Category Archives: వన🦌🌳🐾🌾🦋 విహారం

వనవిహారం – పచ్చని చెట్టు ఒకటి – వెచ్చని ….. రెండు


an amazing courtship of jumping spiders i witnessed at Singapore’s Sungeibuloh Wetlands on 02nd May’21.

https://m.facebook.com/story.php?story_fbid=4171276352933510&id=100001535590899&sfnsn=mo

లలాటాక్షుడు-లకుముకిపిట్ట


శివుడి జటాజూట ధారలపై వాలిన పిట్టని చూసి గీసుకున్న ఊహాచిత్రం

https://m.facebook.com/story.php?story_fbid=3145258398868649&id=100001535590899&sfnsn=mo

బీ🐝హేవియర్


Bee-haviour – స్పెల్లింగ్ కరెక్టే. తేనెటీగలు తమ పట్టుకి వెళ్ళే దారిలో ఒక అతి తెలివి సాలీడు వల పన్నింది. ఆ తర్వాత ఏమైందో ఈ వీడియోలో చూడండి

https://m.facebook.com/story.php?story_fbid=4134183003309512&id=100001535590899&sfnsn=mo

వనవిహారం – పచ్చని చెట్టు ఒకటి – వెచ్చని ….. రెండు


an amazing courtship of jumping spiders i witnessed at Singapore’s Sungeibuloh Wetlands on 02nd May’21.

https://m.facebook.com/story.php?story_fbid=4171276352933510&id=100001535590899&sfnsn=mo

హుమ్..మ్..మ్..వెతికితే చిక్కడు-దొరకడు, దొరికితే కదలడు-వదలడు 😍


ఓ రెండు మూడు వారాల క్రితం లంచ్ బ్రేకులో మా ఆఫీసు చుట్టుపక్కల వున్న చెట్లు, పుట్టలు, పిట్టలు (రెక్కలు, ముక్కులు, ఈకలు వుండి గాల్లో ఎగిరేవేలెండి😉) చూసుకుంటూ తచ్చాడుతుంటే అదిగో ఆ అద్భుత జీవి కనబడింది. పేరు Cantao Ocellatus[Mallotus Shield Bug] (ట).

ఎక్కువగా బొద్దిచెట్ల (Macaranga peltata) ఆకుల వెనకవైపు గుడ్లు పెట్టి, వాటిలోంచి పిల్లబ్యూటీలు బైటికొచ్చే వరకూ అక్కణ్ణుంచి కదలవుట. చుట్టుపక్కల ఎంత గందరగోళంగా వున్నా సరే కదలవుట. సరిగ్గా ఆ దశలో వున్నప్పుడే, కార్లూ అవీ బాగా తిరిగే రోడ్డుకి పక్కనే, చెయ్యి చాస్తే అందే కొమ్మ మీద, నా కంటబడింది.

పురుగు అని మనం తీసి పారేసే జాతిలో పుట్టిన ఈ ప్రాణి ఓ మంచి తల్లి అని తెలిసి ఆర్ద్రత అనే భావన అనుభవంలోకి వచ్చింది.

తనలోని మరో రహస్యాన్ని నాతో పంచుకోవాలని పుడమితల్లికి సడెన్-గా ఎందుకనిపించిందో!!

నా ఒక్కడితోనే కాదు, కనీసం ఓ వందమంది తెలుగువారితో పంచుకోవాలని ప్రకృతిమాత సంకల్పం అని ఇది వ్రాస్తుంటే అర్థమైంది.

మొత్తానికి “భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు ….” అనిపించాడు విశ్వనేత. విశ్వాన్ని నేసిన ఆ నేతన్న ఎవరోగానీ ఫస్టు నేతన్నల కళాదృష్టి /సృష్టి మనసులో మెదిలాయి. ఆ రంగులు, డిజైన్లూ చూస్తుంటే అవేవో రకరకాల చేనేత చీరలు గుర్తు రావట్లా?

మెడ భాగానికి కింద చూడండి, ఇద్దరు మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్న బొమ్మలా వుంది.

