ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ? సూరీడు నెత్తురు…


పొద్దు పొడుస్తున్నప్పుడు కానీ, పొద్దు గుంకుతుంటేగానీ సూరిబాబుని చూస్తే ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ? సూరీడు నెత్తురుగడ్డలా లేడూ??.. అని “రావు గోపాల్రావు” టైపు కంట్రాక్టర్లకి అనిపిస్తుంది కానీ అందరికీ అలాగే ఎందుకనిపిస్తుంది? అసలెందుకనిపించాలి?

లోకో భిన్న రుచిః

పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ

ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుంది

ఏకం సత్ విప్రాః బహుదా వదంతి ….

ఇలాంటి సామెతలన్నీ నిజం చెయ్యడానికైనా ఒక్కోళ్ళకీ ఒక్కో విధంగా అనిపించాలి. అనిపిస్తుంది.

అందువల్ల —

ఒకళ్ళకి పడమట సంధ్యారాగం అనిపించొచ్చు.

సంధ్యారాగం అంటే సంగీతంలో అదొక రాగం అనుకునే నాలాంటివాళ్ళు తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో, తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం, యెగిరొచ్చే కెరటం సింధూరం… అనే దాసరి రచనని హమ్ చేసుకోవచ్చు. (కెరటం ఎగిసి రాకుండా ఎగిరి రావడం ఏంటో అనే సందేహం ఒక పక్కన పీడిస్తున్నా సరే)

మరొకళ్ళకి అరిచేత్తో సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో సూర్యాస్తమయాన్ని కూడా ఆపలేరు అనే అర్ధంపర్ధంలేని ఆలోచన రావచ్చు.

కందగడ్డలాంటి సూర్యారావుగారి మొహం చూస్తే పద్యాలూ అవీ రాయడం వచ్చిన వాళ్లకి కందపద్యాలు రాసెయ్యాలనిపించొచ్చు.

ఇంకొకళ్ళకి అరుణకిరణాలు, ఎర్రజెండాలు, ఇంక్విలాబులు తప్ప ఇంకేం గుర్తుకురాక పోవచ్చు. విప్లవభావాలుంటే – “బూర్జువా కత్తి గుండెల్లో దిగబడిన బడుగు సూరీడు …” టైపు కవిత్వాలు ఆ సూరీడి రక్తంలా మబ్బుల మధ్య సందుల్లోంచి ప్రవహించొచ్చు.

కొందరికి ఆకాశంలో ఒలికిన ఆవకాయ ఊట, అందులో బోర్లా పడిన జాడీ కనిపించి నోట్లో నీళ్ళూరొచ్చు.

ఎందరికైనా ఎన్నైనా అనిపించొచ్చు. ఈ రోజు సాయంత్రం ఇంటికొస్తూనే మాస్టర్ రూమ్ కిటికీలోంచి కనబడిన దృశ్యం నాచేత అదిగో 👇అలా అనిపించింది.

StarSlip

కొద్ది నిమిషాల ముందు ఆ నక్షత్రం మా ఇంటి కిటికీ పక్క నుంచి భూమి ఆవలి పక్కకి జారిపోయింది. తెలుగురక్తం కనక A while ago, a star slipped by my window towards the other side of the globe అంటూ ఆంగ్లంలో కూడా యధాశక్తి వెలగబెట్టింది.

ఇంతే సంగతులు. బై4నౌ 🙋‍