పూర్వం ఎప్పుడో ఎక్కడో ఒక వూరుండేదిట. ఆ వూరిచుట్టూ చాలా ఎత్తైన పెద్ద ప్రహరీ గోడ. అవతల ఏముందో అందరికీ విపరీతమైన క్యూరియాసిటీ. అయితే ఎవరూ దాటి వెళ్ళరు, అది పడగొట్టనూలేరు. దాంతో గోడవతల వున్నదానిపై ఊరంతా ఊహాగానాలే కానీ, ఖచ్చితంగా ఏఁవుందో తెలిసినవాడు ఒక్కడూ లేడు. చాలా ఏళ్ళకి ఓ ముగ్గురు సాహసించి, అసాధ్యం అనుకున్న ప్రహరీ గోడ ఎక్కేసారు. అవతల ఏం అద్భుతం కనిపించిందో ఏమో ఒకడు అవతలి పక్కకి దూకేసాడు. ఇంకొకడు గోడ మీదే అలా కూచుని చూస్తూండిపోయాడు. మూడోవాడు తను చూసింది అందరికీ చెప్పడానికి గోడ దిగి వూళ్ళోకి వచ్చేశాడు. జనం బ్రహ్మరధం పట్టారు వాడికి. వాడు చెప్పిందంతా విని కధలుగా చెప్పుకునే వాళ్ళు. నూటికి తొంభైతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిది మందికి ఆ కధలు ఎంతవరకు నిజమో నిర్ధారించుకునే ధ్యాస వుండేదికాదు. గో.ది.వీ (గోడ దిగిన వీరుడు) చెప్పిన విషయాలు చిలవలు పలవలు చేసి చెప్పుకుంటూ వుండేవారు. వాటి మీద మీమాంసలు, భాష్యాలు, కావ్యాలు, సిద్ధాంతాలు, ఫర్ & అగైన్స్ట్ టీవీ చర్చలు … రోజువారీ పన్లు ఐపోయాక గ్రామస్తులకి ఇవే కాలక్షేపం. అంతలో ఇంకో కొత్త గో.ది.వీ తయారయ్యాడు. మొదటి గో.ది.వీ చెప్పిందంతా తప్పన్చెప్పి పాత సారానే కొత్తసీసాలో పోసాడు. ఇంక అక్కణ్ణుంచీ ఫాక్షన్స్,వర్గాలు, రాజకీయాలు మొదలయ్యాయి. .. కొత్తగా ఒకడు గోడ ఎక్కి చూసి వెనక్కి వచ్చినప్పుడల్లా ఒక కొత్త వర్గం తయారయ్యేది. అలా వూరి జనాభా అంతా గోడవతలి మిస్టరీ ఆధారంగా వర్గాలుగా విడిపోయి కొట్టుకు చస్తూ వుండేవారు. వూరిపై ఆధిపత్యం కోసం పోటీపడే వూరిపెద్దలకి గోడవతలి మిస్టరీ కొత్త అస్త్రంగా మారి వోట్ బాంకులు సృష్టించింది. అధికార సంపాదనకి దాన్నో షార్ట్-కట్ గా వాడేసుకుంటున్నారు వూరి పెద్దలు. కొందరికి చిరాకుపుట్టి గోడ పడగొట్టేస్తే సగం దరిద్రం తీరుతుందని ఆ ప్రయత్నం చేశారు. వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళూ సమానంగా ద్వేషించి, వెలివేసి బతుకు దుర్భరం చేసేశారు. కొందర్ని చంపేశారు కూడా. ఇంతలో గోడ పడగొట్టమనేవాళ్ళలో కూడా మూర్ఖ వితండవాదులు బయలుదేరి, సొంత ఫాక్షన్ ఒకటి తయారు చేసుకుని అసలు గోడవతల ఏమీ లేదంటూ జనంలో వున్న కన్ఫ్యూజన్ ఇంకా పెంచడం మొదలెట్టారు. ఈ రకంగా గోడవతల మిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చివరికి ఏనుగుని “చూడ్డానికి” వెళ్ళిన గుడ్డివాళ్ళ కధలా తయారయ్యింది. ఆ వూళ్ళోనే ఓ మేధావి ఈ గందరగోళం అంతా చూసి – గుడ్డిగా నమ్మబడిన, అంతే గుడ్డిగా ఖండించబడినది ఏదైనా సరే అది ప్రజల పాలిటి మత్తు మందే అనే నిశ్చయానికి వచ్చాడు. గోడలేదు, గోడవతల కూడా ఏమీ లేదులాంటి వితండవాదం జోలిపోకుండాముందు తను గట్టిగా ట్రై చేసి, గోడెక్కిమిస్టరీని చూసి అది నిజమే అని ధ్రువపరుచుకున్నాడు. గోడ దిగి వూళ్ళోకి వస్తుంటే జనం యధావిధిగా ఏం చూసావంటూ ఆరాలు మొదలెట్టారు. అందరూ సాయంత్రం రచ్చబండదగ్గరికి రండి అందరికీ ఒకసారే చెప్తాను అన్నాడు మనవాడు. ప్రజలంతా రచ్చబండ చేరుకునేసరికి మనవాడు పక్కన ఓ కాఫీ గ్రైండర్, స్టవ్, ఫిల్టర్ పెట్టుకుని ఉన్నాడు. ఓ పక్క కాఫీ గింజలు వేగుతున్నాయి. ఇంకోపక్క వేగిన గింజల్ని గ్రైండర్లో దంచుతున్నాడు. మరోపక్క పెద్దగిన్నెలో కరిగిన బంగారంలా కాఫీ సన్నటి సెగపై వేడెక్కుతూ వుంది. వేగుతున్న గింజల నుంచీ, గ్రైండర్ నుంచీ అద్భుతమైన అరోమా వ్యాపిస్తోంది. అప్పుడే కలుపుకున్న కాఫీ కప్పులోకి వంపుకుంటున్నాడు హీరో. అక్కడ జరుగుతున్న కాఫీయుక్త కవోష్ణ క్షీర పానీయ విరచనా ప్రక్రియ చూస్తూ జనం వచ్చిన పని మర్చిపోయారు. వరద గోదారి కెరటాలపైనుండే నురుగుని, ఆ రంగుని తలిపిస్తూ పరిమళాలు వెదజల్లుతున్న ఆ కాఫీని చూసిన జనుల జ్ఞానేంద్రియాలు పరవశించాయి. బుర్రల్లో ఎన్నాళ్ళుగానో మేట వేసుకుపోయిన మట్టి, బురద సడెన్ గా క్లియరైపోయిన రిలీఫ్. ఏదో తెలీని మత్తులోంచి తేరుకున్నఫీల్. అమృతభాండం సంగతి మర్చిపోయి జగన్మోహినిని చూస్తూ ఒళ్ళు మర్చిపోయిన రాక్షసుల్లా జనులు లొట్టలెయ్యసాగారు. లొట్టల స్టాండింగ్ ఒవేషన్ తో ఆ ప్రదేశం పులకించింది. అయినా మన హీరో ఎవరికీ కాఫీ ఆఫర్ చెయ్యడు, మాట్లాడడు. వరసగా నాలుగు కప్పులు హాయిగా, ఆనందంగా నురుగులు, పొగలు కక్కుతున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫిల్టర్ కాఫీ తాగుతూ వుండిపోయాడు. కాసేపటికి తేరుకున్న జనం తమకి ఆ రుచి చూపిస్తాడని ఆశపడ్డారు. హీరో మాత్రం ఐదో కప్పు కలుపుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ కళ్ళు మూసుకుని అలౌకికానందంలో మునిగాడు. జనానికి తిక్క రేగిపోయింది. “ఒరేయ్! విషయమైనా చెప్పు, కాఫీయైనా ఇవ్వ”ని ఘోషించారు. హీరో అన్నాడు – “నేను కాఫీ తాగుతుంటే మీరంతా తెగ లొట్టలేసారుగదా, తాగినంత తృప్తి ఫీలైయ్యుండాలే!,” అన్నాడు. “నీ మొహం, కాఫీ తాగింది నువ్వైతే, మాకెలా తృప్తి కలుగుతుంది, మా మత్తెలా వదులుతుంది,” ముక్తకంఠంతో ఘోషించారు ప్రజలు. “కదా! ఎవరి కాఫీవాళ్ళు తాగితేనేగానీ మత్తుపోదు,మజా రాదు,” అన్నాడు కొత్త గో.ది.వీ. “ఇందులో నువ్వు కొత్తగా చెప్పేదేముంది? మా టైము వేస్ట్ చేస్తున్నావ్. కాఫీ చుక్క ఎలాగూ ఇవ్వలేదు. కనీసం గోడవతల మిస్టరీ గురించైనా చెప్పు,” మళ్ళీ లక్ష గళార్చన. “చెప్పడానికి ఒకటే ముక్క. బైటున్న మిస్టరీ, ఈ ఫిల్టర్ కాఫీకి ఇంచుమించు సరిసాటి,” అన్నాడు లేటెస్ట్ గో.ది.వీ. వాడు మాట పూర్తి చెయ్యకముందే జనానికి జ్ఞానోదయం అయిపొయింది. అప్పటినుంచీ ప్రతిఒక్కడు సిన్సియర్ గా గోడ ఎక్కి చూసి మిస్టరీ అర్ధం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఓపికలేనివాళ్ళు నోర్మూసుకుని కూచున్నారు. మొత్తం అందరూ కూడా రోజువారీ పనులకి దానితో ముడి పెట్టడం మానేశారు. అనవసరపు చర్చలు, ఎడతెగని రాద్ధాంతాలు ఆగిపోయాయి. రాజకీయ నాయకులకి కొంచెం నిజం పని నిజంగా చెయ్యాల్సిన అవసరం ఏర్పడిపోయింది. అదీ కాఫీ మహత్వం, కాఫీ శాస్త్రీయంగా తాగినవాడి మహాత్మ్యం.