ఇంకా పైగా ఈ కీటకం వీపు మీది డిజైనులో పూరీ జగన్నాధుడి మూర్తి, అన్నవరం దేవుడి మీసాలు కూడా కనిపించాయి.

హుమ్..మ్…మ్… వెతికితే చిక్కడు-దొరకడు, దొరికితే కదలడు-వదలడు.

ప్రకృతిమాత తన fabric design skill అంతా ఈ బుల్లిజీవి వీపు మీద ప్రదర్శించడం వెనక కారణం ఏమై వుంటుంది? చాలా పెద్ద కారణం వుంది. చెప్పడం కుదరదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని నేలతల్లి కోరిక.

ఇంతే సంగతులు. బై4నౌ🙏😊

🌳🌾వనవిహారం🦜🌵 చిట్టీ చిలకమ్మది మహమద్ రఫీ & ఘంటసాల పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు ….


చిట్టీ చిలకమ్మా! అమ్మా కొట్టిందా! అని చిన్నప్పుడు పాడుకోవడం, బుద్ధి పుడితే దొరికిన పిల్లకాయలచేత పాడించడం తప్ప చిట్టి చిలకమ్మ గూడు ఎలా వుంటుంది? అందులో చిలకమ్మ అసలేం చేస్తూ వుంటుంది? అనే ధ్యాస ఎప్పుడూ కలగలేదు. ధ్యాస కలిగేప్పటికి చిట్టిచిలకమ్మలు జనావాసాల్లో కనిపించడం తగ్గిపోయింది. ఈ నేచర్ ఫోటోగ్రఫీ మొదలెట్టిన దాదాపు రెండేళ్ళకి అదుగో ఆ చిలకమ్మ గూట్లోంచి తొంగిచూస్తూ నా కళ్ళకి, ఆ పైన నా కెమెరాకి చిక్కింది.

మన ఇండియన్ రామచిలకకి దీనికీ కొంచెం తేడాలున్నాయి. రంగుల్లో, సైజులో, పలుకుల్లో. అందంలో డెఫినిట్-గా మన రామచిలక (Rose-ringed Parakeet)దే పైచేయి అయినా ఇదీ అందమైనదే. పేరుకి Long-tailed Parakeet కానీ తోక పొడుగులో రాములవారి చిలక తరవాతే.

పై ఫొటోలో వున్నది తల్లి చిలక. ఆ గ్రే కలర్ ముక్కుని బట్టీ ఇది చిలకమ్మని తెలిసింది. చిలకయ్యగారి ముక్కూ, తల రెడ్ కలర్లో వుంటాయి. ఇక్కడ చిలకమ్మ నన్నే అబ్జర్వ్ చేస్తోంది. దాదాపు 40 అడుగుల కింద వున్నాను, ఐనా దాని భయం దానిది.

మొన్న ఫిబ్రవరిలో ఈ గూడుని ఒక రెండువారాల పాటు ప్రతిరోజూ అబ్జర్వ్ చేశాను. అప్పుడిదే గూట్లో Hornbills వుండేవి. అది వేరే పెద్ద కధ, తరవాత చెప్తాను. ఈ గూడు కూడా మహమద్ రఫీ & ఘంటసాలలు పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు. పేద్ద చెట్టులో ఏర్పడిన రెండు ద్వారాలున్న తొర్ర. చిలకలసలు గూళ్లు కట్టవు, సహజంగా ఏర్పడిన గూళ్ళనే వాడుకుంటాయి. అందువల్ల వీటిలాగే గూళ్ళు పెట్టని పక్షులతో స్థలం కోసం పోటీ తప్పదు. ఆ సంగతి నాకు మొన్న ఆదివారం అర్థమైంది.

పైనున్నదీ తల్లే, సాయంత్రం నాలుగు – ఐదు గంటల మధ్య సూర్యాస్తమయపు వెలుగుల్లో చిలకమ్మ రంగులు మరీ అందంగా మెరిశాయి. ఇంతలో చిలకయ్యగారు కొడుకుతో వచ్చి ప్రక్క చెట్టు కొమ్మ మీద వాలారు. పళ్ళ గుజ్జు అనుకుంటా నోట్లోంచి రప్పించి పిల్లాడికి ‘గోరుముద్దలు’ తినిపించి ఎక్కడికో ఎగిరిపోయింది.

