మోడీమెసేజ్ = శ్రీకృష్ణుని కోరిక = ప్లాస్టిక్-ఫ్రీ భూమాత =గోసంరక్షణ


ఆవులు ప్లాస్టిక్ వ్యర్ధాలు తినే బ్రతికే అవసరం లేకుండా చెయ్యడమే నిజమైన గోసేవ అని మోడీగారు గోరక్షకులకిచ్చిన సందేశం. కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. “ఇదంతా రాజకీయం. గుజరాత్, యూపి ఎలక్షన్స్ దగ్గర పడడంతో మోడీ ఆపరేషన్ వోట్‌బాంక్ ఆకర్ష్ మొదలెట్టార,”ని ఇంకొందరు అంటున్నారు. ఆ రాజకీయ లింకుల సంగతెలా వున్నా ప్రకృతిప్రేమికులకి, పర్యావరణ రక్షకులకి మోడీ మాటలు చెవిలో పోసిన అమృతం కింద లెక్క. హిందూధర్మం, సంస్కృతి దృష్ట్యా ఆవుని రక్షించాలనుకునేవాళ్ళతో కలిసి పనిచేసి పర్యావరణ కాలుష్యాన్ని అంతం చెయ్యడానికి మోడీ సందేశం మంచి అవకాశం కల్పించింది. ఎలా?

ఇలా –

భారతదేశపు మొట్టమొదటి గోప్రేమికుడు గోపాలకృష్ణుడు గీతలో ఏం చెప్పాడు? మనం ఆయన చెప్పినది సరిగ్గా ఫాలో అవుతున్నామా లేదా? ఈ రెండు ప్రశ్నలకి జవాబులు వెతకడంలో మోడీ సందేశానికి సరైన అర్ధం ఏంటో, ఆ అర్ధానికి తగిన కార్యాచరణ ఏదో తెలుస్తాయి (అని నేను అనుకుంటున్నా అందరూ అలా అనుకుంటారని ఆశిస్తున్నా).

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి!
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః॥

(ఎవరు నాకు పరమభక్తితో,ఆకునో, పువ్వునో, పండునో మరియు జలమునో సమర్పించుచున్నాడో,అట్టి పరిశుద్ధ భక్తుడగువాడు భక్తితో సమర్పించిన కానుకను నేను ప్రేమతో స్వీకరించుచున్నాను.)

అని స్వామి మాట. అయితే వాటిని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఇమ్మన్నాడా? కానీ మనం వాటన్నిట్నీ ప్లాస్టిక్ బాగ్స్‌లో / బాటిల్స్‌లో వుంచి గుడికి తీసుకెళ్తున్నాం. ఆ ప్లాస్టిక్ బాగ్స్/బాటిల్స్‌ని గుడి శుభ్రం చేసేవాళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తారో ఎవరూ పట్టించుకోరు కదా? గుడులనే కాదు ఎక్కడ ఏ పూజలు, శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళు, పేరంటాలు జరిగినా అన్నిచోట్లా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా జరుగుతోంది కదా? పేరంటాల్లో ఇచ్చే పళ్ళు, సెనగలకి ప్లాస్టిక్ కవర్లు, వాటితోపాటు ఇచ్చే చిన్న చిన్న ప్లాస్టిక్‌తో చేసిన కానుకలు (కుంకుమ భరిణెలు, దేవుళ్ళ బొమ్మలు, వగైరా); పెళ్ళిళ్ళలో పెళ్లి మండపం డెకరేషన్ నుంచీ పెళ్లి భోజనాలకి వాడే ప్లేట్లు, గ్లాసుల వరకూ ఒకొక్క పెళ్లి సీజన్‌లో ఎన్నేసి టన్నుల ప్లాస్టిక్ వాడకం జరుగుతోందో తలచుకుంటే.. వామ్మో. అన్ని టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కడికి పోతున్నాయి? రీసైకిల్ అవుతున్నాయా? గాలికి, వానకి చెల్లాచెదరై అన్ని చోట్లా వ్యాపిస్తున్నాయా?

