మనం ఏ హడావిడీ లేకుండా పౌర్ణమి అని పిలుచుకునే నిండు పున్నమికి అమేరికన్లు ముద్దుగా సూపర్-మూన్, బ్లడ్-మూన్,…లాంటి పేర్లు పెట్టారు. సూపర్ మూన్ పేరు బానే ఉంటుంది కానీ బ్లడ్-మూన్ అంటేనే ఒక రకంగా ఉంటుంది.
రక్త చంద్రుడు !! అని తెలుగులో అనుకుంటే రాంగోపాల్ వర్మ సినిమా టైటిల్లా వుండి ఎర్రటి ఆకాశం, అందులో గబ్బిలాలు ఎగురుతూ, మధ్యలో కాలు తెగి రక్తం కారుతున్న ఒంటరి ఒంటెలా …. అబ్బో !! తల్చుకుంటే కడుపులో దేవుతోంది.
తెలుగు మనసు ఆర్జీవీ-మార్క్ చంద్రుణ్ణి చూస్తే దూరంగా పారిపోతుంది. నిజానికి శ్రీశ్రీగారి –
ఒక రాత్రి :
గగనమంత నిండి, పొగలాగు క్రమ్మి-
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
ఆకాశపుటెడారి నంతటా, ఆకట !
ఈ రేయి రేగింది ఇసుక తూఫాను!
గాలిలో కనరాని గడుసు దయ్యాలు
భూదివముల మధ్య ఈదుతున్నాయి!
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము!
కరి కళేబరములా కదలదు కొండ !
ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి !
విశ్వమంతా నిండి , వెలిబూదివోలె –
భయపెట్టే బహుళ పంచమి జ్యోత్స్న అన్నా బెదిరిపోతుంది తెలుగ్గుండెకాయి.
ఆర్జీవీ-మార్కు బ్లడ్-మూన్లు, శ్రీశ్రీ మార్కు కాళ్ళు తెగిన ఒంటెలు తెలుగు ఒంటికి పడవు. మిట్ట మధ్యాన్నం పూట వెన్నెల కురిపించి అరవైయ్యేళ్ల పైగా లాహిరి లాహిరి అనిపించి, ఉయ్యాలలూగించిన మార్కస్ బార్ట్లే-మార్కు మాయాబజార్ చందమామకే మన వోటు.
అందుకే మొన్న 20న, 21న రాత్రి పదింటికి సూపర్ మూన్ ఫోటోలు తీద్దామని బైల్దేరినప్పుడు రక్తం, గబ్బిలం, కాళ్ళు తెగిన ఒంటె … ఇలాంటివేం గుర్తుకి రాలేదు.
నల్లటి మబ్బుల మధ్య ఎగురుతున్న తెల్లటి కొంగలా అనిపించాడు జాబిల్లి. అదుగో అలా –
నికాన్’వాడు P900 మోడల్లో మూన్-షాట్ అనిచెప్పి ఒక సెట్టింగ్ ఇచ్చాడు. అది పెట్టి తీస్తే ఇదుగో చందమామయ్యగారి నిజరూప దర్శనం ఇలా అయ్యింది.
అర్ధరాత్రి హత్య చేసి, మొహంమీద పడిన రక్తం తుడుచుకోకుండానే పారిపోతున్న ఆర్జీవీ చంద్రుడు, ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగి పడున్న ఒంటరి ఒంటెలాంటి శ్రీశ్రీ చంద్రుడు అయిపు లేరు.
ఓ రెండున్నర లక్షల మైళ్ళ దూరంలో ఆకాశంలో అడ్డంగా దొర్లుతున్న పుచ్చకాయలాంటి మరో లోకం కనిపించింది. తెల్లగా మెరుస్తున్న ప్రదేశాలన్నీ మిలమిల్లాడుతున్న నగరాల్లా, పుచ్చకాయ చారల్లా వున్న ఆ గీతలన్నీ విమాన మార్గాల్లా, నల్లటి ప్రాంతాలు చంద్రలోకపు సముద్రాల్లా కనిపిస్తూ మళ్ళీ మార్కస్-బార్ట్లే మాయాబజార్లోకి తీసుకెళ్లిపోయాయి.
చిన్నప్పుడు నండూరి రామ్మోహన్రావుగారి “విశ్వరూపం”లో చూసిన చందమామని నా స్వహస్తాలతో ఆకాశంలోంచి దింపినంత సంతోషం. ఆ సంతోషంలోంచి తేరుకుని భూలోకంలో – అంటే మా కాలవ్వొడ్డున – ఏం జరుగుతోందో చూద్దామని కెమెరా అటు తిప్పాను.
కొంగజాతి ఆకలి గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ మా కాలవ్వొడ్డున ప్రతీరోజూ కనిపించే ఈ బకశ్రేష్ఠుడు/శ్రేష్టురాలి ఆకలి మాత్రం అమోఘం. రాత్రీపగలూ తేడా లేకుండా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడూ ఉంది. కెమెరా ఫ్లాష్’కి బెదిరి కొంచెం దూరంగా వెళ్లి వాలింది.
