ఆధారాల్లేవు కానీ అనుమానాలున్నాయిగా?
(సుమోటోగా టవర్ రేడియేషన్ సమస్య, ఆంధ్రజ్యోతి, 03-04-2017 06:36:36) హైదరాబాద్: సెల్ టవర్ల నుంచి వస్తోన్న రేడియేషన్ సమస్యను లోకాయుక్త సుమోటోగా స్వీకరించనున్నట్లు జస్టిస్ సుభాషణ్ రెడ్డి వెల్లడించారు. దాని నుంచి వెలువడుతోన్న రేడియో ధార్మిక కిరణాలు కేన్సర్‌కు కారణమవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ప్రముఖ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా అధ్యక్షతన మాసాబ్ ట్యాంక్‌లోని గోల్కొం డ హోటల్లో ఆదివారం ఇంటెగ్రేటివ్ అంకాలజీ అప్డేట్ పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌నకు జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ఆర్గానిక్ ఫుడ్ మంచిదని, ఎరువులతో పండుతున్న ఆహారధాన్యాల వల్లే ప్రజలు అనా రోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సెల్‌టవర్ నుంచి వెలువడుతు న్న రేడియేషన్ చుట్టు పక్కల ప్రజలపై, పశు, పక్ష్యాదులపై తీవ్రప్రభావం చూపుతోందని ఆయన గుర్తుచేశారు.
బావుంది కానీ ఇదంతా తేల్చి సెల్ టవర్ల బదులు వేరే సేఫర్ టెక్నాలజీ వాడే వరకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సెల్ బిజినెస్సులవాళ్ళు సామాన్యులా? అంత తేలిగ్గా, ఏ లాభం ఆశించకుండా టెక్నాలజీ మార్చడానికి? ఒక్క సంగతి అర్ధం కాదు, ఎక్కడైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడదామన్నా, గనుల్లోంచి యురేనియం ఖనిజం తీద్దామన్నా రేడియేషన్ బాబోయ్ అంటూ గగ్గోలుపెట్టే ఎన్జీవోలు, మేధావులూ,గట్రా సిటీల్లో అడ్డూఆపూ లేకుండా వెలువడే అదే రేడియేషన్‌ని పట్టించుకోరేంటో? అది ప్రమాదకరం అని ఆధారాల్లేవు అంటారేమో. ఆధారాల్లేవు కానీ అనుమానాలు వున్నాయిగా? మరి ఎవరూ రీసెర్చ్ చెయ్యరేం?
గ్రీన్‌కార్డ్
ఆవులకి గుడ్ న్యూస్, డ్రైవర్లకి ….??
(ఆవులను ఢీకొనకుండా హెచ్చరించే ఇండికేటర్:ఆంధ్రజ్యోతి 09-04-2017 15:16:35గాంధీనగర్) : రోడ్లపై ప్రయాణించే వాహనాలు ఆవులతో ఢీకొనకుండా హెచ్చరించే వ్యవస్థను గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. ఆవులు వాహనానికి అడ్డంగా ఉన్నాయా? వాటి వల్ల వాహనానికి ప్రమాదం ఉందా? అనే అంశాలపై ఈ అలర్ట్ సిస్టమ్ హెచ్చరిస్తుంది. ఆడియో లేదా వీడియో ఇండికేటర్ వాహనం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.డ్యాష్ బోర్డ్ కెమెరా, ఆల్గోరితం సహాయంతో ఈ వ్యవస్థ పని చేస్తుంది. పరిశోధకులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో రోడ్డు సదుపాయాలు అవసరానికి తగిన స్థాయిలో లేవన్నారు. తాము రూపొందించిన వ్యవస్థను వివిధ సందర్భాల్లో ఆవులు సంచరించే దృశ్యాలుగల వీడియోలతో అనేక రకాలుగా పరీక్షించినట్లు తెలిపారు. 80 శాతం సందర్భాల్లో ఆవులను ఈ వ్యవస్థ గుర్తించగలిగిందని చెప్పారు.
