(1)ఒక్క బీరు తప్ప – నీళ్ళు, పాలు, పళ్ళు, నెయ్యీ, బిర్యానీ, చాయ్, …. అన్నీ కల్తీయేనని… (2)నాని సినిమాలు మిస్సయినా, లేటుగా వెళ్ళినా కళామతల్లికి అన్యాయం చేసినట్టేనని….


నేను హైస్కూల్లో వున్నప్పుడు అదేఁవిఁటోగానీ 😆 యాన్యువల్లీ పరీక్షలు (పరిక్షలు అని ప్రొనౌన్స్ చేసేవాళ్ళం), వేసంకాలం, శ్రీరామనవమి, నవమితోపాటు రాత్రిళ్ళు శ్రీ కోటసచ్చిదానందశాస్త్రిగారి హరికధలు అన్నీ ఒక్కసారే వచ్చేసేవి. నాకేకాక నా క్లాసుమేట్లందరికీ ఇవన్నీ కామన్‌గా వచ్చేసేవి. అందరం అన్నిటికీ న్యాయం చేసే ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఈ సమయమే మా ఇంటికి సంబంధించి ఒక ప్రత్యేకసందర్భం కూడా, ప్రతి ఏటా. అదే ఫోర్-ఫాదర్స్‌*ని అంటే పితృదేవత*ల్ని తల్చుకుని, గౌరవించి, వాళ్ళున్న లోకాల్లో వాళ్ల అవసరాలన్నీ తీరేలా శాస్త్రప్రకారం చేయాల్సిన విధులన్నీ చేయడం. ఆ రోజంతా మా అమ్మానాన్నలు ఎంత బిజీ అంటే అంత బిజీ. ఒక పక్క ఆ రోజున చేయాల్సిన వంటల ఏర్పాట్లతో అమ్మ, మరోపక్క కార్యక్రమం చేయించడానికి వచ్చిన బ్రాహ్మలతో నాన్న… అన్నీ సరిగ్గా, శ్రద్ధగా చెయ్యడానికి ఎంత శ్రమ పడేవారో, ఎక్కడా విసుగు లేకుండా… ఈ తంతులు, విధులు ఆ వయసులో అస్సలు అర్ధం కాకపోయినా పెద్దలంటే చూపించే భక్తిశ్రద్ధలు, వాటి వెనకనున్న స్ఫూర్తి, సంస్కృతి ఎంతో కొంత అర్ధమయ్యేవి. ఇంకోపక్క పిల్లలం – ఒక గదిలో పుస్తకాలు ముందేసుకుని పరీక్షలకి ప్రిపరేషన్‌‌‌ వల్ల ఒళ్ళూ, పక్క గదిలోనుంచి వచ్చే హోమం తాలూకు పొగతో కళ్ళూ మండుతుంటే భోజనాల టైమయ్యేవరకూ – బాగా లేటయ్యేది – ఎదురుచూస్తూ వుండేవాళ్ళం. ఆ రోజు మెనూ స్పెషల్‌గా వుండేది – అందులో అల్లం పచ్చడి, గారెలు, మెంతిబద్దలు, నువ్వులపొడి కంపల్సరీగా ఉండేవి. సంవత్సరానికి ఒకటి, రెండుసార్లే వచ్చే ఈ స్పెషల్ మెనూ వల్ల తిన్న అనుభవం కూడా ఒక రకంగా, ప్రత్యేకంగా, డిఫరెంట్‌గా వుండేది. ఎక్కువగా అలవాటులేని పదార్ధాలు తిన్న భుక్తాయాసంలాంటి ఫీలింగ్ (ఎందుకోగానీ దీన్ని గీర అనేవాళ్ళు) తీరడానికి సాయంత్రం కాస్త కాఫీ పోసేవారు, పిల్లలక్కూడా. 

