స్పీల్‌బర్గ్‌లా సినిమా తియ్యలేదని విఠలాచార్యని విమర్శించడంలో అర్ధం వుందా? ఎస్వీరంగారావుకి, ప్రకాష్‌రాజ్‌కి ఘటోత్కచుడి పాత్రపోషణలో పోటీ పెట్టొచ్చా?


ఒక కళాతపస్వికి ఆ కళకి ఆద్యుడైన కళాయశస్వి పేరిట అవార్డ్ ఇస్తే అది ఆ యశస్వికి గౌరవమా? ఈ తపస్వికి గౌరవమా? రెండూ కాదు.

దేశం ఒక కళారూపాన్ని ఆదరించి దానికి ఆద్యుడైన వ్యక్తి పేరిట ఆవార్డు నెలకొల్పి, ఆ కళని సుసంపన్నం చేసిన వ్యక్తికి ఆ అవార్డ్ యిస్తే అది –

💐 ఆ కళారూపానికి ఈ దేశం, దేశప్రజలు ఇచ్చే విలువ, చూపించే గౌరవం.

💐 దేశపు అభిరుచి ఏమిటి, ఎలావుండాలి అనేదానికి మనం ఇచ్చుకునే నిర్వచనం.

💐 మన అభిరుచికి, మనం ఇష్టపడే సంస్కృతికి మనం చేసే సన్మానం.

💐 సంఘంలో రావాల్సిన మార్పుకి మనం పలికే ఆహ్వానం.

ఏ టెక్నాలజీ లేకుండా మండుటెండని వెన్నెలగా మార్చిన మార్కస్ బార్ట్లేని ఎంత ఆరాధిస్తామో, లేటెస్ట్ కెమెరాలతో దృశ్యకావ్యాలు రచించే నేటి కెమరామెన్‌లనీ అంతగా ఆదరిస్తాం.

విఠలాచార్యగారి గజగోకర్ణటక్కుటమారా విద్యలన్నిట్నీ తెర మీద ఒకప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో ఈగ, బాహుబలిలాంటి గ్రాఫిక్స్ మాయాజాలాన్నీ అస్వాదిస్తాం.

“బాహుబలి” రాజమౌళి వచ్చాడు కదాని “మాయాబజార్” మాంత్రికుడు కే.వి.రెడ్డిని మర్చిపోం.

నేటివిటీలేకపోయినా మోసగాళ్ళకి మోసగాడులో కనిపించిన కొత్తదనాన్ని ’70ల్లో ఎంతగా ఆస్వాదించామో శివ, సత్య, కంపెనీ రుచి చూపించిన వాస్తవికతని ‘90ల్లో అంతగా ఆహ్వానించాం.

మొత్తమ్మీద మారుతున్న కాలంతో మారుతూ, పెరిగే టెక్నాలజీతో పెరుగుతూ నిరంతరం పరిణామం చెందే ఒక కళాప్రక్రియని ఆయా తరాలకి తెలిసిన, అనుభవంలో వున్న సామాజిక పరిస్థితులు, అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్నిబట్టీ ప్రజలు ఆస్వాదించి ఆనందిస్తారు.

స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లా సినిమా తియ్యలేదని విఠలాచార్యని విమర్శించడంలో అర్ధం ఏమన్నా ఉంటుందా? ఎస్వీరంగారావుకి, ప్రకాష్‌రాజ్‌కి ఘటోత్కచుడి పాత్ర పోషణలో పోటీ పెట్టొచ్చా? పోటీ పడనంత మాత్రాన ఇద్దర్లో ఒకరెక్కువ, ఒకరు తక్కువ అని చెప్పగలరా ఎవరైనా?

ఎస్వీఆర్ ప్రకాష్‌రాజంత గొప్ప నటుడు కాడు అని ఎవరైనా అంటే “నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు కానీ ఇంత పెద్ద గాలివాన జీవితంలో చూడలేదు అందిట” అన్న సామెత ఆటోమేటిగ్గా గుర్తుకొస్తుంది, నాలిక మీదకీ వస్తుంది.

గోదావరినది నాకిష్టం అనంటే త్రయంబకం నుంచీ ధవళేశ్వరం వరకూ నది మొత్తాన్నీ నేను ప్రేమిస్తున్నట్టు. నాకు త్రయబకం దగ్గరే ఇష్టం, పాపికొండల మధ్యనే అది బావుంటుంది, సిద్ధాంతం బ్రిడ్జి కింద మాత్రమే అందంగా వుంటుంది అంటే దానర్ధం ఏంటి? నేను నది గురించి మాట్లాడట్లేదు, Maybe నది మొత్తాన్నీ నేను చూడలేదు. ఒక పర్టిక్యులర్ ప్లేసులో నేను చూసిన ఒక ప్రవాహం గురించి నాకు తోచిన ముక్క చెప్పాను.

నదీప్రవాహంలాంటి సినిమాకళ గురించి మాట్లాడుతూ (ఇంకే కళ అయినా కానీ) అప్పటి మేకింగ్‌ని ఇప్పటి మేకింగ్‌నీ కంపేర్ చేసి ఆనాటి డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌, ఆర్టిస్టులతో ఇప్పటివాళ్ళని పోల్చి ఎక్కువ తక్కువలు చెప్పడం అంటే తాటికల్లుని వోడ్కాతో పోల్చి కల్లు తక్కువ, వోడ్కా ఎక్కువ అని చెప్పినట్టుంటుంది. ఆ రెండిట్నీ పోల్చడం మూర్ఖత్వం అని రెండూ తాగినవాడికే తెలుస్తుంది. మన ఖర్మ కాలి పోల్చాడా వా.డు. ఆ రెండిట్లో ఏదో ఒకటే తాగినట్టు లేదా అస్సలేదీ తాగకుండానే తాగినట్టు పోజుకొట్టినట్టు.

👉 (వా.డు. = వారుణీవరప్రసాదుడు)  

కళాతపస్వులు, కళాయశస్వుల గురించి చెబుతూ ఇలా బెల్ట్‌షాప్‌లో దూరాడేంట్రా బాబూ అనిపించచ్చు. కానీ అదంతే. ఇక్కడది అసందర్భం కాదు. 

ఇంతేసంగతులు.

బై4నౌ.