క్విడ్- ప్రో -కో అంటే తెలీని రాములవారు…/ ॐఉపేంద్రుడిॐకి ఉచితసలహాలు…./


బద్ధకస్తుడికి పనెక్కువ, అవినీతిపరుడికి భక్తెక్కువ. నిజమా అనడగొద్దు. అదేటైపు భక్తి అనికూడా అడగద్దు, అర్ధం చేసుకోవడమే. ఎందుకంటే నవవిధభక్తిమార్గాల్లో అవినీతిభక్తి అనే కేటగిరీ లేదు, కానీ అదేంటోగానీ దొరికిన ప్రతి (దాదాపుగా) అవినీతిమింగలం దగ్గరా పెద్దఎత్తున ఆధ్యాత్మిక సరంజామా దొరుకుతుంది. ఆ👇 ఫోటోలోవున్నavineeti

ఆ బొమ్మలు, ఐ మీన్, దేవుళ్ళ విగ్రహాలు మొన్ననే ఒక అవినీతిమిగలం ఇంట్లో దొరికాయట. ఎంతందంగా చూడగానే పూజ చెసేయ్యాలనిపించేంత కళగా వున్నాయో? సదరు తిమింగిలాలు ఎంతటి భక్తులో, ఎంత నిష్ఠగా దైవసంబంధ కార్యక్రమాల్లో ములిగి తేలుతూ వుంటారో అనిపించేయట్లా? అనిపిస్తుంది దాంతోపాటు అవినీతికి, ఈ టైపు ఆధ్యాత్మికతకి అవినాభావసంబంధం ఏంటా అనికూడా అనిపిస్తుంది. అలా అనిపించే ఆలోచిస్తే ఇలా👇 అనిపించింది –

“గుడిని మింగేవాడు ఒకడైతే – గుడిలోని లింగాన్ని మింగేవాడు మరొకడు,” అన్న సామెత ఎన్ని శతాబ్దాల ముందు పుట్టిందో తెలీదు కానీ చాలా చాలా పాతదే కదూ. ఆనాటి అవినీతికి ఆ సామెత ఒక ఆధారం. నిజానికి త్రేతాయుగంలోనే ఈ పరిస్థితి వుంటే ఇప్పటి మాట చెప్పేదేముంది? రావణాబ్రహ్మలో దైవభక్తి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హిజ్ కరప్షన్. శివుడి ఆత్మలింగం, కుబేరుడి లంకాద్వీపం, పుష్పక విమానాలతో మొదలుపెట్టి మహానుభావుడు కబ్జా చెయ్యని విషయం వుందా అని? అసలు త్రేతాయుగం నాటికి అవినీతిపైన ఎంత అండర్‌స్టాండింగ్ వచ్చేసిందో రామాయణంలోనే ఉత్తరకాండలోని చిన్న ఎపిసోడ్ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు అవినీతిపరుడు దేవుడి జోలికెళ్తే ఏమౌతుందో భావిభారత అవినీతిమింగలాలకి చెప్పే ఓ వార్నింగ్ కూడా అందులో వుంది. బాగా గాయపడిన ఒక కుక్క న్యాయంకోసం రాముడి దగ్గరకొస్తుంది. ఒక బ్రాహ్మడు తనని అనవసరంగా కొట్టాడని అతన్ని శిక్షించమని కోరుతుంది. బ్రాహ్మణున్ని కోర్టుకి పిలిపించి, అతను కుక్కని కొట్టడం నిజమేననని తేల్చుకున్నాక, ఏం శిక్ష విధించమంటావని కుక్కనే అడుగుతాడు రాముడు. అతన్నో దేవాలయ పూజారిగా నియమించడమే శిక్ష అంటుంది కుక్క. అదేంటని ఆశ్చర్యపోతాడు పుట్టినప్పట్నుంచీ మంచి బాలుడు, క్విడ్-ప్రో-కో అంటే అదే భాషలో మాటో కూడా తెలియనివాడూ అయిన రాములవారు. అప్పుడు కుక్క, “అయ్యా, నేను పూర్వజన్మలో పూజారిని, దేవాలయంలో దేవుడికి పళ్ళూఫలాలూ నైవేద్యంపెట్టి ఆ దేవుడి సొమ్ములు నేను ప్రసాదంగా, ‘అందాలరాముడు’లో ‘అల్లురామలింగయ్య’లాగా, పుచ్చేసుకునే వాణ్ని, అందుకే ఇలా కుక్కనై పుట్టి కుక్కబతుకు బతుకుతున్నాను. ఈ బ్రాహ్మడు కూడా శునకజీవితం అనుభవిస్తాడు, పూజార్ని చేసెయ్యండి,” అని అక్కడున్న బల్లలన్నీ గుద్ది, కనిపించిన కుండలన్నిట్నీ పగలగొట్టి చెప్పిందిట.

