ఒకళ్ళు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్; ఇంకొకరు ఎ కింగ్ హూ మేడ్ టైమ్స్ గుడ్ ఫర్ పీపుల్.
ఇద్దరూ లకుముకిపిట్టకి తమదైన శైలిలో పేరు తెచ్చినవాళ్ళే.
ఈపాటికి ఇదంతా ఎవర్ని గురించో మీకర్ధం అయ్యుంటుంది. కనీసం మొదటి కింగ్, లకుముకిపిట్ట పేరు మీద ఒక ఎయిర్-లైన్స్, ఒక బీరు బ్రాండూ పెట్టిన పెద్దమనిషే అని తెలిసిపోయుంటుంది. లకుముకిపిట్టలకి తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం వుందో మనకి తెలీదుగానీ, ఒకవేళ కాస్త సాహిత్యస్పర్శ వుండి, ఆ స్పర్శ లకుముకిపిట్ట చేత దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి చాటుపద్య రత్నాకరం చదివించి వుంటే, దానికి తప్పకుండా –
“ఆడిన మాటకుఁ దప్పెను
గాడిదకొడు” కంచుఁ దిట్టఁగా విని “యయ్యో
వీఁడా నా కొక కొడు” కని
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!
అనే పద్యం గుర్తొచ్చి అది కూడా తెగ ఫీలై పోయుంటుంది. (కానీ గాడిదలూ, లకుముకిపిట్టలూ కూడా తెలుగు చదువుకునే, మాట్లాడే పరిస్థితే వుంటే తెలుగుని రక్షించండోయ్ బాబోయ్ అంటూ తెలుగువాళ్ళు ఏడిచే పరిస్థితి ఎందుకొస్తుందీ? రాదు కదా! అది వేరే విషయం).
కింగ్-ఫిషర్‌కి మంచి పేరు తెచ్చిన రాజుగారెవరో కూడా తెలిసిపోయుంటుంది, టపా టైటిల్ చూడగానే. రాయలవార్ని తల్చుకోగానే సమరాన, సాహితీ సమరానా మడమ తిప్పని మహావీరుడు గుర్తొచ్చి తెలుగుండెలు (=తెలుగుగుండెలు) ఉప్పొంగడం వింతేం కాదు. కానీ ఒకవంక ఉర్రూతలూచు కవనాలతో, ఒక వంక వురికించు యుద్ధ భేరీలతో బిజీ బిజీగా వుండే ఆంధ్రభోజుడి ప్రకృతి పరిశీలనా శక్తీ, ఆ ప్రకృతిని లక్ష్మికి ప్రతిరూపంగా చూసిన ఆయన ఆధ్యాత్మిక దృష్టీ రెండూ అద్భుతం అనిపించేలా వ్రాసిన కొన్ని పద్యాలు – గరికపాటివారి ఆముక్తమాల్యద ప్రసంగంలో విని, ఆయన చెప్పిన ఈ పుస్తకంలో https://ia902708.us.archive.org/18/items/AmuktaMalyada_988/Amuktamalyada_Part01.pdf చూసి తెలుసుకున్నాను – చదివితే ప్రకృతి ప్రేమికుల గుండెలు తెలుగులో ఉప్పొంగడం గారంటీ.
లకుముకిపిట్టలని వర్ణించిన తీరు ఒక విశేషమైతే, అవి గ్రామాల్లో వుండే బావుల్లో, అదీ వీధిబావుల్లో, చేపల్ని వేటాడుతూ వుంటాయని చెప్పడంలో ఆనాటి ప్రజలు ప్రకృతికి ఎంత దగ్గరగా వుండేవారో తెలుస్తుంది. లక్ష్మీదేవి చేతిలో బంతితో లకుముకిని పోల్చడంతో ఆయన సహజ ప్రకృతికి ఇచ్చిన విలువ ఏమిటో తెలుస్తోంది. లక్ష్మి కరముల నుంచి వస్తున్నది కాబట్టి లకుముకి అయిందేమో అసలు. (లంబోదర లకుమికరా..లో లకుమికరా అంటే లక్ష్మిని ప్రసాదించేవాడు అని అర్ధం(ట). దాన్నే కొంచెం నాకు కావలసినట్టు అర్ధం చేసేసుకున్నా, ఇలా –
లక్ష్మికర పక్షి >>> లకుమికర పిట్ట >>> లకుముకి పిట్ట
వై నాట్?
ఇంతకీ లకుముకిపిట్టల్లో ఓ వంద రకాలుండగా రాయలవారి పద్యంలో అందంగా బందీ అయిన లకుముకి ఏ రకం అయ్యుంటుంది?
నా ఊహ ఈ 👇బుల్లి పిట్ట అని. ఎందుకంటే చాలా రకాలు కేవలం చేపల మీదే కాక కీటకాలు, ఇతర చిన్నజీవులని కూడా వేటాడి బతుకుతాయి. ఇది మాత్రం ఎప్పుడూ నీళ్ళు ఉన్నచోటే కొమ్మల మీదా, బండల మీదా, ఒక్కోసారి నీళ్ళలో ఉన్న చేపని చూస్తూ గాల్లో వున్నచోటే కదలకుండా ఎగురుతూ (hovering) కనిపిస్తుంది.
మా యింటికి దగ్గర్లో ప్రవహించే పాంగ్-సువా కెనాల్ చుట్టుపక్కల అలా 👆 కనిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా వర్షాలు పడి కాలవ నిండుగా ప్రవహిస్తున్నప్పుడు. అయితే, అది చేపని పట్టేందుకు నీళ్ళ లోపలికి దూకి చేపతో పైకి రావటం ఇంతవరకూ చూడలేకపోయాను. ఆ అదృష్టం ఎప్పటికో!!
