Statutory Warning – “మాస్టారూ! మీ సొంత రిస్కు మీద బాబాలని, దేవదూతల్ని, స్వయంప్రకటిత దేవుళ్ళని ఫాలో అవుతున్నారు. ఫ్యూచర్లో వాళ్ళు బురిడీలని…..”


దేశంలో బాబాలు, గురువులు, రెండుమూడు వేల ఫీజుకి దేవుళ్ళని డెడ్ చీపుగా ప్రత్యక్షం చేసేసే “సిద్ధు”ల వరకూ లెక్కలేనంత మందీ, వీళ్ళ కృపాకటాక్షవీక్షణాలకోసం, అవి తమ మీద ప్రసరిస్తే లభించే లక్షలూ, మోక్షాల కోసం పడిగాపులు పడే అంతకంటే లెక్కలేనంత మంది “అమాయక” జనం(ఆ కోట్స్ ” ” ఎందుకో ఆ కింద రాశా) వున్నారు కదా. ఆ బాబాలు బురిడీలో కాదో తెలీకుండానే ఈ “అమాయక” జనాభా వాళ్ళ పాదపద్మాల మీద పడిపోడం, వాళ్ళు భక్తిపారవశ్యంలోంచి తేరుకునేలోగా నవవిధభక్తి మార్గాల్లోనూ వాళ్ళని వీళ్ళు బురిడీ కొట్టించేయడం మామూలై పోయింది కదా?

ఒకవేళ కొందరు ముందే తేరుకుని ప్రభుత్వాల్ని, ప్రధానుల్ని ఆశ్రయించినా వాళ్ళు తమక్కావలసిన రాజకీయ లబ్ధి మొత్తం రాబట్టుకునేదాకా చట్టం తన పని తను చేసుకుపోతుందని “నమ్ముతారు” కదా! ఆహాఁహాఁ! ఆ అవకాశం వుంది కదా ఎట్-లీస్టు?

కోర్టువారు, పోలీసులు – “మనం పని చేస్తే కర్మసిద్ధాంతం ఔట్-డేటెడ్ అయిపోతుందీ, అలా జరక్కూడదూ, దేవుళ్ళూ, దైవదూతలు కూడా భూమ్మీదకి రావడానికి యుగాలు పడుతుంది. మానవమాత్రులం మనకో పాతికేళ్ళు పట్టదా?” అని కనీసం ఓ పాతిక, ముప్ఫైయ్యేళ్ళు కేసులు నడిపిస్తారు కదా?  ఒకవేళ వాళ్ళకా ఉద్దేశం లేకపోయినా  వాళ్ళకా “నమ్మకం” సామదానబేధదండోపాయాలతో బురిడీలు, వాళ్ళ లాయర్లు కలిగిస్తారు కదా? ఈ లోపు బురిడీగారి గారడీలు కూడా తమ పని తాము చేసుకుపోతూ వుంటాయి కదా?

ఇంక మన మహామీడియాత్ములున్నారంటే వాళ్ళకీ కొందరు జ్యోతిష్కులకీ పెద్ద తేడా వుండదు. ఇద్దరూ కూడా జరగాల్సినదంతా జరిగిపోయాకే నోరు తెరుస్తారు కదా? జ్యోతిష్కుల సంగతేమోగానీ మీడియా మాత్రం నయీంలు, డేరాబాబాల వంటి వాళ్ళ అరాచకాల్ని వాళ్ళు కటకటాల్లోకి వెళ్లి అంతా సేఫ్ అనుకున్నాకగానీ “బయట”పెట్టరు కదా? బురిడీ కటకటాల వెనక్కి పోయాక “బయట”పడే మీడియా కధనాల్లో నిజమెంతో, సెన్సేషనెంతో ఎవరికీ తెలీదు. ఐ మీన్, ఉన్న నిజం చుట్టూ వీళ్ళు అల్లే సంచలన బూజు ఎంతో తెలీదు. సో, ఏ విధంగా చూసినా బురిడీల సక్సెస్‌ఫుల్ కెరీర్‌ల మీద బతికే పరాన్న-బురిడీలు బోల్డు మంది వుంటారు కదా? ఈ బురిడీలందరి నుంచీ “అమాయకు”ల్ని రక్షించాలి కదా!

