Why(ఎందుకు)We(మనం)Are(ఉన్నాం)?(04) – కృష్ణుడి బోధ, బుద్ధుడి బాధ, జీసస్ గాధ అన్ని వేలయేళ్ళపాటు …


whyweare-logo3

🌊🌊🌊🌊

ఇది నాలుగో అల, మిగిలినవి 👇 

కృష్ణుడి బోధ, బుద్ధుడి బాధ, జీసస్ గాధ అన్ని వేలయేళ్ళు నిలబడినప్పుడు…..

నేనెవర్ని? అంటూ అన్వేషించినంతసేపూ ఏ ప్రాబ్లమూ వుండదు. మొదటినుంచీ చివరివరకూ అంతా అంతరంగ మధనమే. మనసెంత డీవియేట్ అయినా మళ్ళీ మళ్ళీ వెనక్కి లాక్కొచ్చి అన్వేషణ కొనసాగించవచ్చు. వై యామై? (నేనెందుకు వున్నాను?) అన్న ప్రశ్న వేసుకోవడమే తడవు వచ్చి పడతాయి వెయ్యి సమస్యలు – కాదు విఘ్నాలు – కాదు తపోభంగం చెయ్యడానికి ఇంద్రుడు పంపే అప్సరసలు. అప్సరస అనేకంటే అప్‌సురస అంటే బెటరు. అంటే, ఏదైనా సాధించాలనే సంకల్పం కలగగానే, హనుమంతుడికి అడ్డుపడిన సురసలాగా అడ్డుపడేదే అప్సరస ఉరఫ్ అప్‌సురస (Up comes Surasa) అన్నమాట. హనుమంతుడంతటి వాడికి తప్ప సురసని ఎదిరించి నిలబడ్డం సాధ్యం కాదుగదా? నా జీవితానికి ఇదీ లక్ష్యం అని ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నా, చేసుకోబోతున్నా, చేసుకుందామని అనుకున్నా ఆ క్షణం నుంచీ కన్నతల్లితండ్రులనుంచీ కట్టుకున్న భార్యతో కలిపి కన్నబిడ్డల వరకూ,  మారుతున్న సాంఘిక స్థితిగతుల నుంచీ చచ్చినా మారని బాస్ వరకూ, ఆరోగ్యం నుంచీ ఆధ్యాత్మికగురువు (పొరపాటున బురిడీగురువు పాలబడితే) వరకూ, చూపు తగ్గుతున్న కళ్ళ నుంచీ వూడబోతున్న పళ్ళ వరకూ,  వుడుగుతున్న వయసు నుంచీ ఉడుకు తగ్గని మనసు వరకూ ఏదో ఒకటి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇంద్రకార్యం నెరవేర్చడానికి రెడీగా వుంటారు/యి. జీవితానికో లక్ష్యం, పరమార్ధం పెట్టుకోవాల్సిందే అనుకున్నవాళ్ళు – ఐతే స్వామి వివేకానంద, రమణమహర్షిలలాగా ఆజన్మ బ్రహ్మచర్యంలో వుండిపోవాలి. లేకపోతే బుద్ధుడిలా, అరబిందోలాగా, జిడ్డుకృష్ణమూర్తిలాగా అన్నిటినీ దూరంగా పెట్టగలగాలి. ఈ రెండు మార్గాలూ మిస్సైతే, “నేనెక్కాల్సిన రైలు జీవితకాలం లేట”ని నిట్టూర్చుకుంటూ మూలపడిపోవాలి. వెయిట్! వెయిట్! రియల్లీ? మూలపడిపోవాలా? ఐ డోన్ట్ థింక్ సో. మూడో మార్గం వుంది. అది తనకున్న పరిధిలో చేయగలిగినంత చెయ్యడమే. ఏం చెయ్యాలనేదే పెద్ద సమస్య. ఒంటి మీద తోలు నుంచీ కట్టుకున్న ఆలు (మొగుడి) వరకూ కాలు అడ్డుపెట్టి మరీ ఇంక చాలు అంటుంటే, చేసినదేమైనా వున్నా అది మారుతున్న కాలానికి, క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ … అన్నట్టు మారిపోయే మనుషుల ఆలోచనలకి, జీవనవిధానాలకి సూట్ అవ్వక మరుగున పడిపోతుంటే ఏం చెయ్యగలడు మనిషి? ఈ నవనవాభ్యుదయ విశాలసృష్టిలో చిత్రములన్నీ నావేలే… అంటూ చుట్టూ జరిగేవన్నిటిపై ఓనర్‌షిప్ క్లెయిమ్ చేసుకోగలడు కానీ కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే అనే ధైర్యం చెయ్యగలడా? చేసినా ఇవ్వగలడా? ఇదంతా నెగెటివ్‌టాక్, చేతకానివాడి ఆలోచనలు అనుకుంటారేమో 🤔 . సో వాట్? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?నేను చేసేదేదో ఒక నూరేళ్ళో ఎట్ లీస్ట్ యాభయ్యేళ్ళో కనీసం పాతికేళ్ళోనైనా సర్వైవ్ అవ్వకపోతే ఎలా? కృష్ణుడి బోధ, బుద్ధుడి బాధ, జీసస్ గాధ అన్ని వేలయేళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ స్ఫూర్తితో ఇన్నాళ్ళ జీవితాన్ని తట్టుకున్న నా ధ్యేయం పట్టుమని పదేళ్ళు కూడా నిలబడకపోతే… then what is the difference between me and an animal which has no choice but to be a helpless part of a machine called Nature? అసలు నేను ఏం చేస్తే, ఎలా బతికితే I am satisfied with this life అని అనిపిస్తుంది?

