నేనెక్కడున్నాను, ఎలా వచ్చాను, ఎక్కడికిపోతానులాంటి ప్రశ్నలు నాబుర్రలో మెదిలే ప్రశ్నేలేదు


Butterfly

నా జీవితం ఒక అనాకారి గొంగళిపురుగుగా మొదలైంది. అప్పట్లో నాకు నేనూ, నా తిండీ తప్ప మరేం తెలీదు. పచ్చనిఆకు అంటే నా దృష్టిలో తిండి, అంతే. నేనెక్కడున్నాను, ఎలా వచ్చాను, ఎక్కడికిపోతానులాంటి ప్రశ్న నాబుర్రలో మెదిలే ప్రశ్నేలేదు. కానీ ఆకులు, పువ్వులు నన్ను చూసే చూపులు నాలో ఏదోతెలీని ఒక అపరాధభావన కలిగించేవి. ఐనా ఆ భావాన్ని పట్టించుకునేదాన్నికాదు. లెక్క చేసేదాన్ని కాదు. అయినా ప్రాణం నిలుపుకోడానికి నాకు తెలిసిన మార్గం అప్పట్లో అదొక్కటే. ఏదేమైనా ప్రకృతి నుంచి నాకు బతకడానికి అవసరమైన దానికన్నా పదింతలు ఎక్కువగా తీసుకుని ప్రకృతి కష్టాన్ని దోచుకుంటున్నానన్న భావమో, నేను బతకడానికి మొక్కల, చెట్ల బతుకుల్ని నాశనం చేస్తున్నానన్న ఆలోచనో – ఏదైతేనేం తప్పు చేస్తున్నానన్న భావన నన్ను వదిలిపెట్టలేదు.  తేనెటీగ  గురించి తెలిసే వరకూ. తనూ పూల మీదే ఆధారపడి బతుకుతుంది. కానీ ఆ పూలకి ఎంత మాత్రం నొప్పి కలిగించకుండా సుతిమెత్తగా వాటిలోంచి తేనె తీసుకుంటుంది, పూల ఆతిధ్యానికి బదులుగా ఆ పూలపుప్పొడి తీసుకెళ్ళి వేరే పూలపై వెదజల్లి అవి కాయలు, పళ్ళు అయ్యి వాటి జాతి వృద్ధి అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇదంతా నాకొక పువ్వు చెప్పింది, దాని చుట్టూ ఉన్న చిగురాకుల్ని నేను తింటూ వుండగా ఏడుస్తూ చెప్పింది. ఇంక నేనాగలేకపోయాను. ఈ పాడు దోపిడీ బతుకు బతకడం కంటే ముక్కు మూసుకు చావడం మెరుగనుకున్నాను. అమాయకపు ఆకులపై నా దృష్టిపడి మళ్ళీ ప్రలోభపరచకూడదని నా చుట్టూ నేనే ఓ సమాధి కట్టుకున్నాను. నేను తినేసిన రంగురంగుల పూలని, ఆకుల్ని తల్చుకుంటూ పశ్చాత్తపిస్తూ….నన్నూ ఆ తేనెటీగలా మార్చు, లేదా ఇలాగే కదతీర్చమంటూ కనిపించని ఆ సృష్టికర్తని నిశ్సబ్దంగా ప్రార్ధిస్తూ….. సమాధిస్థితిలోకి జారిపోయాను. అలా ఎంతకాలం గడిచిందో, ఏ వన దేవత నన్ను కరుణించిందో …

ఒక రోజు కళ్ళు తెరిచి నన్ను నేను చూసుకుంటే నేను ఆ పాతనేను కాదు. ఈ కొత్త నేను. బతికినన్నాళ్ళూ హాయిగా, అందంగా, ఆహ్లాదకరంగా బతకమని దేవుడు నన్నిలా మార్చేశాడు. నిన్ను చూసి మురిసిననవాళ్ళందరూ ప్రకృతి ప్రేమికులౌతారని ఆశీర్వదించి నాకు ఆహారమై నన్ను బతికించిన పూల, ఆకుల అందాలన్నీ నా రెక్కలమీద ముద్రించి మళ్ళీ వనసీమల్లో వదిలిపెట్టాడు. ఇప్పుడు నేనూ తేనెటీగలాగా పూలలో మకరందాన్నే తాగుతున్నాను. చెట్టు నుంచి చెట్టుకి పుప్పొడి మోసుకెళ్తూ వృక్షజాతికి నాకు చేతైనంత సాయం చేస్తున్నాను. ఇప్పుడు నన్నెవ్వరూ అసహ్యించుకోవట్లేదు. ముఖ్యంగా నన్ను నేను ద్వేషించుకోవట్లేదు. ఇప్పుడనిపిస్తుంది. నన్ను నేను పరిశీలించుకోవడం, నా లోపాలని నేను అర్ధం చేసుకోవడం, మార్పు కోరుకోవడం – ఇవన్నీ గొంగళిపురుగుగా ఉన్నప్పుడు కూడా నాలో ఉండేవని. ఐతే, జీవితం అంటే ఆకలి(కోరికలు) తీర్చుకోవడం మాత్రమే అనే భావనే పైచేయిగా ఉన్నంతకాలం అవి బయటపడలేదు. పూలు నన్ను చూసిన అసహ్యపు చూపులు అర్ధం చేసుకున్నప్పటి నుంచి ఆ పరిస్థితి మారింది. అదే నాలో అందమైన మార్పుకి దారి చూపించింది.   

4ksy