టీకప్పులో ట్సునామి09-కుజగ్రహంపై పక్కాఇళ్ళు, మెగాహీరో ఆడియోఫంక్షన్‌కి పవన్‌కళ్యాణ్ ఎందుకెళ్ళలేదు?, etc, etc.


లాస్ట్‌వీక్ న్యూస్ పేపర్స్‌లో ఒక వార్తొచ్చింది. వార్తంటే హత్యలు, అక్రమసంబంధాల్లాంటి రెగ్యులర్ వార్తలు కాదు. (ఏం చేస్తాం? వీటిని వార్తలు అనాల్సిన ఖర్మ పట్టింది. న్యూస్ పేపర్ ఆన్‌లైన్ ఎడిషన్ చూస్తే వార్తలంటే ఇవే అన్నట్టు చూపిస్తున్నారు మరి. టీవీ ఛానెల్స్ ఐతే… నో కామెంట్స్.) ఇంతకీ ఇక్కడ డిస్కస్, ఐ మీన్,  – ఛీ..ఛీ..  ఆంగ్లమ్ముక్కల్లేకుండా గట్టిగా ఒక వాక్యం రాయడం గగనమై పోతోంది, అహో! ఆంధ్రభోజా శ్రీకృష్ణదేవరాయా, ఏమి చేతునయా?

ఇంతకీ ఇక్కడ చర్చించబోయే అంశం ఏంటయ్యా అంటే –

MARS housing

Photo courtesy: Youtube 

ఈమధ్య ఖగోళ శాస్త్రజ్ఞులకి కుజగ్రహం మీద వేలాది భవనాల్లాంటి నిర్మాణాలు కనిపించాయిట, టెలిస్కోపుల్లో. పై ఫోటో వాటిదే. కుజుడిపై బుద్ధిజీవులున్నారనే సంగతి ఇంకా ఊహక్కూడా అందని పరిస్థితిలో నిర్మాణం అనేమాట వాడడం కరెక్టు కాదు. నిర్మాత ఒకడుంటేనే కదా ఇళ్లయినా, సినిమాలైనా నిర్మాణం అయ్యేది? కుజుడి మీద జీవరాశి ఉండే అవకాశం లేదనుకుంటున్న ఆర్డినరీ మనిషి ఇలాగే అనుకుంటాడు. కానీ యూఎఫ్‌ఓలు, ఫ్లయింగ్ సాసర్లులాంటివి ఉన్నాయని నమ్మేవాళ్ళు అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరు.  వాళ్ళు తెలుగువాళ్ళయితే కన్విన్స్ అవ్వరు అనేబదులు సమాధానపడరు అనేవాణ్ణే కానీ వాళ్ళు తెలుగేతరులు. ఈ దేశంవాళ్ళే కాదు. ఎందుచేతో మనదేశంలో, అందునా తెలుగురాష్ట్రాల్లో యూఎఫ్‌ఓల్లాంటి మిస్టరీల మీద దృష్టి పెట్టేవాళ్ళు తక్కువే అనుకుంటా.     

కొత్తగా రిలీజయ్యే సినిమాలేంటి?

సంక్రాంతికి బాబాయ్-అబ్బాయ్‌ల సినిమాలకి క్లాష్ వస్తోందా?

ఫలానా మెగాహీరో ఆడియోలాంచ్‌కి  పవన్‌కళ్యాణ్ ఎందుకు రాలేదు?

ఫలానా హీరోగారి అబ్బాయి పెళ్లి ఎందుకు వాయిదా పడింది? …………….వంటి చర్చలు,

వేలకి వేల ఎపిసోడ్లు సాగే మెగాసీరియల్స్‌ తిరగబోయే మలుపులపై తర్జనభర్జనలు,

వెకిలితనంతో వెలిగిపోయే “కామెడీ” షోల్లో ఒలికే హాస్యరసాన్ని, సెటైర్‌ని ఆస్వాదించుట

-ఇలాంటి మానవజాతి వికాసానికి, పరిణామానికి అత్యవసరమైన టాపిక్స్‌లో   మెజారిటీ తెలుగుజనం స్పెషలైజ్ చెయ్యడం ఒక కారణం కావచ్చు. 

