ఇవాళ బుకిట్-టిమా హిల్ ఎక్కాను వనవిహారానికి. 1.63 sq.kmల అతి తక్కువ విస్తీర్ణంలో వున్న నేచర్-పార్క్ – అదీ వరల్డ్ హెరిటేజ్ సైట్ – ఇదేనేమో. అంత చిన్నదైనా పిట్ట కొంచెం కూత ఘనంలా ఈ పార్కులో 840 వృక్ష జాతులు, 500 జాతుల జంతుజాలం (పక్షులు, కీటకాలతో కలిపి) వున్నాయి(ట), (ట) ఎందుకంటే ఇక్కడా అక్కడా చదివిన సమాచారమే కానీ కంటితో చూస్తేకదా !! ఇక్కడున్న అరుదైన జీవుల్లో Straw-headed bulbul ఒక్కటే ఇవాళ కనిపించింది. అదీ ఒక్క క్షణంపాటు. కెమెరా ఫోకస్ అయ్యేలోగా మాయమైంది. అదృష్టం కొద్దీ ఒక్క ఫోటో వచ్చింది. ఇదుగో –

ఆ బుల్-బుల్ కనుమరుగైన కాస్సేపటికి ఏదో పిట్ట ఘనంగా కూయడం మొదలుపెట్టింది. దర్జీపిట్టలా వుంది. 10 సెంటీమీటర్లు మించని ఈ పిట్ట కూత 100 మీటర్లు దాటి వినిపిస్తుంది. ప్రస్తుతం కూస్తున్న పిట్ట కనిపించలేదు కానీ దాని కూతకి (బహుశా) కారణం మాత్రం కనిపించింది. అదుగో అదే –

ఇదే Monitor lizard. ఉడుము. పక్షిగూళ్ళ మీద రెయిడ్ కి వెళ్లినట్టుంది. గుడ్లు, పిల్లలని గుటుక్కుమనిపించడానికి. దీన్ని చూసే ఆ దర్జీపిట్ట తక్కిన పక్షులకి వార్నింగ్ మెసేజిలు ఇస్తోంది. దీని దొంగకోళ్ల మొహం చూస్తే డౌటుగానే వుంది. ఫోటో తీసి, ఇటూ అటూ మొక్కల పొదల వైపు పరికించి మళ్ళీ ఇటు తిరిగేప్పటికి మాయమైంది. కచ్చితంగా ఏదో కుంభకోణం చేసిన బాపతే ఇది.
ఇందాకా దర్జీపిట్ట వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తోంది అన్నప్పుడు ఈ కొండ దారిలో కంటబడిన కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ గుర్తొచ్చాయి.
మొదటిది. బుకిట్ -టిమా హిల్ కి వెళ్లే దార్లో మెక్-డొనాల్డ్స్ ఫుడ్ తింటున్న ఆ కోతి, నా కెమెరాకి పట్టుబడింది.

జంక్-ఫుడ్ ఆత్రంగా తింటున్న ఆ పిచ్చిమొహాన్ని చూడగానే ఒక వింత ఊహ కలిగింది. –
ఈ జంక్-ఫుడ్స్ అనేవి కోతి నుంచి మానవుడు పుట్టకముందునించీ కనక ఉండుంటే, మానవజాతికి ప్ర.ప్ర………ప్రపితామహులైన వానరాలు ఆ జంక్-ఫుడ్డుకి అలవాటు పడిపోయుంటే మనం homo-sapiensగా ఇవాల్వ్ అయ్యేవాళ్లమేనా అసలు? ఓ మై గాడ్!! మన లక్కు నిజంగా. లేకపోతే ఏ Mc Monkeyలుగానో ఇవాల్వ్ అయ్యేవాళ్ళమేమో!?!? ఓ పది పదిహేను జనరేషన్స్ తరవాత homo-sapiens ఎలా ఉండచ్చనే దాని మీద ఒక వార్నింగ్ సిగ్నల్లా అనిపించింది ఈ Mc Monkey.
ఇంక రెండో సిగ్నల్. అదుగో ఆ Emerald Dove. స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ రకం గువ్వని చూడడం ఇదే మొదటిసారి. ఐదారడుగుల దూరంలో నిలబడి ఫోటోలు తీస్తున్నా బెదరిపోకుండా అక్కడే తిరుగుతోంది. అడవిచెట్ల కొమ్మల్లోంచి జాలువారిన కిరణాల్లో మెరుస్తున్న దాని ఆకుపచ్చని రెక్కలు చెప్తున్నాయి ఎమరాల్డ్ డవ్ అనే పేరు ఎలా వచ్చిందో. కానీ మరకత కపోతం ముక్కుతో పట్టుకున్నదేంటోగానీ శాంతికపోతాలు పట్టుకోవాల్సిన ఆలివ్ కొమ్మలా మాత్రం లేదు, ఆలివ్-కొమ్మకి టోటల్ ఆపోజిట్ మీనింగ్ కనిపిస్తోంది. ఈ ప్రపంచంలో అసహనం ఎక్కువైపోతోందని ప్రకృతిమాత చెప్తోందా అని నా మనసుకనిపించింది. ఏం చేస్తాం, నేరం మనసుది కాదు, చదువుతున్న, వింటున్నన్యూసుది.


