🌾🌿🌷ధర్మరాజు పర్యావరణ స్పృహ🌷 🌿 🌾 Happy Deepavali + Happy Vrukshavali


పాండవుల వనవాసం కామ్యకవనంలో అనుకుంటా మొదలౌతుంది. ధర్మరాజులేని హస్తినలో ఉండలేక కొందరు ప్రజలు కూడా పాండవులతో ఆ అడవిలో వుంటారు. కొంతకాలానికి ఒకనాటి రాత్రి ధర్మరాజు కామ్యకవనంలో ఉంటున్న జంతువులూ, పక్షులు తనవైపు దీనంగా చూస్తూ బాధ పడుతున్నట్టు కలగంటాడు. గురువు ధౌమ్యుడిని ఆ కలకి అర్ధమేమిటని అడుగుతాడు. “రాజా! నువ్వూ నీ పరివారం ఇప్పటికే సంవత్సరంపాటు ఈ అరణ్యంలో గడిపారు. మీ ఉనికివల్ల అడవిలోని పశుపక్ష్యాదుల జీవనానికి ఆటకం ఏర్పడుతోంది. దయచేసి మీరు మరో స్థలానికి వెళ్లి ఈ పరిసరాలపైన, జీవులపైనా భారాన్ని తగ్గించండని ఆ జీవులు నిన్నుకోరుతున్నాయి యుధిష్టిరా!,” అని వివరిస్తాడు ధౌమ్యుడు. పరిస్థితి గ్రహించిన యుధిష్ఠిరుడు తక్షణమే తన నివాసాన్ని ద్వైతవనానికి మారుస్తాడు. అంతేకాదు తనతోపాటు వనవాసం చేస్తున్న ప్రజల్ని జనజీవన స్రవంతిలోకి మళ్ళిస్తాడు. వనాల పేర్లు, డయలాగ్సూ కొంచెం అటూ ఇటూ అవ్వచ్చు గానీ స్థూలంగా ఇదీ కధ. ప్రాచీన జీవనశైలిని గంధపుష్పాక్షతలతో “పూజించే” మనం నేర్చుకోవాల్సిన పాయింటు – యుధిష్టిరుడి పర్యావరణ పరిరక్షణ స్పృహ. సబ్-కాన్షస్‌గా పర్యావరణ పరిరక్షణ స్పృహ వున్నవాడు కాబట్టే ఆయనకి అంతరాత్మ ఆ కల రూపంలో దిశానిర్దేశం చేసిందని అనుకోవచ్చేమో. నా మటుకు నేను అలాగే అర్ధం చేసుకుంటాను. ఈ కధ మొదటిసారి చదివినప్పుడు మన పూర్వీకుల పర్యావరణ పరిజ్ఞానం, వాళ్ళ ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ అర్ధమై ఒళ్ళు గగుర్పొడిచింది. ప్రకృతిలో భాగమై, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడమని ఋషులందరి తరఫున వ్యాసమహర్షి ఇచ్చిన, గ్రంధస్తం చేసిన సందేశం హృదయానికి హత్తుకుపోయింది. అప్పుడే పర్యావరణ సమతౌల్యతకి సంబంధించి ఆశ్రమధర్మాలలో అంతర్లీనంగా వున్నఉద్దేశం కూడా తెలిసింది. ఒక్క గృహస్తాశ్రమంలో తప్ప తక్కిన ఆశ్రమాల్లో సహజవనరులమీద వ్యక్తి వల్ల ఎక్కువ వత్తిడి వుండదు. ఈ ఏర్పాటు వల్ల మనుగడ కోసం మనుషులు ప్రకృతి నుంచి ఏమేం తీసుకున్నారో వాటిని భర్తీ చేసుకోవడానికి ప్రకృతికి వీలు కలిగేది. ఒక పక్క మనుషులు కక్షలు, కబ్జాలు, అస్త్రాలు, యుద్ధాల పేరిట విధ్వంసానికి పెద్ద ఎత్తున పాల్పడటం మొదలైన ఆ సమయంలోనే, వర్ణవ్యవస్థ వర్ణవివక్షగా రూపు మారుతున్న రాజకీయ వాతావరణంలో  అప్పటి తత్వవేత్తలు పాలకులకి, ప్రజలకి ఏ విధమైన దిశానిర్దేశం చేసారో తల్చుకుంటే ఒక పక్క ఆనందం, వాళ్ళ దూరదృష్టిని మానవాళి నిర్లక్ష్యం చేసిన విధం చూస్తే బాధ ఒక పక్క కలుగుతాయి. ఇతర జాతుల పోటీ నుంచి, ఆక్రమణ నుంచీ తప్పించుకోవాలంటే డెవలప్‌మెంట్ & ఇండస్ట్రియలైజేషన్ అనేవి తప్పనిసరి. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మొదలైంది. అయితే ఇప్పుడు డెవలప్‌మెంట్ & ఇండస్ట్రియలైజేషన్ వల్ల కలిగిన లాభాలేవీ జారవిడవకుండానే పర్యావరణ హితకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరం, బాధ్యత అన్ని దేశాల, జాతుల మీదా పడింది. ఆ బాధ్యతని సంతోషంగా నెత్తికెత్తుకోడానికి అవసరమైన తాత్వికమూలాలు మన సంస్కృతిలోనే వున్నాయి. అదే ధర్మరాజుని వనం నుంచి వనం మారుతూ వెళ్ళడానికి ప్రేరేపించింది. ఆయనని ఆదర్శపాలకుడిగా తీసుకునే మనం ఆయన పర్యావరణ స్పృహని పుణికిపుచ్చుకుంటున్నామా? లేదా? రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన లైఫ్-స్టైల్లో, అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నామా, లేదా? మన ప్రాధాన్యతలు మారాయని గవర్న్మెంట్లూ, ఉత్పత్తిదారులూ, వ్యాపారవర్గాలూ గ్రహించేలా చేస్తున్నామా, లేదా?
ఈ ప్రశ్నని ఒకసారి లేవనెత్తి దానికి సమాధానం వెతుకుతూ లేదా చెబుతూ ఈ దీపావళి జరుపుకోవాలనే క్రిందటేడు వేసిన దీపావళి “టపా”కాయనే మళ్ళీ వేస్తున్నా ఒక చిన్న హాండ్-మేడ్ వీడియోతో –