మరీ డీప్‌లీ సైంటిఫిక్ ఇష్యూస్ ఐతే మాత్రం.. అంటే – పైజమాబొందు ఏ దిక్కుకి తిరిగి కట్టుకోడం శ్రేష్టం అనే మీమాంస నుంచీ పీఎస్‌ఎల్వీ రాకెట్ లాంచింగ్ విజయవంతం అవ్వాలంటే దాని వాస్తు, న్యూమరాలజీ ఎలావుండాలనే వరకూ అన్నమాట. ఇలాంటి హైటెక్ సబ్జెక్ట్స్ డీల్ చెయ్యడానికి వాటికి సంబంధించిన బోల్డంతమంది ధర్మసందేహాల స్పెషలిస్ట్‌లు టీవీఛానెల్స్‌లో రెడీగా వుండడం మరో కారణం కావచ్చు. (గమనిక: కీ.శే. ఉషశ్రీగారిలా బాలన్స్డ్‌గా ధర్మసందేహాల్ని తీర్చేవాళ్ళు పై స్పెషలిస్టుల లిస్టులో లేరని మనవి). ఇక్కడో చిన్న పిడకలవేట. ఒక్క శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు తప్ప తక్కిన జనాభా అంతా ఔటర్-స్పేస్‌కి సంబందించిన విషయాలన్నీ – గ్రహాంతర జీవుల నుంచీ గ్రహశాంతుల దాకా – అన్నీ జ్యోతిష్కులకి ఔట్‌సోర్స్ చేసేసారా అనే అనుమానం వస్తోంది ఒక్కోసారి. ఒకానొక ఛానల్లో జ్యోతిష్యం మీద అరమిల్లీమీటర్ కూడా అవగాహనలేని యాంకర్‌కి, జ్యోతిష్యంలో రెండు డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ‌నుండి వచ్చిన ఇద్దరు జ్యోతిష్కులకి మధ్య డీ-మానిటైజేషన్ నేపధ్యంలో మోడీగారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే టాపిక్‌పై జరిగిన చర్చ విన్నాక పైన చెప్పిన అనుమానం ఇంకాస్త బలపడింది. ఆ చర్చలో ఏమడగాలో తెలీక యాంకరూ, ఇద్దరు జ్యోతిష్కుల్లో ఎవరు చెప్పేది నమ్మాలో తెలీక శ్రోతక్షకులు** తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. మోడీగారి భవిష్యత్తు విశ్లేషించడానికి ఇద్దరు జ్యోతిష్కులూ వేరు వేరు ప్రామాణిక సిద్ధాంతాలు వాడి వాదించుకున్నారు. ఏ విషయమైనా ఒకటే ప్రమాణం ఆధారంగా చర్చిస్తే శాస్త్రం తెలీని యాంకర్లు, శ్రోతలకి కాస్త అర్ధమౌతుంది కానీ ఇలా ఐతే ఎలా? సెన్సేషన్ కోసం జరిపే డిబేట్ల వల్ల జనంలో కన్ఫ్యూజన్, అనుమానాలు పెరిగి నికార్సయిన శాస్త్రానికీ దూరం కావచ్చు. ఏ ప్రమాణం కరెక్టు ఏది కాదు అన్న దిశగా తప్పుదారి కూడా పట్టచ్చు. ఐనా పొలిటికల్ విశ్లేషణలు నిజానికి పాలిటిక్స్, సోషల్ ఇష్యూస్ ఆధారంగా సాగాలి కానీ ఇదేం విశ్లేషణ? జనం పూర్తిగా వెంగళప్పలైపోయారని టీవీలవాళ్ళు డిసైడ్ చేసేసారో ఏంటో, ఖర్మ? ఈ లెక్కన కొన్నాళ్ళకి ఎగ్జిట్ పోల్స్, పొలిటికల్ సమీకరణాలు, యాంటీ-ఇంకంబెన్సీ వోటింగ్, ఎకానమీ, ఉద్యోగాలు, తాయిలాలు, కుంభ/రంభకోణాల ఎఫెక్ట్స్, … ఇవన్నీ వదిలేసి వాస్తు, జ్యోతిష, న్యూమరాలజీలకి పుట్టుమచ్చలశాస్త్రం జోడించి ఎన్నికల ఫలితాలు ముందుగా చెప్పేస్తారేమో. పన్లో పని ఎవడి నక్షత్రాన్ని బట్టి ఎవడికి వోటేస్తే మంచిదో ఏ దిక్కుకి తిరిగి దణ్ణంపెట్టి వోటేస్తే మంచిదో కూడా చెప్పేసి అలా చెయ్యకపోతే ఎలాంటి గ్రహాలూ, కాలసర్పదోషాలు వోటరు మారాజుని పట్టి పీడిస్తాయో ముందే చెప్పి హడలగొట్టి పారేస్తే వెధవది ఎలక్షన్స్‌లో హద్దులు మీరి ఖర్చు పెట్టడం, సారా పేకెట్లతో వోట్లు కొనడంలాంటి మాల్‌ప్రాక్టీసులు అవసరం లేకుండాపోయి చివరికి ఆగిపోతాయేమో!?! అవినీతి కూడా తగ్గుతుంది. ఆలోచించడం అవసరం. (**శ్రోతలు+వీక్షకులు = శ్రోతక్షకులు అనగా చూస్తూ వినేవారు. సంధి ఏంటో ఇంకా తెలీదు, ఎవర్నైనా టీవీ యాంకర్ని అడిగితేగానీ తెలీదు.)  

