(1) ఏమో! మనకేం తెలుస్తుంది? అసలే సామాన్యులం!! (2) అప్పటికి సోషల్ మీడియా అంటే తాటాకులే (3) తిక్కనగారి దివ్యదృష్టి


పాండవులు అరణ్యవాసం పూర్తిచేసి అజ్ఞాతవాసానికి సిద్ధం అవుతూ మారువేషాల్లో విరాటరాజు కొలువులో చేరడానికి నిర్ణయించుకున్న సందర్భంలో వాళ్ళ పురోహితుడు ధౌమ్యుడు కొన్ని జాగ్రత్తలు – అంటే రాజు దగ్గర పని చేసే ఉద్యోగులు పాటించవలసిన DOs & DON’Ts వివరిస్తాడు. వీళ్ళదసలే రాచరక్తం. బ్రాహ్మడు, వంటవాడు, డాన్స్‌మాస్టర్, దామగ్రంధి the shepherd, Horse Trainer మరియు పూలమాలలు కట్టే దాసీ వేషాలు వేస్తామంటున్నారు. అన్నీ నాన్-క్షత్రియ వేషాలే. రాచరక్తాన్ని కంట్రోల్ చేసుకోలేక, భిన్నంగా ప్రవర్తించలేక ఎక్కడ బయటపడతారో, ఏం కొంపలు ముంచుకుంటారోననే భయం ఆయనకుంటుంది కదా? ఇప్పటికే ఎంత నెత్తి మీదకి తెచ్చుకున్నారో చూసివున్నాడయ్యె. ఆ సందర్భంలోనే ఈ వాక్యాలు వస్తాయని గుర్తు – 
 
నిండు మనంబు నవ్య నవనీత సమానము
పల్కు దారుణాఖండల శస్త్ర తుల్యము
జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును, రాజులందు విపరీతము
కావున విప్రుడోపు, 
నోపండతి శాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్‌
 
అప్పట్నుంచీ ఇప్పటివరకూ అప్పుడప్పుడూ ఈ మాటల్లోని నిజాన్ని ఋజువు చేసే సందర్భాలు బోల్డన్నిసార్లు వచ్చే వుంటాయి. విప్రులు, రాజులు అని చూసేకంటే పాలకులు, వారి సలహాదారులు/ మంత్రులుగా విడదీసి చూస్తే ఇంకాబోల్డన్ని సందర్భాలుంటాయి. వస్తూనే ఉంటాయ్. ఆ సందర్భాలు మీడియాకి మేతగాను, ఎగస్పార్టీ నేతలకి రాజకీయ పెట్టుబడిగాను మారే సందర్భాలు మాత్రం ప్రజాస్వామ్యం అనే బ్రహ్మపదార్ధం అవతరించాకే వచ్చి వుంటాయి.
ఆ పద్యం చూస్తే రెండు వర్ణాల స్వభావాన్ని చెప్తున్నట్టుగా వుంది. కానీ, reading between the lines, నిజానికది వర్ణాలకీ, వ్యక్తులకి అతీతమైన అర్ధం. ఒకే వ్యక్తిలోకావచ్చు, ఒక వ్యవస్థలో కావచ్చు ఈ రెండు స్వభావాల అవసరాన్ని, అనివార్యతని ఎత్తిచూపించే వాక్యాలవి. ఈ రెండు స్వభావాలూ ఒక బాలన్స్‌తో, ఒక సమన్వయంతో పని చేసినప్పుడే రాజ్యవ్యవహారాలు సజావుగా నడుస్తాయనే నీతివాక్యాలు కూడా. 
ఆ బాలన్సూ, ఆ కోఆర్డినేషనూ దారి తప్పినప్పుడు అది మీడియారాతలకి, ఎగస్పార్టీ నేతలకి కావాల్సినంత మేతగా తప్ప ఎందుకూ పనికిరాదని మాత్రం చెప్పలేదు. అప్పటికి సోషల్ మీడియా అంటే తాటాకులే కనక, వాటి మీద రాయడం వాట్సాప్, ఫేస్-బుక్కుల్లో రాసేసినంత, గీసేసినంత వీజీ కాదు కనక ఆ అవసరం వచ్చి వుండదు. 
పద్యంలో అలా అన్నాడు కదాని నోటికొచ్చింది మాట్టాడేసి, నా మనసు వెన్న కాబట్టి మాటల్ని పట్టించుకోవద్దంటే కుదురుతుందా? అందరూ ఒకేలా తీసుకుంటారా? అన్నివేళలా ఒకలాగే అర్ధం చేసుకుంటారా? సందర్భాన్ని బట్టీ వాక్చాతుర్యం వుండద్దూ? రాజకీయాలు ఎలా ఏడ్చినా రాజనీతి అని ఒకటుంది కదా? ఏమో మనకేం తెలుస్తుంది? అసలే సామాన్యులం.
అలాగే ఆ పద్యంలోనే ఇలా కూడా చెప్పాడు కదా అన్జెప్పి –  అన్నిట్లోనూ రాజకీయమే చూస్తాం, ఎండని బట్టీ గొడుగు మారుస్తాం అంటూ –
వోట్లూ, నోట్లూ, ఫైట్లూ వున్నచోట వ్యూహాత్మకమౌనం, అవిలేనిచోట ఊహాత్మక ధైర్యసాహసాలు ప్రదర్శిస్తే మాత్రం బావుంటుందా? ఏమో మనకేం తెలుస్తుంది? అసలే సామాన్యులం.
 
అదంతా అలావుంచి “జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతము” ఈ పదాలు చూస్తుంటే తిక్కనగారు (తిక్కనగారేనా?) ఏదో దివ్యదృష్టితో ఫ్యూచర్ చూసి మరీ రాసినట్టు లేదూ? తెలుగులో కాస్త పట్టుండి, పదాలకి నానార్ధాలు తెలిసి, రోజూ న్యూస్ ఫాలో అయ్యేవాళ్ళకి తిక్కనగారి దివ్యదృష్టి తప్పకుండా అర్ధం అవుతుంది. మనకేం తెలుస్తుంది? అసలే సామాన్యులం.
***🙏***