ఇకనుంచీ ఉగాదిరోజు తెలుగువాళ్ళు తప్పనిసరిగా కిందచెప్పినవన్నీ చేస్తే అసలే రుచిగా ఉండే ఉగాదిపచ్చడి తింటే మరీ మరీ రుచిగా అనిపిస్తుంది. అవేంటంటే –
ప్రతి ఉగాదికీ ఇంట్లోనూ, వీధిలోనూ కొత్తమొక్కలు నాటాలి.
చుట్టుపక్కల పెద్దపెద్ద చెట్లు ఎవరూ కొట్టెయ్యకుండా చూసుకోవాలి. (కోయిలలు కూచుని కూయడానికి చెట్లు ఉండాలిగా మరి)
కోయిలలు తీరుబడిగా, తియ్యగా కూయాలంటే వాటి పిల్లల్ని చూసుకోడానికి ఆయాలు అంటే కాకులు బాగుండాలి, వాటికి సరైన గూళ్ళు వుండాలి. కాకులు ప్రకృతిసిద్ధమైన స్వచ్ఛభారత్ వలంటీర్లు. జీతం అడక్కుండా, స్ట్రైకులు చెయ్యకుండా పరిసరాల్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు. అందుచేత కాకులు ఉండడానికీ అవసరమైన చెట్లు నాటాలి.
ఉగాది కోయిలనే కాదు రామచిలుకనీ గుర్తు తెప్పిస్తుంది. (శుకాలతో, పికాలతో ధ్వనించే మధూదయం అంటూ ఓ పాతికేళ్ళ క్రిందటి ప్రాచీనకాలంలో నాగార్జున పాడాడు కదా). సో, చిలకల కోసం మామిడి చెట్లు ఎక్కువగా పెంచాలి. వాటితోపాటు ఆరోగ్యకరమైన గాలి కోసం వేపచెట్లు కూడా నాటించాలి, కాదు నాటాలి.
పండగరోజు ఇచ్చి పుచ్చుకునే బహుమతుల్లో ప్లాస్టిక్ సరుకు లేకుండా చూసుకోవాలి. సరుకులు తెచ్చుకునేప్పుడు కూడా ప్లాస్టిక్ బాగ్స్ వాడకూడదు.
ఈ రోజు వీలైనంత వరకూ కార్లు, స్కూటర్లలాంటి వాహనాలు వాడకుండా ఉండి కనీసం ఉగాదినాడు వాతావరణం కలుషితం కాకుండా చూడాలి.
పర్యావరణ కాలుష్యం కంటే భయంకరం అంతరావరణ కాలుష్యం. అంటే సిగరెట్లు, తాగుడు (కూల్ డ్రింకులనుంచీ ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్ వరకూ అన్నీ), మసాలా సినిమాలూ, సీరియల్సూ మానేస్తే ఈ రకం కాలుష్యాన్ని ఆపొచ్చు. ఉగాదిరోజు దీన్ని ఆపితే సంవత్సరం పొడుగునా ఆపే ఉత్సాహం కలుగుతుంది.
ఉగాదిపచ్చడిలో ఉండే షడ్రుచులు జీవితంలో ఎదురయ్యే సుఖసంతోషాలు, కష్టనష్టాలు, గెలుపోటములకి చిహ్నాలు. బీదవారికి, ఆర్ధిక స్తోమత పెద్దగా లేనివారికి కొంత సహాయం చేసి వారి ‘ఉగాది పచ్చడి’లో చేదు, కారం తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. వూళ్ళో వున్న సన్నకారు రైతులకి వీలైన సాయం చేసి వాళ్లకి జీవితం మీద ఆసక్తి, వ్యసాయం చేసే శక్తీ కలిగించాలి.
ఊళ్ళో ఉన్న పళ్ళు, కూరగాయల గోడౌన్లని సామూహికంగా సందర్శించి పళ్ళని కృత్రిమంగా కెమికల్స్ చల్లి పండించవద్దని హెచ్చరించి రావాలి. (గుడిలో, తాంబూలాల్లో, పేరంటాల్లో కార్బైడ్ పళ్ళు ఇస్తే దేవుడి బాధపడడూ ?)
