“నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్😍, కొందరు స్వాములు కాస్తా మంత్రులైతే నవ్వుకున్నాడోయ్..డోయ్..డోయ్😂” + రాములవారికి Belated🌹HappyBirthDay🌹Message


“నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్ కొందరు మంత్రులు మారాజులైతే నొచ్చుకున్నాడోయ్,” అంటూ ఏఎన్నార్ చేత పాడించారు బాపు రమణలు, అందాలరాముడు సినిమాలో. ఆ సినిమా అప్పుడెప్పుడో సెవెంటీస్‌లో వచ్చింది. అంటే కలియుగం మొదట్లో ఎప్పుడో అనుకోవచ్చు. ప్రస్తుతం కలియుగం ముదిరింది. స్వామీజీలు మంత్రులైపోయే కాలం. సర్వసంగపరిత్యాగి అయిన స్వామిని చక్రవర్తితో సమానంగా చూసే కల్చర్ మనది. అందుకే పీఠాధిపతుల సేవకై ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు మొదలైనవి వుంటాయట. ప్రవచనాల్లో విన్నా. మరి చక్రవర్తి సమానుడికి మంత్రి హోదా ఇవ్వడం అంటే అది ప్రమోషనా? డిమోషనా? ఏమో!!! హోదా తీసుకున్న స్వాములకి, ఇచ్చిన ప్ర’భూ’స్వాములకే తెలియాలి. రాములవారు మాత్రం పై పాటకి “కొందరు స్వాములు కాస్తా మంత్రులైతే నవ్వుకున్నాడోయ్..డోయ్..డోయ్..డోయ్..” అని ఇంకో లైను కలుపుకుంటాడు.

ఆఁ! అన్నట్టు రాములవారిని తలచుకోగానే గుర్తొచ్చింది. రామనవమికి రాములవారికి గ్రీటింగ్ టపా వెయ్యలేదని. మనం మోడర్న్‌గా బిలేటెడ్ గ్రీటింగ్స్ పెట్టినట్టు రాముడికీ బిలేటెడ్ హాపీ బర్త్ డే చెప్తే ఎలా వుంటుంది? అని బ్రహ్మాండమైన ఐడియా ఒకటి తట్టింది. తట్టీతట్టగానే అదృశ్యహస్తం ఒకటి నెత్తిన మొట్టింది. ఆ మొట్టికాయతో పుట్టిన శబ్దంలో, “ఆదిమధ్యాంతరహితుడికి బర్త్ డే ఏంటి? దానికి బిలేటెడ్ గ్రీటింగ్స్ ఏంటి? అది సిద్ధాంతులు, జ్యోతిష్కులు, రాష్ట్రప్రభుత్వాలు కిందామీదాపడాల్సిన టాపిక్. నీలాంటి సామాన్యుడికి మాత్రం నేనే రోజు అర్ధమైతే ఆ రోజే నాకూ, నీకూ కూడా పుట్టిన్రోజు. తెల్సిందా,” అనే అర్ధం ధ్వనించింది.  “అవును కదా స్వామీ ! నాకు వేసిన ఈ మొట్టికాయ ఆ కిందామీదా పడుతూ ప్రజల్నీ పడేస్తున్నవాళ్ళకీ వెయ్యచ్చుగా?!? ప్రతి ఏడూ నానా తర్కాలూ, చర్చలూ చేసి చివరికి రెండురోజులు పండగ, ఒక రోజు సెలవూ సాధిస్తున్నారు పాపం,” అని స్వామితో వేళాకోళం ఆడాలనిపించినా, స్వామివారి చేత “నీ సంగతి నువ్వు చూసుకోవోయ్, ఇతర్ల సంగతి నీకెందుకు?,” అని చీవాట్లు పెట్టించుకోవడం ఎందుకొచ్చిన గొడవ అనిపించి తమాయించుకున్నా. ఇంతలో రాంబాబు నా మనసులోని సంశయం గ్రహించినట్టుగా, “అవును, వాళ్ళ సంగతి నీకనవసరం. నీ ఫ్రెండ్సు చూడు. ఆ గొడవలన్నీ పట్టించుకోకుండా ఇవాళే వాట్సప్‌లో హాపీ శ్రీరామనవమి నుంచి శ్రీరామసహస్రనామం వరకూ ఎన్ని రకాలుగా గ్రీటింగ్స్ పెట్టేస్తున్నారో, అవన్నీ నే స్వీకరించట్లా? స్టేట్ గవర్నమెంట్ ఏ రోజు సెలవంటే ఆ రోజే నా నవమి అన్జెప్పి వాళ్ళందర్నీ దీవించడం మానేశానా ఏంటి?,” అన్నట్టు అనిపించింది. వాట్సప్ మెసేజీలు చూశా, ఎవరి మనసుకి నచ్చినట్టు వాళ్ళు రాములవారికి, లోకానికీ శుభాకాంక్షలు చెప్పినా ఒక రకం మెసేజి అందులో మిస్సయినట్టు అనిపించింది. ఒక చేతులో విల్లు, మరో చేత్తో అభయముద్రతో మనసులోనే నిల్చునివున్న స్వామి, “ఇంకెందుకు ఆలోచన? నువ్వనుకున్న సందేశం కూడా పోస్ట్ చేసేయ్,” అన్నట్టు నవ్వుతున్నాడు. నేను తొమ్మిదోక్లాసులో వుండగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చి నన్నమితంగా అలరించి, ఆలోచింపజేసిన నండూరివారి “విశ్వదర్శనం” కోసం బాపుగారు వేసిన బొమ్మ, అదే నా రామనవమి శుభాకాంక్షగా పోస్ట్ చేసేశాను. అదుగో అదే 👇 –

