కార్బైడుపొగకన్న హాలాహలము మిన్న వదిలెయ్యరా నన్ను నా మానవా!!!


పూజింప నేఁబిల్వదళములను తెచ్చెదను దీవింపరావేర నా శంకరా

అమ్మయై పోషించు అడవులను నరికితివి దళములెట దొరుకురా ఓ మానవా?

 గంగజలములు తెచ్చి అభిషేకములుజేయ ఆనతీయగరార గంగాధరా

పాపాలు కడిగేటి నీరు కలుషితమయ్యె ఏ నీట ముంచెదవొ ఓ మానవా?

పాలతో రుద్రాభిషేకములు గావింతు పాపములు పోగొట్టు ఫాలాక్షుడా

ఫెవికాలుపాలతో ప్రోక్షింపజూచితివ నెత్తిపై నా ఆలి నొచ్చు మానవుడా  

పుట్టతేనెలు పోసి పూజింతురా నిన్ను పుణ్యాలనీయరా ప్రమధేశ్వరా

తేనెటీగను పట్టి ఖైదులో పెట్టగా పుట్టతేనెట్లొచ్చు పురుషోత్తమా?

నాగులను నీ కంఠహారములు చేసెదను ననుగావరావయ్య నాగేశ్వరా

పాములన్నీ చేతిపర్సులుగ మారినవి నాకేమి మిగిలెరా నా మానవా

పులిచర్మమును దెచ్చి చుట్టబెట్టెద నీకు పాలింపరా నన్ను పరమేశ్వరా

పులి కొరకు గాలింప ఏ గ్రహముకేగెదవు? ఎందుకొచ్చిన గొడవ! ఓ మానవా

తీయని పళ్ళతో ఫలహారములు పెడుదు ఆరగించర నీవు అర్ధనారీశ్వరా

కార్బైడుపొగకన్న హాలాహలము మిన్న వదిలెయ్యరా నన్ను నా మానవా

వదిలెయ్య మంటే ఎలా స్వామీ ?? ఆ పూజలన్నీ చెయ్యకుండా మాక్కావల్సినవన్నీ నువ్విస్తావా? ఇవన్ని కుదరదంటే నిన్ను ప్లీజ్ చేసేదెలా?

అందుకు మార్గం ఉంది మానవా? నీ త్రిగుణాలు నాకు సమర్పిస్తే చాలు. బిల్వపత్రాలతో పుజించినట్టే

త్రిగుణాలా అవేంటి స్వామీ?

అవేంటో తెల్సుకునే బాధ్యత నీదే నాయనా! బిల్వపత్రం అంటే తెలుసుకున్నవాడివి త్రిగుణాలని, అంటే సత్వరజస్తమో గుణాలని, కూడా అర్ధం చేసుకోగలవు. ఆ పని వదిలేసి మారేడుచెట్లకి ఆకులు మిగల్చకుండా దూసేస్తున్నావు.

అంత టైమెక్కడ స్వామీ? ఎన్ని పన్లు, ఎన్ని బిజినెస్సులు, ఎన్ని రాజకీయాలు చక్కబెట్టుకోవాలి చెప్పు?

అలాగైతే అవే చక్కబెట్టుకో. నీ లాభాలు నువ్వు చూసుకో. గ్లోబల్ వార్మింగూ, గ్రీన్-హౌస్ ఎఫెక్టూ తెలుసా. చెట్లని, అడవుల్నీ పట్టించుకోకుండా సంపాదించే నీ లాభాలు పెరిగిన కొద్దీ అవీ పెరుగుతూపోతాయి. మీకు పీల్చేందుకు మంచిగాలి కూడా లేకుండా చేసేస్తాయి.

బాబోయ్! అవేంటి స్వామీ?

నా గొంతులో హాలాహలం దాచుకున్నాను. తెలుసా?

తెలుసు స్వామీ. అది మింగి నువ్వు ప్రపంచాన్ని రక్షించేసావని విన్నాను.

