అధ్యక్షా!అధ్యక్షా!…ఓ అసెంబ్లీ అధ్యక్షా!


అధ్యక్షా, ఈ రోజు కొందరు సభ్యులం సభాముఖంగా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నామధ్యక్షా! అదేంటంటే అధ్యక్షా! పార్లమెంటు కొత్తభవనం నిర్మాణానికి లోక్ సభ స్పీకరుగారు కోరినట్టుగానే రాష్ట్రంలో కూడా కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలనధ్యక్షా! ఐతే కొత్తసెంబ్లీలో కొన్ని ప్రత్యెక వసతులు కల్పించాలని కూడా మా వినతి అధ్యక్షా! అధికారపక్షఁవోళ్ళుగానీ, ప్రతిపక్షపార్టీలోళ్ళుగానీ అధ్యక్షా అందరికీ – అంటే ప్రతి ఒక్కరి కుర్చీకి ఈ ప్రత్యెక వసతులు ఉండేలా చూడాలి అధ్యక్షా! అందుకు మా సూచనలేంటంటే అధ్యక్షా …

మొదటిది ప్రతి కుర్చీకి సీట్ బెల్టు ఉండి, ఎమ్మెల్యే కుర్చీలో కూకోగానే చర్చలు అయ్యేవరకూ మళ్ళా లేచేదానికి లేకుండా ఆటోమేటిగ్గా బెల్టు లాక్ అయిపోవాలి అధ్యక్షా! ఈ ఏర్పాటు వల్ల గౌరవ సభ్యులు వెల్లులోకి దూసుకొచ్చి ఐటం డాన్సుల మాదిరి విన్యాసాలు చేసేదానికి ఛాన్సుండదఅధ్యక్షా!

కొందరు సభ్యులు సినిమా టికెట్ల క్యూల కాడ, వీధిపంపులకాడ నీళ్ళు పట్టే టైముల, బస్సులల్ల సీట్లు పెట్టుకునేటప్పుడు చేసే ట్రిక్కులు, గిమ్మిక్కులు చేసి ఎదో ఇదంగా వెల్లులోకొచ్చే పరిస్థితి ఈ రోజునున్నాది అధ్యక్షా! వెల్లు ఫ్లోరంతా గాజుపెంకులు, ముళ్ళ తీగలు పరిపించి సభ్యులు అక్కడ చేరకుండా నివారించమని మా కోరికధ్యక్షా! అడవి జంతువుల నుంచి పొలాలని రక్షించేందుకు రైతులు ఎలక్ట్రికల్ ఫెన్సింగులు వాడుతుంటారు అధ్యక్షా! అదే విధంగా అసెంబ్లీ బెంచీల చుట్టూత ఎలక్ట్రికల్ ఫెన్సింగులు ఏర్పాటు చేస్తే అధ్యక్షా సభ నిర్విఘ్నంగా జరుగుతాదని ప్రజలు, కొంతమంది సభ్యులు గూడా అనుకుంటున్నారధ్యక్షా!  

ఇక రెండో సూచనధ్యక్షా! సభ్యుడి గొంతు మాట్లాడే, చర్చించే స్థాయి దాటి అరుపులు, దబాయింపుల స్థాయికి చేరుతుంటే ఆయనగారి మైకు ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోవాలి అధ్యక్షా!

మామూలుగా మాట్లాడేప్పుడు కూడా బూతులు, అన్-పార్లమెంటరీ లాంగ్వేజీ వస్తావుంటే అధ్యక్షా! అప్పుడు కూడా మైకు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోవాలధ్యక్షా!

ఒక సభ్యుడు మాట్లాడతావుంటే ఆయన మైకు, మీ మైకు తప్ప తక్కినోళ్ళ మైకులు పనిచెయ్యకూడదధ్యక్షా!

అదే విధంగా సభ్యులు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా వుంటే గూడ మైకులు ఆగిపోవాలధ్యక్షా! లైనుకోపాలి అధ్యక్షా అధ్యక్షా అనడంగూడ ఫాషన్‌అయిపోయిన పరిస్థితుందధ్యక్షా ఈ రోజు. ఒక నిముషంలో రెండుసార్లు అధ్యక్షా అంటేగూడ మైకు ఆఫ్ ఐపోయే ఏర్పాటు చేసి ఈ విధంగా ముందుకుపోవాల్నని విజ్ఞప్తిజేస్తున్నామధ్యక్షా!  

పాలక పక్షంలోగానీ, ప్రతిపక్షంలోగానీ అధ్యక్షా! సభ్యులందరు గూడ పార్టీ నాయకుని దయవల్లనో, ఫలానా నాయకుని కులంలో పుట్టినందువల్లనో అసెంబ్లీల అడుగుపెడుతున్న పరిస్థితున్నదిగానీ అధ్యక్షా ప్రజలకి చేసిన సేవ వల్లన అసెంబ్లీకి వస్తున్న పరిస్థితైతే కనబడ్డంలేదధ్యక్షా! ఈ కారణం వలన సభ్యులు సభ్యత లేకుండ చర్చించడం వదిలిపెట్టి వ్యక్తిగతదాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఈ రోజుందధ్యక్షా! కాబట్టి అధ్యక్షా ముందు జెప్పిన ఏర్పాట్లన్నీ చేయిస్తేగానీ అసెంబ్లీ సభాసమయం సద్వినియోగమయ్యే పరిస్థితి అసలే లేదధ్యక్షా!……