళతో పంచుకోవాలని YVR Walks with Nature అనే నా ఆంగ్ల బ్లాగుకి తెలుగు జోడించి ఆంగ్లాంధ్ర బ్లాగుగా బాగు చేశాను. నా అం’తరంగా’లు చదువుతున్న చదువరులని నాతో వనసంచారాలకి ‘తీసుకెళ్ళా’లనిపించింది. అంతకంటే ఇంకేంలేదు. ఇదుగో ఇక్కడ 👇క్లిక్కితే – you can join me on my Nature walks, Welcome🤗 –

https://yvrwalkswithnature.wordpress.com/2018/10/05/%F0%9F%90%8Dbronze-back-vs-golden-tree-frog%F0%9F%90%B8/

Happy🖐😀Reading

🐠🌷🦌🌲🦅🌻🐻🌵