ఆంధ్రభోజుడి / తెలుగు వల్లభుడి పద్యంలో – తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటైన కావ్యంలో చోటు దక్కించుకున్న ఈ పిట్ట పక్షిలోకానికి, తెలుగుభాషాప్రియులకి, తెలుగు ప్రకృతిప్రేమికులకీ సెలబ్రిటీయే!! ఇంతకీ మన సెలబ్రిటీ విల్‌ఫుల్ డిఫాల్టర్ తన ఎయిర్‌లైన్స్‌కి , బీరుకి లోగోగా వాడుకున్న కింగ్‌ఫిషర్ కూడా ఇదే. బీర్ కింగ్ తెచ్చిన తలవంపులు, రాయలవారిచ్చిన సెలబ్రిటీ స్టేటస్తోనైనా ఈ లకుముకి మర్చిపోగల్గుతుందని ఆశిద్దాం.
ఈ దేశంలో కనపడే దగ్గర దగ్గర పది రకాల లకుముకుల్లో నాకిప్పటి వరకూ నాలుగే కనిపించాయి. వాటిలో ఇది మూడోది. నాలుగో దాన్ని కిందటి పోస్టులో చూపించాను. ఒకటి, రెండు రాబోయే వనవిహారాల్లో.
బై4నౌ
🐾🌵🐋💦🌦🐢🐞🍁🍄🌾
ఆముక్తమాల్యద నాటిది.
ఆ ముక్త మాల్య దగా నేటిది 🙂
రాయల వారి పదమ్ముల
పాయలు పాయలుగ పాంగ్సువా తీరమునన్
ఛాయాచిత్రంబుగ వై
వీయారుని లకుముకులివి వీక్షింపుడయా 🙂
జిలేబి
LikeLike
జిలేబిగారూ, ఈ పద్యం చదువుకోడానికైనా మాల్యా తెలుగు నేర్చుకోవాలండీ !
అబ్బాయిగారి పన్నూడేలా వేసేశారు పన్!!
😆😆😆 !
LikeLike
తెలుగు తెలిసిన తన కేలెండర్ గర్ల్ ఎవరన్నా ఉంటే ఆ అమ్మాయితో చెప్పించుకుంటాడు 😀. అసలు “జిలేబి” గారే కన్నడ భాషతో పరిచయం ఉన్నవారు కదా … తనే అనువదించేస్తే పోలా 👍?
ఎస్, పన్ మాత్రం అద్భుతం 👌. “జిలేబి” గారా, మజాకా 🙂?
LikeLike
@ జిలేబిగారు
తోటి కన్నడిగుడు చేసిన నిర్వాకానికి లకుముకిపిట్టతో పాటు తనూ తలపట్టుకుంటాడేమో కన్నడ రాజ్య రమా రమణుడు.
ఆముక్త మాల్యద ని ఆ-ముక్త-మాల్య-దగా (willful defaulter-at-large) గా మలిచిన మీ మాటలగారడీని సరసుడు, రసజ్ఞుడు ఐన ఆంధ్రభోజుడు, తప్పక ఆస్వాదించి ఆశీర్వదిస్తాడు.
👏👏👏👏👏👏👏
LikeLike
మీరు విడమర్చి చెప్పకపోయిఉంటే, నేను జిలేబి గారి పద్యాన్ని మరో పది సార్లు చదివే వాడిని. మొదటి రెండు ముక్కల్లోనే ఆవిడ తేల్చేశారు. జిలేబి గారి మాట అంటే మాటలా?
LikeLike
ఎవరినైనా విమర్శించదలుచుకుంటే వారి గురించి పూర్తిగా తెలుసుకునో, చట్టం గురించి తెలుసుకునో లేక ఆర్ధిక అంశాలగురించి తెలుసుకునో విమర్శించాలి. గొడ్డొచ్చి చేలో పడ్డట్టు సామాజిక మాధ్యమాలు లేదా రాజకీయ నాయకుల ఆరోపణ కారణంగా దోషిగా నిర్ణయించేయడం,ఓట్లకోసం ఉద్ధరించేస్తాం అని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారులు, 5 సంవత్సరాలు గడిచినా మాల్యాని తీసుకురాకుండా ఏ ఆ ముక్త మాల్య దగా చేస్తున్నారో ? అని ఆలోచించరా వై వీ ఆర్ గారూ ?
LikeLike
భలేవారండీ నీహారిగ్గారూ!! మీరన్నవన్నీ తెల్సిపోతే ఇంక వోట్లెయ్యడానికి, వోటు బాంకులకీ సామాన్యులనేవాళ్ళు మిగుల్తారా? ఛానళ్ళకీ, మేధావులకీ బిగినెస్సుంటుందా?సారా పాకెట్లకీ, బిర్యానీ పొట్లాలకీ గిరాకీ వుంటుందా? విగ్రహాల ఇండస్ట్రీలు, తాంత్రిక పూజలూ, యాగాలూ,… అన్నీ ఖాయిలా పడిపోవూ? ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినిపోదూ? అర్ధం చేసుకోరూ 😆😆😆!!!
LikeLike
లకుముకి పిట్ట కాడ మొదలై , కథ రాయల మాల్యదాంతర
ప్రకటిత పద్యమున్ దవిలి , బాపురె ! మాల్య ‘దగా’ పరీతమై ,
తికమక పెట్టి , భాజపను దిట్టి , ప్రతిష్టల కెక్కె పోష్టు – సా
రు ! కనుడు , వైవియారు ! బహు రూప విచిత్రము మీ చమత్కృతుల్ .
LikeLike
మాస్టారూ! ఒక్క పద్యంతో ఎంతందంగా సమీక్షించారు!! నమోన్నమః
🙏🙏🙏🙏🙏
LikeLike