గోదావరిని గాంధీనది, బంగాళాఖాతాన్ని నెహ్రూమహాసముద్రం;హిమాలయాల్ని పటేల్‌పర్వతాలు అని పిలిస్తే🤔 ? ఎలా ఉంటుంది😲?


భారద్దేశంలో  అన్నిచోట్ల ముఖ్యంగా తెలుగునేలపైన తెలుగు గురించి ఎక్కువగా వినపడే కంప్లయింట్స్, ఫిర్యాదులు ఏంటి? తెలుగు సంస్కృతి అంతరించిపోతోంది, మన భాష అడుగంటిపోతోంది, తెలుగుదనానికి ఇంగ్లీషుమీడియం తెగులు పట్టింది, ఇలా ఎన్నెన్నో. కదా? ఇవన్నీ నిజంగా సమస్యలే. తెలుగుని, తెలుగుదనాన్ని సీరియస్‌గా తీసుకునేవాళ్ళకి. మనం ఎంత సీరియస్‌గా సారీ, (సారీ కాదు అపచారం అపచారం), ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నాం?తెలుగుభాషని, సంస్కృతిని కాపాడడానికి ఏం చేస్తున్నాం?  ఏం చేస్తున్నాం అంటే ఏదో జవాబు దొరుకుతుంది కానీ చేసేది ఎంత ఎఫెక్టివ్‌గా (తెలుగు! తెలుగు!), అదే ఎంత ప్రభావశీలంగా వుంది అంటే ..? డౌటే!, ఐ మీన్ సందేహాస్పదమే. అదే, డౌట్‌ఫుల్లే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతమంది ఎన్నివిధాల ఇంగ్లీషుని ఇతరభాషలని తిట్టిపోసినా తెలుగు(తెలుగు = తెలుగు భాష + సంస్కృతి)కి ఏం ఒరిగేదిలేదని టీవీల్లో, సినిమాల్లో, ఎఫ్ఫెమ్ రేడియోల్లో, వార్తాపత్రికల్లో వినబడే, కనబడే తెలుగుని బట్టి తెలిసిపోతోంది కదా (కొన్ని మినహాయింపులున్నాయి కానీ సరిపోవు). భాషని మాట్లాడాలి, సంస్కృతిని పాటించాలి కానీ తెలుగుని రక్షించుకోవాలని పిలుపుల మీద పిలుపులిస్తే ఏం సరిపోతుంది? ఇతర భాషల్ని తిడితే తెలుగు గొప్పదైపోతుందా? ఇతర భాషలకి, ముఖ్యంగా ఇంగ్లీష్‌కి, ఏ కారణాల వల్ల జనం ప్రాముఖ్యత ఇస్తున్నారో చూసి అదే విధమైన ప్రాముఖ్యత తెలుగుకి కలిగించడం ఎలాగో కనిపెట్టామా?

