🌳🌾వనవిహారం🦜🌵 చిట్టీ చిలకమ్మది మహమద్ రఫీ & ఘంటసాల పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు ….


చిట్టీ చిలకమ్మా! అమ్మా కొట్టిందా! అని చిన్నప్పుడు పాడుకోవడం, బుద్ధి పుడితే దొరికిన పిల్లకాయలచేత పాడించడం తప్ప చిట్టి చిలకమ్మ గూడు ఎలా వుంటుంది? అందులో చిలకమ్మ అసలేం చేస్తూ వుంటుంది? అనే ధ్యాస ఎప్పుడూ కలగలేదు. ధ్యాస కలిగేప్పటికి చిట్టిచిలకమ్మలు జనావాసాల్లో కనిపించడం తగ్గిపోయింది. ఈ నేచర్ ఫోటోగ్రఫీ మొదలెట్టిన దాదాపు రెండేళ్ళకి అదుగో ఆ చిలకమ్మ గూట్లోంచి తొంగిచూస్తూ నా కళ్ళకి, ఆ పైన నా కెమెరాకి చిక్కింది.

మన ఇండియన్ రామచిలకకి దీనికీ కొంచెం తేడాలున్నాయి. రంగుల్లో, సైజులో, పలుకుల్లో. అందంలో డెఫినిట్-గా మన రామచిలక (Rose-ringed Parakeet)దే పైచేయి అయినా ఇదీ అందమైనదే. పేరుకి Long-tailed Parakeet కానీ తోక పొడుగులో రాములవారి చిలక తరవాతే.

పై ఫొటోలో వున్నది తల్లి చిలక. ఆ గ్రే కలర్ ముక్కుని బట్టీ ఇది చిలకమ్మని తెలిసింది. చిలకయ్యగారి ముక్కూ, తల రెడ్ కలర్లో వుంటాయి. ఇక్కడ చిలకమ్మ నన్నే అబ్జర్వ్ చేస్తోంది. దాదాపు 40 అడుగుల కింద వున్నాను, ఐనా దాని భయం దానిది.

మొన్న ఫిబ్రవరిలో ఈ గూడుని ఒక రెండువారాల పాటు ప్రతిరోజూ అబ్జర్వ్ చేశాను. అప్పుడిదే గూట్లో Hornbills వుండేవి. అది వేరే పెద్ద కధ, తరవాత చెప్తాను. ఈ గూడు కూడా మహమద్ రఫీ & ఘంటసాలలు పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు. పేద్ద చెట్టులో ఏర్పడిన రెండు ద్వారాలున్న తొర్ర. చిలకలసలు గూళ్లు కట్టవు, సహజంగా ఏర్పడిన గూళ్ళనే వాడుకుంటాయి. అందువల్ల వీటిలాగే గూళ్ళు పెట్టని పక్షులతో స్థలం కోసం పోటీ తప్పదు. ఆ సంగతి నాకు మొన్న ఆదివారం అర్థమైంది.

పైనున్నదీ తల్లే, సాయంత్రం నాలుగు – ఐదు గంటల మధ్య సూర్యాస్తమయపు వెలుగుల్లో చిలకమ్మ రంగులు మరీ అందంగా మెరిశాయి. ఇంతలో చిలకయ్యగారు కొడుకుతో వచ్చి ప్రక్క చెట్టు కొమ్మ మీద వాలారు. పళ్ళ గుజ్జు అనుకుంటా నోట్లోంచి రప్పించి పిల్లాడికి ‘గోరుముద్దలు’ తినిపించి ఎక్కడికో ఎగిరిపోయింది.

చిలక బాలుడు నేను ఫొటోలు తీసుకునే వరకూ కూర్చుని , ఆ పని కాగానే చటుక్కున మాయమయ్యాడు. పశ్చిమభానుడి కిరణాలు బాలశుకుడిపై పడి మరీ అందంగా మెరిశాయి.

ఇలా, కిందటి శుక్రవారం నుంచీ ఆదివారం వరకూ శుక సంసారాన్ని గమనిస్తూ గడిపాక, ఆదివారం సాయంత్రం సడెన్-గా తెలిసింది శుకసంసారం మరీ సుఖ సంసారమేం కాదని.