🌹This is not preaching but just ideas and dreams to share with those who have the might and the means to make them happen🌹 

మానవజాతి ‘బాల్యా’న్ని శతాబ్దాలపాటు మనకిష్టమైనట్టు గడపనిచ్చింది భూమాత. తనకిష్టమైనవి, తనకి కావాల్సినవి త్యాగం చేసింది. ఇప్పుడింక నేలతల్లికి అవసరమైనవి మనమివ్వాలి. మన ప్రాధాన్యతలు, ప్రయారిటీలు మార్చుకోవాలని నేలతల్లి పర్యావరణం ద్వారా సంకేతాలిస్తోంది. పిల్లలకి ఒక వయసు వచ్చేవరకూ బొమ్మలు ఆటలు తప్పనిసరి. బాల్యం దాటాక పుస్తకం చదవాలి, మస్తకం పనిచెయ్యాలి. పుడమితల్లి తన పిల్లలకి అదే చెప్తోంది. టపాకాయగా మారి పేలిపోయిన ప్రతి రూపాయికీ ఒక చెట్టు నాటమని మౌనంగా సైగ చేస్తోంది.

సింపుల్‌గా, అందంగా, ఏదో లోతైన సత్యాన్ని మనసుకి స్ఫురింపజేస్తూ వెలిగే దీపంతో మనం గడిపేది కొన్ని నిముషాలు. ఆనందంతోపాటూ హడావిడి, ఆర్భాటం; వీటికి తోడు ఆడంబరం వెంటేసుకుని వచ్చే స్వీట్లు, టపాకాయలకోసం వెచ్చించే సమయం కొన్ని గంటలు. నానాటికీ కలుషితం అవుతున్న నైతిక వాతావరణం మనం దీపానికి ప్రాధాన్యత పెంచాలని చెబుతోంది. స్వచ్ఛంగా వెలిగే దీపాన్ని మనసులో సత్యంగానూ, బాహ్యంలో ఆ దీపపు పరమార్ధాన్ని ప్రతిఫలించే వృక్షాల రూపంలోనూ శాశ్వతత్వం కల్పించమని ప్రకృతి, మానవప్రకృతి కోరుకుంటున్నాయి. టపాకాయల హంగులకి, మండి మాడి ఉక్కిరిబిక్కిరి చేసే పొగగా మిగిలే వాటి వయసుపొంగులకి చెట్టూచేమల పచ్చిగాలితో, పూలూపళ్ళ సుగంధాలతో సాంత్వననివ్వాల్సిన సమయం వచ్చిందనీ, దీపావళితో వృక్షావళినీ పండగగా చేసుకోవాలనీ భావితరాల భవిష్యత్తు భారతీయులనడుగుతోంది.

 

Happy Deepavali 🌹🙏🌹Happy Vrukshavali 

 

15 thoughts on “🌾🌿🌷ధర్మరాజు పర్యావరణ స్పృహ🌷 🌿 🌾 Happy Deepavali + Happy Vrukshavali

 1. నీహారిక