మన దేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ అంతగా ఊపందుకోలేదు కనక రెండోదే నిజం అనుకోవాలి. చెల్లాచెదురైన ప్లాస్టిక్ వ్యర్ధాలు పొలాలు, కాలువలు, నదులు, సముద్రాల్లోకి చేరుతున్నాయి. కొంత భాగం ఆవుల, ఇతర జంతువుల, పక్షుల శరీరాల్లో భాగంకూడా అవుతున్నాయి. ఆవు తినడంవల్ల ఆ గోవుతో పాటు ప్లాస్టిక్ కూడా మన పూజలందుకుంటోందేమో అనుకుంటే…. ఎంత చిరాగ్గావుందో కదా? చిరాకే అయినా ఇది నిజం. 2008లో శబరిమల ఆలయాన్ని 35 మిలియన్ల భక్తులు సందర్శించారు(ట). ఒక అంచనా ప్రకారం సగటున ఒక్కొక్క సందర్శకుడు 250గ్రాముల ప్లాస్టిక్ అక్కడ వదుల్తారు. అంటే ఒక్క ఏడాదిలో 8750టన్నుల ప్లాస్టిక్ అక్కడ పేరుకుంటోంది. చెన్నైలో ఒక ఆవు సడెన్‌గా చనిపోతే పోస్ట్‌మార్టం చేసారు. దాని కడుపులో 17కిలోల ప్లాస్టిక్ ఉందిట. మరో ఆవు కడుపులో 40కిలోలు, ఒక ఏనుగు ఉదరంలో 80 కిలోల ప్లాస్టిక్ బయటపడ్డాయిట. వైట్ క్రేన్ అనే యూరోపియన్ కొంగ తినే ఆహారంలో ప్రస్తుతం ప్లాస్టిక్ భాగం అయిపోయిందిట. నదులు, సముద్రాల్లో వుండే జీవులని ప్లాస్టిక్‌తోపాటు మురుగు, కెమికల్స్, ఆయిల్స్ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కొత్తగా పుష్కరాల్ని ప్రభుత్వాలు కమర్షియలైజ్ చెయ్యడం మొదలెట్టాక షాంపూలు, సబ్బులు, బట్టలు, కొబ్బరి చిప్పలు, డబ్బులు… మై గాడ్!!!

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇప్పుడు రాస్తే శకుంతల ఉంగరాన్ని మింగిన చేప కడుపులో కాయిన్స్, సబ్బు బిళ్ళలు, మినరల్ వాటర్ బాటిల్స్ కూడా దొరికినట్టు వర్ణించాల్సివస్తుంది 😉

మన సంస్కృతిలో అడుగడుగునా ఆధ్యాత్మిక అర్ధం ఉంటుందని మనకి తెలుసు. దేవుడి నైవేద్యానికిచ్చినా, బ్రాహ్మడికో, బీదలకో దానం ఇచ్చినా, పెళ్లిపేరంటాల్లో కానుకలు, విందులు ఇచ్చినా.. అన్నీ దైవభావనతో జరగాలి. జరుగుతాయి కూడా. మనకి ప్రకృతి, జీవులు, కొండలు, నదులు, సముద్రాలు (మనం ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం కానీ మనుషులు కూడా 😉 ) అన్నీ దైవస్వరూపాలే. అలాంటపుడు అందరిలోనూ అన్నిటిలోనూ నిండివున్న నల్లనయ్యకి మనం ప్రేమతో ఇచ్చే పత్రపుష్పఫలతోయాలలో  ప్లాస్టిక్సూ, వాటి సహోదరగణమైన ఇతర కాలుష్యాలు కలవకుండా చూసుకోవడం మన ధర్మం. ఈ ధర్మాన్ని రక్షించుకోడానికి పెద్ద ఉద్యమాలు అక్కర్లేదు. మంత్రులు, సెలబ్రిటీల ఆధ్వర్యంలో ప్రాజెక్ట్స్ చేపట్టక్కర్లేదు. ఎవరికివారు ప్లాస్టిక్ వాడడం మానెయ్యాలి. గాంధీజీ విదేశీవస్తుబహిష్కరణ పిలుపు బ్రిటిష్‌‌వాళ్ళని ఎంత ఊపు ఊపిందో “నేను ప్లాస్టిక్ వాడను. ఇతరులు ఇచ్చిన ప్లాస్టిక్ వస్తువులు తీసుకోను” అనే వ్యక్తిగతనిర్ణయం కాలుష్యాన్ని, కాలుష్య కారకులని అంతగా తగ్గించగలదు. కొన్ని పరిస్థితులని చక్కదిద్దాలంటే గవర్నమెంట్ చట్టాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకన్నా  ప్రజాభిప్రాయాలు, వ్యక్తిగత ప్రాధాన్యతలు బాగా పని చేస్తాయి.

What do you think?

Don’t think, just decide….

to carry a cotton bag with you while shopping and convince others to do the same.

🙂  🙏  🙂