నీతి:
కాఫీ ఆనందం అనేది ఎవరికివారే అనుభవించాల్సిన విషయం అని అనుభవపూర్వకంగా తెలిసిన వూరివాళ్ళు గోడవతల మిస్టరీ కల్పించిన మత్తు వదిలించుకోగలిగారు. అదే కాఫీత్వ తత్త్వం. అలాగే మతంయొక్క పరమార్ధం ఏదో దాని మీదే దృష్టి పెడితే ప్రజలు మతం and/or మతరాహిత్యం కల్పించే మత్తులు కూడా వదిలించుకోగలరు. At the least, మత్తులో వున్నామనే విషయం గ్రహించగలరు.
(మతం అనే పదం ఆర్గనైజ్డ్ రెలిజియన్ అనే అర్ధంలోనే వాడడం జరిగింది)
So, let us now understand కాఫీత్వ –
కప్పులో వున్న వేడి వేడి కాఫీ = సత్య సాక్షాత్కారం
కాఫీని ఆస్వాదించడంలో కప్పు, గ్లాసు, చుట్టూ వున్నఎట్మాస్ఫియరూ అన్నీ అవసరం అనుకుంటే అది సగుణోపాసన(కి ఇంచుమించు సరిసాటి)
ఇతర విషయాలతో సంబంధం లేకుండా జస్ట్ కాఫీ మీదే దృష్టంతా వుంటే అది నిర్గుణోపాసన (well, నిర్గుణోపాసనకి ఇంచుమించు సరిసాటి)
వివిధ బ్రాండ్ల కాఫీ పొడి = గ్రాంధిక జ్ఞానం, అనుభవ జ్ఞానం, ఆత్మ పరిశీలన, ఎట్సెట్రా
ఫిల్టర్, కాఫీ ప్రెస్,కాఫీ మెషీన్ = సాధనా పద్ధతులు
పాక హోటలు, కాఫీ బార్, స్టార్ బక్స్, కాఫీ డే, ఎట్సెట్రా = వివిధ ప్రార్ధనా స్థలములు
మిగిలిపోయిన కాఫీమడ్డి (గులాబీ మొక్కలకి, అంట్లకి తప్ప దేనికీ పనికిరాదు) = సత్యసాధనలో ఎదురైన వ్యక్తిగత అనుభవాలు (ఇతరులని ఇన్-స్పైర్ చేయడం వరకే వీటి ఉపయోగం, అంతేతప్ప అందర్నీ ఒక మూసలో పోసి వాళ్ళ నెత్తిన అవే రుద్దితే వాళ్ళ ఆలోచనాశక్తిని నిరోధిస్తాయి)
మనిషి తన జీవితానికి అర్ధం కల్పించుకునే ప్రాసెస్ లో భాగం కాఫీ త్రాగడం, పరమార్ధం తెలుసుకునే ప్రయత్నంలో కరదీపిక కాఫీకప్పు, జీవిత పరమార్ధం తెలుసుకోవాలనే ఆసక్తికి మూలం కాఫీ కలిగించే చైతన్యం. ఇంత ప్రాధాన్యమున్నా కూడా కాఫీ ఇష్టం కదా అని డికాషన్ తీసాక మిగిలే కాఫీమడ్డి మనుషులు దాచుకోరు. గులాబీ మొక్కలకి వేస్తారు, లేదా అంట్లు తోమడానికి వాడతారు. కాదూ? దీనర్ధం కప్పులోకి వచ్చిన వేడి వేడి కాఫీకి ఫిల్టర్ అడుగున మిగిలిపోయిన మడ్డికి తేడా వుందనే కదా?