చిలక బాలుడు నేను ఫొటోలు తీసుకునే వరకూ కూర్చుని , ఆ పని కాగానే చటుక్కున మాయమయ్యాడు. పశ్చిమభానుడి కిరణాలు బాలశుకుడిపై పడి మరీ అందంగా మెరిశాయి.

ఇలా, కిందటి శుక్రవారం నుంచీ ఆదివారం వరకూ శుక సంసారాన్ని గమనిస్తూ గడిపాక, ఆదివారం సాయంత్రం సడెన్-గా తెలిసింది శుకసంసారం మరీ సుఖ సంసారమేం కాదని.

ఇంతకు ముందు ఈ గూట్లో రెండు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన Hornbills, (సేమ్ అవే, ఆ రెండే అనుకుంటున్నా) వచ్చి ఈ చోటు మాదిరో, ఈ గూడు మాదిరో అంటూ గొడవ మొదలు పెట్టాయి. పైన ఫొటోలో సర్కిల్స్ చూడండి. Hornbills కీ గూళ్ళు కట్టే అలవాటు లేదనుకుంటా. అందుకే చిలకలతో ఈ property dispute.

పాపం, చిలక ముక్కూ, Hornbill ముక్కూ పుల్లలు పట్టుకుని గూడు కట్టేందుకు అనువుగా వుండవు. దాంతో అద్దె కొంపలైనా వెతుక్కోవాలి, కబ్జాలైనా చెయ్యాలి.

Hornbills గందరగోళం చేస్తూ తల్లీపిల్లలని భయపెడుతున్నాయి. చిట్టి చిలకమ్మకి ఎందుకోగానీ ఎగిరేందుకు ధెైర్యం చాలట్లేదు. ఈ లోపు hornbills ఏం గూండాయిజం చేస్తాయో తెలీక చిలుక సమాజం కంగారు పడుతోంది.

పర్యావరణ సమతూకం తప్పడం వల్ల ఈ జాతి చిలుకలు ప్రమాదం అంచుల వైపు పయనిస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రతి పిల్లా బ్రతికి బట్టకట్టడం వీటికి చాలా అవసరం. వాటికీ సంగతి తెలీకపోయినా నాకు తెలుసు కనక ఆ ఆందోళన నన్ను రోజూ లంచవర్లో, సాయంత్రం ఆరు తరవాతా ఆ గూటివైపుకి పరుగెత్తిస్తోంది. తల్లీ – పిల్లా చీకటి పడే వరకూ క్షేమంగా వుంటే ఆ రోజు గడిచినట్టే.

ఈ రోజు వరకూ అలా గడిచింది. తొందర్లో చిలుకపిల్ల ఎగురుతుందా? నేనది చూస్తానా?

ప్రకృతిమాతా!! జగన్మాతా!! బాలశుకుడికి నువ్వే అండ 🙏😐🙏

🦜🌴🦜🌳🦜🌵🦜🌾🦜🌲🦜

వ🌳న 🍂వి👣హా🍃రం🌴- వనదేవతల వార్నింగ్ సిగ్నల్సేమో అవి🤔?


ఇవాళ బుకిట్-టిమా హిల్ ఎక్కాను వనవిహారానికి. 1.63 sq.kmల అతి తక్కువ విస్తీర్ణంలో వున్న నేచర్-పార్క్ – అదీ వరల్డ్ హెరిటేజ్ సైట్ – ఇదేనేమో. అంత చిన్నదైనా పిట్ట కొంచెం కూత ఘనంలా ఈ పార్కులో 840 వృక్ష జాతులు, 500 జాతుల జంతుజాలం (పక్షులు, కీటకాలతో కలిపి) వున్నాయి(ట), (ట) ఎందుకంటే ఇక్కడా అక్కడా చదివిన సమాచారమే కానీ కంటితో చూస్తేకదా !! ఇక్కడున్న అరుదైన జీవుల్లో Straw-headed bulbul ఒక్కటే ఇవాళ కనిపించింది. అదీ ఒక్క క్షణంపాటు. కెమెరా ఫోకస్ అయ్యేలోగా మాయమైంది. అదృష్టం కొద్దీ ఒక్క ఫోటో వచ్చింది. ఇదుగో –