🌊🌊🌊

మూడో అల

“…అతనికి దొరికిన సత్యాన్ని మతంగా ఆర్గనైజ్ చేయిస్తాను,” అన్నాడు సైతాన్.

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది – ఈ లైను సెల్‌ఫోన్ కంపెనీలకి బిజినెస్ స్లోగన్ కావచ్చు. కానీ అందులో ఎంత తాత్వికత – philosophical depth – వుందో కదా? ఐతే, ఐడియా బదులు ప్రశ్న అంటే ఆ లోతు పెరుగుతుంది. (P.N.👉 బిజినెస్‌మెన్‌కి ప్రజలు వేసే ప్రశ్నలు నచ్చవు. వాళ్ళ ఐడియాలకి మనం డబ్బు ధార పొయ్యాలి కానీ ప్రశ్నలు గుప్పించకూడదు. అందుకే స్లోగన్‌లో ఐడియా వుంటుంది కానీ కొశ్చనుండదు 😉 ) ఇన్ ఫాక్ట్, ఐడియా కంటే ప్రశ్నే గొప్పది. ప్రశ్నించే స్వభావమే కొత్త ఐడియాలకి దారి తీస్తుంది. కాదా? హూ యామ్ ఐ? వై యామ్ ఐ? అనే రెండు ప్రశ్నలు వేల సంవత్సరాల నుంచీ మానవులతో ప్రయాణిస్తున్నాయి, మానవ పరిణామాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రెండిట్లో ఏ ప్రశ్నతో మొదలైనా రెండోది ఎదురౌతుంది. నేనెవర్నో తెలిసాక నేనేం చేస్తున్నాను?అనే ఉపప్రశ్న, దానికి తోడుగా చేసేదేదో ప్రపంచానికి మంచి చేసేది అవ్వాలనే కోరిక కలుగుతాయి. Why(ఎందుకు)We(మనం)Are(ఉన్నాం)? అనే మీమాంస, హూ యామ్ ఐ, నేనెవర్ని? అనే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాసెస్ రెండూ వేరు వేరు కాదు. ఆఫ్ట్రాల్ ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఎక్కణ్ణుంచి వచ్చాం? ఎక్కడకి పోతున్నాం అనేది అర్ధం కాకుండానే – గట్టిగా మాట్లాడితే అసలు రావడం, పోవడం అనేది ఉందా లేక అదంతా జస్ట్ మెంటల్ కన్స్ట్రక్షనా? తెలుసుకోకుండానే – టపా కట్టేస్తే ఏం బావుంటుంది?(యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !) అందువల్ల నేనెవర్ని? అని మరీ బాహుబలిలో ప్రభాస్ అంత భీకరంగా, భీభత్సంగా కాకపోయినా ఎంతోకొంత సీరియస్‌గా, వీలైనంత సిన్సియర్‌గా ట్రై చేసి తెల్సుకోవాలి. అయితే ఇందులో కొంచెం రిస్కుంది. ఎవరికీ? సెల్ఫ్-రియలైజేషన్ బాహుబలికి, వాడితో పాటు సొసైటీకి. ఏదో కాస్త అర్ధమైందనిపించగానే “బాహుబలి” దాన్ని ఆర్గనైజ్ చెయ్యడం, ఇన్స్టిట్యూషనలైజ్ చెయ్యడం మొదలుపెడతాడు. జిడ్డు కృష్ణమూర్తిగారి ఫేవరిట్ జోక్ ఒకటుంది. ఒకసారి దేవుడు, సైతాన్ పైనుంచి భూలోకాన్ని చూస్తున్నారట. వాళ్ళ దృష్టి దారిన పోతున్న ఒక దానయ్య మీద పడింది. పోతూ పోతూవున్న దానయ్య ‌సడెన్‌గా వంగి బాట మీదనుంచి ఏదో తీసుకుని పరిశీలనగా చూస్తున్నాడు. అతను చూస్తున్నదేమిటో దేవుడికి తెలిసిపోయింది, సంతోషంగా నవ్వుతూ సైతాన్‌తో అన్నాడు – “ఇంక నీ ఆట కట్టు. మానవుడికి సత్యం ఏమిటో తెలిసిపోయింది. నీ మాయలకి, ప్రలోభాలకి లొంగడు.” సైతాన్ కూల్‌గా చెప్పాడు, “నా ఆట ఇప్పుడే మొదలవ్వబోతోంది. ఆ దానయ్య చేత అతనికి దొరికిన సత్యాన్ని ఆర్గనైజ్ చేయిస్తాను,” అని. తర్వాతేంజరిగిందో ఊహించుకోవచ్చు. దానయ్య తనకి దొరికిన సత్యం ఆధారంగా ఓ విశ్వాసం, దానికి సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్, డ్రెస్‌కోడ్ ఏమిటి, హెయిర్ స్టైలు ఎలావుండాలి, వగైరా వగైరా స్టార్ట్ చేసాడు. అవన్నీ స్ట్రిక్ట్‌గా, కొండొకచో fanaticalగా ఫాలో అవ్వనివాళ్ళు ఎలాంటి నరకాలకి పోతారో చెప్పి భయపెట్టాడు, అయినవాళ్ళు ఎంతటి స్వర్గసుఖాలు అనుభవిస్తారో చెప్పి ఆశపెట్టాడు. ఆ తర్వాత జరిగిందంతా హిస్టరీ. ఇప్పటికీ జీ టీవీ సీరియల్లా సాగుతూనేవుంది. దానయ్యకి దొరికిన సత్యం మాత్రం దానయ్య కట్టించిన రకరకాల ఆరాధనాస్థలాల్లో బందీ అయిపోయింది. ప్రపంచంలో ఒకే ఒక్క దానయ్యే వుండివుంటే కధ ఎలా ఉండేదో ! కానీ కుల..వర్గ.. ప్రాంత..వృత్తి.. భాషా….. ఇలా ఎన్ని రకాలుగా మనుషుల్ని విభజించొచ్చో అంతమంది దానయ్యలుంటారు. ప్రతి దానయ్యకీ, అసిస్టెంట్ దానయ్యలు, సబ్-అసిస్టెంట్ దానయ్యలు…….

