భారతం కాదు, బసవ పురాణం అంటే కోపం వచ్చింది + కోపం రాలేదు


తెలుగులో ప్రధమకావ్యం భారతం కాదు, బసవ పురాణం అంటే ఆంధ్రవాళ్లకు కోపం వస్తుంది(ట) 🙂
నేను అంధ్రవాణ్ని కాదు, తెలుగువాణ్ణి. అందువల్ల కోపం వచ్చింది 😡, కోపం రాలేదు కూడా 😐

కోపం ఎందుకొచ్చింది?
తెలుగువాడైన ప్రతివాడికి కోపమొస్తుంది. “భారతం ప్రధమ తెలుగు కావ్యం కాదు,” అన్నందుక్కాదు. కవిత్వానికి, కావ్యాలకి రాజకీయరంగు పులిమినందుకు. ఈ కారణంగా కోపం రాలేదు అంటే వాడి తెలుగుదనంలో లు, గు తమ పొజిషన్లు మార్చుకున్నట్టే 😉
ఠాట్! పొజిషన్లు మార్లేదెహే! అని ఢంకా బజాయించాడంటే వాణ్ణెవరో కల్లు తాగిన కోతిగా మార్చినట్టు.

కోపం ఎందుకు రాలేదు?
భారతం అనువాద రచనే అయినా మూలభారతానికీ తెలుగు భారతానికీ తేడా వుంది. ఇది స్వతంత్ర కావ్యం అనేటంత తేడా!
పద్యాల అల్లిక వివిధ ఛందస్సులలో వున్నప్పుడు అది విన్నా, చదివినా, నాటకం వేసినా వచ్చే మజా వేరు. ద్విపద కావ్యం తక్కువని కాదు. దాని అందం దానిది. అన్ని వర్గాలకీ చేరువగా, అర్ధమయ్యేలా వుండడం దాని ప్రత్యేక ప్రత్యేకత. రసజ్ఞత అని ఒకటేడిసిందిగదా! అదే, literary, artistic or aesthetic taste అంటారూ, అదీ! అందులో వేరు వేరు లెవెల్స్ అనమాట.
రెండిట్నీ ఎంజాయ్ చేసే సెక్షనూ వుంటుంది, సందర్భమూ వుంటుంది. శంకరాభరణం? క్లాస్ ప్రేక్షకులు మాస్ సినిమానీ, మాస్ ఆడియెన్సు క్లాస్ సినిమాల్నీ ఎంజాయ్ చేసిన సందర్భాల్లేవూ? ఏఎన్నార్ దేవదాసు, ఎన్టీయార్ రాముడు-భీముడు – వీటిని  క్లాసూ మాసూ రెండు సెక్షన్లూ ఎంజాయ్ చెయ్యలా? అలాంటిదే ఇదీ. నన్నయ, పాల్కురికి సోమనాధుల కాలపువాళ్ళు రెండిట్నీ ఎంజాయ్ చేసేవుంటారు. ఇటాలియన్ కాన్సెప్ట్లు, పార్లమెంటులో కరెంటు పోవడాలు అప్పటికి లేవుగా!

బసవపురాణాన్ని ద్విపదలో రాయడం వెనుక అది సామాన్యులకి చేరాలన్న బసవేశ్వరుని సామాజిక స్పృహవుంది. భారతంలో విషయవైవిధ్యం విస్తృతం – ఫిలాసఫీ, సోషియాలజీ, పాలిటిక్స్, ఎథిక్స్, మోరల్స్, ఎమోషన్స్, హ్యూమన్ ఫ్రెయిలిటీస్ …. ఒకటేమిటి it covers every aspect of life. సమకాలీన సమస్యలని ప్రత్యేకంగా ఎత్తిచూపకుండా, అలాగని వదిలెయ్యకుండా, అంటే జడ్జిమెంట్ పాఠకుడికి వదిలేసే ఒక విధమైన థాట్ ప్రొవోకింగ్ నేరేషన్ భారతంలో వుంటుంది. బసవ పురాణం బసవేశ్వరుడి చరిత్ర. సాంఘిక సంస్కరణ లక్ష్యంగా సాగిన బయోగ్రఫీ. రెండూ రెండు విధాల ప్రభావం చూపే గొప్ప గ్రంధాలు. అందువల్ల ఏది ఫస్టు, ఏది సెకెండులాంటి అసందర్భ అనుచిత సందేహాలు మంచి సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్లకి రావు. ఒకవేళ రాంకింగులిచ్చినా అది సింబాలిగ్గా తీసుకోవాలనుకునే హృదయవైశాల్యం మంచి పాఠకుడికి వుంటుంది. తెలుగువాళ్ళు మంచి పాఠకులు. ఈ కారణాల వల్ల కోపం రాలేదు.
కోపం వస్తుందని, రావాలనుకుని కోపం తెచ్చుకునే కేటగిరీ వేరు.

****