☝ అది జస్ట్ కాఫీ మూడ్‌లోకి వచ్చేందుకు,
ఇది👇 నేను ఫ్రెష్‌గా కలిపిన కాఫీ ఎంజాయ్ చెయ్యడానికీ 😎, go ahead !!
ఈ మధ్య వైకుంఠంలో స్వామివారితో బాతాఖానీ కొడుతూ కాఫీ పుచ్చుకుని చాలా రోజులు – రోజులు కాదు, ఒక ఏడాదిన్నర – అయింది. స్వామివారేమనుకుంటున్నారో, ఇప్పుడు కప్పు పట్టుకుని వెళ్తే, “ఏం ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా,” అంటారో అనీ, అంటే ఏం చెప్పాలో తెలీకా కొంచెం ఊగిసలాడినా , స్వామివారి దగ్గర మనకి మొహమాటం ఏంటీ? ఒకవేళ ఆయన చురకలేమన్నా అంటించినా నేను కొత్తగా కొనుక్కున్న ఫ్రెంచ్-ప్రెస్ ఫిల్టర్‌లో తీసిన డికాక్షన్నీ, పాలకడలి పాలనీ, ఆయన వేసిన చురకలతో వేడి చేసి, తీపికి కాసిని పోతనగారి పద్యాలో, రామదాసు కీర్తనలో కలిపి ఒక కప్పు కాఫీ స్వామివారి చేతికందిస్తే అంతా సద్దుకుంటుందని, ధైర్యం చేసి –
ఆలోచనల చుట్టలు చుట్టుకుని
అలజడుల పడగలతో బుసలు కొడుతూ
అం’తరంగా’లపై తేలియాడుతున్న
మనోశేషుడిపై కూర్చునో, పడుకునో వుండే స్వామివారి వైపుకి దారి తీశాను. లాస్టియర్ బ్రెజిల్లో కొనుక్కున్న రెండు బుల్లి కాఫీ కప్పుల్తో సహా.
నేను వెళ్ళేప్పటికి స్వామివారి పాదాల దగ్గర రెండు చేతులూ జోడించి కళ్ళలో ఆనందభాష్పాలు నిండి ఆయన్నే చూస్తూ హనుమంతులవారున్నారు. స్వామివారు ఒక చేత్తో హనుమ వీపు నిమురుతున్నారు.
నా రాక చూసి స్వామి , ” ఏమిరా! నా అడ్రెస్ మర్చిపోయినట్టున్నావ్?,” అన్నారు. అఫ్కోర్స్ నవ్వుతూనే. “అమ్మయ్య! స్వామికి కోపమేం లేదనమాట, హస్కు మొదలెట్టచ్చు,” అనుకున్నా. మాట కలుపుతూ, “స్వామీ! హనుమంతులవారున్నారని తెలీక రెండు కప్పులే తెచ్చాను. ఇంకో కప్పు … , పోనీలెండి మీరిద్దరూ కాఫీ తాగాక నేను….,” అంటుండగా హనుమ నావైపు కళ్ళు చికిలించి చూశాడు. నా నోరు మూతపడింది. హనుమ, “రామయ్యా! వీడెవడయ్యా? పానకంలో పుడకలాగా? కాఫీ ఏంటి? తాగడమేంటి?,” అన్నాడు.
“వీడొకరకం భక్తుడు హనుమా! నవవిధభక్తిమార్గాల్లో ఏదీ వీడికి సూటవ్వదు. అందుకే కాఫీత్వం అని పదోరకం భక్తి మార్గాన్ని ఫాలో అవుతున్నాడు”
“అసలు కాఫీ అంటే ఏమిటి స్వామీ!” హనుమ అడిగాడు.