మొత్తమ్మీద దానయ్యల ప్రస్థానం మంచి ఉద్దేశాలు, ఆదర్శాలతోనే మొదలైనా ఒక స్టేజిలో దానయ్యల అనుయాయులకి గమ్యంకంటే మార్గం, ప్రయాణం, లగేజీ ముఖ్యమైపోతాయి. దానయ్య ఫాలోవర్స్‌కి వాళ్ళు చేరాల్సిన ఊరికంటే ఊరికి వెళ్ళే దారి మీద, ప్రయాణించే బస్సుమీద, దారికి రెండు పక్కలా ఉండే షాపులు, హోటళ్ళ మీద శ్రద్ధ ఎక్కువైపోతుంది. బస్సు ప్రయాణం కంటే రోడ్డు పక్క కాఫీ హోటల్లో కూచుని మాట్లాడుకోవడం, పేకాడుకోవడం అలవాటౌతాయి. వాటితోపాటు దెబ్బలాడుకోవడం, కాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం కూడా. చివరికి కన్ఫ్యూజన్‌లో పడిపోయి, దాన్ని భరించలేక దానయ్యలెవర్నీ నమ్మకూడదనే కన్క్లూజన్‌కి వచ్చి ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్లు బతకడం మొదలెడతారు. అందులో ఒకడు ఉట్టి బతకడంలో ఫన్ ఏముందనిపించి చంపడం మొదలెట్టాడంటే వాణ్ని ఏ న్యాయం, ధర్మం, చట్టం, శాస్త్రం, నీతి, నియమం ఆపలేవు. ఇంకెవడో వచ్చి వాణ్ని చంపేవరకూ. ఈ సొదంతా ఎందుకంటే దానయ్యలని గుడ్డిగా ఫాలో అవ్వడంవల్ల కలిగే ప్రయోజనం లిమిటెడ్, పరిమితం అని చెప్పడానికే. దానయ్య ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ అతని అనుభవాన్ని మరొకరికి ఇవ్వలేడు. జస్ట్, గైడ్ చెయ్యగలడు. “ఆహారనిద్రాభయమైధునాలు ఎవరికివారు చేసుకోవాల్సిందే, అవి పనివాళ్ళు చేసిపెట్టేవి కాదని అయ్యగారికి చెప్పరా,” అని అందాలరాముడులో రమణగారు రాస్తే ఏఎన్నార్ నాగభూషణం మీద విసిరిన డైలాగుంది. ఆ నాలుగిటిలాంటిదే ఆధ్యాత్మికానుభవం కూడా. Don’t take me wrong. ఒక్క ఎక్స్‌పీరియెన్సింగ్  విషయంలో తప్ప ఆ నాలుగిటినీ స్పిరిచ్యువాలిటీని ఒక గాటన కట్టడంలేదు. సో, దానయ్య ఆచరించి మరీ బోధించిన ఫిలాసఫీ మనలో జ్ఞానకాంక్షని తీరుస్తోంది, మన సత్యాన్వేషణకి గమ్యం చూపిస్తోంది అనిపిస్తే, మనం కన్విన్స్ అయితే ఆ ఫిలాసఫీని ఎవరంతట వారు అనుభవంలోకి తెచ్చుకోవాలి. Who Am I? Why Am I? Whence do I come? Where Am I heading to? ఈ ప్రశ్నలతో సతమతమై, రాజీలేని సమాధానం కోరుకున్న వ్యక్తికే ఫిలాసఫీని స్వీయానుభవంలోకి తెచ్చుకునే అవసరం, ఆకాంక్ష కలుగుతాయి. ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ ఆన్సర్స్‌కి అనుగుణంగా ఆ వ్యక్తి జీవనవిధానం మారుతుంది. అప్పుడే ఆ లైఫ్‌కి నిజమైన, అర్ధవంతమైన పర్పస్ ఏర్పడుతుంది. ఆ పర్పస్‌లో హింస, మోసం, స్వార్ధం వుండవు. మంత్రతంత్రాలు, కన్వర్షన్లు, క్రూసేడ్‌లు, జిహాద్‌లు, ఫత్వాలు వుండవు. వాటి అవసరం ఆ వ్యక్తి జీవనవిధానంలో వుండదు. ఒక సుకుమారమైన పువ్వు, ఒక తియ్యటి పండు, ఒక పూలమొక్క, ఒక పళ్ళచెట్టు, ఒక మహావృక్షం – వీటి జీవన విధానం ఏమిటో, వీటి లైఫ్ పర్పస్ ఏమిటో – I think it is called ఋషిత్వం – అదే ఆ వ్యక్తి జీవితంలో ప్రతిఫలిస్తుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ (నేనెక్కడున్నాను, ఎలా వచ్చాను, ఎక్కడికిపోతానులాంటి ప్రశ్న నాబుర్రలో మెదిలే ప్రశ్నేలేదు) ఏదో అలాంటిదే ఈ వ్యక్తిలోనూ మార్పు తెచ్చింది.

