కురుక్షేత్రయుద్ధం ముగిసి కృష్ణపరమాత్ముడు అర్జున జీవాత్ముణ్ణి రధంలో ఇంటికి తోలుకొచ్చాక..


“స్వామీ! కిందటిసారి మీ కూర్మావతారం గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా?,” ఔల్‌బ్రాండ్ కాఫీపొడితో తీసిన డికాక్షన్‌లో పావుకప్పుడు పాలకడలిని నిమజ్జనం చేస్తూ అడిగాను. “గుర్తుంది, ఏం?” అన్నారు స్వామి క్లుప్తంగా. నిన్నరాత్రి ఒక కల వచ్చింది. కలలో క్షీరసాగరమధనం కనబడింది. కానీ మామూలుగా పటాల్లో, శిల్పాలలో, బాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సెట్టింగులో, పౌరాణిక సినిమాల్లో చూసినట్టుగా లేదు,” పుష్పహాసుని చిరునవ్వుండగా వేరే పంచదార ఎందుకనే భావనతో సుగర్‌లెస్ కాఫీని తనివితీరా ఆఘ్రాణిస్తూ అన్నాను. “మరెలాఉందేమిటి నీ స్వప్నసాగర మధనం?,” అని ఆధారనిలయుడు ఆరా తీశాడు. “మహాకన్ఫ్యూజింగా ఉంది స్వామీ, అసలక్కడ పాల సముద్రమే లేదు. నాలుగు దిక్కులా ఎటుచూసినా మహాసముద్రంలా పరుచుకుని ప్రజల బుర్రలే. సముద్రంలో అలల్లాగా ఎగిరెగిరి పడుతున్నాయ్.” “ బావుంది. కంటిన్యూ చెయ్.”

Bangkok

ఫోటో: గూగుల్

“మధ్యలో న్యూస్‌పేపర్లు, టీవీలు, మైకులు, స్పీకర్లు, మొదలైనవాటితో నిండివున్న కొండ, దాన్ని చుట్టుకుని పేద్దపాము, దానికి రెండు చివర్లా రెండు తలలు, తోక లేదు. రెండు తలల్నీ పట్టుకుని అటూ ఇటూ గుంజుతూ దేవదానవుల స్థానాల్లో అందరూ మనుషులే. వివిధ రంగుల చొక్కాలు, టోపీలు, కండువాలు ధరించినవాళ్ళు కొందరు. వింతవింత వేషాల్లో చిత్రవిచిత్ర భాషల్లో మాట్లాడేవాళ్ళు కొందరు. ఒక్కడు కూడా స్థిరంగా ఒక వైపు వుండకుండా అటూ ఇటూ గెంతుతున్నారు. నువ్వు మాత్రం కొండ కింద, పైనా, లోపలా ఎక్కడా కనపడలేదు. పాముని పట్టుకు లాగుతున్నవాళ్ళలో మాత్రం ఒక్కొక్కడూ ఒక్కో దేవుడి బొమ్మని మెళ్ళో తగిలించుకున్నారు. సముద్రంలావున్న ప్రజల్లోకూడా దాదాపు ప్రతిమనిషి మెళ్ళోనూ ఒక్కో దేవుడో, మతచిహ్నమో, జెండానో ఏదో ఒకటి తగిలించుకునివున్నారు. ఏం జరుగుతోంది స్వామీ?”

ఇంతలో జగన్నాటక సూత్రధారి అందుకున్నాడు, “పాముని ఇటూ అటూ లాగుతుంటే కొండ గిర్రున తిరిగి ప్రజలు కడలి అలల్లా చెల్లాచెదురౌతున్నారు. మళ్ళీ తిరిగొచ్చి కొండకి గుద్దుకుని మళ్ళీ చెల్లాచెదురౌతున్నారు. కొందరేమో పాము కింద, దాన్ని పట్టుకు గుంజుతున్నవాళ్ళ కాళ్ళ కింద పడి పచ్చడౌతున్నారు. అవునా?.”

“యూ ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, స్వామీ! ఎలా చెప్పేశారు?,” నాది వెర్రిప్రశ్నని వెంటనే రియలైజ్ అయ్యాను కానీ అంతలోనే స్వామివారు ఒకరకంగా చూసారు. ఆ చూపెలావుందో తెలుసా?

