బ్రహ్మాండమైన అప్పడాలకర్రతో చపాతీపిండిని వొత్తినట్టు భూగోళాన్ని వొత్తి, చాపలా చుట్టి…


భూమి గుండ్రంగా లేదు ఫ్లాట్‌గానే వుందని సడెన్‌గా ఎవరో కనిపెట్టేసినా, సూర్యుడు ఉదయిస్తున్న దిక్కు తూర్పు కాదు అది పడమర అని ఇంకెవరైనా ప్రూవ్ చేసేసినా మన చిన్న ప్రపంచంలో మారేదేమైనా ఉందా? ఏం లేదు కదా? కాదు కాదు కొన్ని మారతాయి. అవి సైన్సు & జాగ్రఫీ  టెక్స్ట్-బుక్సు, మతగ్రంధాలు/చరిత్రలలో అక్కడక్కడా కాసిని మార్పులూ ; మన సుప్రభాతాల్లో పూర్వాసంధ్యా ప్రవర్తతే అనే బదులు పశ్చిమా సంధ్యా ప్రవర్తతే అనీ ఇలా ఏవో కొన్ని చిన్న మార్పులు చెయ్యాలేమో**👇. కానీ ఓవరాల్‌‌గా భూమ్మీద పెనుమార్పులేవీ వచ్చి పడిపోవు కదా. అంతా మామూలుగా ఎప్పట్లాగే నడిచిపోతూ వుంటుంది. అలా నడిచిపోయే వాటిల్లో రాజకీయాలు కూడా వుంటాయి. అలాంటి రాజకీయాలంటే ఇష్టం వుండదు కొందరికి. వాళ్ళల్లో కొందరు, ఫేషన్ కోసం కావచ్చు, అవేంటో అర్ధమే కాదంటారు. వాళ్ళని అనడానికీ లేదు పాపం. ఎందుకంటే – మొదటి కారణం, ముఖ్యమైనదికూడా, వాళ్ళలో నేనూ ఒకణ్ణి కావడం. పాలిటిక్స్ వల్ల ప్రపంచ లేక ప్రజా సమస్యలు ఏవన్నా పర్మనెంటుగా తీరిపోయాయా అంటే చెప్పడం కష్టం కానీ వాటి వల్ల కొత్త సమస్యలేవన్నా పుట్టుకొచ్చాయా అంటే ఆన్సర్ చాలా ఈజీ కావడం రెండోదీ, మొదటిదానికంటే ఇంపార్టెంటయినదీ అయిన కారణం. అంచేత చాలా మంది పాలిటిక్సుని అర్ధం చేసుకోడం మానేసి అందులో కాలక్షేపాన్నే వెదుక్కుంటారు. ప్చ్! మంచి పరిణామం కాదు కానీ ఏం చేస్తాం? కోక్ మంచిది కాదు, సిగరెట్లు మంచివి కావు, నైంటీ పర్సెంట్ సినిమాలు మంచివి కావు, తాగుడు & డ్రగ్స్ అసలే మంచివి కావు – కానీ జనం అవన్నీ మానేస్తున్నారా? ఈ ప్రపంచంలో ఎందుకో కొన్ని మంచి పరిణామాలు సంభవించవు. ముఖ్యంగా నేరాలు-ఘోరాలకి సంబంధించి. దాన్సంగతి తర్వాత, ముందు రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాల్లో దొరికిన కాలక్షేపం బఠానీలు రెండు, (అవేంటో పాత మిస్సమ్మ పాటల్లో దొరికాయి) –

ఒకటో బఠానీ – మీకు మీరే మాకు మేమే ఎందుకీ రుసరుస నస గుస గుస?

మీకు మీరా మాకు కోవింద్ అందుకేగా రుసరుస నసనస బుసబుస….

రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయితే బావుండేదని అందరికీ అనిపిస్తుంది కానీ ఏకాభిప్రాయం అనేది కుదిరితే అసలు ఎలక్షన్లెందుకు? రాజకీయాలెందుకు?

రెండో బఠానీ -బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే…. టూ టు టు టూ — టు టు — టూ టు టు టూ..