స్వామి జవాబిచ్చేలోపు నేనందుకుని,”కపీశ్వరా ! కాఫీ గురించి తెలియాలంటే భూలోకంలో కాఫీ గురించి వున్న ఒక సూక్తి వినండి. అది – Coffee is to the body what the Word of the Lord is to the soul – మీ భాషలో చెప్పాలంటే మీకు రాములవారి గొంతు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో మా నరులకి కలియుగంలో కాఫీ ఫ్లేవర్ తగిలినా, కాఫీ చుక్క నాలిక మీద పడినా అలా వుంటుందన్నమాట,” అన్చెప్పి నా తెలివికి నేనే మురిసిపోబోతుండగా, రామబంటు , “మూర్ఖుడా! కృతయుగం నుంచీ కలియుగం వరకూ ఆల్ టైమ్ ఫేవరిట్ రామనామం ఒక్కటే. సోమరసం కంటే రామరసం గొప్పదని దేవతలు కూడా చెప్తుంటే ఇదేదో కాఫీచుక్క, కాఫీ కిక్కు అంటూ కారుకూతలు కూస్తున్నావా? ఎందుకో స్వామివారు నిన్ను ఉపేక్షిస్తున్నారు కనక వదిలేస్తున్నా! లేకపోతేనా ….!!” అంటూ గుడ్లురిమాడు. హడిలిపోయాను. వెంటనే చేతులో వున్న రెండు కప్పుల్లో నాలుగు చెంచాల పాల సముద్రము, 16 చెంచాల కాఫీరసమూ కలిపి హనుమ కళ్ళ ముందుంచాను. “పిబరే రామరసం, రస..నే, పిబరే రామరసం …” అంటూ కీర్తన అందుకున్నా. మనసులో మాత్రం స్వామివారి వైపు తిరిగి, “నీ వ్యూహాత్మక మౌనం వీడి హనుమని శాంతింపచెయ్యి స్వామీ!” అని ప్రార్ధించ సాగాను. హనుమ చూపులకి కాఫీ మరిగి కమ్మటి కాఫీ ఆవిరులు భగవంతుణ్ణీ, నాలోని భక్తుణ్ణీ అనుసంధానం చెయ్యడం మొదలెట్టాయి. ఓరకంట హనుమంతులవార్ని చూశా. లవకుశలో లవకుశుల మీద కోపం వచ్చి యుద్ధానికి దిగినా “రామ సుగుణధామా ..” పాటతో చల్లబడినట్టు హనుమంతులవారు ఇప్పుడూ చల్లబడుతున్నారు. అది కాఫీ ఫ్లేవర్ వలన కాదు సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన వలన అని తెలుసుకోలేనంత మూఢత్వం లేదు కనక పాట పూర్తి చేసి కిక్కురుమనకుండా కూచున్నా. ఇంతలో స్వామివారు ఓ కప్పు చేతిలోకి తీసుకున్నారు. “హనుమని ఇబ్బంది పెట్టద్దు, ఆ రెండో కప్పు నువ్వు తీసుకో,” అన్నారు స్వామి.
“హనుమా! భూమ్మీద కాఫీ గురించి “No one can understand the truth until he drinks of coffee’s frothy goodness” అనే సూక్తి కూడా ప్రచారంలో వుంది. కలియుగంలో కలిగే రకరకాల కన్ఫ్యూజన్లనించి బయటపడడానికి వీడిలాంటివాళ్ళు కప్పు కాఫీ కలుపుకుని, దాని రుచికీ , సువాసనకీ మనసుకాస్త స్థిమితపడి నిదానంగా ఆలోచిస్తారు. కలియుగ-కన్ఫ్యూజన్లోంచి బయటపడినా, పడకపోయినా కనీసం అది ఎందుకొచ్చిందో అర్ధం చేసుకుంటారు. నరులు truth తెలుసుకోవాలనుకోవడం, తెలుసుకోవడం, దానికి కట్టుబడి బతకడం ఇవే కదా నేను వాళ్ళ నుంచి ఆశించేది. అంచేత మనమే కాస్త అర్ధం చేసుకోవాలి. ఓ కప్పు కాఫీ తీసుకుంటూ ఓ పది నిముషాలు నిదానంగా కూచుని చుట్టూ జరిగేది రేషనలైజ్ చేసుకోడం మనిషికి అలవాటైతే వాడు అనేక అనవసర కన్ఫ్యూజన్స్లోంచి బయటపడొచ్చూ అని కాఫీత్వ సిద్ధాంతం,” అన్నారు స్వామి.
“ఏంటి స్వామీ, ఆ కన్ఫ్యూజన్లు? తాటకిని, వాలిని చంపే ముందు మీకొచ్చిన కన్ఫ్యూజన్కంటే, లంకలో సీతమ్మని వెతుకుతూ నేను పడ్డ కన్ఫ్యూజన్లకంటే, అగ్నిపరీక్షప్పుడు మేమంతా పడిన కన్ఫ్యూజన్కంటే పెద్దవా?,” ఆంజనేయులవారి అమాయక ప్రశ్న.
