బాహుబలి తెలుగుగ్రామర్ విని అప్పటివరకూ కట్టడిలో ఉన్న కట్టప్పలో కోపం, చిరాకు కట్టలు తెంచు…


(ఏదో సరదాగా ఈ ‘టపా’కాయ విసిరాను.  సినిమా మీద కాకుండా తెలుగు మీద ఫోకస్ పెట్టి చదవమని కోరుతున్నా… 😊)

ఆ మధ్య విడుదలైన బహుబలి2 టీజర్ చూసిన కొందరు అంతర్జాలపౌరులు అనగా Netigens ఉరఫ్ నేటి జనులు i.e. నిన్నటి బాలలు సినిమా డైరెక్టర్, డైలాగ్ రైటర్ మొదలైనవాళ్ళ మీద విరుచుకు పడ్డారు. ఇంటర్నేషనల్ లెవెల్లో తీసిన తెలుగుసినిమాలో తెలుగు ఎంతటి స్థాయిలో ఉండాలి అసలు? అంటూ.

“నువ్వు నాపక్కనున్నంత వరకూ నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా,” అని అమరేంద్ర బాహుబలి డైలాగు “ఇరగదియ్యడం” ఆ తె.తే.లకి నచ్చలేదు. (తె.తే.=తెలుగు తేజాలు). సినిమా యూనిట్‌లో ఎవ్వరూ చలించినట్టులేదు. అసలు పట్టించుకున్నట్టే లేదు. ఏ రకమైన వివరణకానీ, తె.తే.లు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు సంజాయిషీకానీ ఇచ్చుకున్నట్టు లేదు. కొన్నాళ్ళు ముక్కులు చెవులూ కొరుక్కున్న తె.తే.లు ఇంక కోరుక్కోడానికి ఏం మిగలక, వాటి బదులు ఇంకేం కోరుక్కోవాలో తెలీక కన్ఫ్యూజన్‌తో మరో టీజర్ వదిలినప్పుడు చూద్దాంలే అన్నట్టు వెయిటింగ్‌లో ఉండిపోయారు. 

ఫ్రాంక్లీ స్పీకింగ్, బాహుబలి & కో అసలు తెలుగు మాట్లాడాల్సిన అవసరమే లేదనే సంగతి తెతేలు గ్రహించలేదు. మనం తెలుగులో స్ట్రాంగ్ అయితే సరిపోదు హిస్టరీ, జాగ్రఫీ, కాస్త సోషల్ ఆంత్రోపాలజీ తెలిస్తే కానీ బాహుబలి-ది కంక్లూజన్ పై ఓ కన్‌క్లూజన్‌కి వచ్చెయ్యడం పధ్ధతి కాదు అనేది తెతేలు మర్చిపోతే ఎలా? ఇక్కడ తెతేలు కొన్ని కీలకాంశాలు దృష్టిలో పెట్టుకుంటే పాపం తెలుగుభాష భవిష్యత్తు గురించి అర్ధంలేని సినీబాధపడేవాళ్ళు కాదేమో. 

వీళ్ళు ఓవర్‌లుక్ చేసేసిన కీలకాంశాల్లో ఒకటి బాహుబలి ఏ ప్రాంతం వాడు అనేది. బాహుబలి అంటే అదేదో జైనుల పేరులా వుంది కదా గుజరాతీవాడేమో అనుకోడానికి లేదు. బిజ్జలదేవుడు, భల్లాలదేవుడు లాంటి భేతాళుడికి తాళంవేసేవాళ్ళలాంటి పేర్లు పెట్టుకున్నవాళ్ళతో బంధుత్వం వుండడం చేత గుజరాతీ జైన్ కాదు, కన్నడసీమలో గోమటేశ్వరుడు వెలిసిన ప్రాంతం నుంచి వచ్చాడనుకోవచ్చు. వీరభల్లాలుడు అనే కన్నడరాజు గురించి మనం ఐదోక్లాసు సోషల్లో ఆల్రెడీ చదివాం కూడా. నిజానికి రాజమౌళిగారి ఫ్యామిలీ అంతా కొన్నేళ్ళపాటు కర్ణాటకలో నివసించారు(ట) . ఆ అభిమానం చేత కూడా అమరేంద్ర బాహుబలిని కన్నడిగుడిగానే సృష్టించి వుంటారు.

