ఎకనామిక్ డెవలప్‌మెంట్+కన్జ్యూమరిస్ట్ మైండ్=ఖాండవ దహనం


కేజ్రివాల్ ప్రభుత్వం పుణ్యమా అని ఢిల్లీలో కాలుష్యం తగ్గించే దిశగా ఒక అడుగు పడింది. ప్రజాస్పందన అదిరిపోతోందని కేజ్రివాల్ సంతోషం వెలిబుచ్చారు కూడా. అదిరిపోక చస్తుందా? రాష్ట్రపతి నుంచి రోడ్లు, పేవ్‌మెంట్లు తప్ప వేరే నివాసంలేని వాళ్ళ వరకూ అందరూ పొగనే పీల్చాల్సి వస్తుంటే. అత్యవసరంగా రోడ్డు మీదకొచ్చే వాహనాల సంఖ్యని నియంత్రిస్తే తప్ప కుదరని సిట్యుయేషన్‌లో ఈ అడుగు పడింది-అంటే ఎన్విరాన్‌మెంటల్ ఎమర్జెన్సీ అనుకోవచ్చు – బట్ స్టిల్ ఈ చర్య తాత్కాలికపరిష్కారం మాత్రమే. సమస్య మూలాలని ఛేదించే ప్రక్రియ మొదలవ్వలేదు. నిజానికి ఎన్విరాన్‌మెంటల్ ఎమర్జెన్సీ విధించాల్సిన స్థితి అన్ని పెద్ద సిటీలలోనూ వుంది. ఇన్నాళ్ళకి ఒక్క రాష్టంలో ఒక్క సిటీలో ఒక్క అడుగు ముందుకుపడింది. త్వరలో అన్ని రాష్ట్రాలూ ఈ దారిలో నడవాల్సిందే. లేకపోతే ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న పరిస్థితి తప్పదు. బీజింగ్‌లో ఎక్కడైనా ఓ పాతిక నుంచి వంద గజాల దూరం క్లియర్‌గా కనిపిస్తుంది.  ఆపైనంతా దోమల నివారణకి ధూపం వేసినట్టు వుంటుంది. ఒకసారి, అంటే రెండువేల పద్నాలుగు జులైలో, షాంఘై నుంచీ మూడుగంటలు ప్రయాణం చెయ్యాల్సొచ్చింది, కార్లో. మూడుగంటలూ పళనిహిల్స్‌లో మేఘాల మధ్య ప్రయాణించినట్టుంది. ఐతే పళనిహిల్స్ మేఘాలకి వాసన అనే ప్రాపర్టీ లేదు. మేడిన్ చైనా మేఘాలకి వాసన వుంది. మాతో వచ్చిన చైనీస్ కన్సల్టెంట్‌ని ఇంత పొల్యూషనేంటి బాబూ అని అడిగితే,”This is the price we pay for rapid development” అని చైనీస్‌భాషలోనే నిట్టూర్చాడు. వార్తల్లోకిరాని విషయం అంటూ ఇన్‌ఫాంట్ మోర్టలిటీ, అబార్షన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయని కూడా చెప్పాడు. తక్కిన ఇతర రోగాల గురించి చెప్పనే అక్కర్లేదు. మనం ఇప్పుడు మేక్-ఇన్-ఇండియా అంటున్నాం. అదే నోటితో స్వచ్ఛభారత్ అని కూడా అంటున్నాం. దశాబ్దాల తరబడి గంగా – యమునల శుద్ధి గురించి మాట్లాడుతున్నాం. మేక్-ఇన్-ఇండియా తప్పకుండా ముందుకే వెళ్తుంది. డబ్బు, వ్యాపారం, ఆర్ధిక వ్యవస్థలకి మనిషిచ్చే ప్రాధాన్యత అటువంటిది కనక. తక్కినవన్నీ వెనక బడతాయి. అవి మన సంస్కృతిలో లేనివి కనక. ఇండియా చైనాతో ఏ విషయంలోనూ పోటీ పడలేదు అనే భావం చాలామందికి వుంది. ఐతే అది నిజం కాదు. పాప్యులేషన్ & పొల్యూషన్ – ఈ రెండు రంగాల్లో పోటీ పడుతున్నాం, గారంటీగా గెలుస్తాం కూడా. దురదృష్టం కొద్దీ ఈ రెండిట్లోనూ ఓడిపోవడం అవసరం, అత్యవసరం. సోలార్ & విండ్ ఎనర్జీ, సోలార్ / బాటరీ పవర్డ్ వెహికిల్సూ, పబ్లిక్ ‌ట్రాన్స్‌పోర్ట్‌ – ఈ రంగాల్లో విప్లవాలు వస్తే తప్ప ఓడిపోడం కష్టం. అలాగే జనాభా తగ్గుదల, కన్జ్యూమరిస్ట్ ఎకానమీలో మార్పు కూడా అవసరం. ఈ రెండూ అంత త్వరగా వస్తాయనుకోవడం అమాయకత్వమే, కానీ రావాలి. ముఖ్యంగా మనలో పెరిగిపోతున్న కన్జ్యూమరిస్ట్ మైండ్-సెట్ మారాలి. ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంటు, కన్జ్యూమరిజాల మధ్య సంబంధం అగ్ని, వాయువుల సంబంధమే. ఆ రెండూ కలిస్తే ఖాండవ దహనమే. సో, కన్జ్యూమరిస్ట్ మైండ్-సెట్ మార్చుకుంటే భావిభారత పౌరులకి వాతావరణంలో కాస్త ఆక్సిజన్ మిగిల్చినవాళ్ళం అవుతాం. ఇండస్ట్రీ & వ్యాపార వర్గాలు ఏం తయారు చేసి మన మీదకి వదిలితే దాన్ని ఆత్రంగా కొనేసి, వాడేస్తున్నాం ఇవాళ. నిజానికి కన్జ్యూమర్‌కి ఏది మంచిదో అదే ఉత్పత్తి చెయ్యాల్సిన పరిస్థితి కల్పించలేక పోతున్నాం. ఎందుకంటే మనకేది మంచిదో మనకి సరిగ్గా తెలీదు. తెలుసుకునే ఓపిక లేదు, ఓపిక వుంటే తీరిక లేదు. ఆ రెండూవుంటే మనసు మీద కంట్రోల్ లేదు. బుద్ధభగవానుడు కోరికలే దుఃఖ్ఖానికి మూలం అని ఏ ముహూర్తంలో కనిపెట్టాడో కానీ మానవజాతికి ఆ పాఠం వంటబట్ట(డం లే)దు. అఫ్‌కోర్స్, ఇండియా మటుకు ఈ పరిస్థితి దురదృష్టం కొద్దీనే అనుకుంటా. కోరికల్లేకుండా ఏదో ఉన్నదాంతో సంతృప్తిగా బతుకుదామంటే ఇతర దేశాలు, ముఖ్యంగా సామ్రాజ్యవాద జాతులు పడనివ్వవు. వాళ్ళ చేతుల్లోంచి బయటపడ్డాక అభివృద్ధి చెందితే తప్ప బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఒకసారి అభివృద్ధి మొదలైందంటే చాలు వ్యాపారస్తుడు అనేవాడు ఏం పనిచేసినా – అంటే చదువు, మంచినీళ్ళు, దైవభక్తి – కాదేదీ వ్యాపారానికనర్హం అన్నట్టు దేన్ని వ్యాపారవస్తువుగా మార్చేసినా – అవన్నీ అభివృద్ధి కోటాలో పడిపోతాయ్. ప్రధాన మంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంటు వరకూ డిమాండ్ – సప్లై మాయాజాలంలో పడిపోతారు. ఇవాళ అమెరికాలో వుండి పంచదార చిలకలనుంచీ పంచగవ్యం (ఆవుయొక్క పాలు, పెరుగు, నెయ్యి, పేఁడ, మూత్రము) వరకూ ఒక్క క్లిక్కుతో ఆర్డర్ చేసెయ్యొచ్చు కదా. అవిక్కడనుంచి అమెరికా వెళ్ళడంలో ఎంత కాలుష్యం ఏర్పడుతోంది? పోనీ అలాంటి వస్తువులు స్టాక్ చేస్తారు కనక పరవాలేదనుకున్నా ఆహారపదార్ధాలు, ముఖ్యంగా కొన్ని రకాల సీ-ఫుడ్స్, ఒక దేశం నుంచి మరో దేశానికి ఓవర్‌నైట్ ఎయిర్‌ఫ్రైట్ అవుతాయి ప్రతిరోజూ. దీనివల్ల ఏర్పడే కాలుష్యం ఎంత? ప్రతిరోజూ సిటీల్లో తాజాకూరలు, పాలు, చాల చోట్ల మంచినీళ్ళు, మొదలైనవి అందుబాటులోకి తేవడంలో ఎంత వాయుకాలుష్యం జరుగుతోంది? ఆటోమొబైల్ వున్న ప్రతివ్యక్తి తన వాహనంతో ఉత్పత్తి చేసిన కాలుష్యానికి సమానంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాడా? అభివృద్ధి లెక్కల్లో ఇలాంటి విషయాలు పట్టించుకునే సమయం, ఓపిక వుండవు. నిజమే. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన టైము వచ్చేసింది. పెద్ద పెద్ద ఫాక్టరీలు, పవర్ ప్లాంట్ల సంగతి అలావుంచి మనం చాలా మామూలుగా, అమాయకంగా చేసేసే రోజువారీ పనులవల్ల కూడా పొల్యూషన్ పెరిగిపోతోందనేది ఇప్పటికే తేలిపోయింది.

2016

(సశేషం)