😊”మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మెరిసేదంతా బంగారం కాదు!!”😉 – ప్రధానిపై శాస్త్రజ్ఞుడి ప్రాక్టికల్ జోకు.


జవహర్లాల్ నెహ్రూ – ఒకప్పుడు ఈయన్ని అభిమానించిన జనాభా ఎంతో ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్న, కొండొకచో దూషిస్తున్న జనాభా దానికి రెట్టింపు వుండచ్చు. స్వాతంత్రం వచ్చినప్పట్నుంచీ జనాభా నాలుగు రెట్లు పెరిగిందన్న దాంట్లో డౌట్ ఏమీలేదు కానీ, జనంలో చరిత్ర పరిజ్ఞానం నాలుగు రెట్లు పెరిగిందా? నాలుగోవంతుకి పడిపోయిందా అనేది చెప్పడం కష్టం. ఇంత తేలిగ్గా ఎలా చెప్పేస్తున్నానంటే –

  1. అశోకుడి నుంచీ ఔరంగజేబు వరకూ ఎవరి చరిత్ర చూసినా గర్వపడేవాళ్ళు ఉన్నారు ఏమున్నది గర్వకారణం అనేవాళ్ళూ ఉన్నారు(పెరుగుతున్నారు).
  2. చిన్నప్పుడు చదివిన హిస్టరీ బుక్స్ అన్నీ అప్పటికే తిరగబడ్డాయనే విషయం అనుమానం స్థాయి నుంచీ పెనుభూతం సైజు వరకూ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా పెరుగుతోంది. చరిత్ర ఈ పాటికి ఎన్నిసార్లు తిరగరాయబడి వుంటుందా అనేది దీనికి అనుబంధ ప్రశ్నగా తలెత్తక తప్పదు. (మనసు లేని దేవుడు .. మనిషికెందుకో మనసిచ్చాడూ… ఊ..ఊ..ఊ..😂)
  3. History is but the version of the victor అని నెపోలియన్ అన్న మాటలు అప్పుడందరికీ తెలీవు. ఇప్పుడు చాలా మందికి తెలుసు.
  4. పై మూడు పాయింట్ల వల్ల హిస్టరీ అనేది మిస్టరీగా మారి కన్ఫ్యూజన్‌లో పడిపోయినవాళ్ళలో నేనూ ఒకణ్ణి.
  5. ఇంకోటి, ప్రజలు / సామాన్యులు అనబడే వోట్-బ్యాంకుల్లో హిస్టరీ తెల్సుకోవాలనే వైజ్ఞానిక ఆసక్తి ప్రత్యేకంగా వుందని చెప్పుకోడానికి తగిన ఆధారాలు కూడా పెద్దగా …. నెవర్ మైండ్..ఐనా, మెకాలే విద్యావిధానాన్ని ఇవాళ్టి చై.నా. విద్యావిధానం రిప్లేస్ చేస్తున్న ఈ రోజుల్లో చరిత్ర తిరగ రాసినా, మరగ రాసినా ఎవడిక్కావాలి?

సో, హిస్టరీ పరిజ్ఞానం పెరగలేదు కానీ మిస్టరీ/కన్ఫ్యూజన్‌  పెరిగిందనేది సొంత పర్సనల్ అభిప్రాయం. అంచేత నెహ్రూని — ఆ మాటకొస్తే చరిత్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళెవరి మీదా కూడా అభిప్రాయాలు ప్రకటించడం నా బోటి కన్ఫ్యూజ్డ్ మైండ్స్‌కి కుదరదు. సో, ప్రకటించను. కానీ – నెహ్రూకి, నోబెల్ బహుమతి సంపాయించిన మన సైంటిస్టు సి.వీ. రామన్‌కి మధ్య జరిగిన పిట్టకధ ఒకటి నెహ్రూ పాలిట భవిష్యపురాణంలా అనిపించింది. 1948లో నెహ్రూజీ రామన్ గారి లేబరేటరీ సందర్శనకి వెళ్ళినప్పుడు జరిగింది(ట) –

Raman Nehru

ఒక రాగితీగపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రసరిస్తుండగా అది ప్రధానికి చూపించి అదే లోహమో చెప్పమన్నాడట శాస్త్రజ్ఞుడు. అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావంతో మెరుస్తున్న రాగి నెహ్రూజీకి బంగారంలా కనబడిందిట. ఆ మాటే అనేసాడాయన. “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మెరిసేదంతా బంగారం కాదు (Mr Prime Minister, everything that glitters is not gold),” అంటూ రామన్ కిరణాల ప్రసారం ఆపి రాగి తీగని చూపించాడట. ప్రధాని రియాక్షన్ ఏంటో తెలియదు కానీ రామన్ మాటలు చైనా విషయంలోనూ, వీకే మీనన్‌‌పై నమ్మకంతోనూ నెహ్రూ చేసిన పొరపాట్లని (🤔)  పదమూడేళ్ళ ముందే సశరీరవాణిలా వినిపించినట్టులేదూ? ఆయన కారెక్టర్లో ఏదో లోపాన్ని రామన్ పసిగట్టి ఒక ప్రధాని మీదే జోక్ పేల్చాడా? లేక అలాంటి జోక్స్ పేల్చడం ఆయన నైజమా? తెలీదు కానీ నెహ్రూ మాత్రం విమర్శనీ, వ్యంగ్యాన్నీ పాజిటివ్‌గా తీసుకునేవాడంటారు. శంకర్స్ వీక్లీలో తనపై పడిన పదునైన కార్టూన్స్‌ని చూసి ఆయన నవ్వుకునేవాడంటారు. అంటారా? నిజంగానే నవ్వుకునేవాడా? ఎవరికి తెల్సూ? హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ. హిస్టరీ & పాలిటిక్స్ పక్కనపెట్టి ఒక సైంటిస్టుకి, ఒక లీడర్‌కి మధ్య నడిచిన చమత్కారంగా చూస్తే చాలు.

బై4నౌ😉