163 మీటర్ల ఎత్తున కాస్త పచ్చిగాలి పీల్చుకుని తిరిగి కిందకి నడుస్తుంటే కంటి కొలకులోంచి బాట పక్కనే కనపడిన ఒక ఆకారం గుండె ఝల్లుమనిపించింది. చేతిలోని కెమెరా ఫోటో తీసి కానీ అడుగు ముందుకెయ్యడానికి వీల్లేదంది. పడగ విప్పి నిలబడిన త్రాచులా వున్నది త్రాచు కాదని తెలిసి ఎక్సయిట్-మెంట్ తగ్గిపోయింది. అదొక ఎండుటాకని గ్రహించాక అదొక వనదేవతల ఇచ్చిన సందేశంలా కనిపించింది.

“పర్యావరణాన్ని కాలుష్యంతో నింపితే అది పడగ విప్పి కాటేస్తుంద,”ని ప్రకృతి సంకేతాలిస్తే తప్ప తెలియని అమాయక శిశువేం కాదు మానవజాతి. సిగరెట్ కాల్చడం ప్రాణాలు తీస్తుందని పెట్టె మీద రాసి మరీ అమ్మే అతితెలివి, అత్యాశ సొంతం చేసుకున్న నాగరిక జాతి. ఆ విషయం తెలుసో తెలీదో కానీ ఒక తల్లిగా మంచి చెప్పడం ప్రకృతిమాత సహజ లక్షణం, అందుకే చూసి పట్టించుకునేవాళ్ళకోసం ఆ ఆకుని ఒక నోటిస్ బోర్డులా అక్కడ ఉంచినట్టుంది.
.🌴🌳వృక్షో రక్షతి రక్షితః 🌾🌲.