కురుక్షేత్రయుద్ధం ముగిసి కృష్ణపరమాత్ముడు అర్జున జీవాత్ముణ్ణి రధంలో ఇంటికి తోలుకొచ్చాక, “అర్జునా! రధం అర్జెంటుగా దిగమంటాడు. అర్జునులవారు పద్దెనిమిదిరోజుల క్రిందట విన్న భగవద్గీత విన్నరోజునే మర్చిపోవటం చేత, “ఠాఠ్! వీల్లేదు. ‌ఆఫ్ట్రాల్ డ్రైవర్‌వి, ప్రోటోకాల్ పాటించు. ముందు నువ్వుదిగి, డోర్ తియ్యి. అప్పుడు నేను దిగుతాను,” అంటాడు. అణుధార్మికతకి గురైన ఆ రధం ఫుకుషిమా, చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్లతో పోటీపడుతోందని ఎక్స్‌ప్లెయిన్ చేసే టైములేక కృష్ణుడు అర్జునుడి వైపు ఎలా చూసివుంటాడో ఆల్మోస్ట్ అలా చూసాడు నావైపు సనాతనసారధి. అయితే అర్జునుడికి, నాకు చిన్న తేడావుంది. ఆయనకి కాఫీ అలవాటు లేదు. అసలదేంటో కూడా  తెలీదు. అందువల్ల శ్రీకృష్ణులవారు రధంలోంచి బయటికి గెంటేసేవరకూ మొండితనం చేశాడు. క ఫర్ కమలాక్షుడు, కా ఫర్ కాఫీ అంటూ క గుణింతం నేర్చుకున్నప్పుడే కాఫీత్వం, కమలాక్షతత్త్వం వంటబట్టేసాయి కనక మనలో అర్జునుడి టైపు మొండితనం వుండదు. క్రెడిట్ గోస్ టు కాఫీ. ఆ సంగతి స్వామివారికీ తెలుసు. దాంతో ఆయన చూసిన చూపుకి మనసులోనే నాలిక్కరుచుకున్నానని గ్రహించి అక్కడితో వదిలేశాడు. వదిలేసి నా పిచ్చిప్రశ్నకి జవాబిచ్చాడు.

“మూఢవిశ్వాసాలు, కులమతవిబేధాలు, అహంకారమమకారాలు, ఎట్సెట్రాలతో ఒక్కటిగా ఉండాల్సిన సముద్రమంత జనాభా అలలు అలలుగా చీలిపోయింది. అందుకే సముద్రం ప్రజాసముద్రంలా కనపడింది. పాముకున్న రెండు తలల్లో ఒకటి రాజకీయం, రెండోది మతం. రెండు పక్కలా విషం కక్కగలదు. ప్రజల మనోభావాల సముద్రంలో మీడియా, ప్రచారం అనే కొండని కవ్వంగా వేసి రెండు తలల పాముతో రాజకీయనాయకులు, సెలబ్రిటీలు, మేధావివర్గాలు ప్రజాసముద్రాన్ని చిలుకుతున్నారు. కొండ నిండా టీవీలు, పేపర్లు, మైకులు, స్పీకర్లు వున్నది అందుకే. టోపీలు, కండువాలు, వేషాలు, గెడ్డాలు, శాలువాలు – ఇవన్నీ పొలిటీషియన్లు, సెలబ్రిటీలు, మేధావివర్గాలకి చిహ్నాలు. వీళ్ళంతా గందరగోళం సృష్టించి ప్రజాభిప్రాయం ఏకత్రాటి మీదకి రాకుండా చేసి పబ్బాలు గడుపుకుంటున్నారు. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ఇంకా ఈ చెత్త ఎందుకు భరిస్తున్నారంటే వాళ్ళలోవున్న ఓర్పు, సహనం, క్షమ, కొంత అమాయకత్వం – ఇవే కొండని మోసిన కూర్మంలా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే వీళ్ళు పూర్తిగా సహనం కోల్పోతారో అప్పుడే ప్రజాగ్రహం అనే హాలాహలం పుడుతుంది.  అప్పుడు లీడర్లందరూ బుద్ధి తెచ్చుకుని నీతి, న్యాయం, నిజాయితీ అనే మూడుకళ్ళున్న త్రినేత్రుడిని ఆశ్రయిస్తారు. దానికింకా చాలా టైముంద,”ని మందరగిరిధారి అంటుండగా ముప్ఫైఎనిమిదో కప్పు కాఫీ చివరికి వచ్చుటచే స్వామి అంతర్దానము కాగా నేను మరో కప్పు కలుపుట ఎలా, ఎప్పుడు అన్న ఆలోచనలో మునిగిపోయితిని.

 _/|\_ \|/ _/|\_

బై4నౌ:-)