ఇక్కడవరకూ రాశాక, “గుడిని మింగేవాడు ఒకడైతే – గుడిలోని లింగాన్ని మింగేవాడు మరొకడు” సామెతకి నేపధ్యం ఏమిటా అని గూగులిస్తే అది దొరకలేదు కానీ ఓ ఏడాది క్రితం రిటైర్డ్ డీజీపీ శ్రీ అరవిందరావు గారు నరసింహావతారంపై రాసిన ఒక ఆర్టికల్ కనబడింది, ఇక్కడ http://www.andhrajyothy.com/artical?SID=332375. అందులో ఆయన నరసింహావతారం అవినీతి నిర్మూలన కోసమే వచ్చిందని తేల్చారు. అసలు హిరణ్యకశిపుడు అంటేనే బంగారం తినేవాడు అని అర్ధం చెప్పి అవినీతికి, అసురుడికి మధ్యనున్న అనురాగబంధాన్ని  ఆవిష్కరించారు. దీన్నిబట్టీ కాలంలో ఇంకొంచెం వెనక్కి వెళ్తే హిరణ్యాక్షుడు అంటే బంగారంపై కన్నేసినవాడనీ, బంగారం భూమిలో వుంటుంది కనక గనులని అక్రమంగా తవ్వేవాడనీ, ఈనాటి భూకబ్జాదారులందరికీ పితామహుడనీ అర్ధం చేసుకోవచ్చు. పరశురాముడి క్షత్రియనిర్మూలనా కార్యక్రమానిక్కూడా బేసిగ్గా కార్తవీర్యుడి కబ్జా పాలసీయే మూలకారణం కాదూ? దీన్నిబట్టీ దశావతారాల్లో నాలుగు – వరాహ, నరసింహ, పరశురామ, రామ – అవతారాలు రకరకాల అవినీతిఅవతారాల పనిపట్టడానికే వచ్చినట్టు తెలుస్తోంది. ఆ సంగతి తెలిసేనేమో ఆయన అప్రూవర్‌గా మారిపోకుండా అవినీతిమింగిలాలు తమ అవినీతిలో దేవుడిక్కూడా పార్ట్‌నర్‌షిప్ ఇస్తూవుంటారు, నో, ఇచ్చేశామనుకుంటారు. ఇళ్ళల్లోనే గుళ్ళు కట్టి కొందరు, కిరీటాలు, కవచాలు చేయించి కొందరు, …. ….. ఎంత చెట్టుకి అంత గాలి.   

ఇదంతా చూసి, అవినీతి-ఆషాఢభూతి-ఆధ్యాత్మికత వీటి ఈక్వేషన్ ఏంటో అర్ధం కాక ఆషాఢభూతుల పూజల్ని అందుకోకపోతే ఆయనకి ఏం తక్కువైందని దేవుడి మీద కాస్త కోపం వస్తుంది ఒక్కోసారి. ఆయన మాత్రం పెదవి విప్పడు. కానీ ….

