ప్రయాణీకులతో కిక్కిరిసిన బస్సు ఒక దారిన పోయే దానయ్యని గుద్ది అతని జీవితం అర్ధంతరంగా ముగిసిపోతే ఆ పాపంలో ప్రయాణీకులకి భాగం ఉంటుందా? ఉండదు గాక ఉండదు. అని బల్ల గుద్ది చెప్పెయ్యచ్చు. డ్రైవర్ పొరపాటో, బస్సు బ్రేకులు పని చెయ్యకపోవడమో, అవతలి మనిషి రాంగ్ సైడులో ఉండడమో, ఇంకేదో ఇంకేదో వంద కారణాలు ఉండచ్చు ప్రయాణీకులదే తప్పని ఎవరనగలరు? ఆ మనిషిని గుద్దెయ్యడానికే బస్సు మాట్లాడుకుని వీళ్ళంతా బయలుదేరివుంటే అది వేరే విషయం. ఐ థింక్, మనం ఇంకా అంత గొప్పవాళ్ళం అవ్వలేదు.
సినిమా పిచ్చిలో పడిన యువకుడు, సినిమాల్లో ఒక వెలుగు వెలగాలనీ, అందుకు కోట్లడబ్బు కావాలనీ అనుకుని ఆ డబ్బు కోసం ఇంకో ముక్కుపచ్చలారని కుర్రవాణ్ణి కిడ్నాప్ చేస్తే, అనుకునో, అనుకోకనో అది హత్యగా మారిపోతే లక్షకారణాలు చెప్పి తొంభైమంది మీద ఆ నేరానికి బాధ్యత పెట్టచ్చు కానీ,
సినిమాలకి, సినీగ్లామర్కి, సినిమాలవల్ల ప్రభావితమైన సంస్కృతికి మనం – వోటుహక్కు, సమాచార హక్కు, బాలల హక్కులతోపాటు అనేక మానవహక్కులున్న మనం – ఇస్తున్న ప్రాధాన్యత,
సంస్కారానికి, విలువలకి ఉన్న విలువ, అవసరం తెలీకుండా ఎదుగుతున్న యంగ్‌జనరేషన్ మీద సగటు, మోస్ట్లీ స్టుపిడ్, మాస్‌మసాలా సినిమా ప్రభావం
— ఈ రెండూ కూడా కారణాలే అనొచ్చా? జవాబు యెస్ అయితే, అలాంటి నేరాలకి మనమీద కూడా ఎంతో కొంత బాధ్యత ఉందని ఒప్పుకున్నట్టేనా? ఎవరు చెప్పగలరు? మసాలాసినిమాలు తీస్తున్నవాళ్ళా? వేషాలు వేస్తున్నవాళ్ళా? ఎగబడి చూస్తున్నవాళ్ళా?సెన్సార్ బోర్డా? గవర్న్మెంటా?
సపోజ్, ఫర్ సపోజ్, బస్ డ్రైవర్ రాంగ్‌సైడ్‌లో ఓవర్‌స్పీడ్‌లో వెళ్తున్నాడని చూసికూడా ప్రయాణీకులు పట్టించుకోకపోతే, దారిన పోతున్న దానయ్య ఆ బస్సు కిందపడి, పోతే? ప్రయాణీకుల బాధ్యత ఉన్నట్టా లేనట్టా? పోలీసులు నిరూపించగలరా? కోర్టులు నిర్ధారించగలవా? భూమికి సమాంతరంగా నడుస్తున్న దానయ్య ప్రయాణం సడెన్‌గా ఆయన ఇష్టాయిష్టాలతో పనిలేకుండా అనంతలోకాలవైపు నైంటీడిగ్రీ టర్న్ తిరిగితే? దీనికి ప్రయాణీకుల బాధ్యత ఉన్నట్టా, లేనట్టా?
తీసేవాళ్ళు+వేసేవాళ్ళు+ఎగబడి చూసేవాళ్ళు+సెన్సార్‌బోర్డు+గవర్న్మెంటు = ప్చ్! మనం!?!? :-(