“పిచ్చి స్వామీ! ఇప్పుడా టైపు కన్ఫ్యూజన్లు పెట్టుకునేవాళ్ళెక్కడున్నారు? భూలోకానికెళ్ళావంటే నీ గురించి నిన్నే కన్ఫ్యూజన్లో ముంచేస్తారు,” అనుకున్నా. పైకి అన్లేదు.
అనాలా? అంతరంగశాయికి తెలీదా?
ఇంతలో సర్వాంతర్యామి చేతుల్లో మాయాబజార్ సినిమాలో వాడిన ప్రియదర్శిని ప్రత్యక్షం అయింది. అది తెరిచి హనుమ ముందుంచి, “హనుమా! నీ గురించి భూలోకంలో ఇప్పుడు ఏం వివాదం జరుగుతోందో చూస్తావా ?,” అన్నారు. తోకరాయుడి తోక నిటారుగా నిలబడింది. “నా గురించా? చర్చా? నా చుట్టూ ప్రదక్షిణాలూ, దీక్షలు, చాలీసా పారాయణాలూ కాకుండా వివాదాలు కూడానా!?!,” అనే ఆశ్చర్యం, ఆందోళనా ఆ తోకలో కనిపిస్తున్నాయి. ఇంతలో ప్రియదర్శినిలో ఒక టీవీ ఛానెల్ డిబేట్ మొదలైంది. ఇద్దరు ఛోటా లీడర్లూ, ఒక పండితుడూ, రెండు మతాలకి చెందిన పెద్దలూ, ఒక హేతువాది, ఒక యానిమల్-రైట్స్ అసోసియేషన్ ప్రతినిధి … ఇలా చాలామంది వున్నారు. అందరూ గందరగోళంగా అరుచుకుంటున్నారు. యాంకర్ కి చర్చ జరపడం కంటే వాళ్ళ రణగొణ ధ్వని ఆపడమే పెద్దపనిగా వుంది. హనుమయ్య కళ్ళు చిట్లించి, చెవులు రిక్కించి, తోక నిలబెట్టి జరిగేది చూస్తున్నాడు.
సీన్ ఇక్కడ కట్ చేద్దాం.
………………. ……………………. ……………… ……………….. ……………………..
అరగంట తర్వాత రామభక్త హనుమాన్ ప్రియదర్శిని మూసేసి స్వామి వైపు చూశాడు. “ఏంటి స్వామీ! ఇదంతా? ఈ చర్చతో పోలిస్తే నేను లంకలో రాక్షసులందరి మధ్యా రావణుడితో చేసిన చర్చ చాలా ప్రశాంతంగా నడిచినట్టు లెక్క. అదలా వుంచండి, వీళ్లంతా రామాయణం చదవరా, లేకపోతే అర్ధం చేసుకోరా స్వామీ? ఒకడు నన్ను బడుగుజాతి వాడంటాడు, ఒకడు నేను ఉట్టి కోతినంటాడు, ఇంకోడేమో క్షత్రియుణ్ణంటాడు, మరొకడు దేవుణ్ణంటాడు, ఒకళ్ళయితే హనుమంతుడు హిందువు కాదంటాడు, ఆ తరవాత వాడు “ఏంటండీ దేవుళ్ళూ, అవతారాలూ ఇదంతా? అంతా నాన్సెన్సండీ,” అంటాడు. ఆ పండితుడేమో ఎవరికీ సరిగ్గా చెప్పలేక ఏవో చిలవలూ, పలవలూ, ప్రక్షిప్తాలూ, నిక్షిప్తాలూ.. చెప్తున్నాడు. అసలీ కులాలూ, మతాలూ ఇవన్నీ ఏంటీ? కన్ఫ్యూజనంటే ఈ గందరగోళమేనా?,” అన్నాడు.
స్వామివారు నవ్వి, “Hanuma! Let’s discuss that over our next cup of coffee☝,” అన్నారు. అని నా వైపు తిరిగారు. “సరే స్వామీ, బై4నౌ, వచ్ఛే టపాకి మూడు కప్పులు తీసుకొస్తా,” అంటూ అం’తరంగా’ల్లోంచి ఈదుకుంటూ బాహ్యప్రపంచంలోకి వచ్చేశా🤗.