ఈ రెండు రకాల బురిడీల నుంచి నిజమైన అమాయకఅమాయకుల్ని రక్షించాలంటే, – ఆహాఁ! రక్షించాలని ఏ ప్రభుత్వానికైనా  పొరపాట్న అనిపిస్తే – “సిగరెట్ / మద్యము త్రాగుట ఆరోగ్యానికి హానికరము” లాంటి చట్టబద్ధమైన హెచ్చరిక ఒకటి – “మాస్టారూ! మీరు మీ సొంత రిస్కు మీద బాబాలని, గురువుల్ని, దేవదూతలని, స్వయంప్రకటిత దేవుళ్ళని ఫాలో అవుతున్నారు. ఫ్యూచర్లో వాళ్ళు బురిడీలని తేలవచ్చు. అప్పటికే మీకు జరగాల్సిన నష్టం జరగవచ్చు. అప్పుడెంత ఏడ్చినా లాభంలేదు. ఇప్పటికి సవాలక్ష కేసులయ్యాయి. ఒక్కోటీ తేలడానికి పాతికేళ్ళు పట్టొచ్చు. “దేవుళ్ళు” “దయ తలిస్తే” ఇంకా ఎక్కువే కూడా పట్టచ్చు. కనక వీళ్ళని ఆశ్రయించేముందు బాగా ఆలోచించుకోండి మహానుభావా!! ఏ దళారీలు లేకుండా డైరెక్ట్‌గా దేవుణ్ణి ఆశ్రయించడం ఉత్తమం. అందుకు కొంచెం బుర్ర ఉపయోగిస్తే చాలు. తర్వాత మీ ఇష్టం. లేకపోతే మీ ఖర్మ ”  – అని స్టాట్యుటరీ వార్నింగ్ అన్ని రెలిజియస్ & నాన్-రెలిజియస్  స్పిరిచ్యువల్ లీడర్సూ తమ ఆశ్రమం ముందు / డేరా ముందు / వాళ్ళేమని పిలిస్తే అది – దాని ముందు కంపల్సరీగా పెట్టాలని చట్టం చేస్తే???? నిజమైన గురువులెవరికీ ఎలాగో అభ్యంతరం వుండదు. అబ్జెక్షన్ పెడితే వీళ్ళు బురిడీలని తెలిసి పోతుందని నిజమైన బురిడీలు కూడా అడ్డు చెప్పరు.  కానీ అమాయకఅమాయకులు మాత్రం కాస్త ఆలోచించి అడుగేస్తారని కొంచెం ఆశ. What do you think?

స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వార్నింగ్ పెడితే ఎంత మంది పట్టించుకుంటున్నారు? ఇది కూడా ఎవరూ పట్టించుకోరు అనచ్చు. అదీ కరెక్టే. సిగరెట్, సారా, డ్రగ్స్‌లాగే గుడ్డిగా ఫాలో అయ్యేదేదైనా – మతం, సినిమాలు, లేటెస్ట్ టెక్నికల్ గాడ్జెట్స్‌తో సహా – అన్నీ  మత్తుమందులే. ఆ మత్తుమందులకి ఇచ్చినట్టే ఈ మత్తుమందులకీ వార్నింగ్ ఇస్తే మంచిదే కదా? ఆ కారణం చేతైనా బురిడీబాబా-స్టాట్యుటరీవార్నింగ్స్ పెట్టడం బెటరు.

[“అమాయకుల”కి ఇటూ అటూ ఆ కోట్స్ ఎందుకంటే అమాయకుల్లో అందరూ అమాయకులు కాదు మరి. నిజం అమాయకుల్ని పక్కనపెడితే మిగిలినవాళ్ళు దేవుణ్ణీ, తలరాతని, నవగ్రహాల్నీ బురిడీ కొట్టించాలని చూసే “సామాన్య” బురిడీలు. వీలైతే సొంత తలరాతని, కుదరకపోతే తక్కినవాళ్ళ తలరాతల్ని మార్చడానికి గవ్వల పంచాగం / చిలకజ్యోతిషం నుంచీ ఫిరాయింపులు, వోట్-బాంక్ పాలిటిక్స్ వరకూ ఏదైనా చెయ్యడానికి రెడీగా వుండే “అమాయక బురిడీ”లే “గురు”బురిడీలకి ఆధారం. అందుకూ ఆ కోట్స్.]

ఇవాళ కౌముదిలో మారుతీరావుగారి గొల్లపూడి కాలమ్  (http://www.koumudi.net/gl_new/083117_rabandu_rekkala_chappudu.html) చదువుతుంటే ఈ ఐడియా వచ్చి రాసేశా. ఇంక ఇంతేసంగతులు. బై4నౌ.🙏