ఇంతకు ముందు ఈ గూట్లో రెండు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన Hornbills, (సేమ్ అవే, ఆ రెండే అనుకుంటున్నా) వచ్చి ఈ చోటు మాదిరో, ఈ గూడు మాదిరో అంటూ గొడవ మొదలు పెట్టాయి. పైన ఫొటోలో సర్కిల్స్ చూడండి. Hornbills కీ గూళ్ళు కట్టే అలవాటు లేదనుకుంటా. అందుకే చిలకలతో ఈ property dispute.

పాపం, చిలక ముక్కూ, Hornbill ముక్కూ పుల్లలు పట్టుకుని గూడు కట్టేందుకు అనువుగా వుండవు. దాంతో అద్దె కొంపలైనా వెతుక్కోవాలి, కబ్జాలైనా చెయ్యాలి.

Hornbills గందరగోళం చేస్తూ తల్లీపిల్లలని భయపెడుతున్నాయి. చిట్టి చిలకమ్మకి ఎందుకోగానీ ఎగిరేందుకు ధెైర్యం చాలట్లేదు. ఈ లోపు hornbills ఏం గూండాయిజం చేస్తాయో తెలీక చిలుక సమాజం కంగారు పడుతోంది.

పర్యావరణ సమతూకం తప్పడం వల్ల ఈ జాతి చిలుకలు ప్రమాదం అంచుల వైపు పయనిస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రతి పిల్లా బ్రతికి బట్టకట్టడం వీటికి చాలా అవసరం. వాటికీ సంగతి తెలీకపోయినా నాకు తెలుసు కనక ఆ ఆందోళన నన్ను రోజూ లంచవర్లో, సాయంత్రం ఆరు తరవాతా ఆ గూటివైపుకి పరుగెత్తిస్తోంది. తల్లీ – పిల్లా చీకటి పడే వరకూ క్షేమంగా వుంటే ఆ రోజు గడిచినట్టే.

ఈ రోజు వరకూ అలా గడిచింది. తొందర్లో చిలుకపిల్ల ఎగురుతుందా? నేనది చూస్తానా?

ప్రకృతిమాతా!! జగన్మాతా!! బాలశుకుడికి నువ్వే అండ 🙏😐🙏

🦜🌴🦜🌳🦜🌵🦜🌾🦜🌲🦜

14 thoughts on “🌳🌾వనవిహారం🦜🌵 చిట్టీ చిలకమ్మది మహమద్ రఫీ & ఘంటసాల పాడినట్టు పుల్లా, పుడకా ముక్కున కరిచి కట్టిన గూడేం కాదు ….

 1. అన్యగామి

  అమ్మే బాలశుకుడికి, మనకి కూడా అండ. మీ చిలకలు తోటల్లో తిరిగిన మాబాల్యం గుర్తుకుతెచ్చాయి. ఎప్పటిలాగే అద్భుతమైన చిత్రాలు.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   థాంక్యూ అన్యగామిగారూ, మీ బాల్యాన్ని గుర్తు చేసిన మా చిలుకబాలని ప్రకృతిమాత బాగా చూసుకుంటోంది. ఈ రోజు కూడా (O4 Aug)కూడా చూసి వచ్చాను. 🙂🙏

   Like

   Reply
 2. Bulusu Subrahmanyam

  ఫోటోలు బాగున్నాయండి.
  మీ చిలుక కబుర్లు కూడా బాగున్నాయి.
  చిన్నప్పుడు చిలుకని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం గుర్తుకు వచ్చింది.

