ప్చ్ ప్చ్ ప్చ్3 – “క్రింది చచ్చుప్రశ్నలను ప్రజలు అడుగరాదు”


“ఫలానా కుంభకోణంలో నిజానిజాలు వెలికితీస్తాం, దోషులుగా తేలినవారికి శిక్ష తప్పద,”ని ఫలానా మంత్రిగారు అన్నారు.

నిజానిజాలు బయటపడితే, దోషులెవరో తేలితే, విషయంలో సెషన్స్ నుంచీ సుప్రీమ్ వరకూ కోర్టులన్నిటికీ ఏకాభిప్రాయం కుదిరితే, అదంతా అయ్యేప్పటికి దోషులు (లేక దోషులని మనం అనుకుంటున్నవాళ్ళు) బతికుంటే శిక్ష గారంటీ అని మంత్రిగారంతటివారు చెప్పిన తరువాత బాధ్యతగల పౌరులు నమ్మాలి. నమ్మితీరాలి. ఈ ప్రాసెస్ వలన లాభాలు ఏవో అర్ధమయితే నమ్మి తీరతారు. ఆ లాభాలు ఏవనగా –

వందమంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి కూడా అన్యాయంగా (న్యాయస్థానం చేత)()శిక్షించబడడు.

లాయర్లకు, లైయర్లకు జీవనోపాధి లభించును.

కొన్ని దశాబ్దముల పాటు మీడియావారికి వార్తలకు కరువు వచ్చు భయముండదు.

మేధావులకు, జర్నలిస్టులకు నిరుద్యోగ సమస్య తీరును.

కొందరికి (ఎవరికో చెప్పుట కుదరదు) ఉన్నత పదవులు లభించును. అట్టి పదవులతో ప్రతిపక్ష ప్రభుత్వములను పడగొట్ట వచ్చును.

వివాదము వలన నష్టపోయిన జనులతో వోటుబాంకులు తయారు చేసికొను అవకాశము కలదు.

ఎన్నికలలో ఈ వివాదములపై గొంతు చించుకుని “మంచి విలువలు”గల రాజకీయ పార్టీలు అధికారములోనికి రావచ్చును.

సో కాల్డ్ దోషులు కేసు తప్పించుకొను ప్రయత్నములో కొందరి ఆర్ధిక పరిస్థితులను దారిద్ర్యరేఖ దాటించి కనీసము ఎవరెస్టు ఎత్తుకు చేర్చెదరు. అట్టి వారు కొత్త వ్యాపారములను, పరిశ్రమలను ప్రారంభించి వందల కొలది ప్రజలకు ఉద్యోగావకాశములు కల్పించెదరు. వారే భావి రాజకీయ నాయకులై దేశమును, సంస్కృతిని తీర్చి దిద్దెదరు. వీరి వలన స్వదేశమే కాక స్విట్జర్లాండు వంటి విదేశములు కూడ అభివృద్ధి చెందును.

“దోషులను” పై విధమగు కేసులలో ఇరికించిన “నిర్దోషుల” వ్యాపారములు అభివృద్ధియగు అవకాశములు పెరిగి ఆర్ధిక వ్యవస్థ పటిష్టమగును.

ఇన్ని ప్రజాస్వామిక ప్రయోజనములున్నందున ఇట్టి కుంభకోణములందు ఈ క్రింది (అభివృద్ధి నిరోధక) చచ్చుప్రశ్నలను ప్రజలు అడుగరాదు –

నిజానిజాలు ఎన్ని ఏళ్లపాటు బయట పడతాయి?

బయటపడినవాటిలో నిజాలు ఎన్ని? అనిజాలు ఎన్ని? దేని శాతము ఎంత?

ఏవి నిజాలో, ఏవి అనిజాలో ఎవరు నిర్ధారిస్తారు? ఎన్నిసార్లు నిర్ధారిస్తారు? అసలు నిర్ధారించడం ఎలా? నిర్ధారించడం అవసరమా?

నిజనిర్ధారణ చేయువారి నిజాయితీలో నిజమెంత? అబద్ధము ఎంత శాతము?

దోషులెవరో తేల్చలేక పోలీసులు, నిఘా సంస్థలు తన్నుకు చస్తుంటే, కింద కోర్టు తీర్పుని పై కోర్టు కొట్టేస్తుంటే ఇంక దోషులెవరో తేల్చేదేలా? శిక్ష వేసేదెలా?

అసలు నిజము, నిజాయితీ, న్యాయము అనగానేమి? అవి ఎచటయుండును? ఉన్నవనుటకు ఆధారములేవి?

సర్వేజనాఃస్సుఖినోభవంతు

<<<>>>