(2)
మృత్యువుపై గెలిచే వరకూ వేదాంతం వినక తప్పదు
అప్పుడెప్పుడో యుగాల క్రితం ఉండిన హిరణ్యకశిపుడి నుంచి ఇప్పటి హోమోసేపియనుడి వరకూ మృత్యువు అంతు తేల్చుకున్న వాడొక్కడూ లేకపోయాడు. ఐ మీన్ ఇప్పటివరకూ.(ఎందుకంటే I trust science as much as I trust God.) హిరణ్యకశిపుడు పాపం సృష్టికర్తని ప్రత్యక్షం చేసుకుని, ఎన్ని రకాల మెలికలు పెడితే చావుని మోసం చెయ్యొచ్చో అన్ని రకాల మెలికలతో వరాలు పొంది కూడా మరణమాఫీ పొందలేకపోయాడు. తమ్ముడు హిరణ్యాక్షుడు వరాహమూర్తి చేతుల్లో అంతం అవడంతో దుఃఖ్ఖిస్తున్న తల్లి దితికి జననమరణాల అనివార్యత గురించి హిరణ్యకశిపుడు చెప్పిన సుద్దులు వింటే (చాగంటివారి ప్రవచనంలో విన్నాను) అసలు భగవద్గీత చెబుతూ కృష్ణ పరమాత్మ కాపీరైట్ వయోలేషన్స్ ఏమైనా చేశాడా అనిపిస్తుంది. “ఎప్పుడో సృష్ట్యాదిలో నేను వివస్వంతుడికి, ఆయన మనువుకి, మనువు ఇక్ష్వాకువుకి చెప్పినదే ఈ గీత,” అని భగవానుడు అన్నాడని తెలుసు కనక సరిపోయింది లేకపోతే బలిచక్రవర్తిని, మహిషాసురుడినీ, రావణబ్రహ్మనీ అణగారినవాళ్ళనీ, అమాయకులనీ అనుకునే “మేధా😇వులు ” కృష్ణుడి మీద కేసు పెట్టేవాళ్ళేమో! టాపిక్ వదిలి మనకక్కర్లేని విషయాల్లోకి వెళ్ళడం ఇప్పుడవసరమా? కాదుగదా! లెటజ్ గో బాక్ టు ద టాపిక్.
మృత్యువు అంతు తేల్చుకున్న వాడొక్కడూ లేడు అనగానే మార్కండేయుడు, ఆంజనేయుడు గుర్తొచ్చి వాళ్ళిద్దరూ ఉన్నారు కదా అనిపించచ్చు. వాళ్ళు తేల్చుకోలేదు. వరాల ద్వారా చిరంజీవత్వాన్ని పొందారు. మార్కండేయుడి మూలంగా శివుడే మృత్యువు అంతు తేల్చేస్తే దేవతలందరూ ప్రార్ధించి మృత్యువుని “బతికించు”కోవాల్సి వచ్చింది. చావుని బతికించడం ఏమిటో? అవును తప్పదు మరి, అది లేకపోతే దేవుళ్ళకి భయపడేదెవరు? మానవలోకమైనా, దేవలోకమైనా ఒకటే రూలనుకుంటా! పక్కవాడి అవసరాల్నీ, బలహీనతల్నీ ఆసరా చేసుకుని బిజినెస్ చెయ్యడం. దేవతలంతా కలిసి మృత్యుదేవతని తిరిగి బతికింపజేసి భూలోకంలో ఎంతటి ఎకనామిక్ డెవలప్మెంట్కి పునాదులు వేశారో మెడికల్ ఇండస్ట్రీని చూస్తే చాలు. అది చూసి, గుండెలవిసిపోయి, శ్రీహరి కటాక్షం కన్నా శ్రీమతిహరి దాక్షిణ్యం ముఖ్యమనీ, అది లేకుండా వైద్యుడి దగ్గరికెళ్తే నారాయణుడడ్డు పడినా హరీమనక తప్పదని శ్రీమతిహరిని ప్రత్యక్షం చేసుకునే కంగారులో, ఆ పరుగుల్లో –
ఆల్రెడీ ఉన్న కోరికల్ని, తీర్చుకునే ఛాన్సున్న కోరికల్ని అనుభవించడానిగ్గూడా తీరికుంటే ఓపికలేక, ఓపికుంటే తీరిక లేక కొట్టుకుంటున్న మెటీరియలిస్టిక్ నరుడికి నచికేతుడిలాగా యముడి పీక మీద కూచుని జననమరణచక్రాల అంతు తేల్చుకునేంత కోరిక తీరిక ఓపిక ఎక్కడుంటాయ్?