మనం ఇంగిలిపీసుకి ఎందుకు సాగిలపడుతున్నామంటే సాంకేతికవిద్యలన్నిటికీ ప్రస్తుతం ఆంగ్లమే ఆధారంగా వుంది కనక. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉద్యోగాలన్నిట్లో ఆంగ్లమాధ్యమమే వాడుతున్నాం కనక.  ప్రపంచదేశాలన్నిటి మధ్య జరిగే లావాదేవీలన్నిటికీ ఆంగ్లభాషని మించిన ప్రత్యామ్నాయ మాధ్యమం ఏదీ లేదు కనక, మనం వద్దన్నా ప్రపంచీకరణం అనేది ఆగకుండా జరిగిపోతోంది కనక, ఇలా కావాల్సినన్ని కారణాలున్నాయి. ఈ పరిస్థితి మారే పరిస్థితి రావడం ఊహల్లోనైన సాధ్యమయ్యే పరిస్థితి లేదు. సో, దేర్‌ఫోర్ అందుచేత ఇలాంటివాటన్నిటితో సంబంధంలేకుండా భాష మీద మమకారం, భాషాసౌందర్యాన్ని ఆస్వాదించి ఆనందించే గుణం ఉంటేనే తెలుగు కానీ మరే ఇతరభాషలైనా కానీ మనగలిగేది. అదెలా జరుగుతుంది అంటే? ఇదే సమస్య, అదెలా జరుగుతుందని జనం అనట్లేదు. ఒకవేళ అంటే మాత్రం టీవీల్లో, సినిమాల్లో, ఎఫ్ఫెమ్ రేడియోల్లో, వార్తాపత్రికల్లో వినిపించే/కనిపించే భాష మీద స్వచ్ఛభారత్ నిర్వహించి తీరాలి. ప్రభుత్వాలు ఈ మాధ్యమాల నిర్వహణకి స్వచ్ఛమైన తెలుగుభాష కనీస అర్హతగా నిర్ణయించి అమలుచేస్తే తెలుగు వాడకం అద్భుతంగా పెరుగుతుంది. నిజానికి ఈ మధ్య కొన్ని టీవీ ఛానళ్ళలో చర్చలు నిర్వహించేవారి తెలుగు చాలా బాగుంటోంది. హెచ్చెమ్ టీవీలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌గారి చర్చలు మంచి ఉదాహరణ. నాగేశ్వర్‌గారు, ఆయనతో సంభాషించే చర్చా నిర్వాహకులనుంచి  చాలా మంచి భాషని వినొచ్చు. ఇలాగే ఇతర ఛానళ్ళలో కూడా కొందరున్నారు. కానీ ఇవి సరిపోవు. ముఖ్యమైన చర్చలు, వార్తలే కాకుండా ఇతర ప్రసారాలన్నిట్లోనూ మంచి భాష వినిపించాలి. చాదస్తానికి పోయి అతితెలుగు చేసేయ్యక్కర్లేదుకానీ అన్ని మాధ్యమాల్లో ఆంగ్లపదాల వాడకం తగ్గించటం, ఫాషనబుల్ తెలుగు, అంటే సరైన ఉచ్ఛారణ తెలిసినా తెలీనట్టుగా ఉచ్ఛరించడం, చిన్నపట్నుంచి పరాయి రాష్ట్రంలోనో, విదేశంలోనో పెరిగినవాళ్ళలాగా మాట్లాడ్డం, ఉచ్ఛారణలో అనవసరమైన అసందర్భమైన ఉద్వేగం, anxiety, agitation, excitement పలికించడం; భావోద్వేగాల్ని పదాల్లో, ఉచ్చారణలో చూపించే బదులు   అతిగాఉండే నేపధ్యసంగీతంతో (సంగీతం???) ఆ లోపాన్ని కప్పిపెట్టే ప్రయత్నాలు ఆపడం – ఇలాంటివి చేస్తే చాలు. మంచిభాష విన్న కొద్దీ జనానికి మంచిభాష అలవాటౌతుంది. భ్రమర-కీట న్యాయం. ఐనా మంచి తెలుగుని విన్న, చదివిన, మాట్లాడినవాళ్ళుగా మనం ఏదో ఇలా బ్లాగుల్లో రాసుకోవడమేగానీ – తప్పు, తప్పు వ్రాసుకోవడమేగానీ – ప్రత్యేకహోదాలో, పాకేజీలో తెచ్చుకోలేక, ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాలని ఆమోదించాలో అక్కర్లేదో తెలీక, ఒలింపిక్స్  పతకాల సాధనలో తమతమ పాత్రలని ఎలా ప్రచారం చేసుకోవాలో అర్ధంకాక తంటాలు పడుతున్న ప్రభుత్వాలకి తెలుగుని గురించి ఆలోచించే సమయం ఎక్కడుంటుంది? అందువల్ల ఉచితసలహాలతో కూడిన ఈ విలాపం ఇక్కడితో ఆపి అసలీ టపా ఎందుకు రావ్రాశానో రావ్రాస్తాను. నిన్నో మొన్నో పేపర్లో ఒక వార్త చూశాను. కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే ఒక్కో జిల్లాకి ఏం పేరు పెట్టాలో కొందరు మహానుభావులు చేసిన సూచనల సారాంశం ఆ వార్త. ప్రతి జిల్లాకి ఆ జిల్లాలో ఏదో ఒక విషయంలో ఎంతో కొంత పేరు తెచ్చుకున్న ఎవరో ఒక నాయకుడి పేరు పెట్టాలని ప్రతి జిల్లాలోనూవుండే ప్రతి వర్గానికీ, సమస్యకి లేక నాయకుడితో సంబంధం ఉన్న ప్రతి మహానుభావుడూ సూచిస్తున్నాడు. ఆ రకంగా ఆ నాయకులని గుర్తు చేసుకోవాలని, చరిత్రలో వాళ్ళని శాశ్వతంచేసెయ్యాలని వీళ్ళ ఆరాటం + పోరాటం. బానేవుంది కానీ ఆ సూచనలు పాటిస్తే ఏ జిల్లా ముఖ్యపట్నానికీ కూడా దశాబ్దాలుగా శతాబ్దాలుగా వాడుకలో ఉన్న పేర్లు మిగలవు. తరాల తరబడి కొనసాగిన ఊళ్ళపేర్లలో ఎంతో చరిత్ర సంస్కృతి భాషా వెతుక్కోవచ్చు. చాలామందికి ఇలాంటి అంశాల్లో ఆసక్తి, కుతూహలం ఉంటాయి. కొందరు వాటి వెనకవున్న చారిత్రిక, భాషామూలాలపై పరిశోధనలు చేస్తారు, చేస్తున్నారు. ఆ ఆసక్తిని, పరిశోధనల్ని అలాగే కొనసాగనివ్వడం ఒకరకంగా భాషని కాపాడుకోవడమే కదా? ఉన్న పేర్లు తీసేసి ఊళ్ళకి మనుషుల పేర్లు పెట్టడంవల్ల ప్రజాదృష్టి ఆ వ్యక్తులపైన ఎన్నాళ్ళు నిలుస్తుందో చెప్పలేం కానీ చారిత్రక, సాంస్కృతిక పరిణామాలకి కొంతవరకైనా అద్దంపట్టే ఆధారాల్ని, అవి చరిత్రపై సామాన్యుల్లో కలిగించే ఆసక్తిని చెరిపేసినట్టు మాత్రం అవుతుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, డాములు, ప్రాజెక్ట్లు — అన్నీ ఒకరో ఇద్దరో పెద్ద నాయకుల పేర్లు పెట్టేసుకున్నాయి. కొత్తగా జిల్లాలు అదే బాట పట్టేలావున్నాయి. ఆపైన రాష్ట్రాలు. ఇంకొన్నాళ్ళకి కొండలు, నదులు, సముద్రాలక్కూడా ఇదే గౌరవం దక్కవచ్చు.