  ఒక కొడుకు(నరకాసురుడు) చావుని తల్లితో(భూదేవి) సహా ప్రజలంతా కలిసి బాణా సంచా కాల్చి సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకో నాకు తెలియదు గానీ త్రయోదశి రోజు మొదలుపెట్టి ఆ నెలంతా పితృదేవతలకు స్వర్గాన్ని చేరే దారి చూపుతాయని భావిస్తూ దీపాలు వెలిగించడం మాత్రం చేస్తాను.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   1)నాకు తెలిసి బాణాసంచా కాల్చడం దీపావళి కధలో లేదండి. దీపావళి అన్నారు కానీ బాణాసంచావళి అన్లేదు కదా? 😊 2)తల్లి కొడుకుని చంపడం అనే లిటరల్ మీనింగ్ మాత్రమే తీసుకుంటే మీరన్నది కరెక్టే. నరకుడి బాధ తప్పించుకున్నవాళ్ళ యాంగిల్లోంచి చూస్తే సెలబ్రేషన్ కరెక్టే కదా. 3) ఒక తల్లే కొడుకుని చంపాల్సిన పరిస్థితి ఎందుకు అంటే చాలా ఆలోచించాల్సిన విషయం. ఆ విధంగా కూడా దీపానికున్న ప్రాధాన్యత టపాకాయకి లేదని నా ఉద్దేశం. 4) నా మటుకు టపాకాయలు అనగానే చిన్నప్పుడు దీపావళి సాయంత్రం ఎర్లీగా యాచన ముగించుకుని వెళ్ళిపోయే బిచ్చగాళ్ళు(టపాకాయలు మీద పడకుండా); కాస్త బాణాసంచా కొనుక్కునే స్తోమత వున్నవాళ్ళు ఎండబెట్టుకున్న టపాకాయల వైపు అవి కొనలేకపోయిన వారి పిల్లల చూపులు, ఇప్పుడు కొత్తగా ఈ పొల్యూషన్ ఇవే గుర్తొస్తాయి. All said and done, ఎవరిష్టం వాళ్ళది. కానీ దీపావళి రోజు జరిగేదే కాదు, ప్రతిరోజూ జరుగుతున్న పొల్యూషన్ గురించి మాత్రం ఆలోచించాల్సిందే.
   పితృదేవతలపై మీ గౌరవం అభినందనీయం.

   Like

   Reply
 2. విన్నకోట నరసింహారావు

  <"టపాకాయగా మారి పేలిపోయిన ప్రతి రూపాయికీ ……"

  బాగా చెప్పారు. టపాకాయలు కాల్చడమంటే రూపాయినోటుని చుట్ట చుట్టి అగ్గిపుల్ల అంటించడమే అని మా తండ్రిగారు అంటుండేవారు. ఎక్కడ టపాకాయలు కాలుస్తున్నట్లు కనిపించినా / వినిపించినా (ఇప్పుడు దీపావళికే కాదుగా, ఏ సెలబ్రేషన్ కి అయినా, దేవుడి ఊరేగింపుకయినా, క్రికెట్ మాచ్ గెలిచినా కూడా టపాకాయలు హోరెత్తాల్సిందే కదా) మా తండ్రిగారి మాటలు గుర్తొస్తుంటాయి. చాలామందికి ఇదే అభిప్రాయం ఉంటుంది కానీ పిల్లల సరదా తీర్చడం కోసం భరిస్తారనిపిస్తుంది.
  వృక్షావళిగా చేసుకుంటే బాగానే ఉంటుంది.