పెదవి విప్పకుండానే సమాధానాలిస్తాడు. ఎలా? ఇలా 👇

అవినీతిమింగిలం దొరికిపోయినప్పుడూ పెదవి విప్పడు, ఎన్నాళ్ళబట్టో వీడు నన్ను ఎంచక్కా పూజిస్తున్నాడు, వాడి మీద ఈగ వాలినా ఒప్పుకోను, వాణ్ణి వదిలెయ్యండని ఏసీబీవాళ్లక్కానీ, సీబీఐవాళ్ళక్కానీ కనీసం కలలో కనిపించైనా చెప్పడు. పాపం, అవినీతి ఆషాఢభూతి ఎంత బాధపడతాడో అనే ఫీలింగైనా వుండదాయనకి. కర్మ సిద్ధాంతం, మనుషులు పెట్టుకున్న చట్టాల్లాగా కాకుండా, తన పని తాను నిజంగానే చేసుకుంటూ పోతుందని ‘ప్రూవ్’ చేసేస్తాడు. జగన్నాటక సూత్రధారి అనే బిరుదు ఊరికే వస్తుందా?

ఇక్కడ వరకూ వచ్చాక –

దేవుడు మాట్లాడకపోయినా అందరి మనసుల్నీ “వింటాడు” కదా? అనుకుని, వింటాడనే అనిపించీ  –

“స్వామీ! భక్తులకి కలల్లో కనబడి నేను ఫలానా పుట్టలోనో గుట్టలోనో వున్నాను, అక్కడ నాకో గుడి కట్టండి అని చెప్తూఉంటావు కదా? అలాగే ఫలానా లంచగొండి ఇంట్లోనూ, ఫలానా కబ్జాదారుకి ఖైదీగానూ, ఫలానా బకాసురుడికి బందీగానూ వున్నానని, వాణ్ని పట్టుకునే టైమయింది, పట్టుకోండని అధికార్ల, మంత్రుల, ప్రతిపక్షనేతల కలల్లో కనబడి చెప్పరాదూ,” అని దేవుడికో ఉచిత సలహా ఇవ్వాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. కానీ –

మనకి తెలీని రహస్యాలు ఆయనకి మాత్రమే తెలిసినవి ఇంకెన్ని వున్నాయో అనుకుని,

ఆయన టైమింగ్ ఆయనకి ఉంటుంది కదా, ఎవరి కలలో ఎప్పుడు కనబడాలో ఆయనకి తెలీదా? అనిపించీ,

ఫలానావాడికి కల్లో కనబడి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఫలానావాడు ఇంకేం లెక్కలేస్తాడో, ట్రిక్కులు చేస్తాడోననే ఆలోచనకూడా ఆయనకుండి ఉండవచ్చు కదా  అనికూడా అనుకుని …. ….. ….

ఉపేంద్రుడికి

ఉచితసలహాలిచ్చే పని

ఉపసంహరించుకుని

ఊరికే ఇలా 😷,  ఇలా🙈 🙉 🙊 , ఇలా🙏

ఉండిపోయా…

అంతేసంగతులు.

 

          🌹A humble tribute🌹
 

 

 

 

 

 

 

 

7 thoughts on “క్విడ్- ప్రో -కో అంటే తెలీని రాములవారు…/ ॐఉపేంద్రుడిॐకి ఉచితసలహాలు…./

 1. anyagaami

  అవినీతికి భగవానుడు ఎన్నుకొనే మార్గాల విశ్లేషణ బావుంది. ముఖ్యంగా – ఆయన టైమింగ్ ఆయనకి ఉంటుంది కదా – ఇది తెలిస్తే అసలామార్గంలో ఎందుకు వెళ్ళకూడదు అనేది అర్థం అవుతుంది. భలే వాక్యం.


  https://polldaddy.com/js/rating/rating.js

  Like

  Reply
 2. విన్నకోట నరసింహారావు

  “నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలములెల్ల ద్రోలవచ్చు ….. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సమూహముల సంహరింపవచ్చు ….. ” అన్నాడు శతకకారుడేనాడో …. “నరసింహుడి” మహిమ గురించి 😉😉.
  దేవుడి “టైమింగ్” … బాగా చెప్పారు. The mills of the gods grind slowly, yet they grind exceeding fine అనే ఆంగ్ల సామెత గుర్తొచ్చింది.

  Like

  Reply

Hi, _/\_ :-) Thank you for coming this far in the post ;-) I do appreciate people who stimulate my creativity & make me think on a deeper level. Your rating this post helps. _/\\_ :-)

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s