బ్లాగ్జీవి, RGV, మెగాస్టార్ చిరంజీవి, …ఏ జీవికైనా సరే….


Coffeesunవిష్ణువు అంటే బాలెన్సింగ్ పవర్ ఆఫ్ యూనివర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఫిల్టర్ కాఫీకి ప్రాణంలాంటి పాలు గుర్తు రావాలి. గుర్తొస్తాయ్. గుర్తొస్తాయ్ కాబట్టి ప్రపంచాన్ని నడపడంలో విష్ణుమూర్తి రోల్ ఏమిటో అదే రోల్ కాఫీలో పాలు ధరిస్తాయని కూడా అర్ధమైపోతుంది. దీన్నిబట్టీ కాఫీలో పంచదారే బ్రహ్మదేవుడనిన్నీ, కాఫీ డికాక్షన్ అనేది సాక్షాత్తూ ఆదిదేవుడు శివుడికి ప్రతిరూపమనిన్నిన్నీ అర్ధం అవుతుంది. అవ్వాలి. లేకపోతే అర్ధం చేసుకుంటాం. అదర్వైజ్, అది కాఫీత్వం అనిపించుకోదు.

క్రియేటెడ్ బీయింగ్స్ అన్నిటికీ కూడా ప్రాణంమీద తీపి కామనే కదా, తీయదనం రజోగుణానికి గుర్తు. అంచేత పంచదార అనేది ‘బ్రహ్మ’పదార్ధం.

ఇహపోతే, అది –

నిర్జీవి కానీ, సూక్ష్మజీవి కానీ, బడుగుజీవి కానీ, బ్లాగ్జీవి కానీ, మెగాస్టార్ చిరంజీవి కానీ, చివరికి RGV కానీ ప్రతి జీవికీ కూడా మార్పు చాలా అవసరం. అంటే మారుతున్న పరిస్థితులతో పాటు తనూ మారడం. లేకపోతె ఆర్జీవీ కి ఆగ్ లాగా సోదిలోకి లేకుండా పోవచ్చు,
ప్రజారాజ్యంలాగా అస్తిత్వం కోల్పోవచ్చు, చిరంజీవి నూటయాభయ్యో సినిమాలాగా ఎంతకీ లాంచ్ అవ్వకపోవచ్చు. ఆ అవస్థ తప్పించుకోడానికే జీవి అనేది పరిణామం-evolution- చెందుతుంది. పరిసరాలలో మార్పులకి అనుగుణంగా తనని తను మార్చుకుని మనుగడ సాగిస్తుంది. ఆ ధర్మం వల్లే కోతులు మనుషులయ్యాయి. ఒకప్పుడు నేల మీద బతికిన కుక్కని పోలిన జీవులు తిమింగలాలుగా మారాయి. కొన్ని రకాల డైనోసార్లు పక్షులయ్యాయి అని ఒక థియరీ. ఈ పరిణామక్రమాన్ని మెయింటైన్ చెయ్యడం లయకారకుడు అని మనం పిల్చుకుంటున్న శివుడి డ్యూటీ. యూనివర్స్ స్థాయిలో త్రిమూర్తులు నిర్వర్తించే ఈ కార్యక్రమాల్ని మనిషి మనసు అనే మైక్రో లెవెల్లో కాఫీ చేస్తుంది కనక అది బ్రహ్మవిష్ణుశివాత్మకం అని కాఫీప్రియుల- సత్కాఫీప్రియుల – ఉవాచ.

