⚛🌌🌊🌏సైంటిఫిక్☯వినాయక్🌷 🌿 🌾 🌹


 🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹

వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |

Bapu Ardhanariswara

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ||

 🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹

(pic courtesy: Google)

అనగనగనగా చాలా రోజుల కిందట, ఎంత చాలా అంటే చెప్పలేనంత చాలా. సైన్సు ప్రకారం సృష్టికి మొదలు అని చెప్పుకునే బిగ్ బాంగ్ కంటే కొంచెం ముందు అనమాట. అప్పుడు పరమాత్మ అని ఒకటే ‘పదార్ధం’ ఉండేది. పదార్ధం అని ఎందుకంటామంటే – అది ఆడాకాదు, మగ కాదు; దానికి పుట్టడం, పోవడం అనేవి లేవు. ఆకలి, దాహం, నిద్ర, భయం అంటే ఏంటో కూడా తెలీదు. “ఇంకొకటి”అనే కాన్సెప్టే లేనప్పుడు ఇంకే ఫీలింగైనా ఎలా వుంటుంది? అలాంటిది ఆ పరమాత్మ. దానికి సడెన్‌గా ఒకసారి ప్రకృతి , పురుషుడు అనే రెండుగా విడిపోతే ఎలా వుంటుంది అనిపించింది. అలా ఎలా అనిపించింది? “ఇంకొకటి”, “నేను కానిది”, “వేరేది” లాంటి రిలేటివిస్టిక్ కాన్సెప్ట్ లేనప్పుడు అని అడగద్దు. అదంతే. “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా” అనుకోవాల్సిన సరిహద్దు రేఖ అది. సో, అనుకున్నట్టే అలాగే విడిపోయింది. విడిపోయిందన్న మాటే గానీ ప్రకృతి, పురుషులిద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన ఆకర్షణ. ఉండదా మరి? వాళ్ళిద్దరూ నిజంగా ఇద్దరు కాదు కదా! ఒక్కరే కదా? అందుకే ఆ ఎట్రాక్షన్. దానికి వాళ్ళు ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. ఆనంద తాండవంగా ఆ ప్రేమని ప్రకటించుకోవడం వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. ప్రకృతికి రకరకాల రూపాలు ధరించి అలరించడం ఇష్టం. పురుషుడిని తన యోగమాయతో మోహితుడిని చెయ్యడం ఆమెకి ఒక ఆట. ప్రతీ రూపం తన ప్రతిరూపమేననీ; మాయకి, మోహానికి అతీతమైన శక్తి స్వరూపిణి తననుంచి వేరు కాదని, కాలేదని నిరూపించి ఆట పూర్తి చెయ్యటం పురుషుడి వంతు. ఈ సయ్యాటల్లో భాగంగానే  ప్రకృతి మేటర్ & ఎనర్జీ అనే రెండు రూపాలు ధరించింది ఒకసారి. పురుషుడు ఎవేర్‌నెస్ (ఎరుక)గా నిలిచాడు. మేటర్ & ఎనర్జీలుగా మారిన ప్రకృతి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్‌లుగా ఆవిర్భవించింది. ప్రోటాన్, న్యూట్రాన్లతో కూడిన న్యూక్లియస్‌ని పురుషుడు ఆవహించాడు. న్యూక్లియస్‌‌లో దాగిన పురుషుడిని చేరాలని,  ప్రేమతో దాని చుట్టూ ప్రదక్షిణనృత్యం సాగించింది ఎలక్ట్రాన్. రకరకాల రీతుల్లో సాగిన ఆ  ప్రకృతీపురుషుల నృత్యవిన్యాసాలే హైడ్రోజెన్ మొదలైన మూలకాలుగా పరిణమించి ఇప్పటికీ సాగుతున్నాయి. ఆ తాండవంలోనే వాళ్ళిద్దరూ  గ్రహనక్షత్రాల రూపాల్లో వెలుగుతూ ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నారు నేటికీ. అక్కడితో ఆగలేదు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, దిక్కులు, కొండలు, నదులు, సముద్రాలు, …. ఎన్నెన్నో అయ్యారు. నృత్యవిన్యాసాలు ప్రేమ విలాసాలుగా పరిణమించిన తరుణాలే జీవకణాలు. x & y క్రోమోజోములూ అయ్యాయి. అవే వృక్ష, పశు, పక్షి, కీటకాదులయ్యాయి. ఆ ప్రాణుల జీవనగమనమే వేదనాదంగా వింటూ ఆనంద పారవశ్యం పొందారు.  అప్పటికీ ప్రకృతీపురుషుల తనివి తీరలేదు. ఇంకా ఇంకా గొప్ప సృష్టి ఏదో జరగాలి. ఇప్పటివరకూ జరిగిన ఆనందనాట్యానికి శిఖరాయమానంగా ఒక అద్భుతవిన్యాసం చెయ్యాలి. ఏమిటది? సృష్టినృత్యానికి పరాకాష్టగా దాన్నెలా సంయోజన చెయ్యాలి? తాండవకేళి సలుపుతూనే పురుషుడు ధ్యానమగ్నుడయ్యాడు. ప్రకృతి ప్రేమదీక్షితురాలయింది.