ఆ బుల్-బుల్ కనుమరుగైన కాస్సేపటికి ఏదో పిట్ట ఘనంగా కూయడం మొదలుపెట్టింది. దర్జీపిట్టలా వుంది. 10 సెంటీమీటర్లు మించని ఈ పిట్ట కూత 100 మీటర్లు దాటి వినిపిస్తుంది. ప్రస్తుతం కూస్తున్న పిట్ట కనిపించలేదు కానీ దాని కూతకి (బహుశా) కారణం మాత్రం కనిపించింది. అదుగో అదే –

ఇదే Monitor lizard. ఉడుము. పక్షిగూళ్ళ మీద రెయిడ్ కి వెళ్లినట్టుంది. గుడ్లు, పిల్లలని గుటుక్కుమనిపించడానికి. దీన్ని చూసే ఆ దర్జీపిట్ట తక్కిన పక్షులకి వార్నింగ్ మెసేజిలు ఇస్తోంది. దీని దొంగకోళ్ల మొహం చూస్తే డౌటుగానే వుంది. ఫోటో తీసి, ఇటూ అటూ మొక్కల పొదల వైపు పరికించి మళ్ళీ ఇటు తిరిగేప్పటికి మాయమైంది. కచ్చితంగా ఏదో కుంభకోణం చేసిన బాపతే ఇది.

ఇందాకా దర్జీపిట్ట వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తోంది అన్నప్పుడు ఈ కొండ దారిలో కంటబడిన కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ గుర్తొచ్చాయి.

మొదటిది. బుకిట్ -టిమా హిల్ కి వెళ్లే దార్లో మెక్-డొనాల్డ్స్ ఫుడ్ తింటున్న ఆ కోతి, నా కెమెరాకి పట్టుబడింది.

Would we have evolved into Homo sapiens, if our ancestor-apes had this food 😂?

జంక్-ఫుడ్ ఆత్రంగా తింటున్న ఆ పిచ్చిమొహాన్ని చూడగానే ఒక వింత ఊహ కలిగింది. –

ఈ జంక్-ఫుడ్స్ అనేవి కోతి నుంచి మానవుడు పుట్టకముందునించీ కనక ఉండుంటే, మానవజాతికి ప్ర.ప్ర………ప్రపితామహులైన వానరాలు ఆ జంక్-ఫుడ్డుకి అలవాటు పడిపోయుంటే మనం homo-sapiensగా ఇవాల్వ్ అయ్యేవాళ్లమేనా అసలు? ఓ మై గాడ్!! మన లక్కు నిజంగా. లేకపోతే ఏ Mc Monkeyలుగానో ఇవాల్వ్ అయ్యేవాళ్ళమేమో!?!? ఓ పది పదిహేను జనరేషన్స్ తరవాత homo-sapiens ఎలా ఉండచ్చనే దాని మీద ఒక వార్నింగ్ సిగ్నల్లా అనిపించింది ఈ Mc Monkey.

ఇంక రెండో సిగ్నల్. అదుగో ఆ Emerald Dove. స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ రకం గువ్వని చూడడం ఇదే మొదటిసారి. ఐదారడుగుల దూరంలో నిలబడి ఫోటోలు తీస్తున్నా బెదరిపోకుండా అక్కడే తిరుగుతోంది. అడవిచెట్ల కొమ్మల్లోంచి జాలువారిన కిరణాల్లో మెరుస్తున్న దాని ఆకుపచ్చని రెక్కలు చెప్తున్నాయి ఎమరాల్డ్ డవ్ అనే పేరు ఎలా వచ్చిందో. కానీ మరకత కపోతం ముక్కుతో పట్టుకున్నదేంటోగానీ శాంతికపోతాలు పట్టుకోవాల్సిన ఆలివ్ కొమ్మలా మాత్రం లేదు, ఆలివ్-కొమ్మకి టోటల్ ఆపోజిట్ మీనింగ్ కనిపిస్తోంది. ఈ ప్రపంచంలో అసహనం ఎక్కువైపోతోందని ప్రకృతిమాత చెప్తోందా అని నా మనసుకనిపించింది. ఏం చేస్తాం, నేరం మనసుది కాదు, చదువుతున్న, వింటున్నన్యూసుది.