తెతేలు గమనించాల్సిన రెండో అంశం – అది బాహుబలి ఫామిలీ ఓ ఇంటర్-స్టేట్ ఫామిలీ అని. లేకపోతే శివగామి అనే అరవమామి ఈ కన్నడ ఫామిలీలో ఎలా ప్రవేశిస్తుంది? ఐతే దానికో మాంచి ఆన్సర్  రెడీగా వుంది. కన్నడిగులకి, తమిళపులులకి కావేరీ జలాల విషయంలో “చక్కటి సత్సంబంధాలు”న్నాయి కదా? అవెలా ఏర్పడ్డాయంటే అమరేంద్రబాహుబలి తాత రాజ్యం చేస్తున్న టైములో ఒకప్పుడు తమిళులు కన్నడిగులు కర్రలు కత్తులతో తమ “సత్సంబంధాలు” చక్కబెట్టుకుంటున్న సందర్భంలో ఆయనకి తమిళరాజుతో , అంటే శివగామి తండ్రితో వియ్యమంది కావేరీ సమస్యకి ఓ ఫుల్‌స్టాప్పెట్టి, నీళ్ళు పంచుకుందామనే మంచి ఐడియా వచ్చింది.  అనుకున్న  వెంటనే రెండో కొడుకు బిజ్జలదేవుడికి శివగామినిచ్చి పెళ్లి  చెయ్యమని తమిళ పులిరాజుని అడగటం, ఆయన ఓకే చెయ్యడం జరిగిపోయాయి. అప్పట్నుంచీ కొన్నాళ్ళపాటు  కావేరీజలాల సమస్య లేకుండా చాలా కాలం హాయిగా వున్నారు కూడా (ఇండియాకి స్వతంత్రం వచ్చి కొత్త రాజకీయాలు మొదలయ్యేవరకూ). ఆ విధంగా బాహుబలి ఫామిలీ కూడా అంతర్రాష్ట్రవంశం అయింది. పాయింట్ అది కాదు. ఆ వంశంలో అసలు తెలుగువాళ్ళెవ్వరూ లేరు. కన్నడిగుడిగా పుట్టి, అరవ శివగామి పెంపకంలో పెరిగి మధ్యప్రదేశ్‌లో మాహిష్మతికి మైగ్రేట్ అయిన బాహుబలి మంచి తెలుగు మాట్లాడాలని డిమాండ్ చెయ్యడం అసలు న్యాయమేనా అంటా? కాదు కదా! తెలుగే రానివాళ్ళు మంచి తెలుగెలా మాట్లాడతారు? కానీ వాళ్ళు మాహిష్మతికి రాజధాని మార్చినప్పటినుంచీ తెలుగు మాట్లాడ్డం మొదలెట్టారు. ఇక్కడే వుంది అసలైన ట్విస్టు. ఏ రాష్ట్ర విభజనో జరిగి వుంటుంది. బాహుబలి & కో ఇప్పటి మధ్యప్రదేశ్‌లో వున్న మాహిష్మతికి మైగ్రేట్ అవ్వాల్సివచ్చింది. ఎవరూ నిధులూ పాకేజీలూ ఇవ్వకపోయినా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి పెద్ద కాపిటల్ సిటీ కట్టేసుకున్నారు. మాహిష్మతి చరిత్ర ప్రకారం సెంట్రల్ ఇండియాలో వుంది. మన తెలుగు శాతవాహనుల రాజధాని పైఠాన్, అదే ప్రతిష్టానపురానికి చాలా దగ్గర. అక్కడే బాహుబలి & కో దేశభాషలందు తెలుగు లెస్స అని గ్రహించారు. వాళ్ళ రాజపురోహితుడు జోస్యం కూడా చెప్పాడు. ఫ్యూచర్లో మీకధ ఇండియా గర్వించ దగ్గ గ్రాఫిక్స్ సినిమాగా రూపొందుతుంది, అదీ తెలుగులో అని. ఇంకేముంది? బాగా ఎక్సైట్ అయ్యి, వాళ్ళు సీరియస్‌గా తెలుగు నేర్చేసుకోడం మొదలెట్టారు. ఈ కధాకాలానికి వాళ్లింకా తెలుగు నేర్చుకుంటున్నారు. సో, ఇప్పుడు వైరల్ అయిపోయిన డైలాగ్లో గ్రామర్ లేదు, టెన్స్ లేదు వంటి తెతేల ఆందోళనల్లో అర్ధం గుండుసున్నా. 

