ప్రేమతో పెంచిన గులాబిమొక్క ఆకలి తప్ప ఏమీ తెలియని పశువు నోట పడితే, పెంచిన ఆ మనసుకి కలిగే విలవిల
అందమైన భావాల్ని అక్షరీకరించి వ్రాసిన కవితని, వ్యామోహాన్ని మించిన భావం ఎరుగని బైతు చింపి పారేస్తే, ఆ కవితని కనిపెంచిన కవిహృదయం పడే వేదన
అపురూపంగా నిర్మించుకున్న పర్ణకుటీరం శివాలెత్తిన సుడిగాలికి చిందరవందరగా కూలిపోతే, పర్ణశాలలోనే పంచప్రాణాలూ పెట్టుకుని బ్రతికే ఆత్మ పొందే క్షోభ
— ఇవన్నీ అంతులేని అలలై చెలరేగుతూ ఆ తల్లి కళ్ళలోంచి పొంగిపొర్లుతున్నాయి.
ప్రేమ పోసి పెంచుకున్న మొక్క,
ఆశయాల ప్రతిరూపంగా రక్తంతో లిఖించుకున్న కవిత,
ఆశలసౌధంగా పంచప్రాణాలతో నిర్మించిన పొదరిల్లు
—- అయిన కన్నబిడ్డని ఆ స్థితిలో చూసిన తల్లి ఇంకెలా వుండగలదు.
మూడురోజుల ముందు స్నేహితులతో వెళ్ళిన కూతురు, కూతురుగా కాక ఆమె నిర్జీవశరీరంగా తిరిగొస్తే, ఆ తల్లి మనసులో ఎగిసిపడే ప్రశ్నాకెరటాలకి అడ్డుకట్టవేసే సాహసం, జవాబు చెప్పే ధైర్యం, ఇది మళ్ళీ జరగనివ్వం అనగల ఆత్మవిశ్వాసం సమాజానికి, జాతికి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి ఉన్నాయా? వాట్సాప్‌లో వాడుకునే ఎమోజీ/ఎమోటికాన్‌లకి పర్యాయపదాలైపోయిన –
రెండు క్షణాల మౌనం / ఒక కొవ్వొత్తి / పుష్పగుచ్ఛం – ఇవికాక ఇంకేమైనా చెయ్యగలదా/రా?
ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, పాశ్చాత్యసంస్కృతిని తిట్టుకోడాన్ని మించి ఏమైనా నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టగలదా?
చిన్నారి సాన్వి, “నిర్భయ”, మొన్న ర్యాన్, గుర్గాఁవ్లో బస్ కండక్టర్ పశుత్వానికి బలైన బాలుడు, చెన్నై రైల్వే స్టేషన్లో హత్యకి గురైన స్వాతి, కాలేజ్ రాగింగ్స్ వల్ల ఆత్మహత్యలకి పాల్పడ్డ విద్యార్ధులు, బీహార్‌లో ఒక కారుని ఓవర్టేక్ చేసిన “పాపానికి” హత్యకి గురైన మైనర్ కుర్రాడు, డేరాఘోరాల బలిపశువులు —- వీళ్ళందరి విషాదాంతాలు టీనేజర్లకి పాఠాలుగా స్కూల్ సిలబస్‌లలో చేరాల్సిన అవసరం లేదా?
బలి అయినవాళ్ళ, బలి “తీసుకున్న”వాళ్ళ కుటుంబాల దుర్భర అనుభవాలు యవ్వనంలోకి అడుగు పెడుతున్న పసిమనసులకి వార్నింగ్ సిగ్నల్స్‌గా ఉపయోగపడాల్సిన సమయం వచ్చేసి చాలా కాలం అయినట్టుంది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని కోల్పోయిన అభాగ్యులూ, వాళ్ళ దుఃఖానికి కారణమైనవాళ్ళకి జన్మనిచ్చిన “పాపానికి” “జీవితకాలశిక్ష” అనుభవించాల్సిన ఖర్మ పట్టిన నిర్భాగ్యులూ కూడా సానుభూతికి అర్హులే. తమ జీవితాలు వ్యర్ధం అయిపోయాయనే భావం వారికి కలగకుండా చెయ్యలేకపోతే సమాజానికి సభ్య అనే ప్రిఫిక్స్ శుద్ధదండగ. అలాంటివారిని అలా వారి మానాన వార్ని వదిలెయ్యకుండా తమ దుఃఖాన్ని, ఆక్రోశాన్ని, అనుభవసారాన్ని హైస్కూల్ పిల్లలతో పంచుకునేలా ప్రోత్సహించి, అవకాశం కల్పిస్తే ? పోయినవాళ్ళు తిరిగి వస్తారని కాదు. చెడిపోయినవాళ్ళు మారుతారనీ కాదు. విధి చేతులో దారుణంగా మోసపోయిన వాళ్ళ అనుభవాన్ని ప్రత్యక్షంగా వారి నుండే వింటూ, ఆ బాధ చూసినప్పుడు
స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టబోయే తరంలో విచక్షణాదీపాలు వెలిగించి తమ దుఃఖభారం కొంతైనా తగ్గించుకోగలుగుతారని,
సో-కాల్డ్ మోడర్న్ జెనరేషన్స్‌లో కొందరైనా విచక్షణాజ్ఞానాన్ని వాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని. మంచి చెడు అనేవి వుంటాయని, జీవితానికి, ఫన్‌కి తేడా వుందని గ్రహిస్తారని.
“ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. లైట్ తీసుకోండి,” అని చెప్పే పిల్లలు కూడా కొంచెం సున్నితంగా ఆలోచిస్తారని.
నా ఉద్దేశంలో ప్రభుత్వాలకి, ప్రజాప్రతినిధులకి ఇలాంటి ఐడియాలు రావడం, వాట్ని అమలు చెయ్యడం అలవాటు లేదు, ఫ్యూచర్లో అలవాటౌతుందనే ఆశ కూడా లేదు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు చొరవ తీసుకోవాలి.
(మూడురోజుల ముందు స్నేహితులతో వెళ్ళిన కూతురు, కూతురుగా కాక ఆమె నిర్జీవశరీరంగా తిరిగొస్తే హతాశురాలై శోకవిహ్వల అయిన ఒక తల్లి🙏 ఫోటో నిన్న పేపర్లో చూసి మనసు వికలమైతే, అది ఫామిలీతో పంచుకుని రాసిన పోస్ట్ ఇది. ఎవరినైనా ఏ కోణంలోనైనా బాధిస్తే మన్నించమని కోరుతున్నాను🙏)
పాఠ్యాంశాల్లో చేర్చినా ఎవరూ మారరు. వాట్స్ అప్, ఫేస్ బుక్ లలోనే ట్విటర్ లాగా కూత పెట్టి మరీ చెప్పాలి. మారాల్సింది పిల్లలు కాదు పెద్దలే ! ఏమయిపోతుంది యువత అని మీరనుకుంటున్నారు. ఇటువంటివి జరుతూనే ఉంటాయి. లైట్ తీసుకోండి అని పిల్లలే చెపుతున్నారు. ప్రాణం అంత విలువైనదా ? బ్లూ వేల్ గేం, రైతు ఆత్మహత్యలు, తెలంగాణా పోరాటాలు, రైలు ప్రమాదాలు ఎన్ని చూడడం లేదు ? ఎంత మంది చస్తే భూమికి అంత భారం తగ్గుతుంది.
ఏ ఒక్క దేవుడైనా ఒక్క ప్రాణం నిలబెట్టినట్లు చరిత్రలో ఉందా ?
LikeLiked by 1 person
పాఠాల్లో చేర్చడం మాత్రమే కాదు, బాధితులు ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలని. నేను సరిగ్గా కన్వే చెయ్యలేదు ముందు. ఇప్పుడు కాస్త మార్చాను. అది సరే గానీ, మీరేంటండీ “ముత్యాలముగ్గు”లో కాంట్రాక్టర్ లాగా అర్ధణాకి మూడు ప్రాణాలనేశారు? ఇంక దేవుడు ప్రాణాలు నిలబెట్టడం గురించి అంటారా? హ్మ్… ఇవ్వడం, తియ్యడం కూడా ఆయన పనేగా? అందుకే లైట్ తీసుకుంటాడు. “దేవుడికేం హాయిగ కూచుంటాడు, మానవుడే బాధలు పడుతుంటాడు. మానవుడే …..”
I hope your words will provoke thoughts 😊
LikeLike
< " ఎవరినైనా ఏ కోణంలోనైనా బాధిస్తే మన్నించమని కోరుతున్నాను🙏) "
————————-
వ్రాసింది మంచి టపా. మరి ఎందుకు చివర్లో పై విన్నపం? మొదటి సంగతి మీ టపాలో ఉన్నవన్నీ నిజాలే, సమకాలీన సమాజంలోని కుళ్ళు గురించే. దాంట్లో ఎవరినైనా బాధించే ప్రసక్తి ఎందుకొస్తుంది? బాధించినా కూడా తప్పదంటాను – ఎందుకంటే కొన్ని నిజాల గురించి ఒక్కోసారి కర్కశంగానే మాట్లాడుకోవాలి.
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike