ఈ మధ్య ఎవరిమీదైనా అవినీతి ఆరోపణలు వస్తే “అవి నిజమని ఋజువు చెయ్యండి, రాజీనామా ఇచ్చేస్తాం , పాలిటిక్స్ నుంచి తప్పుకుంటాం,”అని రొటీన్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. జోక్ కాకపోతే అవినీతి చేసేవాళ్ళు సాక్ష్యాలు , ఆధారాలు పెట్టుకుని చేస్తున్నారా ఏంటి? ఒక్కో కుంభకోణం వెలుగులోకొచ్చినప్పుడల్లా నేర్చుకున్న పాఠాలతో చట్టాలు వ్యవస్థల్లో మార్పుచేర్పులు చేస్తాయి ప్రభుత్వాలు. పాఠాలు నేర్చుకోవడం ఒకప్పటి ప్రత్యేక హోదా లాగా ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పటి ప్రత్యేక హోదా లాగా క్లోజ్డ్ చాప్టర్ కాదు. అందువల్ల ఇక్కడో పాయింట్ మాత్రం ప్రజలు మిస్సవ్వరు . ఆ పాయింట్ – ప్రభుత్వాల్లాగే అవినీతిమంతులూ పాఠాలు నేర్చుకుంటారు, ప్రతి కుంభకోణం నుంచీ – అనేది . అవినీతిలో MBA లెవెల్ కి చేరిపోయిన దుర్బుద్ధి మంతులు (కావాలంటే ‘తు’ కి ‘ర’ వత్తు పెట్టుకోండి😉) ఒకసారి చేసిన పొరపాటు మరో సారి చెయ్యరు. వెనకటికెప్పుడో ‘ముత్యాలముగ్గు’లో కాంట్రాక్టర్ కే తెలుసు గోడలకి చెవులుంటాయని, యవ్వారాలు మాట్టాడుకోడానికి ఆరుబయటే సేఫ్టీ అనీను . ఇప్పటోళ్ళకి గోడలకు కాదు ఫర్నిచర్ కి కూడా చెవుల్తో పాటు కళ్ళు కూడా వుంటాయని తెలుసు. అవి ఎవరి అవసరాన్ని బట్టి ఎవరిమీద ప్రయోగించబడతాయో ఆ లెక్కలు కూడా ఇంచుమించు తెలుసు. అందువల్ల అవినీతి “కధలు” ఋజువయ్యే ప్రసక్తే లేదు. ఋజువవ్వాలని జనానిక్కూడా పెద్ద పట్టింపు లేదు. ఉన్నట్టు లేదు. ఏలయన, ఎవడు చెప్పేది నిజమో, ఎవడు చెప్పేది కాకమ్మ కధో ఎవడికీ అర్ధమై చావట్లేదు.