🌊🌊

రెండో అల

ప్రశ్నించడం అనేదో కన్జెనిటల్ డిసీజ్, or, is it?

కృష్ణుడు చెప్పినట్టుగా సీరియస్‌గా సత్యాన్వేషణలో పడ్డ ఇరవైమందిలో ఒక్కడు అల్టిమేట్ రియాలిటీని అర్ధం చేసుకుని బుద్ధిగా జస్ట్ అలా “ఉండడం(to exist)” కి అలవాటు పడతాడు. అల్టిమేట్ రియాలిటీలో మొదలై తిరిగి అదే అల్టిమేట్ రియాలిటీలో అంతమయ్యే ప్రయాణం – ఉనికి, జీవితం, ఎగ్జిస్టెన్స్‌కి  –  నదిలో లేక నదిగా కొట్టుకుపోతున్న నీటిచుక్క అన్‌కాన్షస్‌గా ఏదో అలా కొట్టుకుపోవడం కాకుండా నేను ఆవిరై గాల్లో కలిసిపోవచ్చు, మట్టి నన్ను పీల్చేసుకోవచ్చు, కాలుష్యం నిండిన ఢిల్లీ యమునానదిలా తయారవ్వచ్చు, ఉప్పునీళ్ళల్లో కలిసిపోయి సముద్రంపేరుతో చెలామణీ అయిపోవచ్చు ఏదైనా కావచ్చు అనే స్పృహతో కాన్షస్‌గా కొట్టుకుపోతుంటే  అది “జస్ట్ ఉండడం (Being)” – ఉనికి. నీటిచుక్కకి కాన్షస్‌నెస్ ఉంటుందా అంటే అదో డిఫరెంట్ సబ్జెక్ట్. ఐనా, కాన్షస్‌నెస్ ఉంటేమాత్రం ఏం చేస్తుంది? దండంపెడుతూ ప్రవాహంలో కొట్టుకుపోడం తప్ప. దండంపెట్టాలన్నా చేతులుండాలి కదా. సో, దాని గతి సంపూర్ణశరణాగతే. total surrender ఒక్కటే శరణ్యం. మనిషిలాగా పరిస్థితి మార్చుకునే ఫెసిలిటీ – కాళ్ళూ, చేతులూ, రెక్కలూ, నోరూ ఎట్సెట్రా లేవుగా మరి. ఆ సౌకర్యం వున్న మానవజీవి మాత్రం రకరకాల సర్కస్ ఫీట్లు చేస్తూ ఉంటుంది.  బట్, ఎన్ని ఫీట్లు చేసినా తన చేతుల్లోలేని పుట్టుక, చావు మధ్యనే. ప్రతి మనిషి కూడా చచ్చినట్టు పుట్టాల్సిందే. చచ్చినట్టు చావాల్సిందే.  ఒక్కసారి పుట్టాక చచ్చినట్టు బతకాల్సిందే(పోయేవరకూ). జంతువులు పాపం ఎందుకు పుట్టాం, ఎక్కడికి పోతాంలాంటి ప్రశ్నలు వేసుకోవు(మనకి తెలిసి)కదా. అవి ఇంచుమించు ప్రవాహంలో కొట్టుకుపోయే నీటిచుక్కతో సమానం.  పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము అంటూ రాగాలు తియ్యలేవు. మనిషికి మాత్రం కాస్త సర్కస్‌ఫీట్లు చేసే చాన్స్ ఉండడంతో తనకి నచ్చని స్థితిలోంచి తను బాగుంటుందనుకునే స్థితిలోకి మారడానికి ప్రయత్నిస్తాడు. మార్పు తృప్తికరంగా ఉంటే ఓకే. లేకపోతేనే నట్టనడిమి పని అంతా నాటకంలా అనిపిస్తుంది. నిజంగా నాటకమా కాదా? నిజం ఎవరికి తెలుసు? Who am I? Why am I? What is this journey called life? Where do I come from and where am I heading? Is there purpose for this life?ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు గురువులు చెప్పింది విని బుద్ధిగా నమ్మేయ్యడం కాకుండా స్వీయానుభవంతో తెలుసుకుని ఆ ఎవేర్‌నెస్‌లోనే మొత్తం జీవితాన్ని నడుపుకోగలమా? ఏమో, అది సాధ్యమేనేమో, కానీ ఎందుకలా అంత కష్టపడి అవసరంలేని ప్రశ్నలు వేసుకుని వాటికి జవాబులు వెతుకుతూ, దొరికిన జవాబులు రైటో కాదో తెలిసే అవకాశంలేక ప్రశ్నల్తోనే జీవితాంతం ప్రయాణం చెయ్యడం అనే ప్రశ్న వస్తే అది కచ్చితంగా సరైన ప్రశ్నే. కానీ ఈ ప్రశ్నించడం అనేదో కన్జెనిటల్ డిసీజ్. మొట్టమొదట నిప్పు రాజేసినవాడితోనో చక్రం కనిపెట్టినవాడితోనో మొదలై వేదకాలపు ఋషులకి, అవేవో రకరకాల నదీ తీర నాగరికతల వాళ్లకి అంటుకుని సోక్రటీజ్, బుద్ధుల వరకూ పాకి ఆ పైన లెక్కలేనంత మందికి వ్యాపించి ఇప్పటికీ నయం కాని, మందులేని సహజసిద్ధ’వ్యాధి’. దానికి మందుగా ఒక్కోసారి విషం తాగాల్సి రావచ్చు, సిలువ ఎక్కాల్సి రావచ్చు. ఒకప్పుడు ఈ ‘వ్యాధి’లేక “బాధపడుతున్న”వాళ్ళు పుర్రెలో పుట్టిన బుద్ధి పుడకలతో గానీ పోదన్చెప్పి గియోర్డానో బ్రూనో అనే ఆయన్ని బతికుండగానే కాల్చి చూశారు. సామెత తప్పని ఋజువు చేస్తూ అప్పటికే ఆ బుద్ధి ఇతర పుర్రెల్లోకి ప్రవేశించింది. ప్రశ్నా పరంపర కొనసాగించింది. కొనసాగిస్తోంది.