ఇజాల ప్రిజాల్లో, సిద్ధాంతాల రాద్ధాంతాల్లో, భావజాలాల ఇంద్రజాలాల్లో మైండు ఇరుక్కుపోయి కార్బైడ్ వేసి పండబెట్టిన కాకరకాయగా మారిపోకుండా చేసేదే కాఫీ. గ్లాసులో పోసుకుని ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుని తాగే వేడి వేడి ఫిల్టర్ కాఫీయే కాదు. మనసుని నిత్యనూతనంగా వుంచేదీ, మనిషిని simple living – high thinking individualగా నిలిపేదీ అది, ఒక్క త్రీ ఇన్ వన్ ఇన్స్టెంట్ కాఫీ తప్ప, ఏదైనా సరే ఇంచు మించు ఫిల్టర్ కాఫీకి సమానం.
ఈ విధంగా ఆలోచించుకుంటూ, ఈ-పేపర్ చూస్తూ, వేడి వేడి కాఫీని నాలుక మీంచి నాభిస్థానం మీదగా నాడీమండలానికి చేరుస్తున్న క్షణంలో ఓ వార్త కనిపించింది
అక్కడెక్కడో ఓ ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు ఓ రెండొందల కోట్లు పెట్టి, ఎనభై ఎకరాల స్థలంలో గుడి కట్టిస్తార్ట. బానేవుంది కానీ ఓ పాతిక కోట్లతో గుడికట్టి తక్కిన నూటా డెబ్భైఐదు కోట్లతో రాష్ట్రంలో ఎంతమంది వీలైతే అంతమంది రైతులని ఋణవిముక్తుల్ని చేయిస్తే దేవుడేమైనా ఫీలౌతాడా, బాధపడతాడా అలా చెయ్యొచ్చుగా అనిపించింది. అఫ్ కోర్స్, వాళ్ళు ఇతర సేవా కార్యక్రమాలు చేస్తూనే వుండి వుంటారు కానీ రైతుల బాధలు ఇంత విజిబుల్ గా కని
పిస్తుంటే, ప్రజల కష్టాలు తీర్చే పని దేవుడి అవతారాలకి అప్పగించేసి, ప్రభుత్వాలు చేతులు, మూతులు ముడుచుక్కూచుని విదేశాల్లో ఫార్ట్యూన్ ఫైవ్-హండ్రెడ్ సి.ఈ.ఓ లకి పార్టీలిస్తూ బిజీగా వున్నప్పుడు జనం దేవుడి మీద డిపెండవ్వక తప్పదు కదా గుళ్ళుకట్టి పూజలు చెయ్యద్దూ మరీ! అని కూడా అనిపించింది.

సైతాన్ని “చంపడానికి”, పుష్కరాల్లో మట్టి జల్లడానికీ తొక్కిసలాడుకుని పోయేవాళ్ళు,
సొంత దేశాల్లో నిలవనీడలేక వలసలు పోతూ మధ్యలోనే బలైపోయే అమాయక పసివాళ్ళు
భూమ్మీద కళ్ళు తెరిచేలోపు తిరిగి పైకి పంపిచెయ్యబడుతున్న ‘గర్ల్-చైల్డ్’

— వీళ్ళందర్నీ ఆదుకోడానికే తెగ ఆలోచించే దేవుడు

రైతు రుణాలు తీర్చడానికి,

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించడానికి,

విడిపోయిన రాష్ట్రాలకి ప్రత్యేక పాకేజీలు ఇప్పించడానికి,

కల్తీకల్లు బాధితుల్ని ఆదుకుని, గుడుంబాధిపతుల్ని శిక్షించడానికి అర్జెంటుగా ఓ అవతారం ఎత్తే పని పెట్టుకుంటాడా ఏమన్నానా? అందుకే కోట్లు పెట్టి గుళ్ళు కట్టి, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చనలు చేస్తూవుంటే అవతారం త్వరగా దిగిరావచ్చు కదా! దేర్ ఈజ్ ఎ పాయింట్ ఇనిట్. ఎట్లీస్ట్ మనం అవతారాలు దిగివస్తాయనే ఆశతోనైనా కాలం గడపొచ్చు. దేవుణ్ణి మానవాకృతిలో యాక్సెప్ట్ చెయ్యనివాళ్ళకి పరాయిమతాలవాళ్ళని చంపడం లేకపోతె కన్వర్ట్ చెసేయ్యడమే మార్గం. దానికంటే ఇదే నయం కదూ! అంచేత కాఫీత్వం చెప్పేదేంటంటే గుళ్ళు కట్టాలి, వీలైనంత గొప్పగా కట్టాలి, బట్! గుడి అనేది సోషల్ డిస్ట్రెస్ తగ్గించడంలో ప్రధానపాత్ర వహించాలి……… 
ఇలా ఆవేశంగా ఆలోచించేసుకుంటుంటే కాఫీకప్పులో విష్ణుమూర్తి కనిపించాడు -నోనోనో కనిపించినట్టు అనిపించి వుంటుంది, బుర్రకి తోచినట్టు ఆలోచించేసి ఏదో బ్లాస్ఫెమీకి పాల్పడుతున్న గిల్టీఫీలింగ్ కావచ్చు అంతరాత్మ విష్ణువుని అం’తరంగా’ల మధ్య కనిపించేలా చేసివుంటుంది. సాగర సంగమంలో వేటూరి గారు క్షారజలధులే క్షీరములాయే అన్నారు. కాఫీమహోదధి క్షీరాబ్ధిశయనుడికి కాంప్ ఆఫీసవుతుందని ఏ కవీ, ద్రష్టా, దార్శనికుడు అనలేదు కదా! (అన్నా మనకా విషయం తెలీదు కదా!) మరీయన ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడా అనే సందేహం పట్టుకుంది. బై ద వే, పాలకడలిలో అస్సలు అలలే వుండవుట. ఆలోచనా తరంగాలు ఆగిపోయిన మనసే పాలసముద్రంట! అక్కడ, అలల కుదుపు, అంతుపొంతూలేని ఆలోచనల అదురు లేని ఆ ప్రదేశంలో పాము మీద పక్క వేసుకుని స్వామివారు రిలాక్స్ అవుతూ ఉంటారుట, అవతారానికి అవతారానికి మధ్య వచ్చే గాప్ లో. నా అం’తరంగా’లు మామూలు సముద్రపు అలలు కాదు కదా, అవి కాఫీ కడలి కెరటాలు. ఆ రకంగా చూసినా హౌ కెన్ దిస్ బి పాజిబుల్?
ఇంతలో అం’తరంగ’శాయి, “ఏమోయ్! త్రిమూర్తుల పేర్లు చెప్పికాఫీకప్పులో తుఫాను సృష్టించే ప్రయత్నంలో వున్నట్టున్నావ్! ఏఁవిటి సంగతి,” అన్నారు.

