ఆ దీపావళి నిర్ణయం పేల్చిన బాంబుల రీ-సౌండ్స్ ఇప్పటికీ ….


//ఎన్టీయార్ కృష్ణుడి దీపావళి సినిమా , అందులో ఎస్వీయార్ నరకాసురుడు, సావిత్రి సత్యభామ తన తల్లి భూదేవే అని చనిపోయే ముందు తెల్సుకొని చేసిన తప్పులకి వగచటం; అది చూసి మనకీ కళ్ళలో నీళ్ళు తిరగటం, మోస్ట్లీ నరకాసురుడు ఎస్వీ రంగారావు కావడంవల్ల; (అదే ఏ సత్యనారాయణో ప్రభాకర్రెడ్డో అయితే డౌటే. గిరిబాబో మోహన్ బాబో ఐతే పట్టించుకునే ప్రశ్నేలేదు. దీన్ని బట్టీ ఏం తెలుస్తోంది? విలన్లలో కూడా రాను రాను మంచితనం తగ్గిపోతోందని.)//

దీపావళి= ముందురోజు నరక చతుర్దశి నాడు టపాకాయలతో ట్రయల్ రన్;
దీపావళి = తలంట్లు, స్వీట్లు, కొత్త బట్టలు, టపాకాయలు,
దీపావళి= చలికాలపు సాయంత్రాలు, దీపాలు, దిబ్బూ దిబ్బూ దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి
దీపావళి= కాయితాల మీద నరకాసురుడి బొమ్మలేసి వాటిని కాల్చెయ్యడం
దీపావళి=గోంగూర కాడలతో దిబ్బూ దిబ్బూ అయ్యాక, రెండు కాకర పువ్వొత్తులు కాల్చి, ఇంట్లోకొచ్చి సబ్బుతో చేతులు కడుక్కుని, స్వీటు తిని కొత్త బట్టలనుంచి పాతవాటిలోకి మారి టపాకాయల హంగామాకి రెడీ అవ్వడం
దీపావళి= బాగా పేల్తాయని టపాకాయలు ఎండబెట్టి, పావుగంటకోసారి వెళ్లి ఎండాయో లేదో చెక్ చేసుకోవడం పండగ రోజు వర్షం రాకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్ధించడం
ఇవన్నీ కాక –
దీపావళి= ఎన్టీయార్ కృష్ణుడి దీపావళి సినిమా , అందులో ఎస్వీయార్ నరకాసురుడు, సావిత్రి సత్యభామ తన తల్లి భూదేవే అని చనిపోయే ముందు తెల్సుకొని చేసిన తప్పులకి వగచటం; అది చూసి మనకీ కళ్ళలో నీళ్ళు తిరగటం, మోస్ట్లీ నరకాసురుడు ఎస్వీ రంగారావు కావడంవల్ల; (అదే ఏ సత్యనారాయణో ప్రభాకర్రెడ్డో అయితే డౌటే. గిరిబాబో మోహన్ బాబో ఐతే పట్టించుకునే ప్రశ్నేలేదు. దీన్ని బట్టీ ఏం తెలుస్తోంది? విలన్లలో కూడా రాను రాను మంచితనం తగ్గిపోతోందని.)
పెద్దాళ్ళు దగ్గరుండి –
విష్ణుచక్రం ఊచ ఎలా పట్టుకుంటే చేతిమీదకి రాకుండా ఉంటుంది
భూచక్రం వెలగగానే కాళ్ళ మీదకి రాకుండా ఏ డైరెక్షన్ లో ఉంచి వెలిగించాలి
తాటాకు టపాకాయకి నిప్పు అంటించే విసిరేసే టైమింగు
మతాబు చివర అట్లకాడ గుచ్చి పట్టుకోవడం వగైరా వగైరా జాగ్రత్తలు చెప్తూ చిచ్చు బుడ్ల నుంచీ రాకెట్ల వరకూ అందరి చేతా అన్నీ కాల్పించడం
మర్నాడు పొద్దున్నే ఫ్రెండ్సుతో కలిసి పేలని బాంబులు, చిచ్చుబుడ్లు, గట్రా ఏరుకొచ్చి కాల్చి పేల్చి దీపావళి సీక్వెల్ జరపడం
అన్నీ మధుర స్మృతులే ఒక్కటి తప్ప –
ఆ ఒక్కటీ –
యూజువల్ గా ఇంటిపన్లు చేసే మనిషి – పని మనిషి అని ఇదివరకు ఈజీగా అనేసేవాళ్ళం, ఇప్పుడు ఆ మాట వాడాలంటే అదో అనీజీనెస్ – పండగ పూట కొడుకునో కూతుర్నో పట్టుకు వచ్చేవాళ్ళు. వాళ్ళు మన కొత్తబట్టలు, ఆరబెట్టిన టపాకాయలకేసి చిన్నపిల్లల సహజమైన కుతూహలంతో చూసే చూపుల్లో ఇవన్నీ మనకెందుకు లేవు అనే ప్రశ్న కూడా కనిపించేది. నా ఐదోక్లాసు టైముకి క్లాసు డిఫరెన్సులు అవీ కొంచెంకొంచెం అర్ధమయ్యీ అవ్వకుండా మనసు ఆల్ ఈజ్ నాట్ వెల్ సిగ్నల్స్ ఇస్తూవుండేది. మనకున్నది పక్కవాడికి లేకపోతే తాత్కాలికమే ఐనా వై సో? అని హృదయం అడిగేది. అదే సమయంలో అమ్మ ఆ పిల్లల్ని పిలిచి టపాసుల్లో తలో రకం రెండు మూడు తీసి ఇస్తే ఆ పిల్లల కళ్ళలో మెరుపు కనిపించేది. అక్కడితో అసమానతల వ్యవస్థ గురించి మదిలో మొలకెత్తే ప్రశ్నల మొక్క చిగురు తొడగడం ఆ ఏడాదికి ఆగిపోయేది. ప్రాబబ్లీ ఆ పిల్లల మనస్సులో కూడా. బయటనుంచి వినపడిన మొదటి సీమ టపాకాయ చిటపటల్లో సామాజిక శబ్దాలు వినబడవు. నెక్స్ట్ యియర్ మళ్ళీ అదే జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మళ్ళీ ….
పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి ఇదో ఛైల్డిష్ పండగ అనిపించింది.
ఇన్నేళ్ళు ఎంజాయ్ చేసాం, ఇంక చాల్లే అనిపించింది.
అనవసరపు ఖర్చు, వేరే వాళ్ళు కాల్చేది చూస్తే చాల్లే అనిపించింది.
పొల్యూషన్ ఎవేర్-నెస్ కలిగాక టపాకాయల మీద ఇంట్రెస్టు పోయింది.
పాతికేళ్ళు వచ్చేసరికి దీపాల అందం అర్ధం తెలిసాయి.
దీపం = Enlightened Quietude టపాకాయలు = Noisy & Vulgar Display అనే భావం స్థిరపడిపోయింది. ఆ భావానికి పునాదులు చిన్నప్పుడు ఆ పనివాళ్ళ పిల్లల కళ్ళలో అర్ధం తెలియకపోయినా అస్పష్టంగానైనా కనిపించిన అంతస్తుల తేడాలు ఆర్ధిక అసమానతలు.
అసమానతలు తగ్గించే మార్గం, శక్తీ, యుక్తీ, సాహసం లేవు కానీ అసమానతని హైలైట్ చేసే కొన్ని యాక్టివిటీలు తగ్గించుకోవచ్చు కదా. అంతే, టపాకాయలు బంద్. తారాజువ్వలు బంద్.
పిల్లల కళ్ళలో నాక్కనిపించిన భావాలు – (అవును నాక్కనిపించినవే, ఇప్పుడాలోచిస్తే వాళ్ల భావాలు సరిగ్గా నేననుకున్నవే కావాలని ఏముంది అనికూడా అనిపిస్తుంది. బట్, మనం నమ్మింది చెయ్యాలి అంతే) – నో మోర్ బర్నింగ్ ఆఫ్ మనీ అనే నిరంకుశ నిర్ణయంగా మారిపోయాయి. ఆ నిర్ణయం సృష్టించిన చిటపటల, పేల్చిన బాంబుల రీ-సౌండ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయ్. దీపాలు తప్ప ఇంకే ఫైర్ వర్క్సూ కుదరని ఈ చోట ఆ రీ-సౌండ్సే టపాకాయలు.