🌊

అల

Uncertainty is the only Certainty

ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తని మనిషి నిజంగా అదృష్టవంతుడు(రాలు). ఈ మీమాంస మొదలైన మైండ్‌కి ప్రశాంతత దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా అది తాత్కాలికమే, టెంపరరీ ఫినామినన్. ఎందుకు టెంపరరీ? ఎందుకంటే, మనిషి ఉనికే టెంపరరీ కనక. ఈ ప్రపంచంలో, ప్రపంచం మరీ చిన్నది, విశ్వంలో Uncertainty is the only Certainty. నదిలో కొట్టుకుపోయే నీటిచుక్క తను ఆవిరైపోయేవరకూ తనో పేద్ద నదిననే అనుకుంటుంది. ఆవిరై మేఘాల్లో చేరిపోయాక? తనో కుములో నింబస్ మబ్బునని అనుకుని ఉరుములు, మెరుపులతో నానా హడావిడీ, ఆర్భాటం చేసేస్తుంది. వర్షంగా కురిసి బురదగానో, వరదగానో మారేవరకూ. దానికి తెలీని సంగతి ఏంటంటే తన ఐడెంటిటీ, నీటి బిందువు నుంచీ మహా సముద్రం వరకూ మధ్యలో బురద, వరదతో సహా ఎలాగైనా మారొచ్చు అని.

వెయ్యికోట్లఏళ్ళ క్రితం బిగ్‌‌బాంగ్‌తో మొదలైన ఈ దృశ్యప్రపంచంలో మనిషి పాత్ర ప్రవేశించి కొన్ని క్షణాలే అయింది. ఇంతలోనే మనిషి బుర్రలో ఎన్ని ప్రశ్నలు? ఈ పూటకి నూకలెక్కడ దొరుకుతాయ్? నుంచీ భూమ్మీద నూకలు చెల్లాక ఎక్కడికి పోవాలి వరకూ. అన్నిటికీ జవాబులు దొరుకుతున్నాయా? అది డౌటే. జవాబుల కోసం వెతుకుతున్నామా అంటే ముందు అడగాల్సింది అసలు ప్రశ్నలు వేస్తున్నామా అని…..

ఏడు బిలియన్ల జనాభాలో ప్రశ్నలు వేసుకుని, జవాబులు వెతుక్కునే లగ్జరీ ఎంతమందికి దొరుకుతుంది? ముందీ ప్రశ్నకి ఆన్సర్ వెతకాలి. అక్కర్లేదు, కురుక్షేత్రంలో మొట్టమొదటి ప్రపంచయుద్ధం జరిగినప్పుడు (1914 – 18 జరిగింది రెండో ప్రపంచయుద్ధం) అర్జునుడికి అర్జెంటుగా వై వియ్ ఆర్ అనే ప్రశ్నకి సమాధానం కావాల్సొచ్చింది. కృష్ణుడు కూడా అంతే అర్జెంటుగా విశ్వరూపం చూపించి హడలగొట్టేవరకూ యుద్ధం చెయ్యనని భీష్మించుక్కూచున్నాడు. ఆ తరవాత “అర్జునా! కోట్లాదిమందిలో ఓ పదిమందికో ఇరవైమందికో ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం, సమాధానాలు వెతకడం అనే హాబీ ఉంటుంది. వాళ్ళలో ఏ ఒక్కడికో మాత్రమే కరెక్ట్ ఆన్సర్ తెలిసే అవకాశం వుంటుంది,” అని తేల్చేసాడు(సింది) పరమాత్మ. అందువల్ల ఎవరికైనా ఎగ్జిస్టెన్షియల్ డౌట్స్ వచ్చాయంటే పరమాత్మ షార్ట్ లిస్టు చేసిన పదీ ఇరవై మందిలో వారూ ఉన్నట్టే లెఖ్ఖ. ఐతే, చివరికి సెలక్ట్ అయ్యేది ఒక్కరే కదా! తనెందుకు “ఉన్నాడో” వాడికి తెలిసిపోయింది కనక వాడితో ప్రపంచానికి, ప్రపంచంతో వాడికి గొడవేంలేదు.