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   వీఎన్నార్ సర్, ధన్యవాదాలు. పిల్లల సరదా కోసం చెయ్యడం అనేది కరెక్టేనండి. ఇంటర్మీడియేట్ దాటే వరకూ మేమూ అలా కొనిపించేవాళ్ళం మా నాన్నగారి చేత.
   //వృక్షావళి// నిన్ననే చదివాను ఇప్పటికిప్పుడు అన్ని రకాల కాలుష్య నివారణ చర్యలూ చేపడితే భూతాపం తగ్గడం ఒక నలభై ఏళ్ళకి కానీ మొదలవ్వదుట.

   Like

   Reply
 3. Zilebi

  ఇలా టపాకాయల్ని
  బ్యాను చేసే వాళ్ళంతా
  కుహనా సెక్యూలరిస్ట్లున్ను
  యాంటీ హిందూసున్ను

  జిలేబి

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   ధన్యవాద్ జిలేబిగారూ. జనతా గేరేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇలాగే బాన్ చేస్తూ ఉంటాడు. ఐనా అదేవిఁటో సినిమా సూపర్ హిట్టు 😊

   Like

   Reply
 4. నీహారిక

  >>>నరకుడి బాధ తప్పించుకున్నవాళ్ళ యాంగిల్లోంచి చూస్తే సెలబ్రేషన్ కరెక్టే కదా.>>>

  కధే అనుకున్నా… చెడ్డవాడిని మార్చడానికి వేరే దారే లేదా అనిపిస్తుందండీ … తల్లి చేతిలో మాత్రమే చావాలని కోరుకోవడం అలాగే జరగడం చూస్తుంటే మనం కోరుకునేవే మనకు జరగుతాయేమో అనిపిస్తుందండీ ! ఎంతటి శతృవైనా ఎవరి చావునీ నేను కోరుకోను. దెబ్బలు మాత్రం గ్యారెంటీ ! ఇంతోటి దేవతలూ దేవుళ్ళు కూడా జైలు లో వేయలేకపొయారేవిటండి ! యావజ్జీవ ఖైదు సరిపోదా ?

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   చంపినవాడు సాక్షాత్తూ దేవుడే అని నమ్మినప్పుడు ప్రాణం పోసేవాడు ప్రాణం తీస్తే మాత్రం సమస్యేంవుందండీ? మళ్ళీ ఆయనే ఇంకో జన్మ ఇస్తాడు కదా? రాక్షసుల ప్రాణాలు దేవుడిలో కలిసిపోయే సీన్ భలే థాట్ ప్రొవోకింగ్‌గా అనిపిస్తుంది.
   //ఇంతోటి దేవతలూ దేవుళ్ళు కూడా జైలు లో వేయలేకపొయారేవిటండి !// దేవుడిక్కూడా మన జైళ్ళ శాఖ మీద నమ్మకం లేదేమో 😊

   Like

   Reply
 5. నీహారిక

  సో… ప్రాణం పోసినవారికి ప్రాణం తీసే హక్కు ఉన్నది అనే కంక్లూజన్ కి వద్దాం. నేనెపుడన్నా మర్చిపోతే మీరు గుర్తుచెయ్యండి. Note This Point Your Honour !