టీవీలు, సినిమాలకి సెలవిచ్చి పిల్లలకి చుట్టూపక్కల ప్రకృతి దృశ్యాలు, పక్షులు, జంతువులతో పరిచయం కల్పించాలి.
చుట్టుపక్కల మూతవెయ్యని బోరుబావుల వివరాలు సేకరించి అధికారులకి పంపించాలి.
పండగపూట పదార్ధాల (తినేవి, కొనేవి) కంటే పరమార్ధానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. అనగా, ఆ రోజు ritual తగ్గించి spiritual activity పెంచుకోవాలి. అంటే భజనలు, స్వామీజీలు, ప్రదక్షిణాలు కాకుండా జీవిత పరమార్ధం మనకెంత అర్ధమైంది అని మినిమం ఓ పావుగంట సీరియస్ రివ్యూ చేసుకోవాలి.
ఇవన్నీ యధాశక్తిగా చేసి ఆ పైన ఉగాదిపచ్చడి తింటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పటికే ఇవన్నీ చేసేస్తుంటే వీలైనంతమందికిది చెప్పి చేయిస్తే పచ్చడి రుచి విపరీతంగా పెరిగిపోతుంది. పంచాంగంలో చెప్పిన ఆదాయం-వ్యయం, అవమానం – రాజపూజ్యాలతో పని లేకుండా ఏడాదంతా సుఖంగా గడుస్తుంది అని వేదాలు చెప్పాయో లేదో తెలియదుగానీ జీవనవేదంలో స్పష్టంగా రాసివుంది.
ఓపిగ్గా విసుక్కోకుండా ఇక్కడి వరకూ చదివినందుకు ఎంతో సంతోషం _/|\_ 🙂 . మీకు –
మళ్ళీ వినాయక చవితికీ, వీలయితే అన్ని పండగలకీ ఇలాగే చేద్దాం. ఇట్లు మీ – 
(పర్యావరణ వినాయకుడు)
మీకు మీ కుటుంబ సభ్యులకూ యుగాది శుభాకాంక్షలు !
పండిన మామిడి మీకెక్కడ దొరికిందో చెప్పాలి. అలంకరణ బాగుందండీ.మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నాము కనుకనే ఈరోజు పచ్చడి రెండుసార్లు చేసినా అయిపోయింది…అంత రుచిగా ఉంది మరి…వేప చెట్టు దగ్గర్లో లేదు గానీ ఉండుంటే మరోసారి చేసేదాన్ని.
LikeLike
థాంక్… ఆహాహా ..నెనర్లు నిహారిక గారు.
మీలాంటి వారెందరో సహృదయులు న్నారని తెలుసు కనక అవన్నీ ఆల్రెడీ చేస్తున్నవాళ్ళ కోసం కాదు ఈ టపా అని చివర్లో నోట్ పెడదామనుకుని తొందరలో మర్చిపోయాను.
అలంకరణ క్రెడిట్ అంతా మా శ్రీమతి గారిదే , బాపూ ఫాంట్ కలిపే చాన్స్ మాత్రం నాకు వచ్చింది.
మామిడిపళ్ళు ఆల్ఫోన్సో అనుకుంటా( విత్ కార్బైడ్ ఆర్ వితౌట్ అనేది ఆ దేవుడికి, చల్లినవాడికే తెలియాలి.) మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు.
LikeLike
అబ్బ చాలా చాలా బాగా రాశారు చూశారూ మా ఇంట్లో ఆల్రెడీ మావిడి చెట్టూ వేప చెట్టూ కాకూలూ కోయిల్లూ పిచ్చుకలూ అవేంటబ్బా హనీ బర్డుసు వచ్చేశాయి పోతే ఇంకా చిలకలే రాలేదు….. మరి నీళ్లకేవో కరవొచ్చే ఏం చేయాలో ఏంటో, అక్కడికీ వీలైంత చేస్తూనే ఉన్నాం….మీకేమో ఉగాది బోల్డు సుభాకాంక్షలు..(రామనవమి వచ్చేస్తోంది)
LikeLike