“పార్ధసారధీ అపార్ధమేల?

వినాయకుడిపై ట్వీట్లేసిన ఆర్జీవీ అంతటివాడిని కాను,

తన దేవుడి బొమ్మ ఊసేత్తే దమ్ము లేకపోయినా మనదేవుళ్ళని నగ్నంగా చిత్రించే ధైర్యంవున్న ఎమ్మెఫ్ హుస్సేన్ అంతటివాడిని అసలేకాను,

నీ వేషం వేసుకుని శంఖచక్రగదాపద్మాల బదులు పెప్సీ, చిప్సు, సెల్ ఫోను, బూస్టు ధరించిన ధోనీ అంతటి సెలబ్రిటీని అంతకన్నా కాను

వోట్లకోసం, నోట్లకోసం, మీడియా ఫీట్ల కోసం అలాంటి మహానుభావుల చేష్టల్ని వాడుకునే లేదా మతవాదం మరియు సెక్యులరిజం అనే రెండు పేర్లతో ఒకే టైపు రాజకీయాలు నడిపి విభజించి పాలించే రాజకీయనాయకుణ్ణి, ప్రభుత్వ పెద్దని కానే కాను.

అలాంటిది నీ పేరు చెప్పి కాఫీకప్పులో తుఫాను సృష్టించగలవాడనా? ఏదో నీ లీలావినోదాన్ని కాఫీపాన ప్రమోదానికి కలిపి సేవిద్దామని ట్రై చేస్తున్నా, నాలాంటి కాఫీగతప్రాణులకై పురాణకాఫీక్షేపం చేస్తున్నా అంతే! అంతే స్వామీ అంతే!,” అని మనసులోనే లెంపలు వేసుకున్నా.

అంతట స్వామివారు,” ఐతే మరేమిటి నీ అంతరంగ మధనం? మనసుని పాల సముద్రంలా అలలు లేకుండా వుంచితే నేనక్కడ వుండగలను కానీ అందులో హాలాహలంలాంటి కాఫీ డికాక్షను పోసి మందరపర్వతంలాంటి సందేహాలతో, సమస్యలతో, ప్రశ్నలతో కలియదిప్పితే ఎలా?,” అని గదమాయించారు. ఆయనకి జవాబిచ్చేలోపు కప్పులో కాఫీ ఐపోయింది. ప్రభూ! ముప్ఫయ్యో కప్పు కాఫీ చివరికి వచ్చింది కనుక తిరిగి ముప్ఫై ఒకటో కప్పుకి మీరు వేంచేస్తే నా ప్రాబ్లెమ్స్ అన్నీ నివేదించుకోగలవాడన”ని ప్రార్ధింపనంత స్వామివారునూ, “సరే”యనుచు ఆలోచనాంతరంగముల మధ్య అంతర్ధానమైరి. నేనునూ కాఫీ కప్పును శుభ్రముగా కడిగి బోర్లించితిని. బై4నౌ. _/\_ 🙂