పూరీలు కాలిపోతే న్యూస్‌లో చెప్పాలా ?


పూరీలు కాలిపోతే న్యూస్ లో చెప్పాలా ? పూరీలు కాలిపోవడం ఒక న్యూసా? ప్రత్యేకంగా అనౌన్స్ చెయ్యాల్సినంత పెద్దవిషయమా? హూ యామ్ ఐ టు డిసైడ్ ? డిసైడ్ చెయ్యాల్సింది తెలుగు టీవీ చానల్సు. ఎందుకు, ఎలాగా అంటే –

నేడొక ప్రముఖ తెలుగువార్తామాధ్యమమందు సజీవ ప్రత్యక్షవార్తలు చూడ కుతూహలము కలిగి దూరదర్శన యంత్రమును దూరనియంత్రణా సాధనముతో వెలిగించితిని. అత్యంతాధునాతన వస్త్రములు ధరించి, గొప్ప కళ్ళద్దములు  కూడా పెట్టుకొని, పెదవికర్రచే ఎర్రగా అద్దుకొనిన అధరములతో ఆంగ్లమువలె  ధ్వనించు ఆంద్రభాషను అంత్యంత దమ్ముతో అచ్చతెలుగులో ఆ పఠకురాలు ముచ్చటగా చదువుచుండెను. అంతట ఆ వార్తలను వినుచునే ఏదో పని కొరకు ప్రక్క గదిలోనికి పోయిన నాకొక ఆశ్చర్యకరమగు వార్త వినబడెను. అది ఏమన – ఆంధ్రదేశమునందు ఒకానొక పురమునందు అగ్నిప్రమాదము సంభవించి ఇరవై పూరీలు కాలిపోవుచున్నవట. అహో! ఈ వార్తామాధ్యమములు ఎంత బాధ్యతాపూర్వకముగా వ్యవహరించుచున్నవి? సామాన్యుని ఇంట మాడిన పూరీలను సైతము వార్తగా, ఆ మాడుటనొక అగ్నిప్రమాదముగా పరిగణించి ప్రచారము కల్పించి సమాజమునకెంత సేవచేయుచున్నారని ఆనందము కలిగినది. అదే సమయమున పూరీలతోపాటు తినుటకు చేసిన కూర్మా పరిస్థితి ఏమైనదోయను ఆదుర్దా కూడా కలిగినది. ఐననూ, మనసున ఒకింత సందేహము కలిగి, మాడినవి సామాన్యునింటి పూరీలు కాక ఆ వూరి ప్రజాప్రతినిధి వంటయింట వేగుచున్నవై యుండవచ్చునని యూహించి, ఆపైన ఉత్కంఠ భరింపజాలక, పోయి తెరపై చూచితిని. అచట కనబడిన దృశ్యమునుజూచి మూర్చ వచ్చినంత పనియయ్యెను. కాలుచున్నది పూరీలు కాదు, పూరిళ్ళు-గుడిసెలు. ముఖముపై నీళ్ళు జల్లుకొని మూర్ఛనాపుకొంటిని. తెలుగువార్తలకు పట్టిన దుర్దశకు ఏడ్చుటయా, పూరిళ్ళను పూరీలు చేసిన పఠకురాలి పదగుంభనమునకు నవ్వుటయా తెలియని నా దురవస్థనెరుగుటకు వీలుకాని ఆ చూడముచ్చటగు పఠకురాలు, విన ముచ్చెమటలు పట్టించు తన ఆంధ్రోచ్చారణతో వార్తలను అప్రతిహతముగా చదువుచునేయుండెను.

కళావాచస్పతి కొంగర జగ్గయ్య•, తిరుమలసెట్టి శ్రీరాములు, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ, దుగ్గిరాల పూర్ణయ్య ప్రయాగరామకృష్ణ వంటి చక్కని న్యూస్‌రీడర్ల నోటబడి కొత్త అందాలు, హుందాలు సంతరించుకున్న తెలుగువార్తల పరిస్థితి ఇదా? తెలుగు భాషని బ్రతికించుకోవాలంటూ పిలుపుల మీద పిలుపులిచ్చే ఛానల్స్ ఇలాంటి తెలుగుని వినిపించాలా? డిసైడ్ చెయ్యాల్సింది వాళ్ళే. కాదా?

(•జగ్గయ్యగారు ఇంగ్లీష్ వార్తలు చదివేవారని విన్నా. తెలుగులో చదివారో లేదో సరిగ్గా తెలియదు. ఒకవేళ చదివేవుంటే అంతకంటే గొప్పగా ఎవరు చదవగలరు?)

***

 ఆర్ యూ బయింగ్ డైమండ్స్?థింక్ అబౌట్ టైగర్స్ టూ!!

సైంటిఫిక్ హిందూ – దేవుడిపై ఒక ఫిజిసిస్ట్ అభిప్రాయానికి కదిలిన అం’తరంగా’లు