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   దేవుడికి , కంక్లూజన్ లకి అస్సలు సరిపడదు. దేవుణ్ణి ఫలానా అని కంక్లూడ్ చేసేసిన వాళ్ళు ఒరగబెట్టింది అంతా చూస్తున్నాం కదా! దేవుడి విషయంలో ప్రపంచవ్యాప్త ఏకాభిప్రాయం లేదు. అలాంటప్పుడు కృష్ణుడు దేవుడు , నరకుడు అసురుడు అని కంక్లూడ్ చెయ్యడం కూడా కుదరదు. ఒప్పుకోరు.ఏకాభిప్రాయం లేనంతవరకూ కంక్లూజన్స్ కుదరవండీ. 😃

   Like

   Reply
 6. వెంకట రాజారావు . లక్కాకుల

  కామ్యక భూములందు కల గన్పడి జంతులు పక్షి జాలముల్
  గమ్యము తాముగా తమను కాల్చుక తిన్న జనాల వైనముల్
  ధౌమ్యుడు చెప్పగా దెలిసె ధర్మజులోరికి , తుల్యతాంతరా
  రమ్యము లిట్టివా ! యనఘ ! ప్రాణుల మధ్య , వనాంతరమ్ములన్ !

  కొంతలో కొంత మేలు , బాగుంది సారు !
  ప్రజల వెన్కకు బంపె నారాజు గాని ,
  ఇంక నెన్ని జీవాలు కన్పించు చచ్చి
  రాజు కలలందు ప్రతిరోజు భూజ వనుల !

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
  1. YVR's అం'తరంగం' Post author

   1.తుల్యతాంతరారమ్యము అంటే తెలియలేదు మాస్టారు.
   2.వాళ్ళు భుజించిన జీవులు కాదని గుర్తు మాస్టారు. నరసంచారం వల్ల ఇబ్బంది పడుతున్న జీవులే అనుకుంటాను. అప్పటికే ధర్మరాజు దగ్గర అక్షయపాత్ర ఉండేదేమో.

   Like

   Reply
 7. వెంకట రాజారావు . లక్కాకుల

  1.సమతుల్యతకు సంబంధించిన అంతరం
  బహురమ్యంగా అనిపించిందండి .
  2.ధర్మజుడున్ను తమ్ములును తత్పరివారము వేట శాయరా ?
  ధర్మము క్షాత్రమే యగు కదా ! మరి శాఖములే భుజించిరా ?
  అర్మిలి ధర్మరాజు కడ ‘ నక్షయపాత్రమ ‘ ? క్షాత్ర మే మయెన్ ?
  మర్మము మాంస భక్షణమె , మారొక టుండుట కాదు మిత్రమా !

  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 8. విన్నకోట నరసింహారావు

  “బోన్సాయ్” ఒక దారుణమైన ప్రక్రియ. నిషేధించవలసిన సోకాల్డ్ కళ. దీని మీద వచ్చిన ఒక అస్సామీ కవిత గురించి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి గారి “మందాకిని” అనే బ్లాగులో “బోన్ ‘సాయమా?’ గాయమా?” అని నిన్న (Feb 07, 2018) ఒక పోస్ట్ కనపడింది.
  ఇదే అంశం మీద మా కనిష్ఠసోదరుడు విన్నకోట రవిశంకర్కుండీలో మర్రిచెట్టు” అనే కవిత 1983 లో వ్రాశాడు. తన కవితల సంకలనానికి కూడా ఇదే పేరు పెట్టాడు. తరవాత ఈ కవిత “ఈమాట” వెబ్ పత్రికలో కూడా వచ్చింది. లింక్ ఈ క్రింద ఇస్తున్నాను.
  http://eemaata.com/em/library/kumdilo/311.html
  (లక్ష్మీదేవి దేశాయి గారి బ్లాగులో వ్యాఖ్యల సౌకర్యం ఉన్నట్లు లేదు. బ్లాగ్ మిత్రులు ఈ కవిత చదువుకోవడానికి వీలుగా ఉంటుందని నా ఈ వ్యాఖ్య వృక్షప్రేమికులైన – పక్షిప్రేమికులు కూడా 🙂 – మీ బ్లాగులో పెడుతున్నాను. సారీ అండ్ థాంక్స్.)
  (మీరు కూడా బోన్సాయ్ మీద ఒక టపా వ్రాసారని … బాగా … గుర్తు. కావలసినప్పుడు పట్టుకోగలననుకున్నాను – “అహం” అందామా? 🙂. కానీ పట్టుకోలేకపోయాను 🙁)


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s