నేల మీద ఈ నీటిపక్షిని చూస్తుంటే ఇప్పుడు చంద్రన్న** సుదూరాకాశంలో రెక్కలు లేకుండా ఎగురుతున్న పక్షిలా అనిపించాడు. (** చంద్రన్న అనగానే ప్రస్తుతం ఏ పార్టీతోనూ పొత్తులేని (?) ఆంధ్ర చంద్రన్నలా అనే అర్ధం ధ్వనిస్తోందేమో🤔… బాబోయ్! నాకసలా ఆలోచనే రాలేదండోయ్!😯🙏) ఆ అనిపించిన దానికి ఫలితంగా ఆ రోదసీపక్షిని, ఈ పుడమిపిట్టని అదుగో అలా కలపాలనిపించింది. కలిపా –
As the bird-celestial zooms above, the bird-terrestrial looms below అంటూ పెద్ద కాప్షన్ కూడా పెట్టా. (నా మిడి మిడి ఆంగ్ల పరిజ్ఞానానికి అదే ఎక్కువ.)
ఇంతకీ ఆ బకశ్రేష్ఠుడు / బకశ్రేష్ఠ యొక్క ఆంగ్లనామం Striated Heron. ఆసియాలో చాలా దేశాల్లో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఈ కొంగ ప్రమాదంలో పడిన జీవ జాతుల జాబితాలో ఇంకా చేరలేదు. ఏనిమల్ బిహేవియర్ మీద ఆసక్తి వున్న వారికి దీని బిహేవియర్ నిజంగా మెదడుకి మేతే. దాని గురించి వచ్చే వనవిహారంలో. బై4నౌ.
“Hinduism comes closest to being a nature religion. Rivers, rocks, trees, plants, animals, and birds all play their part, both in mythology and everyday worship. This harmony is most evident in remote places like this, and I hope it does not lose its unique character in the ruthless urban advance.”
మీలోనూ మార్కస్ బార్ట్లే ఛాయలున్నాయండి. చక్కటి ఫొటోలు 👌 …. ముఖ్యంగా రెండింటినీ జోడించిన ఫొటో.
bird-celestial, bird-terrestrial అంటూ బ్రహ్మాండంగా పదాలు coin చేసి, పైగా “మీది మిడి మిడి ఆంగ్ల పరిజ్ఞానం” అంటారేమిటి. నో. కానే కాదు.
అవునూ, తను వ్రాసిన context లో lose బదులు loose అనే తప్పు పదం నిజంగానే Ruskin Bond లాంటి రచయిత వాడాడా? ఆశ్చర్యం.
LikeLike
వీఎన్నార్ సర్! నెనరులు. నాది మిడిమిడి జ్ఞానమేనండి. ఇక్కడా అక్కడా విన్నవీ, చదివినవీ గుర్తొచ్చీ, గూగులించీ, ఆం.భా.లో గాలించీ పట్టు కొచ్చేవే bird-Celestialలాంటి మాటలు.
// loose // ఇది రస్కిన్ బాండ్ తప్పు కాదండి, స్వచ్ఛమైన అచ్చు తప్పే 😊
LikeLike
రక్త చంద్రుడు, ఈ పద ప్రయోగం అలాగే ఫోటోస్ బాగున్నాయ్ మేస్టారు
LikeLike
థాంక్యూ పవన్
LikeLike
అదిగో చంద్రుడు వైవి చేతి కెమెరా నందాయె చిత్రమ్ముగా
నిదిగో పాములనారిగాడు కలిసెన్ నింపాదిగాకైపుతో
పదిలంబవ్వగ హాయి గొల్పెను సుమా బ్లాగ్లోక బార్ట్లీ టపా
మదితూగంగ జిలేబియై కవనమై మత్తేభ పద్యమ్ముగా!
జిలేబి
LikeLike
జిలేబిగారు! పద్యం బహుబాగు 👌👌👌👌
ఈ పాములనారిగాడు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు అనే మాజీ ప్రధానిని పద్యంలోకెందుకు లాక్కొచ్చారా అనుకున్నా. తర్వాత తెలిసింది మీ చమత్కారం.
LikeLike
రాత్రిపూట పక్షులకు కళ్ళు కనిపించవు అంటారు కదా ? పుడమి పక్షినీ, రోదశీ పక్షినీ కలపడంలో మీ అంతర్యం అర్ధం అయింది కానీ చంద్రన్న కి ఏ పుడమి(క్షత్రియ)పుత్రుడి సాయమూ అవసరం పడ(కూడ)దని ఆశిస్తున్నాను. చంద్రన్న కష్టం కూడా వారి కళ్ళకు కనిపించడం లేదని నా ఉద్దేశ్యం !