ఒకవేళ వున్నా –
శ్రీఅరోబిందోలాగా, “Life only is, or death is life disguised, — Life a short death until by life we are surprised,” అనగలిగేంతగా సత్యాన్ని శోధించే శక్తీ బుద్ధి తీవ్రతా ఎందరికుంటాయ్?
అందుకే – జిందగీ కా సఫర్, హై యె కైసా సఫర్, కోయి సంఝా నహీ కోయి జానా నహీ||హై యె కైసీ డగర్? చల్తే హై సబ్ మగర్, కోయి సంఝా నహీ కోయి జానా నహీ|| — అని సరిపెట్టుకోవడం, కొంచెం పొయెటిక్ మైండ్ ఐతే ఇంకొంచెం ముందుకెళ్ళి — జిందగీ కో బహుత్ ప్యార్ హమ్ నే దియా, మౌత్ కే భీ మొహబ్బత్ నిభాయేంగె హమ్|| రోతె రోతే జమానే మే ఆయే మగర్, హస్తెహస్తే జమానే సే జాయేంగే హమ్|| జాయేంగే పర్ కిధర్? హై కిసే యే ఖబర్?|| కోయి సంఝా నహీ కోయి జానా నహీ|| — అంటూ రాబోయే దారీదరీ తెలీని ప్రయాణానికి ధైర్యం చెయ్యడం తప్ప సాదామనిషి ఏం చెయ్యగలడు?
కానీ చెయ్యగలడు. సామాన్యుడుగా సాదాసీదాగా ఉండగలవాడు, ఎస్పెషల్లీ మన ఇండియనుడు, అలా ఎలా ఉండగలడంటే వాడికి ఫిలాసఫీ అనేది ఒక కన్జెనిటల్ డిఫెక్ట్ లాంటిది లేకపోతె కన్జాయిన్డ్ ట్విన్ లాంటిది. లేకపోతే జగమే మాయ, బ్రతుకే మాయ అంటూ వేదాంతాన్ని సినిమాపాటల్లోకి దింపేసి చప్పట్లు, వన్స్ మోర్లు ఎలా కొట్టిస్తాడు?
పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము అన్జెప్పేహేసి హాయిగా సినిమా ఐపోయాక హాలు బయటికి నడిచినంత ఈజీగా లైఫులోంచి నిజంలోకి వెళ్ళిపోడానికి ఎలా ప్రిపేర్ అవ్వగలడు?
సైన్స్ ద్వారా మనిషి ఏదోనాటికి మృత్యువుని తప్పించుకునే మార్గం కనిపెట్టినా దానికి ఎంత ధర చెల్లించాలంటారో ఆ రీసెర్చ్ చేయించిన దళారీలు.
