😉 మీ ఊళ్ళో గాంధీస్టాట్యూ మీద రంగుల్ని గీకిన గుర్తులున్నాయా? 😉


gandhi-panchalohaఆయన నమ్మిన సిద్ధాంతం, అవలంబించిన జీవనవిధానం ఒకప్పుడు సంచలనాలు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని, మేధావుల్నీ ఆకర్షించాయి. రకరకాల సోషల్ స్టీరియోటైప్స్‌లో ఇరుక్కుపోయిన జాతులు, సంస్కృతుల్లో కాస్త ఔట్-ఆఫ్-ది-బాక్స్ ఆలోచించడానికి వెనుకాడనివాళ్లని సత్యం, అహింసల బేసిస్‌పై నిర్మితమైన గాంధీగారి పనులు, పద్ధతులు ఆకర్షించాయి. ఆయనంటే పడనివాళ్ళ అభిప్రాయం ఏంటోగానీ, గాంధీజీకి పబ్లిసిటీ పిచ్చిగానీ, ఎప్పుడూ వార్తల్లోఉండాలనే తపనగానీ వుండేవని ఎవరూ అనగా విన్లేదు. అలాంటి గాంధీజీ ఎప్పుడూ ఊహించివుండని పని ఆయన విగ్రహం ఒకటి చేసేసింది 😉 చిన్న సైజు సంచలనం సృష్టించింది. గాంధీమార్గంచేత అనేకమంది అనేక రకాలుగా ప్రభావితులయ్యారని మనకి తెలుసుగానీ తమిళనాడులో బన్రుట్టి అనే వూళ్ళోకొందరు- ఎవరో, ఎందరో, సమాచారంలేదు- తమదైన శైలిలో, కొంత డిఫరెంట్‌గా ప్రభావితులయ్యారు. అయ్యి వూరుకోకుండా గాంధీజీ పంచలోహ విగ్రహం (నలభై కిలోలు బంగారంతో సహా) ఒకటి తయారు చేయించి ప్రతిష్టించేసారు అరవైయ్యేళ్ల క్రితం. పేపర్లవాళ్ళు చెప్పిందాన్నిబట్టీ ఆ విషయం, అది పంచలోహం అన్న విషయం, ఊరు ఊరంతా మర్చిపోయింది. అన్ని కిలోల బంగారం ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో, అందులో వాళ్ళ లాజిక్కేంటో పేపర్లు రాయడంలేదు. పంచలోహ విగ్రహాలు యూజువల్లీ దేవుళ్ళకి కదా చేయిస్తారు. మరి గాంధీజీకి ఎందుకు చేయించారని ప్రశ్న. గాంధీజీ దైవాంశసంభూతుడని భావించి ఆ రోజుల్లో ఆయన మీద స్తోత్రాలు రచించారని చిన్నప్పుడెప్పుడో ఈనాడు ఆదివారం అనుబంధంలో చదివాను. “గాంధిదేవ నమస్తుభ్యం…” అంటూ సాగుతుంది. (మొత్తం గుర్తు లేదు. కావాలనే గుర్తు పెట్టుకోలేదు.) అటువంటి భావాలతోనే వాళ్ళెవరో మహాత్ముడినీ పంచలోహాల్లో పోతపోయించి ఉంటారని సరిపెట్టుకోవచ్చు. అసలే తమిళనాడు, ఖుష్బూకే గుడి కట్టించిన భక్తిప్రపత్తులకి ఆటపట్టైన గడ్డ. గాంధీజీకి కట్టించరా? సో, పంచలోహవిగ్రహం చేయించడంలో పెద్ద వింతేమీ లేదు. అది ఇన్నాళ్ళు సేఫ్‌గా ఉండడమే వింత. దీనికి క్రెడిట్ అంతా ఆ తరం ప్రజల, ముఖ్యంగా గ్రామస్తుల నీతినిజాయితీలకి, జాతిపితపై ఇప్పటికీ ప్రజల్లోవున్న పూజ్యభావానికీ దక్కాలి, దక్కుతుంది. ఐతే, జనంలో పెరుగుతున్న నేరప్రవృత్తిని బట్టీ అనుమానించడం డిఫరెంట్ యాంగిల్లో పాయింట్స్ లాగడం అలవాటైపోయింది. కీడెంచి మేలెంచాలి కదా. దాంతో –

పంచలోహ విగ్రహానికి పెయింట్ ఎందుకు?

విగ్రహం సెక్యూరిటీ కోసం దాన్ని చేయించినవాళ్ళే రంగులు వేసి అసలు విషయం దాచి ఉంచారా?

రహస్యం పసిగట్టిన ఇంకెవరైనా దాన్ని రహస్యంగానే  ఉంచి తగిన అవకాశంకోసం ఎదురుచూడ్డంలేదు కదా!?!?!

– ఇలాంటి కుశంకలు తలెత్తుతూ వుంటాయ్.  (సారీ! సినిమావిలన్లుగా నాగభూషణాలు, రామలింగయ్యలు, రావు గోపాల్రావులూ  చేసే మోసాలు, నేరాలూ సినిమాల్లోంచి బయటకొచ్చి విహరిస్తున్నాయి కదా, వద్దనుకున్నా మైండు ఆ డైరెక్షన్‌లో ఆలోచిస్తుంది, ప్చ్, ఏం చేస్తాం!సినిమాలు చూడ్డం మానేస్తే?)

