నలభైయ్యేడు అడుగుల పొడుగు, ఇరవై టన్నుల బరువూ వున్న ఆ నీలితిమింగిలం (బ్లూ వేల్) జీవితమ్మీద ఆశ వదిలేసుకుని అప్పటికి ఒక రోజు గడిచింది. ఎవరో వస్తారు, రక్షిస్తారు అని ఆశపడడానికి ఆ తిమింగిలానికి గజేంద్రమోక్షంలాంటి కధలు తెలీదు కదా? నిజానికి తన శరీరపు బరువే తనకి మోక్షద్వారం అనికూడా తెలీదు. తెలిసిందల్లా కాలం గడుస్తున్న కొద్దీ తనేదో బండకిందో కొండకిందో చిక్కి నలిగిపోతున్న నొప్పి, ఆర్కా (కిల్లర్ వేల్స్) దాడిచేసి బతికుండగానే తినేస్తాయనే జంతుప్రజ్ఞ(Instinct) వల్ల కలిగిన భయం అంతే. ఇతర జంతువుల వల్ల కలిగే భయం ఆ బ్లూవేల్కి తను పుట్టినప్పట్నుంచీ తెల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు ఆ అవస్థ తప్పదని మరిచిపోకుండానే ఇన్నాళ్ళూ బతికింది. తన జాతిలోని ఇతర తిమింగిలాల్లాగా. అయితే ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి బైట పడుతోంది. తన సైజూ, బరువూ, బలం ఇప్పటికే బాగా పెరిగాయి. ఇంకొంత పెరిగితే కిల్లర్ వేల్స్ తో సహా ఏ జీవీ తన దగ్గరకొచ్చే ధైర్యం చేయలేవనే ధైర్యం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. వయసుడిగి, అంటే ఎనభైయ్యేళ్ళు పైబడి, బలం తగ్గాక ఆ భయం మళ్ళీ మొదలౌతుంది. అంతలోనే ఈ అనుకోని ప్రమాదం. ఈ తీరానికి మరీ దగ్గరగా రావడం, అక్కడ ఉండాల్సిన దానికంటే ఎక్కువ సమయం సేపు ఉండడం, అంతలో సముద్రం పోటు తగ్గి నీరు వెనక్కి పోవడంతో లోతు తక్కువ జలాల్లో ఇరుక్కుపోయింది. అదే పెద్ద ప్రమాదం అయితే మీద ఏదో అంతులేని బరువు పడినట్టు నలిపేస్తున్న ఈ నొప్పి ఏమిటో ఈ యువతిమింగిలానికి ఎప్పుడూ అనుభవంలేదు. ఇప్పుడు అనుభవంలోకి వచ్చినా అదేంటో తెలిసే, తెలుసుకునే అవకాశం అస్సలే లేదు. మనకే తెలుసు. నీలితిమింగిలాలు ప్రపంచంలోనే అతిపెద్ద జీవులు. ఎంత పెద్ద అంటే కొన్ని బ్లూవేల్స్ దాదాపు నలభై అతిపెద్ద ఆఫ్రికాఏనుగులతో సమానమైన బరువు తూగగలవు. అతి పెద్ద ఆఫ్రికాఏనుగు ఐదు టన్నుల బరువుంటుంది. అంటే రెండొందల టన్నులు. ఐతే అవి జీవితాంతం నీళ్ళలో ఉంటాయి కనక ఆ బరువుని మోయ్యాల్సిన వాటి ఎముకల మీద అంత బరువూ పడిపోదు. ఆర్కిమిడీస్ సూత్రం పనిచెయ్యడం వల్ల. ఆ సూత్రం ప్రకారం నీళ్ళు దాని బరువులో చాలా మటుకు మోసేస్తాయి. అదే బరువుని అవే ఎముకలు నేల మీదైతే భరించలేవు. విరిగిపోతాయి. ఇప్పుడీ బ్లూవేల్ ఆ స్థితికి అతి చేరువలో వుంది. సముద్రపు పోటు తగ్గుతున్న కొద్దీ తిమింగిలాన్ని మోస్తున్న నీటిమట్టం తగ్గుతూ దాని ఎముకల మీద భారం పెరిగిపోతూ ఉంది. ఇంకెంతసేపు తట్టుకోగలను అనుకోడానికి దానికి టైం సెన్స్ ఉంటుందా? ఏమో? మూగబాధతో మూగభాషలో లావొక్కింతయులేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణముల్ ఠావుల్ దప్పె అనుకుంటూ ఉందేమో. చక్రి కానరాడయ్యెడిన్ అనుకుంటుందా? ఏమో? అనుకున్నా అనుకోకపోయినా ఆ చక్రి వచ్చినా రాకపోయినా జననమరణచక్రంలో ఆ జీవి ఒకచుట్టు పూర్తి చేసెయ్యబోతోంది. కొన్ని నెలల క్రితమే ఇదే ప్రాంతంలో – మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా సముద్రతీరంలో – తన జాతి జీవి ఒకటి ఇదే పరిస్థితుల్లో ప్రాణాలు వదిలింది. జాలర్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూపంలో సహాయం అందినా వాళ్ళ విశ్వప్రయత్నాలు మానవప్రయత్నాలుగానే మిగిలిపోయి లాభం లేకపోయింది. అందుకేనేమో ఈసారి విష్ణుదేవుడు తనే సంకల్పించుకున్నాడు. International Union for Conservation of Nature (IUCN) సంస్థ వెలువరించే రెడ్ లిస్ట్‌లో – అంటే అంతరించబోతున్న జీవుల జాబితాలో – ఇప్పటికే చేరిన తన మొదటి అవతార రూపాన్ని కొన్నాళ్ళు కాపాడాలని అనిపించిందేమో ఆయనకి. సరైన సమయంలో జాలర్లు అక్కడికి రావడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వార్త అందించడం జరిగిపోయింది. నారాయణుడి సంకల్పం యాభైమంది నరులు, రెండు పడవలకి అవసరమైనంత శక్తియుక్తులు కలిగించి అపరమత్స్యావతారాన్ని లోతట్టు జలాల్లోకి నెట్టగలిగింది. సమయానికి సముద్రుడు విజృంభించి నీటిలోతు పెరగడం కలిసివచ్చింది. ప్రకృతిలో భాగమై దేవుడెవరో తెలియకుండానే ఆయన సృష్టిధర్మాల్ని అవి తెలిసిన మనుషులకంటే బాగా నిర్వర్తిస్తూ బతికే ఆ జీవి తిరిగి స్వేచ్చాజలాల్లో విహరించే అవకాశం మనిషి ద్వారానే కల్పించి ఆ సృష్టికర్త మనకేం చెబుతున్నాడో కదా?
(మత్స్యావతారం అనేమాట తిమింగిలానికి వాడడం సైన్సు ప్రకారం కరెక్టు కాకపోయినా, తెలుగులో కరెక్టే కనక వాడేశాను. ఏమనుకోరు కదా?)
ఇదిగో ఇదే ఆదివారం మధ్యాహ్నం మొట్టమొదటిగా ఇండియాలో రక్షించబడి, తిరిగి దిగంతాల్లోకి స్వేచ్ఛావిహారానికి బయలుదేరిన నీలితిమింగిలం – 
Photo Courtsey: Hindustan Times