నల్లటి తారు రోడ్డు. రెండు పక్కలా అశోకుడు నాటించిన చెట్లు. రోడ్డు మధ్యలో….


నా ఫేవరిట్ ఇంగ్లీషు నవల ఒకటుంది. అది, ‘ది ఫోర్త్ ప్రోటోకాల్’ అని ఫ్రెడరిక్ ఫోర్సిత్ రాసినది. అది మొదలవ్వడం ఒక దొంగతనంతో మొదలౌతుంది. బ్రిటిష్ గవర్నమెంట్లో సెక్రెటరీ లెవెల్లో పంజేస్తున్న ఒక ఘరానా పెద్దమనిషి ఇంట్లో వజ్రాలు దొంగిలిస్తూ వాటితోపాటు పొరపాటున కొన్ని రహస్య పత్రాలు కూడా తీసుకొచ్చేస్తాడు . తీసుకొచ్చినవాడు వాటిని ఎక్కడో పారెయ్యక తీరిగ్గా కూచుని క్షుణ్ణంగా చదువుతాడు. సదరు సెగెట్రీగారు దేశరక్షణ రహస్యాలన్నీ అమ్మేస్తున్నాడని అర్ధం చేసుకుంటాడు. ఇక్కడి వరకూ వచ్చాక ఫ్రెడరిక్ ఫార్సిత్ ఒక గొప్పసత్యాన్ని ‘ప్రవచి’స్తాడు. ఈ వజ్రాలదొంగ అవ్వడానికి దొంగే కావచ్చు కానీ అతను మనసా వాచా కర్మణా అసలు సిసలు బ్రిటిషు జెంటిల్మన్ అని. అలా అన్నందుకైనా ఆ మాట నిలబెట్టాలి అన్నట్టు దొంగగారు ఆ పత్రాలని బ్రిటిష్ గూఢచర్య సంస్థ MI6కో, స్కాట్లాండ్ యార్డుకో పంపించేసి తన దేశభక్తిని మనకి ప్రకటించి, దేశం పట్ల తన బాధ్యతని నిర్వర్తిస్తాడు. దొంగతనం మామూలుగా నేరమే అయినా దేశభక్తి చూపించడానికి అది ఏ మాత్రం అడ్డం రాదని నిరూపించే ఇలాంటి ‘మహత్తర సన్నివేశాలు’ మన దేశంలో ఎన్ని వేలు వందలు జరుగుతూ వుంటాయోననిపించే ఒక వాట్సప్ వార్త ఇవాళొకటి అందింది. బ్రిటిష్ దొంగ మహాశయుడు గుర్తొచ్చాడు. ఎంతమంది ఎన్ని
ఫార్వర్డ్లు చేస్తే నా దగ్గరకొచ్చిందో గానీ ఆ ఫోటో చూస్తే నిజంగా ముచ్చటేసేసింది. నల్లటి తారు రోడ్డు. రెండు పక్కలా అశోకుడు నాటించిన చెట్లు. రోడ్డు మధ్యలో పక్క పక్కనే పార్క్ చేసి ఒక ఎర్ర కారు, ఒక బైకూ. ఆ రెండిట్నీ పార్క్ చేసినవాళ్ళది దేశభక్తో , మనిషి క్రియేటివిటీ పట్ల ఆరాధనా భావమో కానీ ఫోటోలో ఆల్రెడీ నిండిపోయిన ‘దేశభక్తి’కి చాలా క్రియేటివ్-గా అందాన్ని , నిండుదనాన్ని తీసుకొచ్చారు. వాళ్ళకింత ‘కలాపోసన ‘ కలిగించిన ఆ ‘సృజనాత్మకశక్తి’ ఆ రోడ్డేసిన కాంట్రాక్టర్-దే అని ఫోటో చూసిన ఏ భారతీయుడికైనా నమ్మకం కలిగి తీరుతుంది. ఫోటోకి ఫోర్-గ్రౌండ్ లో వున్న వాన నీటి మడుగుని చూస్తే. అసలా కారూ, బైకు ఓనర్లిద్దర్నీ ఆపి, ఫోటో తీయించేలా చేసింది ఆ సృజనాత్మకతే. ఫోటోని స్ట్రెయిట్ గా పోస్టులో పెట్టడం ఎందుకులే అని ఏదో చేతైనట్టు బొమ్మ గీశా. అచ్చు భారద్దేశంలా కనిపించే గొయ్యి పడేట్టుగా అంత నాణ్యత తో రోడ్డు వేసిన ఆ కాంట్రాక్టర్ ది అవినీతి అని కానీ, అలాంటి రోడ్డు వెయ్యనిచ్చిన అధికారవర్యులది అక్రమం అని కానీ అస్సలనిపించదు. అవినీతిని ఇంత అందంగా ప్రెజెంట్ చెయ్యచ్చని కూడా అనిపించదు. ఒక వేళ అనిపించినా అవినీతిలోనూ దేశభక్తిని రంగరించిన ఆ మహానుభావుడి /లకి మనసులోనే జోహార్లు చెప్పకుండా ఉండడం కష్టం. నేనూ అలా జోహార్లర్పించి అవినీతిలోనూ దేశభక్తి ఉంటుందన్నమాట అనో కామెంట్ పడేసి ఊరుకున్నా. అదుగో అదీ👇 ఆ సన్నివేశం –

మీరు ఆల్రెడీ వాట్సప్ లో అందుకునే వుంటారు లేదా త్వరలో అందుకుంటారు. ఇంతేసంగతులు. బై4నౌ 😉🤣.

🌻🌹🎶🐒🎶🌹🌻