😃🙏Stay tuned & join me for the next ☕😃
మొత్తానికి రాములవారికి కాఫీ మప్పి, రామబంటును కూడా కాఫీ ముగ్గులోకి భలే దింపారు. తరువాత సంచికలో కాఫీ కోసం అమ్మవారు వస్తారేమో చూడండి.
LikeLike
అమ్మవారొస్తే మొహమాటం లేకుండా ఆవిడ చేతి కాఫీ తాగాలనుందని చెప్పెయ్యడమేనండి, అన్యగామి గారూ!😊
LikeLike
ఈ కాఫీత్వంలోని మొదటి భాగం గతంలో ఒకసారి వ్రాసినట్లున్నారేమో ఫొటోలతో సహా 🤔 ?
ఇక రెండవ భాగంలోని సారాంశం “పని లేని …. “ సామెతకు ఉదాహరణ అనిపిస్తుంది (అంటే … మీ టపా గురించి కాదండోయ్. తీరికూర్చుని ఇటువంటి అర్థంపర్థం లేని వివాదాలు లేవనెత్తేవారి గురించన్నమాట)
LikeLike
VNR sir, భలే గుర్తుపట్టారే, దాదాపు రెండేళ్ళయింది ఆ పోస్టు పెట్టి.
//”పనిలేని …. ” సామెత//
పార్ట్ -2లో దాని గురించండి.
LikeLike
“అన్యగామి” గారి అంచనా కరక్టే. YVR గారి ఫిల్టర్ కాఫీ అమ్మగారికి కూడా నచ్చే అవకాశాలు బోలెడు. వచ్చేసారి నుండీ YVR గారు నాలుగు కప్పులు పట్టుకెళ్ళవలసుంటుంది 🙂.
రాముడు ఏకపత్నీవ్రతుడు కాబట్టి సరిపోయింది. ఇదే కాఫీగోష్ఠి కృష్ణుడి దగ్గర గనక అయితే YVR గారు ఎన్ని కప్పులు, ఎంత పెద్ద ఫ్లాస్క్ పట్టుకుని తిరగాల్సివచ్చేదో కదా 😀 😀!
ఏమైనా సమకాలీన విషయాలు జోడించి ఇటువంటి వినూత్న టపాలు వ్రాయడం YVR కే చెల్లింది 👌.
LikeLike
VNR sir, ఈ “కాఫీ”లు మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది.
మీరిచ్చిన ఐడియాలు రాబోయే కాఫీలకి వాడుకుంటాను, మీరు OK అంటే.😊
LikeLike
Of course OK OK 👍. అయితే మీరు ఆశ్రమం / కాఫీద్వారం (మోక్షద్వారం అన్నమాట) పెడితే గనక నేనే దానికి మేనేజర్ని ☝️🙂.
(అయినా నేనెక్కడ ఐడియాలు ఇచ్చాను 🤔🤔?)
LikeLike
ఆశ్రమాలు పెట్టే
ఆ శ్రమ పడలేనండీ
సూక్ష్మంలో మోక్షంగా
కప్పు కాఫీ చాలండీ
😊☕😊☕😊
LikeLike
// “యాంకర్ కి చర్చ జరపడం కంటే వాళ్ళ రణగొణ ధ్వని ఆపడమే పెద్దపనిగా వుంది.” //
🤔🤔 ??
ఎన్న, సారువాడూ? అటువంటి ప్రయత్నం చేసిన యాంకరుడిని నేనయితే చూడలేదు (అఫ్కోర్స్, ఈ టీవీ చర్చల కార్యక్రమాలకు నేను ఆమడ దూరంలో ఉంటాను … రిమోట్ సహాయంతో. తరువాత తరువాత ఆ చర్చల సమయానికి ఆ ఛానెళ్ళు ఆన్ చెయ్యడమే మానేశాను). ఆపే ప్రయత్నం ఎందుకు చెయ్యరు అని సీనియర్ జర్నలిస్ట్, టీవీ చర్చల ప్రముఖుడు, బ్లాగరూ అయిన భండారు శ్రీనివాసరావు గారిని ఒకసారి అడిగాను. ఆపడం కష్టమండీ అని వారి సమాధానం 🙁. అసలు సంగతి టీయార్పీల యావేమో అనిపిస్తుంది.
LikeLike