గోదావరిని గాంధీనది అని, బంగాళాఖాతాన్ని నెహ్రూమహాసముద్రం అనీ, హిమాలయాల్ని పటేల్ పర్వతాలనీ పిలిస్తే?

ప్రాంతాలకి గబ్బర్‌సింగ్‌ప్రదేశ్, బాహుబలి జిల్లా, మైకేల్ జాక్సన్ మండలంలాంటి పేర్లు పెడితే?

ఆ వ్యక్తుల్ని గౌరవించినట్టా? సాంస్కృతిక చరిత్రలో ఒకఅంశాన్ని మరుగుపరిచినట్టా?

ఏమో, తెలీదు. కానీ ఇంద్రధనుస్సుకి సున్నం వేసినా, పండువెన్నెల్లో ఫ్లడ్‌లైట్లు పెట్టినా, పచ్చటి చెట్టుకి ప్లాస్టిక్ ఆకులు మొలిచినా అస్సలు బావుండదు.

🙂 _/\_ 🙂

యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ !

మోడీమెసేజ్ = శ్రీకృష్ణుని కోరిక = ప్లాస్టిక్-ఫ్రీ భూమాత =గోసంరక్షణ

Beauty is in the “I” of the Beholder

నేనెక్కడున్నాను, ఎలా వచ్చాను, ఎక్కడికిపోతానులాంటి ప్రశ్న నాబుర్రలో మెదిలే ప్రశ్నేలేదు

కార్బైడుపొగకన్న హాలాహలము మిన్న వదిలెయ్యరా నన్ను నా మానవా!!!

బాపూరమణీయం@వైకుంఠం