One Minute For Wildlife/వన్యప్రాణుల కోసం ఒక నిమిషం – సంబార్ జింకకి గ్రామస్తుల ఆతిధ్యం


అడవిజింకని చూడగానే ఏమనిపిస్తుంది? కొందరికి అందం, అమాయకత్వం, సాధుత్వం కనిపిస్తాయి. కాస్త కవిహృదయమో సాహిత్యస్పర్శో ఉన్నవాళ్ళకైతే లేడికళ్ళ ప్రబంధనాయికలూ, భీతహరిణేక్షణలు, దుష్యంతుడి వద్దకి వెళ్తున్న శకుంతల చీరచెంగు పట్టుకుని కన్నీరు పెట్టిన జింకపిల్ల, సీతారాముల కధని మలుపు తిప్పిన బంగారులేడి గుర్తుకి రావచ్చు. కొందరికి మున్యాశ్రమాల ప్రశాంతతా, హరితవనాల్లో పరుగులు తీసే జీవచైతన్యం స్ఫురిస్తాయి. ఉడుకురక్తాలవాళ్ళకి శ్రీశ్రీగారి “పులి చంపిన లేడి నెత్తురు” కూడా గుర్తురావచ్చు. కొందరికి మాత్రం మరోరకం ఆలోచనలు పుడతాయి. వాళ్ళు కండలవీరులు కావచ్చు, క్రికెట్ నవాబులు కావచ్చు, చైనీస్‌లాగా కాదేదీ తినడానికనర్హం అనుకునే మెంటాలిటీ వున్నవాళ్ళు కావచ్చు సరైన తిండికి, అదనపు ఆదాయానికి మొహం వాచిన బీదలు కావచ్చు – అందరిదీ ఒకటే భావం. అదే జింకని చూడగానే పులికి కలిగే భావం. పులికి ఆకలి వల్ల కలిగే ఆ భావం వీళ్ళలో ఆకలికి బినామీ అయిన జిహ్వాచాపల్యం రూపంలో ప్రత్యక్షం అవుతుంది. వీళ్ళకి జింక అంటే నాలుక్కాళ్ళపై నడుస్తున్న బోల్డంత మాంసం, అంతే. క్రిందటి ఏడాది, ఖమ్మం దగ్గర అని గుర్తు, అడవుల్లోంచి దారి తప్పి గ్రామంలోకి వచ్చిన ఒక దుప్పి అలాంటి వ్యక్తుల కంట బడింది.  దాన్ని వెంటాడి వేటాడి చంపారు. వాళ్ళని తప్పించుకోడానికి ఒక ఏటి మధ్యకి పరుగుపెట్టినా దాన్ని చుట్టుముట్టి మట్టు పెట్టబోతున్న ఫోటో న్యూస్‌పేపర్లలో కూడా వచ్చింది. ప్చ్! మూగజీవాల్ని చంపకుండా బతికే మార్గాలు మనిషికింకా పట్టుబడలేదు. ఒకవేళ ఆ మార్గాలు అందుబాటులోకి వచ్చినా వెరైటీ రుచులకోసం అర్రులు చాచే నాలుకని అదుపు చేసే శక్తి మనిషికి లేదు. అయితే, అడవి వదిలి బయటకొచ్చిన అన్ని జంతువులకీ దురదృష్టపు ఎండమావులే ఎదురవ్వవు. దాహం తీర్చి దయతో ఇంటిదారి పట్టనిచ్చే మానవత్వపు ఒయాసిస్సులూ కనబడతాయి. దారి తప్పి వచ్చిన మృగాలని చంపేవాళ్ళు, దారి వెతుక్కుని మరీ వెళ్లి మూగజీవాల్ని చంపేవాళ్ళే కాక  ఈ ప్రపంచంలో ఒక అమాయక సాధుజీవి దప్పికతో నీరు వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చినప్పుడు దాన్నేం చెయ్యకుండా చూసి ఆనందించే సాధుహృదయులు, జంతుప్రేమికులు కూడా ఉంటారన్న నిజం (అదృష్టం?) ఈ ఫోటోలో ఉన్న సంబార్ (Sambar / కణుజు)కి అనుభవంలోకి వచ్చింది. చిక్‌మగళూర్ దగ్గర ఒక వూళ్ళో, మొన్న ఆదివారం నాడు.

DH Smabar

Photo courtesy : DECCAN HERALD