సరే, ఇంతకీ కుజగ్రహంమీది నిర్మాణాల విషయం తేల్చాలి కదా. యూఎఫ్ఓ హంటర్స్ ఎప్పటికి ఎన్నాళ్ళకి ఆ నిర్మాణాల నిగ్గు తేలుస్తారో ఏమోకానీ ఈలోగా దీని ఆధారంగా భూమ్మీద రెండు సమస్యలకి పరిష్కారం దొరికేలా వుంది. ఆ రెండు సమస్యలు ఏంటంటే – 1) కుజగ్రహం మీద జీవజాలం ఉందా లేదా? 2)మనదేశంలో పేదలకోసం కట్టించిన పక్కాఇళ్ళు ఎందుకు, ఎలా అదృశ్యం అయిపోతున్నాయి అయిపోయాయి?

రెండో సమస్యకి సమాధానం దొరికితే మొదటిది ఆటోమేటిగ్గా సాల్వ్ అయిపోతుంది. సో, లెటజ్ ఫస్ట్ సీ వాట్ ఈజ్ ద ప్రాబ్లెమ్ విత్ పక్కా ఇళ్ళు … 

ఏం జరిగిందంటే –

2009 కంటే ముందు పేదల కోసం కొన్ని లక్షల పక్కా ఇళ్ళు అప్పటి ప్రభుత్వం కట్టిస్తే ఇప్పుడో రెండులక్షల ఇళ్ళు మిస్సింగుట. దుర్భిణీ వేసినా, కళ్ళకి అంజనం పూసుకుని చూసినా కనబడనంత దారుణంగా మిస్సింగుట. నీ మొహం తగలెయ్యా ఈ మిస్సింగ్ పక్కాఇళ్ళకీ, మార్స్ మీది నిర్మాణాలకీ సంబంధం ఏంట్రా? ఇళ్ళు అదృశ్యం అయింది అవినీతి వల్లకదా? అనాలనిపిస్తోందా? అయితే వెయిట్ ఎ మినిట్. ఆ ఇళ్ళు మిస్సయింది మనవాళ్ళ అవినీతివల్లో, గివినీతివల్లో కాదని కుజగ్రహవాసుల హస్తలాఘవం వల్ల అని మీకీపాటికి ఐడియా వచ్చేసివుండాలి. ఒకవేళ రాకపోయినా పర్లేదు. వాస్తు,జాతక,న్యూమరాలజీ దోషాలని సరిదిద్దుకుంటే ఇలాంటి ఐడియాలు ఈజీగా వచ్చేస్తాయి. వాటి మీద నమ్మకం లేనట్టయితే ఎమ్.కామ్ (ఫిజిక్స్) చదువుకున్నా ఫర్లేదు.