రాష్ట్రపతిభవనది అందరిదీ మరి కోవిందుడందరివాడేనా??? టూ టు టు టూ — టు టు — టూ టు టు టూ..

ఆ సంగతిప్పుడే ఎలా తెలుస్తుంది? ఏదైనా రాజ్యాంగ సంక్షోభం వస్తేనే గదా రాష్ట్రపతికి పరీక్ష. అలాంటి సంక్షోభాలు వచ్చే సూచనలేం లేవు, ఎట్-లీస్ట్ 2024 వరకూ. సో, హాపీ ప్రెసిడెంట్-షిప్ టు కోవింద్-జీ !!!💐💐💐

(**ఇన్ని మార్పులూ చేర్పులూ చేసే బదులు సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తే అదే తూర్పు అనెయ్యొచ్చుగా. అనెయ్యొచ్చు కానీ అనలేదు అంతే)

భూమి గుండ్రంగా లేదు ఫ్లాట్ గానే వుంది …. blah, blah…. తో మొదలైంది ఈ టపా. ఆ వాక్యాలు చాలా యధాలాపంగా పడ్డాయి. అనుకున్నంతా రాసేసాక కొన్నే రోజులముందు చూసిన కొంటెబొమ్మల బాపుగారిదీ,  ఈ మధ్యే నేను మొదటిసారి చూసినదీ ఈ 👇 కార్టూన్ యాదికొచ్చింది.

Untitled(picture courtesy : బాపు కార్టూన్లు – సంపుటి2)

 

మొట్టమొదట వరాహావతార కధ విన్నప్పుడు ఇదే సందేహం కలిగింది. ఎవర్నైనా అడిగినా అప్పటికి అర్ధంకాని ఎక్స్ప్లనేషన్లు ఇచ్చేవాళ్ళు. భూమి వెలగపండులా వుందనీ, అదే కండిషన్‌లో  హిరణ్యాక్షుడు చాపలా చుట్టేశాడనీ రెండూ నమ్మిన ఒకరేం చెప్పారంటే అది భూమిని ఫిజికల్‌గా చుట్టేయ్యడం కాదు బాబూ, భూమిలోని సారాన్ని, శక్తినీ, కళనీ అలా చుట్టేసాడూ అసురుడు కదా అని.. ఆ వయసులో ఇదేదో బానేవుందే అనిపించింది. కబ్జాలూ, కాలుష్యాలూ, వగైరా అర్ధం అయ్యాకా ఆ metaphorical meaning ఇంకా బాగా తెల్సిందనిపించింది. ఇప్పుడీ బొమ్మ చూశాకా బ్రహ్మాండమైన అప్పడాల కర్రతో చపాతీపిండి ముద్దల్ని వత్తినట్టు భూమినీ వత్తేసి ఆ పైన చాప చుట్టలా చుట్టెయ్యలేడా అసురుడు అనికూడా అనిపించింది. ఇదే నిజమైతే కృతయుగంలోనే చపాతీలు, అప్పడాలు, అప్పడాల కర్రలు (వాటికున్న ఇతర ఉపయోగాలతో సహా 😜) మన సంస్కృతిలో భాగం అయిపోయాయనే ఆధారాలు దొరికినట్టే.  తర్వాత సింహాచలం గర్భగుడి గోపురంపైనుండే వరాహావతార ప్రతిమ మనసులో మెదిలి, ఆ మూర్తి భూమిని ఏ ఆకారంలో మోస్తున్నాడో చూద్దామని గూగులించా. సింహాచలపు విగ్రహంతో బాటు ఇంకా చాలా ప్రాచీన ఆదివరాహ శిల్పాలు దొరికాయి. ఆల్మోస్ట్ అన్నిట్లోనూ భూదేవి స్త్రీమూర్తిగా విష్ణువు భుజాలపై వుంది. మన ప్రాచీన శిల్పులు ఎక్కడా కపిత్థాకారాన్నిగానీ, చాప చుట్టనిగానీ దృష్టిలో వుంచుకున్నట్టులేదు. ఈ కాస్త పరిశీలనతో సిద్ధాంతాలు స్థాపించేటంత అతితెలివి లేదు కనక శిల్పకళకి సంబంధించినంత వరకూ భూదేవిని ఒక శక్తిగా, కళగా పరిగణించేవారేమోననీ, గోళానికి బదులు స్త్రీరూపం చెక్కడంలో కళానైపుణ్యం ప్రదర్శించేందుకు ఎక్కువ అవకాశం వుండడం కూడా ఓ కారణం కావచ్చనీ  అనుకున్నా.     ఎలా చూసినా ముందు చెప్పిన metaphorical meaning ఎప్పటికీ సరిపోతుంది & నా వరకూ భూమి తల్లే కానీ, గోళం కాదు. మన సైన్సు మూలాలపై ఫర్దర్ రీసెర్చ్ చేసే శక్తీ ఆసక్తీ ఉన్నవారికి ఇదో మంచి పరిశోధనాంశం కావచ్చునేమో. అంటే ఎక్కడైనా ఆదివరాహ శిల్పం భూమాతని కాక భూగోళాన్ని మోస్తూ చెక్కబడి వుంటే ఆ శిల్పపు ప్రాచీనత ఆధారంగా భూమి గోళాకారంలో ఉందనే సంగతి మనవాళ్ళకి ఎప్పటినుంచీ తెలుసన్నది అంచనా వెయ్యచ్చు. గ్రంధాలలో వున్న వాక్యాలూ, శ్లోకాలూ ప్రక్షిప్తాలనే వాదనకి శాస్త్రీయమైన సమాధానం ఇందులో దొరకొచ్చు అని నాకనిపించింది. “కపిత్థాకారం భూగోళం …” చుట్టూ కూడా ఏదో గందరగోళం ఏదో ప్రదక్షిణాలు చేస్తోందని విన్నాను. ఒకవేళ ఆల్రెడీ ఈ విషయాలు ఎవరైనా తేల్చేసివుంటే please ignore my ignorance. ఏది ఏమైనా……