అంచేత ఆ కోణం వదిలేసి తెతేలు కధలో కీలక మలుపుని పట్టుకుంటే కధలో కాస్త కామెడీ వుంటుంది. సస్పెన్స్‌తో నానా బాధాపడుతూ రుణమాఫీకై ఎదురు చూస్తున్న రైతుల్లా, పదవి కోసం   పాకులాడుతున్న నేతల్లా  బాహుబలి-ది కంక్లూజన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నసినిమాగతప్రాణులకి కాలక్షేపం అవుతుంది. తెలుగు మీద తెతేల అభిమానం చాటుకున్నట్టూ వుంటుంది.

సో, ఆ కామెడీ ఏంటో, ఆ భాషాభిమానం ఎంతో చూద్దాం. ఇలా- 

అదృష్టమో, దురదృష్టమో బాహుబలీవాళ్ళు కట్టప్ప అనే తెలుగు యోధుణ్ణి బానిసగా పట్టుకుని అతనిచేత అన్ని పనులూ చేయించడం మొదలుపెట్టారు. అంటే సైన్యానికి చీఫ్ కమాండర్ నుంచీ నైట్ వాచ్‌మాన్ వరకూ అన్ని పన్లూ అన్నమాట. తెలుగువాడు కావడంతో రాజకీయాలు సరిగ్గా తెలీక కట్టప్ప అలా వుండిపోయాడు. కనీసం తనకో స్పెషల్ స్టేటస్ కావాలని అడగలేకపోయాడు. ఇచ్చిన ప్రత్యేక పాకేజీ చాలదని, పనికేరాదని చెప్పలేకపోయాడు. అన్నిట్లో బాహుబలి ఫామిలీని శిరసావహించాడు. బాహుబలి 1 లో శివుడికాలు నెత్తిన పెట్టుకున్నట్టు. ఐతే ఒక్క విషయం మాత్రం కట్టప్ప జీర్ణించుకోలేకపోయేవాడు. బాహుబలి & కో తెలుగు మాట్లాడుతుంటే అతని కడుపులో తిప్పుతూ వుండేది. అయినా బానిసధర్మానికి కట్టుబడి నోరు మెదపలేక పోయేవాడు. అలా తట్టుకుని తట్టుకుని తట్టుకునీ …..

ఒకానొక యుద్ధం జరుగుతున్న టైములో మర్యాద కొద్దీనే ఐనా శత్రువులతో పోరాడుతున్న అమరేంద్రబాహుబలిని నువ్వు క్షేమమేనా, పెద్దపెద్దదెబ్బలేం తగల్లేదు కదా అనడిగాడు. అప్పుడే బాహుబలి నోట్లోంచి ఊడిపడింది టైంలెస్, టెన్స్‌లెస్, గ్రామర్‌లెస్ డైలాగ్, “నువ్వు నాపక్కనున్నంత వరకూ నన్ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు మామా,” అని. అసలే విపరీతమైన యుద్దావేశంలో వుండి, ఒంట్లో బాణాలు, ఈటెలు గుచ్చుకుని మహా ఇరిటేటింగ్ సిట్యువేషన్‌లో వున్నాడేమో అప్పటివరకూ కట్టడిలో ఉన్న కట్టప్పకి కోపం, చిరాకు కట్టలు తెంచుకున్నాయి. ఇంక తట్టుకోలేక …….

ఇవాల్టికి ఇంతే సంగతులు

బై4నౌ 

🙏

  

కప్పు🍵-లిప్పు-కాఫీ☕-సాసర్⛾ & 🎤 ది లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్ ♬

 

🌹🙏🌹 జీవితం ఉగాదిపచ్చడి తిన్నంత వీజీ…🌹🙏🌹

 

నేనెక్కడున్నాను, ఎలా వచ్చాను, ఎక్కడికిపోతానులాంటి ప్రశ్నలు నాబుర్రలో మెదిలే ప్రశ్నేలేదు