చెట్లు, నదులు, సముద్రాలు కూడా మీ పరిశ్రమలూ, వాహనాలు వదిలే హాలాహలాన్ని పీల్చుకుంటూ మిమ్మల్ని కాపాడుతున్నాయి. అవి నా స్వరూపాలే. వాటిని పాడుచేసి మీరు నన్ను దూరం చేసుకుంటున్నారు. కాదా?

అమ్మో! ఒక్క మారేడాకుల వెనకే ఇంత మతలబుందా? పాలు, నీళ్ళు, తేనె….వాటి వెనక ఇంకెంత కధవుందో ఏమో?వామ్మో!!

అదీ అలా రా దారికి.

మరైతే నీ వరాలు పొందడానికి ఏదైనా వేరే ఉపాయం చెప్పు స్వామీ!!  

ఏ పని చెయ్యాలన్నా నన్ను పవిత్రమైన మనసుతో తలచుకో.

ఇది చాల తేలికేమో స్వామీ పన్లు చేసే ముందు నీ పేరు తలచుకుంటే సరిపోతుందా.

సరిపోదు. నా పేరు తల్చుకుని చేసేవన్నీ మంచిపన్లే అయ్యుండాలి సుమీ!!.. మంచీ చెడూ తెలుసుకోకుండా నా పేరు తలచుకున్నా ప్రమాదమే. పూర్వం అలా చేసినవాళ్ళనే రాక్షసులు అనేవారు.

అమ్మో ! గుర్తుంది స్వామి నీ పురాణాల్లో అవన్నీ విన్నాం. కొంపదీసి మేమిప్పుడు రాక్షసులం అంటావా ఏంటీ?

నీ నిర్మలమైన మనసుతో నన్ను ప్రార్ధిస్తే నాకు గంగాజలంతో అభిషేకించినట్టే. అలా చేసినవాళ్ళు రాక్షసులు అవ్వరు.

అవునా స్వామీ..

పూర్తిగా అర్ధం చేసుకో. నిర్మలంగా …అంటే పాపపుఆలోచనలేం ఉండకూడదు . ఎవరికీ కీడు తల పెట్టకూడదు

సరే స్వామీ!

అదంత ఈజీ కాదు. గట్టిగా ప్రయత్నించాలి. ఎవరినీ కించపరచని మంచిమాటలాడడమే నాకు తేనెతో చేసిన అభిషేకం. నిస్వార్ధసేవ నాకు మధురఫలాలకన్నా ప్రీతి. మూగజీవాలని, చిన్నపిల్లలని హాయిగా బ్రతకనీయడమే నాకు ఇష్టమైన యజ్ఞం.

మరి ఇవన్నీ చేసేస్తే నా లాభాలు, పదవులూ అవన్నీ వచ్చేస్తాయంటావా స్వామీ?

ఖచ్చితంగా పైన చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు నన్ను పూజించాక మీకు ఎంత లాభంవస్తే అదే నిజమైన లాభం, ఏ పదవి వస్తే అదే నేను మెచ్చే పదవి. అలాకానివన్నీ పాపాలే.

మరైతే ఇవన్నీ ఎప్పుడో చెప్పేస్తే…..

క్రీస్తుశకం ఏడోశతాబ్దంలోనే శంకరాచార్యుడు ఇవన్నీ చెప్పాడు, శివమానసపూజాస్తోత్రంలో. కాలక్రమేణా బాహ్యాచారానికి, ఆడంబరానికి ప్రాముఖ్యత పెరిగి మనిషికి భావశుద్ధి గురించిన ఆలోచన తగ్గింది. మీరుపెట్టే అర్ధంలేని పరుగులకి, సాంఘిక అనర్దాలకి, ప్రకృతి వైపరీత్యాలకి అదే కారణం.  ఇదంతా నా దయ లేకపోవడం అనుకుంటున్నారు. అదేంలేదు. ఇకనుంచీ భావశుద్ధి పెంచుకుని, అందరూ ఐక్యభావంతో ఉంటూ, మానవత్వమే మహాధర్మం అని అర్ధం చేసుకుని బతికితే మీరూ, మీ ప్రపంచం నిజమైన సుఖశాంతులు పొందుతారు. శుభం. సమస్తలోకాస్సుఖినోభవంతు.