WhatsApp Image 2018-03-25 at 12.06.22

photo courtesy: ViswaDarsanam

యోగవాశిష్టం నేను చదవలేదు. ఫ్యూచర్లో చదువుతానా? ఏమో, తెలీదు. కానీ ఆ బొమ్మ చూస్తేనే, ఆ గురు శిష్యుల రెండుమాటలు వింటేనే తక్కినదంతా అర్ధమైపోయినంత అందమైన ఆ బొమ్మ నచ్చనివారు, మెచ్చనివారు ఎవరుంటారు? కానీ, ఒకే ఒక్కరి స్పందన మాత్రం నాకు అమితంగా నచ్చింది. అది “Oh, What a deep thought?” అన్న క్లుప్తవాక్యం. బై ద వే, అతను మెటీరియలిస్టిక్ అమెరికాలో వుంటూ, కులమతఆచారాల పట్టింపుల్లేకుండా, గుళ్ళూగోపురాల్లాంటి వాటిని కుటుంబసభ్యులకోసం మాత్రం దర్శిస్తూ, హిందూసంస్కృతిపై ఎంతో ఇష్టం, రిచ్యువలిస్టిక్ వ్యవహారాలపై వ్యతిరేకత కలిగి దేవుడికి సేఫ్ డిస్టెన్స్‌లోవుండే పచ్చి హేతువాది. కానీ ఎలాంటివారికైనా నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు రాకపోదు. దేవుడు అనే కాన్సెప్ట్‌లో జీవుడికి అర్ధం తెలుస్తుంది అన్న అర్ధం స్ఫురించబకాపోదు, కాబట్టే “Oh, What a deep thought?” అన్నాడని నాకు తెలుసు, నా క్లాస్-మేట్ కాబట్టి. అతని అంతరాంతరాల్లో అట్టడుగున ఎక్కడో రాముడి పట్ల భక్తి కాకున్నా ప్రీతి ఉంటుందని కూడా తెలుసు, ఈ సంస్కృతిలో పుట్టిపెరిగినవాళ్ళని అది అంత తేలిగ్గా వదిలిపోదని కూడా తెలుసు కాబట్టి. అయితే ఆ ప్రీతి కూడా లేని అతిపదార్ధవాదులకీ, తీవ్రహేతువాదులకీకూడా రాముడు నచ్చకపోడు ఆయన్ని చూపాల్సిన విధంగా చూపిస్తే, ఆయన అనుసరించిన మార్గం భక్తులందరూ అనుసరిస్తే అనిపించింది. అలా అనిపించేసి టపా అక్కడితో ఆగిపోలేదు. ఇంకా వుంది. అది వచ్చే పోస్టులో. స్టే ట్యూన్డ్.

ఆగండాగండి, అందరికీ కొంచెం ఆలస్యంగానే అయినా, మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు స్వామివారికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు. ఏమనుకోకండి పలికించెడివాడు నవమి అయిన ఇన్నాళ్ళకి పలికించాడు. ఇంకో ఒకటో రెండో టపాలకి కూడా పలికించేలాగేవున్నాడు. చూద్దాం. ఏమంటావ్ స్వామీ? ఓ, సరే, చూద్దాం అంటావా?

అయితే సరే. బై4నౌ. 🙏