ఇంకొన్ని పాయింట్స్ –
ఎవరి బ్రాండ్ కాఫీ పొడి వాళ్ళది, ఎవరి ఫిల్టర్ వాళ్ళది, ఎవరి చికరీ పర్సంటేజి వాళ్ళది. వాటి గురించి ఎవరూ పోట్లాడుకోరు.
ఫిల్టర్ కాఫీ, బ్రూ కాఫీ, లాటే, కపుచ్చినో, మోకా, కాఫీ నీళ్ళు ఎవరికిష్టమైంది వాళ్ళు తాగుతారు.
పాక హోటల్లో, ఇంట్లో, కాఫీ డేలో, స్టార్ బక్స్ లో ఎక్కడ కావాలంటే అక్కడ తాగుతారు.
ఎక్కడ, ఎలా, ఏ రూపంలో తాగినా కాఫీ ఇచ్చే కిక్కూ తృప్తీ, ఆనందం, ఉత్సాహం మాత్రం అందరిలోనూ ఒకటే.
Likewise, హూ యామై? అనే టోటల్లీ పర్సనల్ జర్నీ చివరన సత్య దర్శనం అయ్యాక, తన అనుభవాన్ని అందరికీ పంచాలన్నసత్యాన్వేషకుడి అత్యాశకి భౌతిక రూపం ఆర్గనైజ్డ్ రెలిజియన్. నిజానికది, అంటే సత్యాన్వేషకుడి అత్యాశ, కాఫీ డికాక్షన్ తీసాక మిగిలే మడ్డిలాంటిది. అలాని దాన్ని తీసిపారేసినట్టు కాదు. గులాబీమొక్కలకి, అంట్లు తోమడానికి కాఫీమడ్డిని వాడినట్టే ఆర్గనైజ్డ్ రెలిజియన్ని సత్యాన్వేషణకి, తెలుసుకున్న సత్యంతో వ్యక్తిగత జీవితాన్ని రిఫైన్ చేసుకోడానికీ వాడుకోవాలి. అంతే ఇంకొకడి నెత్తి మీదెక్కి మొత్తడానికి కాదు.
మనిషిలో మోరల్ స్ట్రెంగ్త్ పెంచడం, మనసులో, జీవితంలో స్వచ్ఛ భారత్ నిర్వహించటం, సత్యశోధన, సత్యసాధన – ఇవే దాని మెయిన్ ఫంక్షన్స్. ఇవిలేకుండా ఏం చేసినా అది పిడకల వేటే. దేవుడికి, in other words సత్యానికి, పిడకలవేటకి ఏ సంబంధమూ వుండదు. పిడకల వేటకి రూపాంతరాలే తీవ్రవాదం, మతకలహాలు, గడ్డాలు, కృపాణాలు, కన్వర్షన్లు, వోట్ బ్యాంకు పాలిటిక్సు, …. చెత్తాచెదారం, మన్ను మశానం, ఎట్సెట్రా, ఎట్సెట్రా.
Enjoy this sixteenth cup of Kaafeetva with this Jiddu Krishnamurthy’s take on organized religion –
God and the Devil were walking along when they looked down and saw someone had found a piece of the truth. “There” said God “Trouble for you. He’s found a piece of the truth”.
“Not at all” said the Devil. “I’ll let him organize it”.
ఇతి శ్రీ షోడశ కప్పు కాఫీత్వం సంపూర్ణమ్
Bye4now_/\_ 🙂
స’శేషం’
:)) coffee adhirindi.
LikeLike
Very nice and well said.
LikeLike
@Sri NItya
@gksraja
మీకు కాఫీ నచ్చినందుకు రెండు కప్పులు కాఫీ తాగినంత సంతోషం _/\_ 🙂
LikeLike
Carefully weaved. Great article!
https://polldaddy.com/js/rating/rating.js
LikeLike
మీ కామెంట్ చూసి మళ్ళీ ఒకసారి చదివాను, రెండు కప్పుల కాఫీ సేవిస్తూ…
thank you for your feedback 🙏
LikeLike