గుప్తనిధులు, ప్రాచీనశిల్పాలు, పంచలోహవిగ్రహాలకోసం ఎలాంటి నేరానికైనా ఒడిగట్టగల “మహానుభావులు”న్న రోజుల్లో మహాత్ముడి రెండొందలకిలోల పదిహేనుకోట్ల విలువైన ఆ విగ్రహం ఇన్నేళ్ళు భద్రంగా వుండడం వింతే. మునిసిపాలిటీ నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం అనేవి మనదేశంలో పెద్ద వింతకాదు కానీ న్యూస్ పేపర్లు చెప్తున్నట్టు అలాంటి అవాంఛనీయగుణాలే ఒక మంచికి -విగ్రహం ఇన్నాళ్ళు సేఫ్‌గావుండడానికి- కారణం అనడం మాత్రం సెన్సేషనే. బన్రుట్టి గ్రామప్రజల నీతినిజాయితీలని కూడా పరిగణించద్దా? విగ్రహానికి రంగులు వెయ్యడంవల్ల అది పంచలోహం అని ఎవరికీ అనుమానం రాలేదు (ట). అలాంటి అనుమానం రాకూడని వారికెవరికైనా వచ్చుంటే? ఏమయ్యేది? వన్, ఈ టపా పడేది కాదు. టూ, ఆ విగ్రహం ఏ విదేశీ యాంటిక్స్ కలెక్టర్ చేతుల్లోకి పోవడమో లేక కరిగి కరెన్సీగా మారడమో జరిగేది. త్రీ, ఇక్కడో కొత్త కోటీశ్వరుడు తయారయ్యేవాడు లేక పాత కోటీశ్వరుడొకడు కొత్త కోట్లు సంపాయించేవాడు. అలాంటివేమీ జరగలేదంటే అది తప్పకుండా బన్రుట్టివాసుల గొప్పతనమే. ఒకవేళ విగ్రహపు మెటీరియల్ ఏమిటో ఇప్పటి తరానికి తెలీకపోయినా  అరవైయ్యేళ్లలో కనీసం మొదటి పది, పదిహేనేళ్ళపాటైనా విగ్రహవిశేషాలు తెలియకుండా వుండివుంటాయా? దీన్నిబట్టీ తెలిసినవాళ్లున్నా ఆ విషయం బయటికి పొక్కలేదనుకోవచ్చు కదా? లేకపోతే రెండొందల కేజీల పంచలోహ విగ్రహం ఒక పార్కులో ఓపెన్‌గా వుందంటే ఎవరో ఒకరి కన్ను పడే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకే క్రెడిట్ షుడ్ గో టు పీపుల్ ఆఫ్ బన్రుట్టి.

ఈ కధలో చిన్న ఐరనీ వుంది. అది మహాత్ముడికి బ్రతికుండగాలేని, ఆయన కోరుకోని సెక్యూరిటీ ఇప్పుడాయన విగ్రహానికి ఏర్పాటవ్వడం. చుట్టూతా సీసీ కెమెరాలు, ఐరన్ గ్రిల్స్, గేట్లు,….నిజానికి ఇవన్నీవున్నా ఆ విగ్రహానికి ముందెప్పుడూ లేనంత రిస్కు ఇప్పుడొచ్చిపడింది. సీసీ కెమెరాలు ఆగిపోవచ్చు, గేట్లతాళాలు సరిగా పడకపోవచ్చు. ఏమైనా కావచ్చు. తప్పు, తప్పు,…కా’బడ’వచ్చు 😉 . (మళ్ళీ సినిమా నాగభూషణాలు, రామలింగయ్యలు, రావు గోపాల్రావులూ …).

అపరిగ్రహానికి కట్టుబడ్డ గాంధీజీ విగ్రహాన్ని అభిగ్రహించకుండా వుండగల నిగ్రహంలేని శనిగ్రహాలు చుట్టూ తిరుగున్నాయనే కదా ఈ సెక్యూరిటీకర్ధం!!!

అనకూడదుగానీ ఇక ప్రతివూళ్ళో యాభైఅరవైయ్యేళ్ల కిందట పెట్టించిన విగ్రహాలన్నీ ప్రమాదంలో పడతాయేమో!!

P.N. ప్రజల్లారా! మీ ఊళ్ళల్లో గాంధీ స్టాట్యూస్ కానీ, గుళ్ళల్లో విగ్రహాలు కానీ రంగులువేసినవి ఉంటే, ఎందుకైనా మంచిది ఆ రంగుల్ని కొంచెం చెక్ చెయ్యండి. వాటి మీద ఆల్రెడీ గీకిన గుర్తులున్నాయా? ఉంటే, ఎవరో ఔత్సాహికుడు కోటీశ్వరుడయ్యే ప్రయత్నంలో వున్నాడన్నమాటే 😉 గుర్తులు లేకపోతే? లేకపోయినా జాగ్రత్తపడాల్సినంతగా కాలం మారిపోయింది. టెక్నాలజీలు కూడా మారాయి. సినిమా నాగభూషణాలు, రామలింగయ్యలు, రావు గోపాల్రావులూ … మాత్రం మారలేదు.

gandhi-panchaloha

***🙏😉🙏***

Love for Earth అనే భూతయజ్ఞం : అపర మత్స్యావతారానికి “గజేంద్రమోక్షం”

మోడీమెసేజ్ = శ్రీకృష్ణుని కోరిక = ప్లాస్టిక్-ఫ్రీ భూమాత =గోసంరక్షణ

గోదావరిని గాంధీనది, బంగాళాఖాతాన్ని నెహ్రూమహాసముద్రం;హిమాలయాల్ని పటేల్‌పర్వతాలు అని పిలిస్తే🤔 ? ఎలా ఉంటుంది😲?