ఈశ్వరుడు ప్రకృతిని కూర్చి యిచ్చి జీవ
రాశికి బ్రతుకుతెఱువు నొనరంగ జేసె ,
మనిషి స్వార్థ పరత సౌఖ్యమును దలంచి
ఇతర జీవుల యునికి మన్నించ డెందు .
LikeLike
నెనరులు మాస్టారూ!
LikeLike
//ఇతర జీవుల యునికి మన్ నించడెందు… //
మనిషిలోని సత్యాన్వేషణ గుణం వ్యాపారబుద్ధిగా మారి సృష్టిలో అన్నిట్నీ వ్యాపార అవకాశాలుగా చూడటమే దీనికి మొదటి మెట్టు.
LikeLike
సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి.
ఉష్ణోగ్రతలు పెరగడం మొదలైనప్పుడూ అది … వార్నింగ్ సిగ్నలే. ఇవాళ global warming పేరుతో దాని మీద సదస్సులు, పుస్తకాలూ … నిర్వహించకూడదని కాదు, చేతులు కాలాక అన్న సామెత లాగా ఉంది. తిరిగి ఉష్ణోగ్రతలను తగ్గించడం ఎన్ని తరాలు పట్టే బృహత్కార్యం? వెర్రితలలు వేస్తున్న construction activity లో ఏభై అరవై యేళ్ళ వయసున్న చెట్లను కొట్టివేస్తుంటే అంతటి వృక్షాలు తిరిగి పెరగడానికి ఎన్నేళ్ళు కావాలో అని విచారం కలుగుతుంటుంది.
జనావాసాల్లోకి అడివిజంతువుల చొరబాటు ఎక్కువవడం … వార్నింగే. ఓ నరుడా, నువ్వు మా ఇళ్ళను పడగొట్టేస్తున్నావు, మా భూములను ఆక్రమించుకుంటున్నావు అంటున్నాయి.
వీటన్నింటికీ కారణాలు మనిషికి తెలియక కాదు. తెలిసీ రాజారావు గారన్నట్లు ఇతర జీవుల యునికిని మన్నించకపోవడం. మీరన్నట్లు ప్రతిదాన్నీ వ్యాపారం చేస్తున్న ఆబ. రాబోయే తరాల గురించి ఖాతరు లేకుండా … ఈరోజు నా అవసరం గడిచిపోతే చాలు, పర్యాపరణం నాశనమైపోతే నాకేమిటి నేను కోట్లు సంపాదించేసుకుంటే శ్రీరామరక్ష, రాబోయే తరాలా వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు నేను చూడొచ్చానా ఏమిటి … ఇటువంటి స్వార్థం హద్దులు దాటి పోతోంది. ఇది irreversible stage కు జేరుకుందని నాకు అనిపిస్తుంటుంది.
ప్రకృతితో సహజీవనం చెయ్యడం మన దేశంలోనే ఎక్కువగా జరిగేదనుకంంటాను (బహుశః ఆఫ్రికాలో కూడానేమో?) … ఈ వ్యాపారయావ అన్నింటినీ కబళించేటంత వరకు.
మంచి పోస్ట్ వ్రాశారు మీరు. మీరు తీసిన పై ఫొటోలు as usual👌. ముఖ్యంగా నిలబడి చూస్తున్నట్లున్న ఎండుటాకు👌. మీరు ‘లెన్స్ తిరిగిన’ Nature photographer కదా 🙂. రాజారావు గారి సందర్భోచిత పద్యం బాగుంది as usual 👋 .
LikeLike
//ప్రకృతితో సహజీవనం చెయ్యడం … //
ప్రకృతితో ఎంత మమేకమైనా ప్రతి జీవీ ప్రకృతిని irreversibleగా మోడిఫై చేస్తూనే ఉంటుందండి. వన్యజీవుల విషయంలో ఆ మార్పు చాలా నెమ్మదిగా, ప్రకృతి సహజమైన ప్రక్రియల ద్వారా జరిగితే, మనుషులు కృత్రిమంగా ఆ వేగాన్ని పెంచుతున్నారు. మొదటిదానిలో ప్రకృతిని జీవి అనుసరిస్తుంది, రెండోదాన్లో మనిషితో ప్రకృతి పరుగులు పెట్టాల్సి వస్తోంది.
LikeLike
ఎక్కితి బుకిట్ తిమా కొం
డెక్కితి పక్ష్యాదుల గని డెందంబలరెన్
మెక్కు డొనాల్డ్ ఫుడ్డును కపి
నక్కుచు తినురీతి గాంచి నలతయు కలిగెన్!
కొండ యెక్క నేల ! కోతి ని గాంచనేల! కోరి కల వర పడనేల 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారూ, థాంక్యూ ఫర్ ద థాట్-ప్రొవొకింగ్ లైన్స్ _//\_
//కొండ యెక్క నేల ! కోతి ని గాంచనేల! కోరి కల వర పడనేల //
ఏదో ట్రై చేసాను, బావుంటే “కంద”బద్ధీకరించండి 🙂
నేలపై కనరాని కోనేటిరాయని కాంచగా కొండలెక్కవలయు
కౌసలేయుని దలచి కడలి దాటిన రీతి తెలియగా కోతిని గాంచవలయు
కోరికలబడి కలవరపడుటేల?
కోరి, “కల”నుండి మేల్కాంచు వరమును పొందవలయు
LikeLike
కోరికల బడి యిదే! భా
యీ! రొప్పుచు బతుకనేల యీభువి లోనన్
కోరి కలవర పడకురా
కోరు కలను దాటి బతుక కొండల రాయన్!
జిలేబి
LikeLike
కోనేటి రాయుని గనన్
నేనెక్కితి కొండల గన నేత్రానందం
బై! నడువ, రామ, కోతుల
తో, నభసము దాట నీవె తోడని తెలిసెన్!
LikeLike
అలనాటి కోతులు ఆ కాలం నాటి జంక్ ఫుడ్ ఏదో తినే ఉంటాయి. కాబట్టే నరమానవులు నర రూప రాక్షసులు వారి వంశంలో ఉద్భవించారు. అవి మంచి ఆహారం తిని ఉంటే దేవతలో గంధర్వులో వెలిసేవారేమో. …….. మహా
LikeLike
సార్! బులునువారూ! నర మానవుల పుట్టుకే జంక్-ఫుడ్ వల్ల అంటారా? ఇదేదో సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే 🙂
LikeLike
Nice post and pictures as well YVR gaaru.
LikeLike
Thankyou, Pavan garu.
LikeLike
ఆ కొమ్మల మాటున బుల్బుల్ పిట్ట భలేగా వుంది.
జంక్ తింటున్న మంకీని చూసి పాపం! అనిపించింది.
LikeLike
లలితగారూ నెనరులు. ఈ సారి బుల్-బుల్ మీద పోస్ట్ పెడతాను. దాని పాట విని తీరాలి.
LikeLike