Saw the symbol of peace with a “bomb” in its bill, not with an olive branch.

163 మీటర్ల ఎత్తున కాస్త పచ్చిగాలి పీల్చుకుని తిరిగి కిందకి నడుస్తుంటే కంటి కొలకులోంచి బాట పక్కనే కనపడిన ఒక ఆకారం గుండె ఝల్లుమనిపించింది. చేతిలోని కెమెరా ఫోటో తీసి కానీ అడుగు ముందుకెయ్యడానికి వీల్లేదంది. పడగ విప్పి నిలబడిన త్రాచులా వున్నది త్రాచు కాదని తెలిసి ఎక్సయిట్-మెంట్ తగ్గిపోయింది. అదొక ఎండుటాకని గ్రహించాక అదొక వనదేవతల ఇచ్చిన సందేశంలా కనిపించింది.

This dead leaf stopped me in my tracks. It seemed to say, “Pollute the Environment, and it will bite you back!!!” 😱

“పర్యావరణాన్ని కాలుష్యంతో నింపితే అది పడగ విప్పి కాటేస్తుంద,”ని ప్రకృతి సంకేతాలిస్తే తప్ప తెలియని అమాయక శిశువేం కాదు మానవజాతి. సిగరెట్ కాల్చడం ప్రాణాలు తీస్తుందని పెట్టె మీద రాసి మరీ అమ్మే అతితెలివి, అత్యాశ సొంతం చేసుకున్న నాగరిక జాతి. ఆ విషయం తెలుసో తెలీదో కానీ ఒక తల్లిగా మంచి చెప్పడం ప్రకృతిమాత సహజ లక్షణం, అందుకే చూసి పట్టించుకునేవాళ్ళకోసం ఆ ఆకుని ఒక నోటిస్ బోర్డులా అక్కడ ఉంచినట్టుంది.

.🌴🌳వృక్షో రక్షతి  రక్షితః  🌾🌲.

🌿వన🌳🌱విహారం🌊 – సుంగైబులో అడవిలో “అలోలములాలోచనలేవేవో నాలోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడగ, కోరాడగ…”


మొన్నా మధ్య సుంగైబులో మడఅడవిలో కనిపించిందీ దృశ్యం.

సముద్రంలో పోటు వచ్చినప్పుడు నీళ్ళు అడవిలోకి ప్రవహించి పల్లపు ప్రదేశం అంతా నిండిపోతుంది. పోటు తగ్గగానే నీరంతా సముద్రంలోకి జారిపోతుంది. పోటులో అడవిలోకి కొట్టుకొచ్చి, పాటుతో పాటుగా తిరిగి కడలికి చేరలేక బురదనేలపై చిక్కుకుపోయిన జలజీవాల మీద ఆధారపడి వలస నీటిపక్షులు, మొసళ్ళు, ఆటర్స్, … జీవనయానం సాగిస్తుంటాయి.

జలప్రవాహపు ప్రకంపనలే ఇరుసుగా తిరిగే జీవనచక్రం ఈ మడ అడవి.

ఒక ఉదయం పోటు వచ్చిన సమయంలో వనదేవతల సాంగత్యం కోరి సుళ్ళు తిరుగుతూ వస్తున్న సాగరుడు

నా కళ్ళను ఆకర్షించాడు,

కాళ్ళను నిలువరించాడు.

ఆ సుడులలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ దినకరుడేమనుకుంటున్నాడోననే స్ఫురణ నా మానస సరోవరంలో అలలు రేపగా —

అలోలములాలోచనలేవేవో నా లోపల ప్రాలేయచ్ఛాయల వలె తారాడి, కోరాడసాగాయి.

