2020 నాటికి చందమాఁవగారింట్లోగానీ, 2025 నాటికి కుజ బాబాయిగారింట్లోగానీ తిష్ట వేసెయ్యకపోతే….


స్టీఫెన్ హాకింగ్ ఆ మధ్య ఎప్పుడో ఇచ్చిన ఒక స్టేట్మెంటు ఈ మధ్య ఎక్కడో చదివా. హాకింగ్ ప్రకారం భూమ్మీద మానవజాతికి నూకలు చెల్లిపోయే సమయం దగ్గరపడిపోతోంది. యాస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టడం వల్లో, అంతులేకుండా పెరిగిపోతున్న పొల్యూషన్ వల్లో, ఈ రెండూ కాకపోతే సూర్యగోళం అంతరించే క్రమంలో పుట్టే వేడికి భూమి ఆవిరైపోవడంవల్లో నరజాతికి ప్రమాదం పొంచి వుంది కనక అర్జెంటుగా 2020 నాటికి చందమాఁవగారింట్లోగానీ, 2025 నాటికి కుజ బాబాయిగారింట్లోగానీ తిష్ట వేసెయ్యకపోతే మనుషుల పని అంతే సంగతులని స్టీఫెన్ హాకింగ్ ప్రపంచం చెవిలో ఇల్లు కట్టుకుని పోరడం ప్రారంభించాడు. మానవులకి సరిపోయేంత నేల భూమ్మీద లేదని కొత్తగా పుట్టుకొచ్చే జనాభాకోసమైనా గ్రహాంతర వలసలు మొదలుపెట్టాలని ఆయన ఉద్దేశం(ట). నిజమే, ట్రిలియన్ టన్నుల బరువున్న అంటార్కిటిక్ ఐస్ బెర్గ్ కరిగి విరిగిపోయింది మొన్నే. అలాగే అంటార్కిటికా ఐసు మొత్తం కరిగిపోతే ఇంకేమైనా ఉందా?  అప్పటి జనాభా సమస్యలు ఎంత ఇదిగా ఉంటాయో తల్చుకోవాలన్నా ….

మనుషులు మనుగడ సాగించాలంటే వేరే గ్రహాలకి వెళ్ళక తప్పని స్థితిలో ప్రపంచం అంతట్నీ శాసిస్తున్న అవకతవక రాజకీయాలు, గవర్న్మెంట్లు అలాంటి అసాధ్యాన్ని ఎంతవరకూ సుసాధ్యం చేస్తాయో ఊహించలేని పరిస్థితి వుంది. లక్షలమంది ఊచకోత లేకుండా దేశవిభజనలు చెయ్యలేరు; సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, పార్లమెంట్ తలుపులేసి కానీ రాష్ట్రవిభజనలు అవ్వవు. ఒక దేశాన్నిగానీ, రాష్ట్రాన్నిగానీ కాంప్లికేషన్స్ లేకుండా విభజించే కెపాసిటీ, ఆ ఉద్దేశం మనకేకాదు ప్రపంచంలో ఏ జాతికీ ఉన్నట్టులేదు.  సపోజ్, ఫర్ సపోజ్, ఏ దేశం మనుషుల్ని ఆ దేశమే వేరే గ్రహాలకి పంపించుకోవాల్సి వచ్చిందనుకోండి. మన దేశం దాన్ని ఎలా మానేజ్ చేస్తుందో ఊహించుకుంటే కొంచెం ఆదుర్దా తప్పదు. అయినా ఆదుర్దా, ఆ దురదా లేకపోతే ఇండియన్స్ ఎలా అవుతాం? కనక ఊహిద్దాం. ఏయే కులాల వాళ్ళని రాకెట్ ఎక్కించాలి, ఎవరికి ఎంత శాతం సీట్లు రిజర్వ్ చెయ్యాలి, మైనారిటీల సంగతేం చెయ్యాలి? ఎన్ని ఆవుల్ని పట్టుకెళ్ళాలి? బీఫ్ తినేవాళ్ళని రాకెట్ ఎక్కనివ్వాలా వద్దా? వాళ్ళని ఎక్కనివ్వకపోతే అక్కడికెళ్ళాక  బీఫ్-ఫెస్టివల్స్ ఎవరు చేస్తారు? బాంక్ రుణాలు ఎగ్గొట్టి  విదేశాల్లో కూచున్న టైకూన్లని వాళ్ళు ఇప్పుడుంటున్న దేశాలనుంచి ఎక్స్ట్రాడిషన్ ఆర్డర్స్ ఇప్పించి ఎలా పట్టుకెళ్ళాలి? కుంభకోణాలు చేసి జైల్లో వీఐపీ సెల్స్‌లో “మగ్గు”తున్నవాళ్ళ శిక్షాకాలం అవతల గ్రహాలకి తీసుకెళ్ళి మరీ పూర్తి చేయించాలా, అలా అయితే అక్కడికి ముందుగా వెళ్లి వీఐపీ ఏర్పాట్లు చెయ్యాల్సిన ఆఫీసర్లు ఎవర్ని పంపాలి? సినిమావాళ్ల సంగతేంటి? పై గ్రహంలో కట్టిన సినిమా హాల్సన్నీ “ఆ నలుగురి” కంట్రోల్లోనే ఉంచాలా లేక ఇంకెవరైనా కొత్త నలుగుర్ని ప్రోత్సహించాలా? స్విస్-బాంకుల్లో వున్న నల్లధనాన్ని వెనక్కి, ఇండియాకి కాకుండా తిన్నగా వలస గ్రహాలకి రీ-డైరెక్ట్ చెయ్యడం బెటరా? అక్కడే అందరి ఎకౌంట్స్‌లో పదిహేనేసి లక్షలు పడెయ్యడం ఈజీగా ఉంటుంది కదా?

ఇవన్నీ తేల్చుకోనిదే మన గ్రహ-వలస రాకెట్ స్టార్ట్ అవుతుందా? లేక రాష్ట్రవిభజనల్లాగా గ్రహవిభజనలు ఇక్కడే చేసేసుకుని ఎవరి గ్రహానికి వాళ్లని పంపాల్సి వస్తుందా? ఏమో, ఏమౌతుందో!!

కలువకు చంద్రుడు……. కమలానికి సైకిలు…… 

కలువకు చంద్రుడు ఎంతో దూరం

కమలానికి సైకిలు మరీ దూరం

దూరమైన కొలదీ పెరుగును పోరాటం

అధికారం కొరకే అందరి ఆరాటం

కలువకు చంద్రుడు ఎంతో దూరం

కమలానికి సైకిలు మరీ దూరం

పార్టి పార్టీకి తేడా వుంటుంది

పవరొచ్చే యోగం ఏ పార్టీకి పడుతుంది?

ఏ పార్టీకైనా పవరే కావాలీ

పవర్లేని పార్టీ ఎవరిక్కావాలీ?

కలువకు చంద్రుడు ఎంతో దూరం

కమలానికి సైకిలు మరీ దూరం

***