ఇదంతా ఇక్కడ చెప్పిందెందుకంటే, కోటసచ్చిదానందశాస్త్రిగారి హరికధకి బయల్దేరేముందు మైండ్-బాడీ ప్రిపరేషన్‌ని ఒక ఊహాచిత్రంగా గీయడానికి. ఊహాచిత్రానికి వాడిన పెయింట్స్ – శ్రీరామనవమి తాటాకు పందిళ్ళలో వచ్చే ఒక వింత సువాసన + వడపప్పు-పానకాల ఘుమఘుమలు-చురుక్కులు + అల్లం పచ్చడి, గారెలు, మెంతిబద్దలు, నువ్వులపొడిల మల్టీ-స్టారర్ ఎఫెక్ట్ + యాన్యువల్లీ పరీక్షల టెన్షన్ + వేసంకాలం రాత్రి ఆరుబయట ఈతాకుచాపల మీద కూచోడం /పడుకోడంలో వుండే హాయి +శ్రీ కోటా హరికధల్లో ఆయన ట్రేడ్-మార్క్ హాస్యంతో కూడిన నృత్యగానకధా సంవిధానం. ఇన్ని కలిసిన ఆ అనుభవం విలక్షణం, ఎప్పటికి మర్చిపోలేనంత. 

ఇప్పుడింక ఈ ఉపోద్ఘాతానికి కారణం మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా విలక్షణంగా వుంటుందో ఉండదో గానీ పెర్వర్టెడ్‌‌‌గా అనిపించక తప్పదు. కానీ ఏం చేస్తాం? ఉపోద్ఘాతానికి కారణం ఎక్సైజ్ డిపార్ట్మెంటే. 

ఎందుకో చెప్పేముందు కోటా సచ్చిదానందశాస్త్రిగారు చెప్పిన ఒకట్రెండు జోకులు చెప్పుకోవాలి. మొదటిది – ఆయనొకసారి గుంటూరులో, ఆయనది గుంటూరే, ఎక్కడికో వెళ్తుంటే ఒక ఇంటి ద్వారం మీద ” ఇచట చేతులతో తాకకుండా వత్తిన అప్పడాలు దొరుకును” అని రాసున్న బోర్డు కనిపించిందిట. ముందు నమ్మకలేకపోయినా, ఇది నిజమైతే ఇంతకంటే పరిశుభ్రమైన అప్పడాలు ఎక్కడ దొరుకుతాయ్? కాసిని పాకెట్లు కొందామనిపించి లోపలికివెళ్ళారు. లోపల కొందరు స్త్రీలు నిజంగానే చేత్తో ముట్టుకోకుండా అప్పడాలు వత్తుతున్నారు ……………………………………………………….  

 

 

……………………………………………………………………….కాళ్ళతో.

చివరికి అప్పడాలు కొన్నారా లేదా అనేది చెప్పలేదు – శ్రోతల నవ్వులు, చప్పట్లలో వినబడదని. డెబ్భైఎనిమిది – ఎనభైలలో ఈ జోకు కొత్తదే. బాగా నవ్వాం. జోకు పాతదైనా, ఎన్నోసార్లు విన్నదే అయినా ఆయన చెప్పే విధానం మళ్ళీ కొత్తగా నవ్వించేది.