LikeLike
//రాత్రిపూట పక్షులకు కళ్ళు కనిపించవు అంటారు కదా ?// పాపం ఏం చేస్తాయండి, హ్యూమన్ ఏక్టివిటీ / డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి అవీ మారుతున్నాయేమో !!
//చంద్రన్న కి ఏ పుడమి(క్షత్రియ)పుత్రుడి సాయమూ…//
మీరిలా అనుకుంటుంటే చంద్రన్నకి అనుకూలంగా గాలి(పవనం) తిరిగి జగం(న్) ఊగి తూగి బోల్తా పడుతుందని ఇంకొందరు ఆశిస్తున్నట్టుగా వుంది. చూద్దాం.
LikeLike
అదె ! చంద్రన్నను కొంగను
ముదముగ నొక చోటజూచి మురిసితిమి భలే !
కధలల్లు భావుకులు గద !
వ్యధ తప్పదు కొంగల కిక , ఆంధ్రా నందున్ .
LikeLike
ఏంటో మాస్టారూ, ఒక పక్క సూర్యుడి నుంచి పాకేజీ రాకుండా చంద్రన్న వెలగలేడు. ఇంకోపక్క కొంగ జపం చూస్తే దొంగజపమేమో అని సందేహాలు.
LikeLike
కొంగనయినా బజ్జోపెట్టేయవచ్చు కానీ సూర్యుడిని బజ్జోపెట్టలేం కదండీ…
ప్యాకేజీ ఇవ్వకా తప్పదు, (అమావాస్య తరువాత) చంద్రోదయం అవ్వకా తప్పదు.
LikeLike
👌👌👌👌😀
LikeLike
రెక్కరాయని కన్నులలో
రిక్కరాయని వెన్నెలలు !
LikeLiked by 1 person
లలితగారు,
రెక్కరాయుడి కళ్ళమెరుపు నేర్పుగ కనిపెట్టారు,
చక్కనైన ముక్కలతో హైకు బాగ కట్టారు
👏👏👏
LikeLike
మీ చిత్రాలు అద్భుతం !! నా canon లో చంద్రుడ్నిబంధించడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేసా కానీ ఎపుడు సఫలీకృతురాలిని కాలేదు. అందుకే కెమెరా పక్కన పెట్టి చూస్తూ ఆస్వాదించడమే చేస్తుంటాను.
LikeLike
థాంక్యూ చంద్రికగారు. నికాన్ DSLRలో నాకూ చంద్రన్న దొరకలేదు. P900లో మూన్-షాట్ సెట్టింగ్ వల్ల దొరికాడు 😀
LikeLike
The Big Bird Day అని జరుపుకుంటారట birdwatchers … ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో … మీకు తెలుసా? ఆ సందర్భంగా ఇవాళ్టి (ఫిబ్రవరి 5, 2010) Deccan Chronicle (Hyd) దినపత్రిక వారి supplement Hyderabad Chronicle రెండో పేజ్ లో Birding All The Way అని ఒక ఫొటో సహిత వ్యాసం వచ్చింది. మీకు ఆసక్తికరంగా ఉండచ్చు.
http://epaper.deccanchronicle.com/articledetailpage.aspx?id=12386002
LikeLike
పైన వ్రాసిన నా వ్యాఖ్యలో పేపర్ తేదీ ఫిబ్రవరి 5, 2019 గా చదువుకోగలరు.
LikeLike
వై.వి.ఆర్ గారు
నమస్తే
మీరు ముందుమాట రాసిన నా ఇ.బుక్ ఈ రోజు కినిగెలో లైవ్ చేయబడింది. ఈ కింది లింక్ లో చూడగలరు.
http://kinige.com/kbook.php?id=9287
ధన్యవాదాలతో
LikeLike
పదియవ పొత్తంబొచ్చెను
సదమలమగు యంతరంగ చక్కదనముగా,
అదిగో హస్తోదకమది
గదిగొ కరతలామలకము కష్టేఫలియై!
LikeLike
శ్రీజిలేభ్యోంన్నమః 🙏😊
LikeLike
గురువుగారు, నమస్సులు🙏
LikeLike
గురువుగారు నమస్సులు🙏
నా “ముందుమాట” చంద్రుడికి చూపిన దివిటీ మాత్రమేనండి.
సముద్రం దాటడానికి దూకిన హనుమంతుడి వేగానికి మహేంద్రగిరి పైనున్న చెట్లు, వాటి పూలు ఆయనతో పాటు కొంత దూరం ఎగిరి సముద్రంలో పడిపోతాయి. మీ జ్ఞానసుధా సాగరంలో పడిన నా అక్షరాలు మహా అయితే ఆ పూలలాంటివి. నాకీ అవకాశం కల్పించిన మీ వాత్సల్యం నాకు ఆశీర్వాదం. 🙏⚘🙏⚘🙏⚘
LikeLike