ఒకవేళ ఏ ఆరోగ్యశ్రీలాగా మృత్యుంజయశ్రీ పధకం పెట్టి మన రాజకీయ నాయకులు సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చేసినా ఆ సామాన్యుల్లోవున్న అసామాన్యులు (అవినీతిపరులు, అరాజకీయశక్తులు, ఆతంకవాదులు, అత్యాచార పరాయణులు, హత్యాశాపరులు…) కూడా మృత్యువుని జయించేసి కూచుంటారే, రాహుకేతువుల్లా? అప్పుడెలా?(ఇప్పటికే జైళ్ళల్లో అతిధి మర్యాదలు, బెయిళ్ళలో అధికారపగ్గాలు ఎంజాయ్ చేస్తున్న రాహుకేతుజనాభా కన్సిడరబుల్గా వుందని కదా గొడవ)
ఒకసారెప్పుడో ఒక మహిమాన్వితవ్యక్తిని, “దేశంలో నీళ్ళచెరువుల్ని పెట్రోల్ చెరువులుగా మార్చెయ్యొచ్చుగదా? దేశానికి దరిద్రం తీరుతుంద,”ని ఎవరో అడిగారట. “నేను మార్చగలను కానీ నీలాంటి కోతి ఎవడో వాటిల్లో అగ్గిపుల్ల గీసిపడేస్తే ఎలా? ముందు మనిషి కోతివేషాలు తగ్గిచుకుంటే అప్పుడు చూద్దాం,” అని ఆయన జవాబు(ట). మహత్యాల సంగతెలా వున్నా మనిషి వేస్తున్న కోతివేషాలు నిజమే కదా. అందుకే మనిషి తన పూర్వాశ్రమాన్ని పూర్తిగా మర్చిపోయేలోపు, అదే వానరత్వాన్ని ఇప్పటికీ వదలక వేలాడుతున్న వాలం వూడి పోయేలోపు, మనిషికి మృత్యుంజయత్వం దక్కిందో వేదాంతం మర్చిపోయి వేదాన్ని అంతం చేసే మిషన్ భస్మాసుర మొదలెడతాడు.
ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకునేనేమో దేవతలంతా మృత్యుదేవతని పునర్జీవింపజేశారు. ఆ దేవతని తప్పించుకునే సమయం వచ్చేవరకూ, అంటే మార్కండేయుడిలాగా లేకపోతె హనుమంతుడిలాగా చిరంజీవత్వానికి అర్హత సంపాయించుకునే వరకూ వేదాంతం భట్టీయం వేసి ఒంట బట్టించుకోమని వాళ్ళ ఉద్దేశం. నచికేతుడి కధలో, ఆదిశంకర బోధల్లో, అరవిందాశ్రమంలో అమృతత్వాన్ని ఆస్వాదించమని వాళ్ళ సందేశం. అలా నిజంగా ఆస్వాదిస్తే మరణాన్ని ఆపే మందులతోటీ, మృత్యుంజయ ఆరోగ్యశ్రీలతోటీ పనే వుండదు. అంతవరకూ వేదాంతం వినక తప్పదు.
(1)
మనసు మరణించే వరకూ ప్రశాంతికై ప్రయాస తప్పదు.
అవును తప్పదు, లేపోతే మన’సుకవి’ “మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే..ఏ..ఏ.. ఏ ..,” అనెందుకు విలాపిస్తాడు? ఆ మాటని ఊరుకోలేదు, మనసుని మనిషికి దేవుడు విధించిన శిక్షగా, జీవుడిపై దేవుడు తీర్చుకున్న కక్షగా తేల్చి చెప్పాడు.
I think, therefore I am (నేను ఆలోచిస్తున్నాను, కనక నేను ఉన్నాను) అని రినీ దెకార్త్ తన ఉనికి నిజమేనని కన్ఫర్మ్ చేసుకున్నట్టు, మనసు పని చేసేవాళ్ళు – I suffer, therefore I have మనసు అనుకోవచ్చేమో 🤔😂 . (అలా అనుకుంటే నాకు బోల్డంత మనసున్నట్టే – చాలా మందికిలాగే. అది వేరే విషయం.)