కాలప్రవాహంలో అలలా తేలివచ్చే ప్రతి ఉదయం,

సాయం‘కాలగర్భం’లో కలిసిపోయే ఒక కల అనుకుంటున్నాడా ప్రభాతభానుడు?

కావచ్చు.

ఆయన మనసులో ఏమున్నా, నేల మీద, కాలప్రవాహపు ప్రకంపనలే ఇరుసుగా తిరిగే జీవనచక్రం నాకు చెబుతున్నది ఆ సత్యాన్నే. అంతరంగ తరంగాల్లో ప్రతిఫలిస్తున్న ఏ అంతఃస్సూర్యుడో లోపలి చీకట్లని ఛేదించి చూపిస్తున్నది ఆ అనాది జీవనవేదాన్నే 👇

లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.

🌳వన🌕🐦విహారం🌵 – ఆ రోదసీపక్షి, ఈ పుడమిపిట్ట Bird-Celestial zooms above, the Bird-Terrestrial looms below


మనం ఏ హడావిడీ లేకుండా పౌర్ణమి అని పిలుచుకునే నిండు పున్నమికి అమేరికన్లు ముద్దుగా సూపర్-మూన్, బ్లడ్-మూన్,…లాంటి పేర్లు పెట్టారు. సూపర్ మూన్ పేరు బానే ఉంటుంది కానీ బ్లడ్-మూన్ అంటేనే ఒక రకంగా ఉంటుంది.

రక్త చంద్రుడు !! అని తెలుగులో అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమా టైటిల్లా వుండి ఎర్రటి ఆకాశం, అందులో గబ్బిలాలు ఎగురుతూ, మధ్యలో కాలు తెగి రక్తం కారుతున్న ఒంటరి ఒంటెలా …. అబ్బో !! తల్చుకుంటే కడుపులో దేవుతోంది.

తెలుగు మనసు ఆర్జీవీ-మార్క్ చంద్రుణ్ణి చూస్తే దూరంగా పారిపోతుంది. నిజానికి శ్రీశ్రీగారి –

ఒక రాత్రి :

గగనమంత నిండి, పొగలాగు క్రమ్మి-

బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!

ఆకాశపుటెడారి నంతటా, ఆకట !

ఈ రేయి రేగింది ఇసుక తూఫాను!

గాలిలో కనరాని గడుసు దయ్యాలు

భూదివముల మధ్య ఈదుతున్నాయి!

నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము!

కరి కళేబరములా కదలదు కొండ !

ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన

ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి !

విశ్వమంతా నిండి , వెలిబూదివోలె –

భయపెట్టే బహుళ పంచమి జ్యోత్స్న అన్నా బెదిరిపోతుంది తెలుగ్గుండెకాయి.

ఆర్జీవీ-మార్కు బ్లడ్-మూన్లు, శ్రీశ్రీ మార్కు కాళ్ళు తెగిన ఒంటెలు తెలుగు ఒంటికి పడవు. మిట్ట మధ్యాన్నం పూట వెన్నెల కురిపించి అరవైయ్యేళ్ల పైగా లాహిరి లాహిరి అనిపించి, ఉయ్యాలలూగించిన మార్కస్ బార్ట్లే-మార్కు మాయాబజార్ చందమామకే మన వోటు.

అందుకే మొన్న 20న, 21న రాత్రి పదింటికి సూపర్ మూన్ ఫోటోలు తీద్దామని బైల్దేరినప్పుడు రక్తం, గబ్బిలం, కాళ్ళు తెగిన ఒంటె … ఇలాంటివేం గుర్తుకి రాలేదు.

నల్లటి మబ్బుల మధ్య ఎగురుతున్న తెల్లటి కొంగలా అనిపించాడు జాబిల్లి. అదుగో అలా –

dscn2989

dscn3007

నికాన్’వాడు P900 మోడల్లో మూన్-షాట్ అనిచెప్పి ఒక సెట్టింగ్ ఇచ్చాడు. అది పెట్టి తీస్తే ఇదుగో చందమామయ్యగారి నిజరూప దర్శనం ఇలా అయ్యింది.