ఒకసారి హరికధలో ఏదో సందర్భంలో గాంధీగారి ప్రస్తావన వచ్చింది. ఆయన గురించి చెబుతూ ఆయనకి ఈ కాలంలో అందుతున్న గౌరవంపై చమత్కరించిన సందర్భం. ఇదీ గుంటూరులోనే అనుకుంటా – వీధిలో నడుస్తూ అక్కడ కనిపించిన బ్రాందీ షాపు పేరు చూసి రామ రామ అనుకున్నారుట. ఆ షాపు పేరు గాంధీ బ్రాందీ షాపు. అప్పుడప్పుడే అర్ధంకాని సంగతుల్నీ, అర్ధంలేని విషయాల్నీ ఉతికి ఆరెయ్యడం మొదలెట్టిన టీనేజర్లందరం ఈ విషయంతో బాగా కనెక్ట్ అయ్యాం. అవును వెంకటేశ్వరా వైన్స్, లక్ష్మీ బార్, గణేష్ బీడీ, …. ఇలాంటి పేర్లు చూసినప్పుడల్లా చిన్నప్పుడు షాకింగ్‌గా అనిపించేది. తాగుడనేది – అది సారా కానీ , సిగరెట్ కానీ – పాపం కదా, దేవుడికిష్టంలేనివి కదా, పాపభీతి – దైవభక్తి అని నీతులు చెప్పే పెద్దలెవరూ ఇలాంటివి చూసి మాట్లడరేంటా? అనిపించేది. స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ అనే చట్టబద్ధమైన “హెచ్చరిక” చూసినా చుట్టకంపు కొట్టినంత, చేపల బుట్ట పక్కన కూచున్నంత చిరాగ్గా వుండేది.అప్పటికి సమాజంలో ఉన్న లొసుగులన్నీ తెలీదుకదా, అలా ఫీలయ్యేవాళ్ళం. అదేదో సినిమాలో జగదాంబా చౌదరిగారు చెప్పినట్టు నలభైయ్యేళ్ళు వచ్చాక అన్ని షాకులూ అలవాటైపోతాయని తెలిసాక ప్రతి విషయానికీ షాక్ అవ్వడం మానేసి, కొన్ని నిజంగా షాకవ్వాల్సిన వాటికే అవుతున్నాం.  

అలా గుండె రాయి చేసేసుకున్నాక, ఇంక ఇది రాయే, గుండెకాదు అని కన్-ఫర్మ్ చేసేసుకున్నాక ఇవాళ న్యూస్-పేపర్లో బార్లకి, మద్యంషాపులకి దేవుడి పేర్లు పెట్టొద్దని ప్రభుత్వం హుకుం జారీ చెయ్యడం చాలా హాయిగా అనిపించింది. మనుషుల్ని చెడ్డ అలవాట్లకి దూరం చేసే అలవాటు ప్రభుత్వాలకి ఎలాగో లేదు, రాదు కూడా. ఎట్ లీస్ట్, దేవుడి పేరుని వాటికి దూరం చేసే ప్రయత్నం, మాటమాత్రంగానైనా సరే, నాకు భలే నచ్చింది. బీరు అనేది హెల్త్ డ్రింక్ అన్న ఉవాచ ఒక టంగ్-స్లిప్ అయ్యుండచ్చు అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చెయ్యడం కూడా జరిగింది. నిజానికి ఆ స్టేట్-మెంట్ ఒక విధంగా కరెక్టేనేమో కూడా. నీళ్ళు కల్తీ, పాలు కల్తీ, పళ్ళు కల్తీ, నూనె/ నెయ్యీ కల్తీ,  నాన్-వెజ్ బిర్యానీ కల్తీ, ఇరానీ చాయ్ కల్తీ. ఈ కల్తీ సరుకంతా మింగి ఇళ్ళు-ఒళ్ళు గుల్ల చేసుకునే బదులు ఒక్క బీరు మాత్రం తాగితే అది ఇంటికి, ఒంటికి, జేబుకి కూడా కొంత నయం కాదూ???అర్ధం చేసుకోరూ !!!  😂😂😂

(** ఫోర్-ఫాదర్స్/ పితృదేవతలు అంటే లింగవివక్ష చూపించినట్టు అనిపిస్తుంది కొందరికి – నాతో సహా. అందులో తప్పు లేదు కూడా. కావాల్సినంత, కాదు అక్కర్లేనంత లింగ వివక్షత వుందని అందరికీ తెలుసు. అంచేత పూర్వీకులు / ancestors అనడం న్యాయం. )

ఇవాళ్టికి ఇంతే సంగతులు. అసలే “నిన్ను కోరి” సినిమాకి టైమయ్యింది. నాని సినిమాలు మిస్సయినా, లేటుగా వెళ్ళినా కళామతల్లికి అన్యాయం చేసినట్టేననిపిస్తుంది. సో, బై4నౌ 🙏.