  మొన్ననే మా పక్కింటి జామచెట్టు మీద చిలుక కనిపించింది.
  ఫోటో తీద్దామని తయారయే లోపే తుర్రుమంది. …………… మహా

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   నెనరులు సార్, బులుసు వారూ.అన్యగామిగారికీ, మీకూ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు తెప్పించినందుకు సంతోషంగా వుంది.🙂🙏

   Like

   Reply
 3. వెంకట రాజారావు . లక్కాకుల

  తనువంత పచ్చలు తాపడం బొనరించి
  తీరిచి దిద్దిన తీరు సొబగు
  కొనదేరి యెర్రగా మునుకొని కిందికి
  వంగిన ముక్కు బెడంగు సొబగు
  ఫలములు మెక్కుచో వలు పోకడలు వోవ
  నరచు రావముల విణ్ణాన సొబగు
  రాణివాసములందు రమణుల పలుకులు
  నేర్చి మాటాడు చిన్నియల సొబగు

  ఓసి చిలుకా ! మరేమేమి చూసి నాడొ
  రాముగారు నీ సొబగులు , సీమ నుండి
  దేశవాళి దాక , ననేక తీరు తీరు
  లగని చిత్రించె , నీజన్మ రాణ కెక్క .

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   @ వెంకట రాజారావు లక్కాకుల
   భలే తియ్యనైన పద్యాలు మాస్టారూ, మా చిలకలు జామపళ్ళనుకుని తినేసేంత తీపిగా వున్నాయి 🙏🙂

   Like

   Reply
 4. Zilebi

  మా చిలకలు జాంపళ్లని
  చూచి కవిత రుచి మరిగి పుసుక్కున కొరికెన్
  ఓ చిన రాజా ! పదముల్
  దోచెను నాదు మదిని ప్రతి తుంపరలోనన్ 🙂

  జిలేబి

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   //జాంపళ్లని చూచి కవిత రుచి మరిగి …//
   జిలేబిగారు, జాంపళ్ళు చూసి కవితలనుకుంటున్నాయా చిలకలు ?? ఈ ఊహ మరీ బావుంది.

   Like

   Reply
   1. సూర్య

    ఒక్కోసారి ఆ చిలుకలని చూస్తే అచ్చం చికెన్ ని చూస్తున్నట్టే అనిపిస్తుంది సుమా!

    Like

    Reply
    1. YVR's అం'తరంగం' Post author

     సూర్యగారూ, మీ కవితావేశం 😱 చూపుల వరకే అయితే ఓకే 😊 , ఈ జాతి చిలుకలు అసలే near-threatend species కూడాను …

     Like

     Reply
 5. విన్నకోట నరసింహారావు

  చిలుకలను, నెమళ్ళను చూసి ఆనందించాలి గానీ చికెన్ గుర్తుకు రావడమేమిటండీ సూర్య గారూ 😳??

  Like

  Reply
 6. విన్నకోట నరసింహారావు

  ఒరు నిమిషం, ఒరు నిమిషం, నాకు ఇప్పుడే ఏదో వెలిగింది . Let us try and be fair to సూర్య..
  “చికెన్” అనడంలో మీ భావం చిన్న చిన్న కోడిపిల్లలు అనా సూర్య గారు? ఈ చిలుకలను చూస్తుంటే బుజ్జి కోడిపిల్లలు గుర్తొస్తున్నాయనా మీరు చెప్పదలుచుకున్నది? అంతకు మించి వేరే yummy లొట్టల తలంపులేమీ లేవని ఆశిస్తున్నాం ఇక్కడ అందరమూ.
  తెలుగులో చెప్పేస్తే సరిపోయేదిగా జనాలకి ఈ తికమక కలగకుండా? 🙂

  Like

  Reply
  1. Anonymous

   వినరా వారి బుర్రే బుర్ర 🙂 కొంత‌ ఉప్పందిస్తే చాలు వారే మిగిలినవన్నీ అల్లేసుకుంటారు 🙂

   మిగిలిన వారికి ఈ తెలివిడి యేదీ 🙂

   Like

   Reply
   1. విన్నకోట నరసింహారావు

    అంత లేదు లెండి, but థాంక్స్ అజ్ఞాత “జిలేబీ” గారూ. btw “అల్లేసుకోవడం” అంటే complimentary గానే ఉందంటారా?

    ఇంతకీ మనం అనుకుంటున్న భావాన్ని సూర్య గారు ధృవీకరించాలి కదా?

    Like

    Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s