అర్ధరాత్రి హత్య చేసి, మొహంమీద పడిన రక్తం తుడుచుకోకుండానే పారిపోతున్న ఆర్జీవీ చంద్రుడు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగి పడున్న ఒంటరి ఒంటెలాంటి శ్రీశ్రీ చంద్రుడు అయిపు లేరు.

ఓ రెండున్నర లక్షల మైళ్ళ దూరంలో ఆకాశంలో అడ్డంగా దొర్లుతున్న పుచ్చకాయలాంటి మరో లోకం కనిపించింది. తెల్లగా మెరుస్తున్న ప్రదేశాలన్నీ మిలమిల్లాడుతున్న నగరాల్లా, పుచ్చకాయ చారల్లా వున్న ఆ గీతలన్నీ విమాన మార్గాల్లా, నల్లటి ప్రాంతాలు చంద్రలోకపు సముద్రాల్లా కనిపిస్తూ మళ్ళీ మార్కస్-బార్ట్లే మాయాబజార్లోకి తీసుకెళ్లిపోయాయి.

supermoon2

చిన్నప్పుడు నండూరి రామ్మోహన్రావుగారి “విశ్వరూపం”లో చూసిన చందమామని నా స్వహస్తాలతో ఆకాశంలోంచి దింపినంత సంతోషం. ఆ సంతోషంలోంచి తేరుకుని భూలోకంలో – అంటే మా కాలవ్వొడ్డున – ఏం జరుగుతోందో చూద్దామని కెమెరా అటు తిప్పాను.

dscn2899

కొంగజాతి ఆకలి గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ మా కాలవ్వొడ్డున ప్రతీరోజూ కనిపించే ఈ బకశ్రేష్ఠుడు/శ్రేష్టురాలి ఆకలి మాత్రం అమోఘం. రాత్రీపగలూ తేడా లేకుండా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడూ ఉంది. కెమెరా ఫ్లాష్’కి బెదిరి కొంచెం దూరంగా వెళ్లి వాలింది.

నేల మీద ఈ నీటిపక్షిని చూస్తుంటే ఇప్పుడు చంద్రన్న** సుదూరాకాశంలో రెక్కలు లేకుండా ఎగురుతున్న పక్షిలా అనిపించాడు. (** చంద్రన్న అనగానే ప్రస్తుతం ఏ పార్టీతోనూ పొత్తులేని (?) ఆంధ్ర చంద్రన్నలా అనే అర్ధం ధ్వనిస్తోందేమో🤔… బాబోయ్! నాకసలా ఆలోచనే రాలేదండోయ్!😯🙏)  ఆ అనిపించిన దానికి ఫలితంగా ఆ రోదసీపక్షిని, ఈ పుడమిపిట్టని అదుగో అలా కలపాలనిపించింది. కలిపా –

birds celestial n terrestrial

As the bird-celestial zooms above, the bird-terrestrial looms below అంటూ పెద్ద కాప్షన్ కూడా పెట్టా. (నా మిడి మిడి ఆంగ్ల పరిజ్ఞానానికి అదే ఎక్కువ.)

ఇంతకీ ఆ బకశ్రేష్ఠుడు / బకశ్రేష్ఠ యొక్క ఆంగ్లనామం Striated Heron. ఆసియాలో చాలా దేశాల్లో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఈ కొంగ ప్రమాదంలో పడిన జీవ జాతుల జాబితాలో ఇంకా చేరలేదు. ఏనిమల్ బిహేవియర్ మీద ఆసక్తి వున్న వారికి దీని బిహేవియర్ నిజంగా మెదడుకి మేతే. దాని గురించి వచ్చే వనవిహారంలో. బై4నౌ.

“Hinduism comes closest to being a nature religion. Rivers, rocks, trees, plants, animals, and birds all play their part, both in mythology and everyday worship. This harmony is most evident in remote places like this, and I hope it does not lose its unique character in the ruthless urban advance.”

Ruskin Bond, Rain in the Mountains: Notes from the Himalayas