హన్నా!! బాపూగారూ!! చిన్నకార్టూన్‌తో ఎన్నెన్ని ఆలోచనలు పుట్టించారు? మీరు సామాన్యులు కాదండీ🙏🙏🙏

ఇందాకా నేరాలూ-ఘోరాల గురించి అమూల్యమైన అభిప్రాయం ఒకటి చెప్పాలనుకున్నా కదా? ఇప్పుడదీ -పాత సినిమాల్లో పోలీసులు క్రైం సీన్‌కి విజిల్స్ ఊదుతూ పరుగెత్తుకొస్తుంటే – “వీళ్ళొస్తున్నట్టు తెలిస్తే విలన్ పారిపోనేపోతాడు కదా! వాణ్ని పట్టుకునే ధైర్యం లేకనా? లేకపోతే దోచింది చాలు ఇంక తప్పించుకోమనా వీళ్ళు విజిల్స్ వూదేది,” అని అనవసరపు డౌట్లొచ్చేవి. ఏదైనా నేరవ్యవస్థ పైన ఏ మాత్రం ఆధారాలు దొరికినా వీళ్ళ మీద అనుమానం వుందీ, వాళ్ళ మీద సందేహం వుందీ అంటూ ప్రెస్-మీట్లు పెట్టడం అవసరమా అని. ఇలా ఐతే నేరస్తులకి ఒక ఝలక్ ఇవ్వడం ఎలా కుదురుతుందీ?🤔  !!! చట్టం తన పని టాను – ఛ! చ! టాను కాదు తాను, నేరవ్యవస్థ అని టైపు చేస్తేనే కీబోర్డుకీ మత్తెక్కుతున్నట్టుంది😇 –  చట్టం తన పని చేసుకుపోతే నేరవ్యవస్థలని ఒక కుదుపు కుదపగలదు. కానీ ప్రెస్-మీట్లు పెడితే కుదపడానికి ఏం మిగులుతుంది? హ్హేఁవీఁ మిగల్దు. అంతే సంగతులు. బై4నౌ.

***