న్యూటన్ మహాశయుడి ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు గదులు తిప్పుతోందిట. గది నుంచి గదికి ఒక్కో పిల్లని మోసుకేల్తున్న దాని అవస్థ చూసి న్యూటన్ మేష్టారు అన్ని గదుల గోడలకి ఏడేసి కన్నాలు చేసారట. ఏడు పిల్లలకి ఏడు కన్నాలన్న మాట. ఈ ఆవు-ఆన్-ద రోడ్ ఇండికేటర్ కనిపెట్టినవాళ్ళెవరో న్యూటన్ మేష్టారి అంశావతారాల్లా వున్నారు. ఆవులు, ఆంబోతులు రోడ్డు మీదకి రాకుండా కట్టేసుకోమని వాటి ఓనర్లకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే పోలా? ఇంకోటి, రోడ్డు మీద ఆవుఉందో లేదో కనిపించనంత ఘోరంగా ఉంటుందా డ్రైవర్ ఐ సైటు? ఎనభై శాతం సందర్భాల్లో ఆవుల్ని గుర్తిస్తుందిట ఈ సిస్టం. డ్రైవర్ సరిగ్గా చూసుకుంటే వందశాతం సేఫ్ కాదూ? ఏంటో? చదవేస్తే వున్న మతి పోయిందిట ఎవరికో. ఉట్టి ఆవులే కాకుండా రోడ్డు మీద అడ్డంగా ఏమున్నా గుర్తించి అలర్ట్ చేసే సిస్టమ్స్ ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలన్నిటికీ అత్యవసరం. ముందా సంగతి చూస్తే ఉపయోగం.
ఏ కండల వీరుడో, క్రికెట్ నవాబో, ఇంకే పవర్ – కనెక్షన్ వున్నవాడో ఇది చూస్తే ఇంకేమన్నా ఉందా?
సంగారెడ్డి: మెదక్ జిల్లా రామాయంపేట రహదారిపై ఉన్న గంగాపూర్ గ్రామం పోచారం అభయారణ్యం పరిధిలోకి వస్తుంది. రాత్రివేళల్లో ఈ ప్రాంతంలో పులులు, చిరుతలు, జింకలు సహా ఇతర వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో సంచరిస్తుంటాయి. రహదారిని దాటే క్రమంలో ఇటీవల తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ఈ మార్గంలో చీకటిలో ప్రయాణించే వాహనచోదకులను అప్రమత్తం చేసి.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుక రేడియం వెలుగుల్లో ప్రకాశవంతంగా కనిపించేలా స్థానిక రహదారి చెంత ఇలా చిరుతపులి బొమ్మను ఏర్పాటు చేశారు.
ఆవులకి యాక్సిడెంట్లు కాకుండా సిస్టం డిజైన్ చేసిన వాళ్ళంత తెలివితేటలూ ఈ బోర్డు పెట్టిన వాళ్ళకీ వున్నట్టున్నాయి. Wild Animal Crossing అని అన్ని దేశాల్లోనూ బోర్డ్‌లు వుంటాయి. అదికాదు సమస్య. మనదేశంలో ఏ కండల వీరుడో, క్రికెట్ నవాబో, ఇంకే పవర్ – కనెక్షన్ వున్నవాడో ఆ దారిలో వెళ్తే వాళ్లకి డిన్నర్‌కి కావాల్సిన దుప్పులూ, సరదాకి ఒకటో రెండో పులిచర్మాల్నీ, పనిలో పనిగా మెళ్ళో వేసుకోడానికి పులిగోళ్ళు – ఇవన్నీ దొరికే షాపింగ్ సెంటర్లా కనిపిస్తుంది. ఆపైన లాయర్లకి, వాళ్ళ చుట్టూ అల్లుకున్న “యాన్సిలరీ ఇండస్ట్రీ”కి పండగ. పది, ఇరవై ఏళ్ళపాటు.
బై4నౌ
మీ ఆదివారపు సీరియస్ వార్తల – సరదా వ్యాఖ్యానాలని మెచ్చి నా ఈ వ్యాఖ్య 🙂
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
😊😀😆థాంక్సండీ లలితగారు 🙏
LikeLike