పేదపిల్లల కళ్ళలో అస్పష్ట ప్రశ్నలు ఎప్పటికప్పుడు ఆ పిల్లల్లాగే కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఆశ్చర్యంగా, ఉన్నవాళ్ళ కళ్ళల్లోనూ ప్రశ్నలే. నాకేంటంట, నాకెంతంట అని. అప్పటి ప్రశ్నలు టపాకాయలు, కొత్త బట్టల గురించే. ఇప్పటి ప్రశ్నలు? మనసులో ఎన్ని కోరికలు పుట్టచ్చో అన్ని. ప్రతి మనసులో ఒక బుద్ధుడు అవతరిస్తే తప్ప తీరనన్ని ప్రశ్నలు. ఏ ఒక్క వ్యక్తీ, నాయకుడూ, గురువూ తీర్చలేనన్ని కోరికలు. పేలడానికి సిద్ధంగా ఉన్న టపాకాయల్లా.

మారిపోతున్న కాలాన్ని, మనుషుల్ని మార్చాలనుకోడం, మార్పు వస్తుందనుకోవడం ఆదర్శం. గాలికి రెపరెపలాడే దీపం.

ఆచరణలేని ఆదర్శం — ఒక టపాకాయ వెలుగు, క్షణికం. ఆలోచన లేని ఆవేశం — పిడుగులాంటి పేద్దశబ్దం, క్షణికం.

ఎవరికి వాళ్ళు ఎవరంతట వాళ్ళు మారాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి వ్యక్తీ కోరాలి. ప్రతి హృదయంలో ఒక దీపం, ఒకేసారి వెలగాలి. అప్పుడే అసలైన దీపావళి. Deepaavali of Enlightenment. ఈ లెక్కన ప్రపంచానికి దీపావళి ఇంకా రాలేదు. రాకపోవచ్చు. అప్పటివరకూ టపాకాయలదే హవా. దీపాలూ ఉంటాయి. కొంచెం వెనగ్గా, మినుకు మినుకు మంటూ. But, what an irony? టపాకాయ వెలిగించడానికైనా మినుకు మినుకు దీపం ఉండితీరాలి.

రెపరెపలాడుతూనైనా దీపం కనీసం గంటసేపు వెలుగుతుంది. ప్రతిరోజూ వెలుగుతుంది. టపాకాయల Noise, Display – అవెప్పుడూ క్షణికాలే, ఒక్కరోజు ముచ్చట్లే. అఫ్ కోర్స్ అంతా నాయిస్సే అనడమూ కరెక్ట్ కాదు. ఎందుకంటే దీపంలో దాగివున్న శక్తికి నిదర్శనం సీమ టపాకాయల ఫటఫటల్లో వినబడుతుంది.తారాజువ్వలు దూసుకుపోవడంలో కనబడుతుంది.

క్లిక్ > బాపూరమణీయం@వైకుంఠం.బాపు౮

4ksy