హాయిగా జాలీగా బతకాలంటే మనసు లేకుండా ఎలా? మళ్ళీ అదే టైములో మనసు పనిచేస్తే – ఊరికే పన్జెయ్యడం కాదు స్పందిస్తే – బతకడం కష్టం. ఏంటో గోల? ఒక్క వాణిశ్రీని మిస్సయిపోతున్నందుకే ప్రేమనగర్ నాగేశ్వర్రావ్ అంత పెద్ద పాట ఆత్రేయగారితో రాయించుకుని ఘంటసాల గొంతు అప్పు తీసుకుని పాడి మరీ విషం తాగేసాడే అలాంటిది –
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అనిపించుకుని పతితుల, భ్రష్టుల, బాధాసర్పదష్టుల కోసం పరితపించిన శ్రీశ్రీ గారి మనసు ఎంత సఫర్ ఐతే ఆ మనసులోని భావాలు కలంలోంచి ప్రవహించి జగన్నాధ రధచక్రాల్ని కదిలించాయో !?!🤔 ఐనా ఏం లాభం? ఈ భూమ్మీద ఎంతమంది శ్రీశ్రీలు ఎన్ని ప్రాంతాల్లో ఆవిర్భవించి పీడితజనం కోసం ఎంత పరితపించలేదు, వాళ్ళందరి ప్రయాసల ఫలితం మనిషికి ఏ మాత్రం దక్కింది. కారే రాజులు, రాజ్యముల్ గలుగవే… అన్నట్టే కారే కవీశ్వరుల్, కదిలించరే హృదయముల్? వారేరీ? వారి కవిత్వ తత్వ ప్రభావముల్ నేడేవీ? అనుకోవాల్సిన రీతిగానే ప్రపంచం మిగిలిందేం? జగన్నాధరధం ఉన్నచోటే ఆగిందేం? కారణం మనసే కదూ? వ్యక్తుల హృదయాల్లో అశాంతిగా, అసంతృప్తిగా, అందని ద్రాక్షపళ్లు పులుపు అనుకోలేని అశక్తతగా, తలకి మించిన భారం తలకెత్తుకునే అత్యాశగా మెదులుతున్న మనసే కదూ? అదే కదూ వ్యష్టి నుంచి సమిష్టికి పాకి సమాజాన్ని అభద్రతాభావంలోకి, అనైక్యతలోకి నెడుతూ వ్యక్తికి వ్యక్తికి అంతరాన్ని పెంచుతూ అంటరానితనాన్ని పెంపొందించుతూ వున్నది? అదే అయితే మనసు పెట్టే పరుగులు ఆగాల్సిందే. దాని చాంచల్యం మరణించి, మనసు బుద్ధిలో, విచక్షణాజ్ఞానంలో, అంతరాత్మలో లీనం అవ్వాల్సిందే. అప్పుడే మనిషికి ప్రశాంతి. అలాంటి ప్రశాంతిని పొంది, మనీషిగా మారిన మనిషి ఒకరు ప్రశాంతిని పొందటం ఎలా అని అడిగిన వ్యక్తితో ఇలా అన్నారు –
మీరెప్పుడూ I want Peace, I want Peace అని దేవులాడుతూవుంటారెందుకు? I (అహంకారం), want (కోరిక) లేనప్పుడు మిగిలేది Peace (ప్రశాంతి) కాదా?
So, మనసు = I (అహంకారం) + want (కోరిక)
ఆ మనసు అంతరించినప్పుడే ప్రశాంతి. భౌతికమరణంతో కాకుండా మనసుకి మోక్షం ఇచ్చి, బుద్ధిని అంతరాత్మని పని చెయ్యనిస్తే ప్రశాంతిని ఎంజాయ్ చెయ్యొచ్చు, ఇతరుల్నీ ప్రశాంతంగా బతకనివ్వచ్చు, మన అశాంతి వాళ్లకి ట్రాన్స్ఫర్ చెయ్యకపోవడం ద్వారా. ఎవరి ప్రశాంతిని వారే శోధించుకోవాలి, సాధించుకోవాలి.
🙏🙏🙏
I (అహంకారం), want (కోరిక) లేనప్పుడు మిగిలేది Peace (ప్రశాంతి) కాదా?
Well Said!
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
థాంక్సండీ🙏
ఆ వాక్యం ఎక్కడో చదివినదే, సొంతం కాదు.
LikeLike
అహం తప్పదు
అశాంతి తప్పదు,
మరణం తప్పదు
చివరకు ఎదీ మిగలదు 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
గురువుగారూ 🙏
అహం తప్పదు, అది నేనే-ఇది నేనే అనుకునేవరకూ
అశాంతి తప్పదు, అద్వైతంలో మునిగేవరకూ
మరణం తప్పదు, Someదేహంలో / సందేహంలో ఉన్నంతవరకూ
చివరకు ఎదీ మిగలదు, శివుడే శూన్యం అనుకుంటే తప్ప.
ఆచరణలో అసాధ్యమే అయినా ఇలా అనుకుంటే?
LikeLiked by 1 person