🌹🙏🌹 జీవితం ఉగాదిపచ్చడి తిన్నంత వీజీ…🌹🙏🌹


ఉగాది

మనం చేసుకునే పండగలన్నిట్లోకీ ఉగాది మహాగొప్ప పండగ. అంటే అది అతిశయోక్తి అవుతుందా? ఇంకే పండగనాడూ జరగని ఒక అద్భుతం ఆ రోజు జరుగుతుంది. అందుకని అది అతిశయోక్తి కాదు. జనం మామూలుగా సామాన్యుడు సామాన్యుడంటూ ముద్దుగా పిల్చుకునే సామాన్యుడు ఆ అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. ఎలా అనేకదా ఇప్పుడు ప్రశ్న?

వినాయకచవితికి లడ్డూల వేలం, రికార్డ్ సైజు విగ్రహాల వెర్రి వెరసి వేలంవెర్రిగా లౌడ్‌స్పీకర్ల రొదలో తందానాలాడే సామాన్యుడు ఉగాదిరోజు, “మావిచిగురు తినగానే కోయిల కూసేనా? కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?,” అని మనసులోనైనా, మౌనంగానైనా తర్కించక మానడు. ఋతువు మారడంలో వున్న మాజిక్ అది. 

దీపావళికి   చిటపటలాడే టపాకాయలపై మోజుతో మినుకు మినుకు దీపాల చిరదీవెనల్ని చిన్నచూపు చూసే సామాన్యుడే ఉగాదిపండక్కి ఓరకంటనైనా జ్ఞానదీప దర్శనం చేస్తాడు. అంటే, అమ్మ, భార్య, అక్క, చెల్లి, కూతురు – ఎవరి చేతినుంచి వేపపువ్వు పచ్చడి అందుకున్నా ఒక్కసారిగా చిన్ననాట తన వూళ్ళో జరుపుకున్న మొదటి ఉగాది, ఆ వాతావరణం, అప్పుడు కోయిలతో పడిన పోటీలనుంచీ ఈ రోజు ఈ క్షణం వరకూ నడిచిన జీవనప్రయాణం స్మృతిపధంలో మెలిగి ఆ అనుభవాలసారాన్ని ఉగాదిపచ్చడి రుచిలో మళ్ళీ ఒకసారి అనుభవిస్తాడు. 

సంక్రాంతి సీజన్లో కోర్ట్ ఆర్డర్లు కూడా లెక్కచెయ్యకుండా కోడిప్రాణాలతో చెలగాటం ఆడి, ఓడినా గెలిచినా కోడిని పకోడీ చేసిగానీ వదిలిపెట్టని సామాన్యుడు (వీడు నిజంగా సామాన్యుడేనా? ఏమో మరి). అటువంటి అసమానసామాన్యుడు ఉగాదిరోజు కోయిలకూతకి పులకరిస్తాడు. దానితో పోటీపడి రెచ్చగొడుతూ జుగల్ బందీ చేస్తాడు. అది రెచ్చిపోయి గొంతు బొంగురుపోయేవరకూ స్వరం పెంచుతుంటే ముచ్చటపడతాడు. అమాయకపుకోడికి పకోడీ-మోక్షం ఇచ్చేసే ఆ సామాన్యుడే గూటిదొంగ, సహజ ఆజన్మకబ్జాదారు అయిన కోయిలకి ఉగాదికవులతో కలిసి వసంతుడిచ్చే క్రమబద్ధీకరణ ఒప్పేసుకునే  (అ)సామాన్యుడు.

శివరాత్రికి ఒకే టికెట్టు మీద రెండు సినిమాలు చూసిమరీ జాగరణం చేసే సామాన్యుడు ఉగాదినాడు  పంచాంగం వినడానికి సినిమాని పక్కకి నెడతాడు. 

ఇంతెందుకు? ప్రతి పండక్కీ ఎవరో ఒక ఇన్‌ఛార్జి దేవుడుంటాడు. ఉగాదికి మాత్రం ఎవరి ఇష్టదైవం వాళ్లకి ఇన్‌ఛార్జి. నిజానికి ఉగాదిపచ్చడిలో షడ్రుచులతో పాటు కలిపే ఏడోరుచిని, అదే ఫిలాసఫీని, అర్ధం చేసుకుంటే భగవద్గీత చదివినట్టే, విశ్వరూప సందర్శనం అయినట్టే కాదూ?

ఏడాదంతా ఆర్తి లేక అర్ధార్ధి స్టేటస్‌లో సెటిలైపోయే సామాన్యుడు ఉగాదికి జ్ఞాని/జిజ్ఞాసువు అవతారం ధరిస్తాడు. తెలిసో తెలీకో – “అచ్చతెలుగు”లో చెప్పాలంటే – కాన్షస్‌లీ (or) అన్-కాన్షస్‌లీ జ్ఞానోదయం పొందుతాడు. ఉగాదిపచ్చడి రూపంలో జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలని, సుఖదుఃఖాలని, తప్పొప్పులని సమదృష్టితో స్వీకరించి “ఆ విధంగా ముందుకుపోవాల్నని” మళ్ళీ ఒకసారి నిశ్చయించుకుంటాడు. మిగిలిన పండగలన్నిట్లో మామూలు మోక్షంలాంటి చిన్నచిన్నఅవసరాలనుంచీ అభిమాన హీరో సినిమా హిట్టవ్వాల్సిన మహావసరం వరకూ ఆ పండగకి కనెక్ట్ అయ్యివున్న దేవీదేవతలకి అర్జీలు పెట్టుకోడం మామూలే. ఉగాదినాడు మాత్రం ఉగాదిపచ్చడిలో ఆరురుచుల్ని ఆరువిధాల జీవితానుభవాలుగా స్వీకరిస్తాడు. వసంతాగమనాన్ని, పంచమస్వరంలో కోకిలారవాన్ని ఆస్వాదించినంత అనందంగా ఉగాదిపచ్చడి సాంప్రదాయాన్ని ఆహ్వానిస్తాడు. జీవితం అంటే ఉగాదిపచ్చడి తిన్నంత/చేసినంత వీజీ కాదని తెలిసినా ఈ విధంగా కొత్త సంవత్సరంలో రాసిపెట్టివున్న ఆదాయ-వ్యయ-రాజపూజ్య-అవమానాదులకి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతాడు. భారతీయుడిలో అంతర్లీనంగా వుండే తాత్వికత తనలోనూ ఉందని ఓసారి గుర్తు చేసుకుంటాడు. ఏ పూజలూ, ప్రవచనాల సహాయం లేకుండానే ఆ అనుభూతిని పొందుతాడు. ఇది అద్భుతం కాదనగలమా? దేర్‌‌ఫోర్, మనం చేసుకునే పండగలన్నిట్లోకీ ఉగాది మహాగొప్పపండగ.

🌿 🌾 అందరికీ ఉగాది శుభాకాంక్షలతో …🌿 🌾

🌹🙏🌹

20170328_201110.jpg