ధ్యానసమాధిలోంచి పురుషుడు మేలుకొనేలోగా అతనికి నచ్చేలా నూతన సృష్టికి రూపకల్పన చెయ్యాలనుకుంది. ఆ ఆలోచనలోనే, అప్రయత్నంగానే నృత్యసమయంలో తన వంటిపై చేరిన మట్టికణాలతో ఒక ఆకారాన్ని కల్పించింది. అనుకోకుండా తయారైన ఆ మట్టిబొమ్మకి ప్రాణం పోయాలనిపించింది ప్రకృతికి. దానిని చూస్తుంటే అంతకు ముందెప్పుడూ లేని పులకింత. తామిద్దరూ చేసే సృష్టినాట్యంలో ఈ బుల్లిబొమ్మ కూడా  తన బుడి బుడి నడకలతో పదం కలిపితే, అది వేసే తప్పటడుగులు తామిద్దరూ కలిసి చూస్తూ ఆనందిస్తే , అది పలికే ముద్దు పలుకులనే తమ కైలాసశిఖరాగ్ర తాండవానికి వాద్య సహకారం  చేసుకుంటే,… ప్రకృతికి అంతకు ముందెప్పుడూ కలగని కొత్తకొత్త ఊహలు. ఆ బొమ్మ చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో, ఆడే ప్రతి పలుకులో తమ ఇద్దరి నాట్య విన్యాసాలు, విలాసాలు, వినోదాలు ప్రతిఫలిస్తుంటే చూసి ఆనందించాలనే అప్పటి వరకూ లేని ఒక అందమైన కోరిక. ఆ ఊహలు ఇచ్చిన ఊపులో, ఉత్సాహంతో ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ట చేసింది, ఈ నూతన సృష్టిలో పురుషుడి ప్రమేయం లేదన్న విషయం మరిచింది. ఈ చిన్న పొరపాటు వల్ల అప్పుడే ప్రాణం పొందిన ఆ శిశువుకి ఆత్మజ్ఞానం అలవడదన్న సంగతి ప్రకృతి గుర్తించలేకపోయింది. ఆ చిన్నిబాలుడికి అడుగులు నేర్పుతూ ఆడుకోవడం మొదలు పెట్టింది. ఇంతలో పురుషుని  ధ్యానం పూర్తయింది. ముందుగా అనుకున్న కొత్త నాట్యవిన్యాసాన్ని ధ్యానంలో దర్శించి వచ్చిన అతనికి ప్రకృతిమాతతో ఆడుకుంటున్న అందాల బాలుడు వింతగా అనిపించాడు. అయినా వాడి మీద వాత్సల్యం కలిగింది.  వారిద్దరితో తనూ అడుగు కలిపాడు.  అయితే చిన్నవాడు అడ్డుపడ్డాడు. కేవలం ప్రకృతి ఆలోచనలకి అనుగుణంగా ప్రాణం పోసుకున్న ఆ పసివాడు పురుషుడి ప్రవేశంతో తనలో ఆత్మజ్ఞానం మేల్కొనడాన్ని అర్ధం చేసుకోలేకపోయాడు. పశుప్రవృత్తిలో ఉండిపోయి తామసికుడైన మనిషి జ్ఞాన, విజ్ఞాన, చైతన్యాల్ని తన మూఢత్వంతో ఎలాగైతే ఎదిరిస్తాడో అలాగే పురుషుని రాకని నిరోధించడం మొదలుపెట్టాడు. జ్ఞాన స్వరూపుడైన పురుషుడికి సమస్య అర్ధమైంది. బాలుడి మేధోశక్తి , బుద్ధి ఉండాల్సిన స్థాయిలో లేవు. అందువల్లే తన నిజతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తను ధ్యానంలో మునిగేముందు  కల్పించాలనుకున్న విశిష్టసృష్టి ఇది కాదు. ప్రకృతి తొందరపడి తన అభిప్రాయం తెలుసుకోకుండా చేసిన తక్కువ స్థాయి సృష్టి. ఇంతకుముందు ఉనికిలోకి తెచ్చిన ఏ ఇతర ప్రాణి కన్నా ఎక్కువైనది కాదు ఈ జీవి.  దీనికి కారణం ఈ బాలుడి సృష్టిలో తన ప్రమేయం లేకపోవడమే. విషయం గ్రహించిందే తడవుగా నిజతత్వాన్ని, సత్యాన్ని తెలుసుకోలేని, ఆ ఆసక్తే లేని  తక్కువ స్థాయి బుద్ధితో వున్న బాలుడి శిరస్సుని శరీరం నుంచి వేరు చేశాడు. పురుషుడి మనసు తెలియని ప్రకృతి దుఃఖంలో మునిగిపోయింది. పురుషుడు ఆమెని ఓదార్చాడు. బాలుడి మెదడు, శరీరాల బరువుల నిష్పత్తి  ఇతర ప్రాణులకున్నట్టు వుంటే చాలదనీ, అది పెరిగితే కానీ ముందుగా అనుకున్న అద్భుతసృష్టి జరగదని వివరించాడు. వెంటనే అందుకు తగిన బరువున్న మెదడుతో ఒక తలని సృష్టించి బాలుడి మొండేనికి అతికించాడు. బాలుడు సజీవుడై లేచి ప్రకృతిపురుషులిద్దరినీ తన తల్లిదండ్రులుగా గుర్తించాడు. వారిద్దరూ నిజానికి ఒకటేనని, వారూ తనూ వేరు కాదనే అద్వైతభావాన్ని అంగీకరించాడు. పాంచభౌతికమైన శరీరాన్ని ప్రకృతిగా, భౌతికతకి అతీతమైన ఎరుక/consciousness/congnizance ని పురుషుడిగా గౌరవించి, పూజించి –

వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే |జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ||

అని ఉపాసించిన ఆ క్షణంలో సకలచరాచరాల్లో అత్యున్నత జీవిగా పరిగణించబడిన మానవుడు ఉద్భవించాడు.

సూక్ష్మదృష్టి, గొప్ప శ్రవణశక్తి – అందరి అభిప్రాయాలూ వినిపిచుకునే ఆసక్తి,

ఎలాంటి క్లిష్ట విషయమైనా తేలిగ్గా ఆకళింపు చేసుకోగల మేధోశక్తి,

దేన్నైనా సాధించడానికి అవసరమైన  సారళ్యం, వశ్యత, నమ్రత, మృదుత్వం,

అనుభవాలన్నీ సమభావనతో స్వీకరించి జీర్ణించుకునే స్థితప్రజ్ఞత,

మంచితనంతో అందర్నీ కలుపుకుపోయే స్వభావం,

సంఘాన్ని అదుపులో ఉంచగల నాయకత్వ లక్షణాలు

అలవర్చుకుని వినాయకుడు, గణనాయకుడు అయ్యాడు.

వినాయకుడిలోని ఈ గుణగణాలన్నీ సాధించడంవల్లే శ్రీకృష్ణుడు అంతుచిక్కకుండా అదృశ్యమై తనకి అపనిందలు తెచ్చిన శమంతకమణిని వెతికి తీసుకొచ్చి అపవాదు పోగొట్టుకోవడమే కాక ముందుకన్నా కీర్తివంతుడయ్యాడు.

screenshot_20160905-003223.png

 🌷 🌿 🌾 🌹🌷 🌿 🌾 🌹🌷 🌿 🌾 🌹

గజాననం భూతగణాది సేవితం, కపిత్థజంబూఫలసారభక్షితం

ఉమాసుతం శోకవినాశకారణం, నమామి విఘ్నేశ్వర పాదపంకజం

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