నిజంగా ఏం జరిగిఉంటుందంటే –

కుజగ్రహం మీద గొప్ప సివిలైజేషన్ వుంది. వాళ్ళకున్న కొన్ని అతీతశక్తులవల్ల మనకి, మన శాటిలైట్లకి అక్కడి మనుషుల ఉనికి, నాగరికత కనిపించవు. అయితే ఎంత గొప్ప సివిలైజేషనైనా, ఎంత శక్తిమంతులైనా వాళ్ళకీ కొన్ని సమస్యలున్నాయి,  మన గొప్ప సివిలైజేషన్‌కి వున్నట్టే. అవే బీదరికం, అందరికీ పక్కాఇళ్ళులేకపోవడం + ఎలక్షన్లూ+కుంభకోణాలు ఎట్సెట్రా. ఇవన్నీ చాలనట్టు వాళ్లకి మన స్విస్‌బాంకుల్లాంటివి కూడా వుంటాయి. కుజగ్రహ ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాఇళ్ళు కట్టించేసినట్టు పేపర్ మీద చూపించి  అక్కడి అవినీతిపరులు, అధికారులు డబ్బు నొక్కేస్తూవుంటారు. నొక్కేసిందంతా కుజస్విస్‌బాంకుల్లో దాచేస్తారు. దాంతో ఆ మధ్య పక్కాఇళ్ళ అదృశ్యం అంటూ కుజమీడియా గగ్గోలెత్తింది. ఇంతలో ఎలక్షన్స్ వచ్చి పడ్డాయి. నల్లధనం వెనక్కి రప్పిస్తాం, అవినీతిని ఉక్కుపాదంతో అణిచేస్తాం అంటూ కొందరు కుజరాజకీయనాయకులు హుంకరించారు. దెబ్బకి హడిలిపోయిన కుజబ్యూరోక్రాట్లు, వాళ్ళతో చేతులు కలిపిన కుజమంత్రులు రాత్రికి రాత్రి, మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు పదిలంగా కట్టూకున్నా పక్కాఇల్లు మాదీ అని పాడుకుంటూ మనం కట్టించుకుని ఎంచక్కా అట్టేపెట్టుకున్న పక్కాఇళ్ళని వాళ్ళ అత్యంతాత్యంతాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి కుజబీదలకి పంచిపెట్టేశారు. అనుకోకుండా అవి మన కంటబడ్డాయి. అవి మనకెందుకు కనబడుతున్నాయంటే కుజగ్రహాధికారులు ఇంకా వాటికి అదృశ్యం అవడానికి కావాల్సిన ఒక రకం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లాంటిది ఇవ్వడంలో జాప్యం వల్ల. అంతే. (జాప్యం ఎందుకో అర్ధమైపోయుండాలి) ఇప్పుడు మనం వాటిని తిరిగి భూమ్మీదకి రప్పించేసుకుంటాం. స్విస్‌బాంక్స్‌లో మూలుగుతున్న నల్లడబ్బుని రప్పించేసుకున్నట్టు. చాలా ఈజీ. అనవసరంగా మనం మన లీడర్లనీ, బ్యురాక్రసీని, కంట్రాక్టర్ కంపెనీల్ని తిట్టుకుంటాంగానీ అది చాలా తప్పు. జరిగిందేదో జరిగిపోయింది, గతం గతః. రెండు సమస్యలు తీరుతున్నాయి మరి. పక్కాఇళ్ళు మాయం చేసిందెవరో తెలిసిపోయింది. ఇంతపని చేసారంటే వాళ్ళు బుద్ధిజీవులని వేరే చెప్పాలా? మిస్సింగ్ పక్కాఇళ్ళన్నీ కూడా త్వరలో చచ్చినట్టు మన పక్కకొచ్చి కూచుంటాయి. ఐ మీన్, ఏదో ఒక పార్టీ దీన్ని ఎలక్షన్ మానిఫెస్టోలో పెట్టకపోదు. 

ఇంతే సంగతులు

బై4నౌ

 🙏😊🙏

teacup lo tufan

5 comments

 1. “శ్రోతక్షకుల” కథలనటు
  మా తల తిరుగంగ మీరు మార్సు కథలనున్
  గోతులు తవ్వని యిండ్లన్
  జ్యోతిష్యపు తీరులున్ను జోడించిరి బో 🙂

  జిలేబి

  Liked by 1 person

 2. “ఇలాంటి మానవజాతి వికాసానికి, పరిణామానికి అత్యవసరమైన టాపిక్స్‌లో మెజారిటీ తెలుగుజనం స్పెషలైజ్ చెయ్యడం ఒక కారణం కావచ్చు”. ఇది మనపరిస్థితిని అద్దంపట్టే వాక్యం.

  “(**శ్రోతలు+వీక్షకులు = శ్రోతక్షకులు అనగా చూస్తూ వినేవారు. సంధి ఏంటో ఇంకా తెలీదు, ఎవర్నైనా టీవీ యాంకర్ని అడిగితేగానీ తెలీదు.)” . యాంకర్లే నిజమైన నిపుణులు. ముఖ్యంగా సినిమాతో సంబంధంలేని సాహితీవేత్తలనో, వారి వారి రంగాలలో నిష్ట్నాతులని ఇంటర్వ్యూ చేసేటప్పుతూ, వీళ్ళ ప్రశ్నలు వింటే మళ్ళీ అటుకేసి వెళ్ళరు.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s